Author Archives: chudamani chakravarthy

జ్ఞానసారము 8

Published by:

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

జ్ఞానసారము

<< పాశురము 7

పాశురము-8

vishnu
ముఱ్ఱ భువనం ఎల్లాం ఉండ ముగిల్వణ్ణన్
కఱ్ఱై తుళాయ్ సేర్ కళలన్ఱి – మఱ్ఱొన్ఱై
ఇచ్చియా అన్బర్ తనక్కు ఎంగనే సెయిదిడినుం
ఉచ్చియాల్ ఏఱ్కుం ఉగందు

ప్రతిపదార్థము

భువనం ఎల్లాం = సకల భువనములు
ముఱ్ఱ  ఉండ =  ఒక్కటి కూడా విడువక భుజించి తన గర్భమున దాచుకున్న
ముగిల్వణ్ణన్ = నీలమేఘ చ్చాయ గలవాడి
కఱ్ఱై తుళాయ్ సేర్ = సువాసనలు వెదజల్లు తులసి మాలను ధరించిన వాడి
కళలన్ఱి = శ్రీపాదములు తప్ప
మఱ్ఱొన్ఱై = వేరొక ప్రయోజనమును
ఇచ్చియా అన్ బర్ = కోరని భక్తులు
తనక్కు = భగవంతుడైన తనకు
ఎంగనే సెయిదిడినుం = కైంకర్యములు ఎలా చేసినా
ఉగందు = సంతోషించి
ఉచ్చియాల్ ఏఱ్కుం = తల మీద పెట్టుకుంటాడు

అవతారిక

శేషత్వము తప్ప మరే ఇతర ప్రయోజనములను ఆశించక ఆయన మీద అపారమైన ప్రీతిని కలిగివున్న వారు ,దాసత్వములో క్రమము తప్పినను భగవంతుడు దానిని దోషముగా భావించక ప్రేమతో స్వీకరిస్తాడు. గీతలో తన భక్తులు భక్తితో ఇచ్చిన పత్రం,పుష్పం, ఫల, తోయం ఏదైనా ప్రీతితో స్వీరిస్తానని చెప్పాడు. ఆ భావమే ఈ పాశురములో చెప్పబడింది.

వ్యాఖ్యానము

” ముఱ్ఱ భువనం ఎల్లాం ఉండ ముగిల్వణ్ణన్ ” ప్రళయ కాలములో సమస్త జీవరాశులను నాశము కానీయకుండా తన ఉదరములో భద్రపరచిన చరిత్ర చెప్పబడుతున్నది.ఈ విధముగా లోక రక్షణ చేసి అది చేతనోధ్ధరణ కోసము కాక తన కోసమే  అన్నట్లు ఆయన నీల మేఘ వర్ణ  శరీరము తెలియజేస్తున్నది. ఎందుకంటే మేఘములు లోక కల్యాణార్థము వర్షిస్తుంది, భగవంతుడు తన భక్తుల కోసమే దయను కురిపిస్తాడని బోధ పడుతున్నది. పాశురము లో  ‘తాయిరుక్కుం వణ్ణమే ఉమ్మై తన్ వయిఱ్ఱిరుందు ఉయ్యకొండాన్ ‘ ( సృష్టి చేసే క్రమములోఅనే నిన్ను రక్షించాడు) అని చెప్పినట్లుగా ప్రళయ కాలములో లోకములను వాటికి తెలియని తనకు మాత్రమే తెలిసిన సంబంధమే కారణముగా రక్షించి, అది కూడా తనకోసమే  చేసినట్లుగా భావించి తన రూపములో ఆ విషయమును స్పష్టము చేసాడు అని చెప్పబడింది.

కఱ్ఱై తుళాయ్ సేర్ కళలన్ఱి – ఇక్కడ భగవంతుడీ శ్రీపాదములను మహత్యము చెప్పబడింది. భూమిలో పరిగే తులసి కమే ఆయన శ్రీపాదములపై ఉన్న తులసి ప్రకాసమానముగా వుంటుంది . ఎందు వలన అంటే ఆయన తిరుమేని సంబంధమే కారణము.  ఈ వర్ణన వలన భగవంతుడీ శ్రీపాదములకు అందము,ఔన్నత్యము అనేక రెట్లు పెరుగుతుంది.

