శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
భగవానుడికి ప్రీతి కలిగించే కైంకర్యాన్ని ఆళ్వార్ కోరుకున్నారు. భగవాన్ తెఱ్కుత్తిరుమల అని పిలువబడే తిరుమాలిరుంజోలైలో తాను వాసమున్నాడని ఆళ్వార్కి చూపించి, “నేను మీ కోసం ఇక్కడకు వేంచేశాను, నీవు ఇక్కడకు వచ్చి అన్ని రకాల కైంకర్యాలను నాకందించు” అని అంటారు. అది విన్న ఆళ్వార్ పవిత్రమైన కొండను అనుభవించి ఆనందిస్తారు.
మొదటి పాశురము: “సర్వేశ్వరుడికి ప్రియమైన తిరుమల నా లక్ష్యం ” అని ఆళ్వార్ పలుకుతున్నారు.
కిళరొళి యిళమై కెడువదన్ మున్నం
వళరొళి మాయోన్ మరువియ కోయిల్
వళరిళం పొళిల్ శూళ్ మాలిరుంజోలై
తళర్విల రాగిల్ శార్వదు శదిరే
చుట్టూ ఆహ్లాదకరమైన ఎత్తైన చెట్ల తోటలతో ఉన్న తిరుమాలిరుంజోలై అని పిలువబడే తిరుమల, అద్భుతమైన సామర్ధ్యాలున్న సర్వేశ్వరుడి దివ్య ధామము. జ్ఞానం తేజస్సు వికసించే దశలో ఉన్న యువత ఇటువంటి తిరుమలని చేరుకోవడం శ్రేష్ఠము.
రెండవ పాశురము: “అళగర్ల తిరుమల దివ్యదేశాన్ని ఆస్వాదించి ఆనందించడం అత్యున్నత లక్ష్యం” అని ఆళ్వార్ తెలుపుతున్నారు.
శదిరిళ మడవార్ తాళ్చ్చియై మదియాదు
అదిర్ కురల్ శంగత్తు అళగర్ తం కోయిల్
మది తవళ్ కుడుమి మాలిరుంజోలై
పది అదు వేత్తి ఎళువదు పయనే
అందరినీ మంత్రముగ్దులను చేసే తెలివైన యవ్వన కన్యల మాటలు విని మైమరిచిపోకూడదు; బదులుగా తిరుమాలిరుంజోలై అనే ప్రసిద్ధ దివ్య దేశాన్ని కీర్తించాలని తన లక్ష్యంగా పెట్టుకొని పైకి ఎదగాలి; పర్వత ప్రాంతములో ఉన్న ఈ తిరుమాలిరుంజోలై అళగర్ ఎంబెరుమాన్ల దివ్య దేశము, చంద్రుడిని తాకే ఎత్తైన శిఖరాలు ఉన్న ప్రాంతమది; ఈ అళగర్ ఎంబెరుమాన్ శ్రీ పాంచజన్యముతో అద్భుత సౌందర్యముతో దర్శనమిస్తున్నారు. ఈ పాశురాన్ని ఆళ్వార్ తన మనస్సుకి చెప్పుకుంటున్నారు.
మూడవ పాశురము: “చాలా ఉదారమైన ఎంబెరుమాన్ నివాసమున్న ఈ తిరుమల దగ్గరలో ఉన్న కొండని కోరుకోవడమే లక్ష్యం” అని ఆళ్వార్ చెప్పారు.
