శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః
అవతారిక
అన్యప్రయోజనములను ఆశించు భక్తులు ఎంత గొప్ప కానుకలను సమర్పించినా భగవంతుడికి ప్రీతి కారకము కాదు ‘ అని ఈ పాశురములో చెపుతున్నారు.
మాఱాయిణైంద మరుత మిఱ్ తవళ్ంద
శేఱార్ అరవింద శేవడియై వేఱాగ
ఉళ్ళాతా రెణ్ణితియై యీందిడినుం తానుగందు
కొళ్ళాన్ మలర్ మడందై కోన్
ప్రతిపదార్థము
మలర్ మడందై కోన్ = శ్రీమహాలక్ష్మి ధవుడు
మాఱాయిణైంద = తన మీద పగతో జంటగా
మరుతం = మద్ది చెట్ల రూపములో వున్న రాక్షసుల జంట
ఇఱ = విరిగి పడునట్లుగా
తవళ్ంద = పాకుతూ వెళ్ళిన శ్రీకృష్ణుడు
శేఱార్ = బురద పూసుకొన్న
అరవింద శేవడియై= ఎఱ్ఱ తామరల వంటి శ్రీ పాదములున్న( శ్రీ కృష్ణుని )
వేఱాగ = తలచుటే ప్రయోజనముగా
ఉళ్ళాతార్ = భావించని వారు
రెణ్ణితియై = గొప్ప సంపదను
యీందిడినుం = తనకు కానుకగా సమర్పించినా
తాన్ = పరిపూర్ణుడైన పరమాత్మ
ఉగందు కొళ్ళాన్ = ఆనందముగా స్వీకరించడు
భావము
మాఱాయిణైంద మరుతం : తన మీద పగ పట్టి , జంట మద్ది చెట్ల రూపములో వున్న యమళార్జునులనే రాక్షసులు చావ కుండా విరిగి పడేటట్లుగా వాటి మధ్యగా పాకుతూ వెళ్ళాడు అని అర్థము.
ఒక సారి యశోద బండికి ఉయ్యాల కట్టి అందులో కృష్ణుడిని పడుకోబెట్టివెళ్ళింది. అప్పుడు కృష్ణుడు ఆకలికి ఏడ్చాడు. తల్లి కనపడక కోపము వచ్చి పాదములతో బండిని తన్నాడు. ఆ బండి ముక్కలు ముక్కలుగా విరిగి పోయింది. ఆ పసి బాలుడికి ఆపద తలపెట్టతలచి అప్పటికే ఆ బండిని ఆవేశించిన అసురుడు కూడా చనిపోయాడు.
అలాగే ఇక్కడ ఊరి వారందరూ కృష్ణుడు వెన్న దొంగిలించాడని యశోదతో చెప్పగా అవమాన భారముతోను, కోపముతోను కన్నయ్యను రోటికి కట్టివేసింది యశోద . కృష్ణుడు పిల్ల చేష్టగా తాటిని లాగుతూ పాకుతూ ఆ మద్ది చెట్ల మధ్య నుండి వెళ్ళగా ,అక్కడ శాప వశమున జంట మద్దిచెట్లుగా ఉండి , కంసుని కోరిక నెరవేర్చటము కోసము కృష్ణుడికి ఆపద తలపెట్టిన యమళార్జునులు ఆ కృష్ణుడి శరీర ఒరిపిడికి విరిగి పడిపోయారు. ఎవరికి ఆపద తలపెట్టారో వారిచేతిలోనే శిక్షింపబడ్డారు. దీని వలన శతృవులు ఏ కారణము చేత ఎదిరించినా వారు శిక్ష అనుభవించక తప్పదని బోధపడుతున్నది.