– మఱ్ఱొన్ఱై ఇచ్చియా అన్ బర్ – పరమ భక్తులైన వారు అటువంటి శ్రీపాదములను తప్ప మరి ఇతరములను ఆశ్రయించము, అంటున్నారు .  లోకములో భగవంతుడిని పూజించేవారు ఆయన మీది ప్రీతితో కాక తమ కోరికలు తీర్చుకోవటము కోసామే చేయడము మనము చూస్తూనే ఉంటాము. అలా కాక ఆండాళ్ తల్లి చెప్పినట్లుగా ,’ నూరు తడా అక్కార వడిశలుం సొన్నేన్ నూరు తడావిల్ వెణ్ణై వై నేర్దు పరావివైత్తేణ్ ( నీకు ఇష్టమైన నూరు గంగాళాల అక్కర వడిసల్, నూరు గంగాళాల వెన్న సమర్పిస్తాను) .దీనిని నువ్వు స్వీకరిస్తే ఒక్కొదానికి నూరు చొప్పున ఇంకా సమర్పిస్తానూ అనే వారెవరు? నిజమైన భక్తులు భగవంతుడు స్వీకరించడమే పరమ ప్రయోజనముగా భావిస్తారు. వీరినే అన్య ప్రయోజనమాశించని భక్తులని లోకము కీర్తిస్తుంది.

తనక్కు ఎంగనే సెయిదిడినుం- అఒతటి భక్తి గలవారు భగవాంతుడికి కైంకర్యము చేయునపుడు క్రమము తప్పినను….

ఉచ్చియాల్ ఏఱ్కుం ఉగందు –  మహా ప్రీతితో తల మీద పెట్టుకుంటాడని అర్థము. అనగా భక్తుడు కాలితో విసిరి వేసినా తలతో స్వీకరిస్తారనీ అంటున్నారు. ఉదాహరణకు.. పెరుమాళ్ళ కోసము కట్టి వుంచిన పూల మాలను ఆండాళ్ తల్లి తాను ధరించి అందము చూసుకున్నది . అప్పుడు ఆ మాలలో ఆమె తల వెంట్రుక ఒకటి చిక్కుకున్నది. ఆమాలను చూసిన పెరియాళ్వార్లు దానిని విసిరివేశి మరొక మాలను కట్టి తీసుకు వెళ్ళారు.   కాని పెరుమాళ్ళు తనకు ఆమాలె కావాలని అడిగి ధరించిన విషయము జగద్విదితము. ఇటువంటివి ఎన్నో ఉదాహరణలు భక్తులపై భగవంతుది  ప్రీతిని తెలియజేసేవి చూడవచ్చు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/02/gyana-saram-8-murrap-buvanam/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

జ్ఞానసారము 7

Published by:

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

జ్ఞానసారము

<< పాశురము-6

పాశురము-7

sri-parkadal-nathar

తోళార్ సుడర్తిగిరి శంగుడయ సుందరను

క్కాళానార్ మత్తొన్ఱిల్ అంబు సెయ్యార్మీళ

పొరువరియ విణ్ణాట్టిల్ పోగం నుగర్వార్కు

నరగన్ఱో ఇందిరన్ తన్ నాడు?

ప్రతిపదార్థము

తోళార్ = శ్రీ భుజములతో కూడి వున్న

సుడర్తిగిరి = ప్రకాశించు సుదర్శన చక్రము

శంగుడయ = అందమును ఇనుమడించు శంఖము

సుందరనుక్కు =కలిగిఉన్న వాడికి

ఆళానార్ = దాసులైన వారు

మత్తొన్ఱిల్  =అవి తప్ప ఇతరములైన వాటి యందు

అన్ బు సెయ్యార్ =కోరిక కలిగి వుంటారా ?

మీళ = తిరిగి రాని

పొరువరియ = దోషములే లేని (ఒకే ఒక్కటి)

విణ్ణాట్టిల్ = వైకుంఠములో

పోగం = భోగము

నుగర్వార్కు =అనుభవించు వారికి

ఇందిరన్ తన్ = ఇంద్రలోకము

నరగన్ఱో =దుఃఖ హేతువైన నరకముతో సమానము

అవతారిక

భగవద్దాసత్వము రుచి తెలిసిన వారు బ్రహ్మ పదమును కూడా ఇష్ట పడరని  క్రిందటి  పాశురములో తెలుసుకున్నాము.ఇందులో భగవంతుడి అందములో లీనమైన దాసులకు ఇతర విషయములను ఆదరించరని చెప్పబడింది.