పయనల్ల శెయ్ దు పయనిల్లై నెంజే
పుయల్ మళై వణ్ణర్ పురిందుఱై కోయిల్
మయల్ మిగు పొళిల్ శూళ్ మాలిరుంజోలై
అయన్మలై అడైవదు అదు కరుమమే
ఓ హృదయమా! పనికిరాని పనులను చేయడంలో ఎటువంటి ఉపయోగం లేదు. నల్లని మేఘము లాంటి భగవానుడు, నీటి బిందువులను తనలో దాచుకొని, నేల నీరు (సముద్రం) అని తేడా చూపించకుండా సమానంగా వాటిపైన వర్షాన్ని కురిపిస్తాడు; అతి సులభుడు, ఆకర్షణీయమైన తోటలతో చుట్టుముట్టి ఉన్న తిరుమాలిరుంజోలైలో అతడు నిత్య నివాసముంటున్నాడు. ఆ తిరుమల పర్వతాన్ని చేరుకోవాలనుకోవడం, తాపత్రేయ పడటం ఈ ఆత్మకి సహజము.
నాల్గవ పాశురము: “దట్టమైన తోటలతో కప్పబడి ఉన్న రక్షక ధామమైన తిరుమలని పొందడం తగినది [భక్తులకి]” అని ఆళ్వార్ తెలుపుతున్నారు.
కరుమ వన్ పాశం కళిత్తుళ న్ఱుయ్యవే
పెరుమలై ఎడుత్తాన్ పీడుఱై కోయిల్
వరు మళై తవళుం మాలిరుంజోలై
తిరుమలై అదువే అడైవదు తిఱమే
గోవర్ధన గిరిని ఎత్తి వ్రజ వాసులను రక్షించిన భగవాన్, విశాల తోటలలో ఎత్తైన చెట్లను తాకుతూ తేలియాడే మేఘాలు విహరిస్తున్న అందమైన తిరుమాలిరుంజోలైలో దివ్య తేజస్సుని వెదజల్లుతూ నివాసుడై ఉంటున్నాడు; అతడు అక్కడ ఉండి తొలగించలేని అతికష్టమైన మన కర్మ బంధాలను ఛేదిస్తూ, జీవాత్మ సేవలను అందుకుంటున్నారు; కావున, మనమందరమూ చేరుకోవాల్సినది ఆ తిరుమలనే.
ఐదవ పాశురము: “సర్వ మానవాలిని రక్షించడానికి దివ్య చక్రాన్ని ధరించి నివాసమున్న ఆ భగవాన్ యొక్క తిరుమల బయట ఉన్న పర్వతాన్ని చేరుకోవడం ఉత్తమమైన మార్గము” అని ఆళ్వార్ తెలుపుతున్నారు.
తిఱముడై వలత్తాల్ తీవినై పెరుక్కాదు
అఱముయల్ ఆళి ప్పడై అవన్ కోయిల్
మఱువిల్ వణ్ శునై శూళ్ మాలిరుంజోలై
పుఱమలై శార ప్పోవదు కిఱియే
శాస్త్ర నిషేధమైన కర్మలను చేయడంలో తమ సామర్ధ్యం చూపించి మన పాపాలను పెంచుకునే బదులు, వచ్చిన వారిని అన్ని విధాలుగా ఆదుకొని సహాయపడి, సరోవరములతో నిండి ఉన్న తిరుమాలిరుంజోలై (తిరుమలై) వెలుపలి భాగములో ఉన్న కొండకు చేరుకోవడం ఉత్తమ మార్గంగా చెప్పవచ్చు; అళగర్ ఎంబెరుమాన్ దివ్య చక్రాయుధాన్ని ధరించి ఈ తిరుమలలో నివాసుడై ఉండి తన ఆశ్రితులను కటాక్షిస్తున్నారు.
ఆరవ పాశురము: “తన భక్తల ప్రియుడైన భగవాన్ నివాసుడై ఉన్న ఆ తిరుమల మార్గాన్ని మననం చేసినా కూడా ఎంతో మంచి చేస్తుంది” అని ఆళ్వార్ తెలుపుతున్నారు.