శేవడి—-సహజముగా తామర కొలనులో వికసించిన ఎర్ర తామరను పోలిన శ్రీపాదములు గలవాడు. ఇంకా చల్లని, అందమైన, సువాసన భరితమైన, చక్కగా వికసించిన తామరను పోలిన శ్రీపాదములు . పరాశర ముని ఈ కథను చెపుతూ ఆ మధ్దిచెట్లు విరిగి పడగా , ఆ శబ్దము విని కృష్ణుడు వెనకకు తిరిగి చూసినప్పటి ఎర్రని కన్నులను ఇంపుగా పాడారు. ఈ పాసురములో అరుళాళ మహామునులు చెట్ల మధ్యకు పాకిన ఆ ఎర్రని పాదముల అందమును వివరిస్తున్నారు అని మామునుల వ్యాఖ్యాన సారము.
‘” పోరుందియ మామారు తిన్నిడై పోయవెం
పెరుం తగాయ్ , ఉన్ కళల్ కాణియే పేదుత్తు
వరుంది నాన్ వాశగమాలై కొండు ఉన్నైయే
ఇరున్దిరు దేత్తనై కాలం పులంబువనో “ ( తిరువాయ్ మొళి 3-8-10 )
“ పోనాయ్ మామరుదిన్ నడువే ఎన్ పొల్లా మణియే “ (మద్ది చెట్ల నడుమకు పాకిన నా కొంటె కన్నయ్యా ) అని ఆళ్వార్లు అనుభవించ దలచినది మద్ది చెట్ల నడుమ పాకిన ఆశ్రీపాదములనె కదా !
“ వేరాగ ఉళ్ళా దార్ -వేరు పడుత్తి ఎణాదవర్గళ్ “ ( వేరుగా తలచని వారు –వేరుగా ఉండని వారు )
ఇతరమైన కోరికలు లేక పరమాత్మ శ్రీపాదములే ఉత్తారకమని విశ్వసించిన వారు అని అర్థము . ‘మద్ది చెట్లలో దాగిన యమళార్జునల చేతికి చిక్కక తనను తాను రక్షించుకొని మనకు తన శ్రీపాదములను చూపి, తనను అనుభవించే అవకాశము మనకు ఇచ్చుటే ఉన్నతమైన ఫలితము ‘ అని భావించుటే కదా దాసులైనవారికి తగినది. అలా కాక అన్యప్రయోజనములను ఆశించువారు అని అర్థము .
ఒణ్ నిధియై ఈందిడినుమ్ – ఒణ్మై -అర్థాత్ అంతులేని సంపదను ఇచ్చినా
తాన్ ఉగందు కొళ్ళాన్ మలర్ మడందై కోన్ –తాను శ్రీదేవికే శ్రీ అగుట వలన సకల సంపన్నుడు . కోరతయే లేని వాడు. అందువలన ముందు పెర్కొన్నవారు ఎంతటి సంపదనిచ్చినా స్వీకరించడు. ఆయన ఏదైనా కొరత ఉన్నవాడైతే కదా ఇతరులు ఇచ్చే వాటిని ఆశిస్తాడు? పైగా ఇచ్చేవారి మనసు తెలుసుకొని గ్రహించు వాడు కదా! కావున తన మీద భక్తి లేకుండా అన్య ప్రయోజనములను ఆశించి ఇచ్చు వారి వద్ద ఆనందముగా కాక తప్పదని స్వీకరిస్తాడు. ఆయన అందరికి ఆశ్రయణపాడుదు కావున ఎవరిచ్చినా స్వీకరించక తప్పదు. తల్లిదండ్రులు తమ సంతానములో మంచి వాడు ఇచ్చినా ,చెడ్డ వాడు ఇచ్చినా స్వీకరించక తప్పదు కదా! అలాగే పరమాత్మ తనను కాక అన్య ప్రయోజనములను ఆశించి ఇచ్చు వారి వద్ద కూడా స్వీకరిస్తాడు.
అడియేన్ చూడామణి రామానుజ దాసి
మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2015/02/gyana-saram-12-maray-inaindha/
పొందుపరిచిన స్థానము: https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org