వ్యాఖ్యానము

“తోళార్ సుడర్తిగిరి శంగుడయ సుందరనుక్కు “సుందరమైన బాహువులతో అందమైన  పాంచజన్యమనే శంఖమును, సుదర్శన చక్రమును సదా పట్టుకొని ఉన్నవాడని అర్థము.    శ్రీ సుదర్శన చక్రమును కుడి హస్తములో , పాంచజన్యమును తన ఎడమ హస్తము లో ధరించిన స్వామి  అందమునకు వర్ణనాతీతమైన శోభను చేకూరుస్తున్నాయని చెప్తున్నారు. శత్రువులకు భయాన్ని కలిగించి వారిని అంతము చేసే ఆయుధముల వంటిగాను , భక్తులకు అవి ఆభరణములగాను ప్రకాశిస్తున్నాయి. అందుచేతనే ఇక్కడ “అళగన్” అంటే “అందమైనవాడ” అని సంభోదించారు. “మనైపాఱ్ పిరందార్ పిరందెయిదుం పేరింబమెల్లాం తురందార్ ఒళుదార్ తోళ్ ” ( ద్రావిడ వేదమును పాడువారు అవతరించారు. అవతరించి పొందవలసిని భోగములను వదిలి ఈ భుజములనే కొలిచారు అని అర్థము) అని భూదత్తళ్వార్లు తమ ఇరండామ్ తిరువందాది లో చెప్పారు. పాశురములో భగవంతుడి భుజములను కళ్ళతోనె పూజించే వారు, ఈ లోకములో దొరుకు తాత్కాలిక సుఖములన్నింటినీ వదిలి వేస్తారు. అని చెపుతున్నారు.శ్రీరామాయణములో శ్రీరాముడి బాహు సౌదర్యమును చూసిన వారు మరి వేరొకదానిని చూడ లేదు.” తోళ్ కండార్ తోళే కండార్ ” అని , “ఆడవర్ పెణ్మైయై ఆవావుం తోళినాయ్ ” అని ,కంబరామాయణములో విశ్వామిత్రుడు అంటాడు. శ్రీ రాముని బాహూ సౌందర్యము చూసిన పురుషులు కూడా తాము స్త్రీ గా జన్మించాలని ఆశ పడతారని భావన. ‘ తోళమోర్ నాంగుడై కాళ మేగత్తై అన్ఱి మత్తోన్ఱు ఇలం ” అని నమ్మాళ్వార్లు అన్నారు. అతి సుందరమైన బాహువులు కలిగిన తిరుమొగురు కాలమేఘపెరుమాళ్ కన్నా ఇంక ఏదియును విలువైనది లేదు.గవంతుడి సౌందర్యమునకు దృష్టి దోషము తగలకుండా హారతి పట్టాలి.అంతటి అందమును చూసిన వారికి లోకములోని మరి ఇతర విషయములు అంటకుండ ఉత్తరించగల బాహువులు అవి. వారి బాహువులు చూసిన వారు . ప్రాపంచిక విషయాల పై గల వారికి ఉన్న గర్వం పట పంచలవడం ఖాయం.అణియార్ ఆళియుం శంగముం ఏందుం అవర్ కాణ్మిన్ “.శంఖమును,చక్రమును అలంకృతులైన పెరుమాళ్ యొక్క అందము రెండు రెట్లు అధికమవుతుంది. పెరియాళ్వార్ పెరుమాళ్ యొక్క అందమును ఒక్కోక్కటి గా వర్ణిస్తున్నారు . ముందుగా పెరుమాళ్ యొక్క కీర్తి ని తెలిపారు ఆ తరువాత పిరాట్టి తో కలిసి ఉండే పెరుమాళ్ యొక్క కీర్తిని పొగిడారు. అటు పిమ్మట, పిరాట్టి తో శ్రీ సుదర్శనమును ధరించిన పెరుమాళ్ యొక్క అందమును పాడారు. ఇవన్నియును , తిరుపల్లాండు లో ని రెండవ పాశురము యొక్క మొదటి మూడు వరుసలో వర్ణించారు. ఈ మూడు వరుసలు ఆళ్వార్ ప్రత్యక్ష వాక్యంలో పెరుమాళ్ ముందు ఉండి “నీవు చిరకాలం ఉండాలి, నీవు మరియు పిరాట్టి చిర కాలం ఉండాలి, నీవు మరియు నీ కుడి  హస్తములో ఉండే శ్రీ సుదర్శనం చిర కాలం ఉండాలి” అని పాడారు. ఈ ఘట్టములో, శ్రీ పాంచజన్యము ను ప్రవేశ పెట్టి, పెరుమాళ్ ,తన వక్షస్తలములో  పిరాట్టిని , శ్రీ సుదర్శనమును తన కుడి హస్తములో మరియు శ్రీ శంఖమును ఎడమ చేతి లో వెంచేపచేసి దర్శనము ఇచ్చారు. వర్ణనాతీతముగా చాలా అందముగా ఉన్నారు. పెరుమాళ్ ముందు ఉన్న పెరియాళ్వార్ ఇంక స్వామి యొక్క అంతటి సౌందర్యమును గ్రహించలేకపోయారు అందు చే, వారు స్వామి దగ్గరనుండి తన ముఖమును మరల్చుకున్నారు. అందువలననే , అటు పిమ్మట పాదములో “ఆప్పాంచజన్యంముం పల్లాండే ” అని పాడారు అనగా “యుద్ధ సమయములో దివ్యమైన శబ్దము చేసే ఆ పాంచజన్యము కూడా చిర కాలం ఉండాలి ” ఇది ప్రత్యక్ష పద్ధతిలో లేదు, పరోక్షంగా “ఆ పాంచజన్యము కూడా చిర కాలం ఉండాలి ” అని అంటున్నారు. ఆళ్వార్ శ్రీ పాంచజన్యము ను ధరించిన పెరుమాళ్ యొక్క అందమును నేరుగాచూడలేక అలా వివరించారు. అటువంటి అందమును చూసిన వారు ఎవరైనను లౌకికమైన సుఖముల వైపు అడుగులు వేయుదురా??