కిఱియెన నినైమిన్ కీళ్మై శెయ్యాదే
ఉఱియమర్ వెణ్ణెయ్ ఉండవన్ కోయిల్
మఱి యొడు పిణైశేర్ మాలిరుంజోలై
నెఱిపడ అదువే నినైవదు నలమే
అల్పమైన విషయముల పట్ల ఆసక్తి పెంచుకునే బదులు, దీన్ని ఉత్తమ మార్గంగా పరిగణించండి, ఎందుకంటే ఉట్టిలో భద్రంగా దాచి ఉంచిన వెన్నను దొంగిలించిన కృష్ణుని ఆలయమిది. అదీ కాకుండా ఆడ జింకలు తమ దూడలతో కలిసి తిరిగే మాలిరుంజోలై ఇది; అటువంటి తిరుమలకి వెళ్ళే మార్గాన్ని ధ్యానించడం మన లక్ష్యంగా ఉంచుకోవాలి.
ఏడవ పాశురము: “ప్రళయ సమయంలో మనల్ని కాపాడే భగవాన్ నివాసమున్న ఈ తిరుమల పట్ల అనుకూల్యతగా ఉండటం ఉచితమైన మార్గము” అని ఆళ్వార్ తెలుపుతున్నారు.
నలమెన నినైమిన్ నరగళుందాదే
నిల మునం ఇడందాన్ నీడుఱై కోయిల్
మలమఱు మదిశేర్ మాలిరుంజోలై
వలముఱై ఎయ్ ది మరువుదల్ వలమే
ఈ సంసారమనే నరకంలో మునిగే కన్నా, మచ్చలేని చంద్రుడు ఉన్న ఈ తిరుమలలో శేషి శేషత్వ భావాన్ని అత్యున్నత లక్ష్యంగా మన మదిలో ఉంచుకోవాలి. భూమిని పైకెత్తిన వరాహ పెరుమాళ్ అవతారమెత్తిన భగవాన్ ఈ తిరుమలలో నిత్య నివాసుడై ఉన్నాడు.
ఎనిమిదవ పాశురము: “భక్త ప్రియుడైన కృష్ణుడి నివాసమైన ఈ తిరుమల పట్ల నిరంతర ప్రీతి ఉండటమే ఈ ఆత్మకు సహజంగా సరిపోతుంది, అనుకూలమైనది కూడా.” అని ఆళ్వార్ తెలుపుతున్నారు.
వలం శెయ్ దు వైగల్ వలంగళియాదే
వలం శెయ్యుం ఆయ మాయవన్ కోయిల్
వలం శెయ్యుం వానోర్ మాలిరుంజోలై
వలం శెయ్ దు నాళుం మరువుదల్ వళక్కే
భక్త ప్రియుడు, అద్భుతమైన ఆకర్షణ ఉన్న కృష్ణుడి ఆలయము ఈ తిరుమలలో ఉంది; అటువంటి ఈ తిరుమల పరమపద నివాసులైన నిత్యసూరులచే ప్రియాతి ప్రియంగా సేవించబడుతుంది. ఆత్మ తన శక్తినంతా ఈ తిరుమల చుట్టూ ప్రదక్షిణలు చేసి ఈ భగవానుడికి దగ్గర కావడంలో ఉపయోగించాలి కానీ లౌకిక వ్యవహారాలలో ఆ శక్తిని వ్యర్ధం కానీయకూడదు.
తొమ్మిదవ పాశురము: “‘పూతన ను వధించిన ఈ భగవాన్ నిలయాన్ని నేను ఆరాధించాలి అన్న దృఢమైన విశ్వాసము విజయానికి కారణమౌతుంది” అని ఆళ్వార్ తెలుపుతున్నారు.