ఆళానార్ : ఇంతటి సౌందర్యము గలవాడి అందమునకు ఓడి దాసులైనవారని అర్థము.  భగవంతుడికి దాసత్వము చేయుట రెండు విధములుగా చెప్పబడింది. 1. ఆయన స్వామిత్వమునుకు అనగా స్వామి తాను ధారకుడుగా, స్వామిగా, నాయకుడిగా దాసులైన మనము ఎప్పుడూ తన తిరువడి క్రింద ఉండేటట్టు చూచుకునేవాడు. అంతే కాకుండా, అసమానమైన తన దివ్య స్వభావమును తన సౌందర్యము తో మొదలు పెట్టి, సౌలభ్యమును , కుల మత విభేదములు లేకుండా అందరితో కలిసి పోయే తన సౌశీల్యమును చూపుతారు . పూర్వ పాశురం లో “ పుండరీక కేల్వనడియార్ “ అనగా శ్రీ కి భర్త అయిన భగవంతుడికి దాసులవుట  చెప్పబడింది. “సుందరున్నుక్కు ఆళానార్ ‘ ( సుందరుడికి దాసులయ్యారు ) అన్నప్పుడు ఆయన ప్రత్యక్షముగా అందరి ద్వారా సేవించి అనుభవించే సౌందర్యమునకు  దాసులవుట చెప్పబడింది. కావున రెండు విధములుగాను భక్తులను ఓడించి దాసులను చేసుకున్నారు. ఇక్కడ సౌందర్యమునకు  ఓడుట చెప్పబడింది. అరుళాళా పెరుమాళ్ ఎమ్పెరుమానార్ ఇక్కడ సౌందర్యమునుకు చూచిన  వారై పెరుమాళ్ కు దాసులవుటను  ప్రశంసిస్తున్నారు , అటువంటి దాసులను కొనిఆడుతున్నారు.

మతొన్నుఱినిల్ అంబు సెయ్యార్:అనగా ఆత్మ స్వరూపం మరియు భగవంతుడి దివ్యమైన గుణములు తెలుసుకుని దాసులైన వారికి,  ఈ లోక విషయములపై  ఆశక్తి ఉండదు. పరమపదము శుద్దతత్వ మయము. అందువలన అది అప్రాకృతమని, ఈ లోకము ప్రాకృతమని చెప్పబడింది. ఇక్కడ వున్న సమస్త వస్తువులు దేశ కాల నియమములకు లోనై  ప్రతి క్షణము మార్పునకు లోనవుతాయి. అక్కడ దేశ కాల నియమములు ఉండవు, అందుకే వస్తువులు ఏ మార్పునకు లోను కావు . అక్కడ ఉన్నవాళ్లు మన మనసు ను దోచు కునేలా ఉంటారు.  అందు వలన ఈ లోకములోని వస్తువుల కంటే ఆ లోకములోని వస్తువులు ఉన్నతమైనవి. ఆ పరమపదములో అంతులేని ఆనందమునను అనుభవించు వారు ఇక్కడి వస్తువులను కోరుకుంటారా? ఇవి లోపభూయిష్ఠమై, అసహ్యమునకు హేతువై ఉంటాయి. అందుకని వీటిని కోరుకోరు.