వళక్కెన నినైమిన్ వల్వినై మూళ్గాదు
అళక్కొడి అట్టాన్ అమర్ పెరుంగోయిల్
మళక్కళిఱ్ఱినం శేర్ మాలిరుంజోలై
తొళ క్కరుదువదే తుణివదు శూదే
అతి ఘోరమైన పాపాలలో మునిగిపోకుండా, ఆత్మ స్వభావానికి తగినదని ఇది అని చెప్పుకోవచ్చు; మాలిరుంజోలై అనేది ఒక దివ్య భవ్య ఆలయం, ఇక్కడ పూతనను వధించిన ఎంబెరుమాన్ స్థిరంగా నివాసమున్న ప్రదేశమిది; ఏనుగు దూడలు మందలు మందలుగా అటువంటి తిరుమలకి చేరుతాయి; కారణం, ఈ సంసారాన్ని గెలిచి మనస్సులో పూర్తి విశ్వాసంతో ఈ తిరుమల ఆరాధించాలి అని భావము.
పదవ పాశురము: “వైధిక జ్ఞాన నిధి అయిన భగవాన్ నివాసుడై ఉన్న తిరుమలలోకి ప్రవేశించడమే లక్ష్యం” అని ఆళ్వార్ తెలుపుతున్నారు.
శూదెన్ఱు కళవుం శూదుం శెయ్యాదే
వేదమున్ విరిత్తాన్ విరుమ్బియ కోయిల్
మాదుఱు మయిల్ శేర్ మాలిరుంజోలై
పోదవిళ్ మలైయే పుగువదు పారుళే
ఒక వస్తువుని ఆ యజమానికి తెలిసో లేదా తెలియకుండనో దొంగిలించుట ధనం సంపాదించడానికి సరళమైన మార్గమని భావించడం తప్పు, అలాంటి తప్పుడు పనులలో పాల్గొనకూడదు; బదులుగా తిరుమాలిరుంజోలైలోకి ప్రవేశించడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి; ద్వాపర యుగంలో గీతోపదేశం చేసిన పరమాత్ముడి నిత్య నివాసం ఈ తిరుమల; నెమళ్ళు సమూహాలుగా విహరిస్తూ, వికసించిన పుష్పాలతో ఎత్తైన చెట్లతో విశాలమైన తోటలను కలిగి ఉన్న ప్రదేశమిది. మాదుఱు అంటే మగ నెమళ్ళు తమ ఆడ నెమళ్ళుతో కలిసి నివసిస్తున్నట్లు వివరించబడింది.
పదకొండవ పాశురము: . “ఈ తిరువాయ్మొళి (పదిగం) నేర్చుకొని పఠించిన వాళ్ళ భౌతిక బంధాన్ని తెంచి అళగర్ ఎంబెరుమాన్ల దివ్య పాదాలను చేరేలా చేరుస్తుంది”. అని ఆళ్వార్ తెలుపుతున్నారు.
పొరుళ్ ఎన్ఱు ఇవ్వులగం పడైత్తవన్ పుగళ్ మేల్
మరుళిల్ వణ్ కురుగూర్ వణ్ శడగోపన్
తెరుళ్ కొళ్ళ చ్చొన్న ఓరాయిరత్తుళ్ ఇప్పత్తు
అరుళుడై యవన్ తాళ్ అణైవిక్కుం ముడిత్తే
అందమైన అళ్వార్తిరునగరికి నాయకుడు, అత్యంత ఉదారుడు అయిన నమ్మాళ్వార్, మహా జ్ఞానుడు, మహా కృపతో జీవాత్మకి వాస్థవ జ్ఞానాన్ని వివరించిన వారి వెయ్యి పాసురములలో ఈ దశాబ్దం విలక్షణమైనది. ఈ ప్రపంచాన్ని సృష్టించిన భగవాన్ యొక్క దయ, క్షమ, ఔదార్యము మొదలైన గుణాలను కిర్తిస్తుంది. అటువంటి ఈ దశాబ్దం మన సంసార బంధములను నిర్మూలించి కరుణామయుడైన అళగర్ ఎంబెరుమాన్ యొక్క దివ్య పాదాలను చేరుకునేలా చేస్తుంది.
అడియేన్ శ్రీదేవి రామానుజదాసి
మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2020/05/thiruvaimozhi-2-10-simple/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org