కొంతమంది దృష్టి లో శ్రీ వైకుంఠమును ఈ లోకముతో పోల్చినందుకు గొప్పదనము కలిగినదని భావిస్తారు.ఇదే శ్రీ వైకుంఠమును స్వర్గము తో పోల్చినను , గొప్పదనమును ఆపాదించుకుంటూదా అని ప్రశ్న.  స్వర్గం లో దేవత స్త్రీలు అందిచే  సుఖాలకు శ్రీ వైష్ణవులు లోనవుతారా ?ఈ ప్రశ్న కు సమాధానము క్రింది వాక్యములలో చెప్పబడినది.

 మీళా పొరువరియ విణ్ణాట్టిల్ పోగం నుగర్వార్కు ” అని ప్రారంబించి ” అఱివిల్ వీడు  ” అని చెప్పబడింది.శ్రీ వైకుంఠము లో మరు జన్మ లేకపోవుట, మూడు గుణములను మించిన శుధ్ధ సత్వమయమైనదిగా,  అసాధారణ ప్రకాశమానమైనదిగా, అనుపమానమైనదిగా. ఉన్నతమైనదిగా కీర్తించబడింది. అక్కడ సృష్టి మరియు నాశనం అనేవి ఉండవు.  ఇటువంటి పరమపదము చేరి శ్రీ మన్ నారాయణుని , పిరాట్టిని మరియు వారి దాసుల కైంకర్యం చేస్తూ  ఆనందమును అనుభవించాలని అంతులేని కోరిక గలవారని  అర్థము .

నరగన్ఱో ఇందిరన్ తన్ నాడు  – స్వర్గము ,ఇంద్ర,బ్రహ్మాది లోకములు పుణ్యమున్నంత వరకే  అనుభవ యోగ్యము. పుణ్యము తీరి పోతే అక్కడి నుండి తల కిందులుగా ఈ భూలోకమునకు రావలసినదే. పైన చెప్పిన అన్ని లోకములు ఇంద్రాది దేవతలకు అనుభవ యోగ్యముగా వున్నవి. అటువంటప్పుడు అవి నరకముతో సమానమే కదా! అందు వలన తంతులుగా వున్న పదునాలుగు భువనములతో కూడిన ఈ అండము పరమపదమునకు సాటి రాదు , పైగా దానిని కోరుకునే వారికి నరక ప్రాయమే అవుతుంది. అక్కడి భోగ భాగ్యములు అనిత్యమైనవి. ముఖ్యమైన అంశము ఏమనగా ఆ ఆనందము పెరుమాళ్ కు సేవ చేసి పొందినవి కావు. వారి వారి సంతోషమునకు ఆ భోగములు ఉపయోగపడుతాయి. అటువంటి భోగములు పెరుమాళ్ కే దాసుడైన జీవాత్మ యొక్క స్వరూపమునకు వ్యతిరేకమైనవి. రెండవ పాశురం లో చెప్పిన విధంగా పెరుమాళ్ పిరాట్టి తో దూరమైతే అదే ఒక భక్తునికి నరకము. శరణ్గాతుడు స్వర్గ నర్కాదులను సమముగా , దోష భూయిష్టముగా చూస్తాడు, వాటి గురించి ఆశ పడడు. కేవలం శ్రీ మన్ నారాయణుని కైంకర్యమే సర్వవిధ పురుషార్థమని జీవిస్తాడు.

అడియేన్ చుడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/02/gyana-saram-7-tholar-sudarth/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

జ్ఞానసారము 6

Published by:

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

జ్ఞానసారము

<< పాశురము 5

పాశురము-6

$37B2598BC35DA6F3

 

పుండరీకై కేళ్వన్ అడియార్ అప్పూమిశైయోన్

అండమొరు పొరులా ఆదరియార్ మండి

మలంగ ఒరు మీన్ పురండ మాత్తిరత్త్ ఆల్ ఆర్తు

క్కలంగిడుమో మున్నీర్ కడల్

ప్రతి పదార్థము

పుండరీకై = తామరలో పుట్టిన లక్ష్మీ దేవికి

కేళ్వన్ = భర్త అయిన శ్రియఃపతి

అడియార్ = దాసులు

అప్పూమిశైయోన్ = భగవంతుడి నాభి కమలము లందు పుట్టిన బ్రహ్మ చే సృష్టించ బడిన

అండం = పదునాలుగు లోకాలున్న అండమును

ఒరు పొరులా = ఒక వస్తువుగా

ఆదరియార్ = గణించరు

ఒరు మీన్ = ఒక చేప

మండి = తన తాపములన్నింటితో దరి చేరి

మలంగ = ఆర్తితో

పురండ = పొర్లిన

మాత్తిరత్తాల్ = మాత్రము చేత

మున్నీర్ కడల్ =  మున్నీరైన సముద్రము

ఆర్త్ = స్తాన భ్రం శమై గొప్ప శబ్దమునకు

క్కలంగిడుమో  = చలించి పోతుందా? పోదు.

అవతారిక

కర్మ,జ్ఞాన ,భక్తి యోగలను  భగవంతుడిని పొందడానికి ఉపాయముగా శాస్త్రములలో  చెప్పబడింది. అయినప్పటికీ ఆచరణలో అవి కష్ట సాధ్యములవుట, ఈ ఉపాయములను చేపట్టుట ఆత్మ దాస్యమునకు వ్యతిరిరేకమగుట చేత వీటిలోని లోపాలను సహేతుకముగా నిరూపించటము వలన వాటిని ఆచరించవీలు లేకుండా పోయింది. చాలా కాలముగా బహు జన్మలలో ఇంద్రియ భోగములను అనుభవించడానికి అలవాటు పడిన ఆత్మలకు శాస్త్రములు తప్పు అని చెప్పిన వాటిమీద మనసు పోకుండ వుంటుందా? సంపదల మీద కోరిక మనసును కలచి వేయకుండా వుంటుందా? అన్న ప్రశ్నలుదయిస్తే ఈ పాశురములో దానికి జవాబు లభిస్తుంది. భగవంతుడికి కైంకర్యయము చేసి దాని రుచి తెలుసుకున్న వాళ్ళకు ,సంపదలలో కెల్ల గొప్పదైన పరమపదము లభిస్తే లౌకిక  సంపదలను ఒక వస్తువుగా కూడా చూడరు, దాని వలన మనో చాంచల్యమును పొందరు, అని ఈ పాశురములో చెపుతున్నారు. దీనికి ఉదాహరణగా శ్రీరామాయణములో చరిత్రను చూడవచ్చు.

శ్రీరాముడు దండకారణ్యములో శరభంగ మహా ముని ఆశ్రమానికి వెళ్ళారు. ఆ సమయములో ఇంద్రుడు ఆ మునితో మాట్లాడుతున్నాడు.  ఇంద్రుడు వెళ్ళిపోయిన తరువాత శ్రీరాముడు ఆ ముని సమీపమునకు వెళ్ళి తాను వచ్చిన కారణమును చెప్పి నిలబడ్డారు. ఆ ముని తన జ్ఞాన నేత్రము శ్రీ రాముని రాకను ముందే అనుమానించారు.  శ్రీరాముడిని చూసి “ఆళియిల్ అరితుయిలవన్”, అని సంతోషించి ఇందిరన రుళినన్ ఇరుది శెయ్ పగలా వంతనన్ మరువుతి మలర్  అయన్ ఉలగం తందనెన్ “, ” ఎన్ ఉరవోయ్!అందమిల్ ఉయర్ పదం అలైతలై ముయల్వేన్” అని అన్నారు. అర్థాత్, బ్రహ్మ దేవుడు మునిని తనలోకమునకు రమ్మని ఇంద్రుడి ద్వారా ఆహ్వానించారు. ఆ ముని ఆ లోకమునకు నేను రాను అని చెప్పారు. ” నీ ఇవన్ వరుగితి ఎనుం నినైవు ఉడయేన్” అర్థాత్ నీ రాక కై ఎంతో కాలమునుండి ఎదురు చూస్తున్నాను . నీ శ్రీ పాదముల తో మా ఆశ్రము ను పావనము కలుగుటయే మాకు లభించే భాగ్యము.  ఇటువంటి భాగ్యము ముందు, మరి ఎటువంటి లౌకిక విషయములు ఉదాహరణకు లోకాలకు అనింటికి రాజు అగుటయో , బ్రహ్మలోకం లో స్థానమో నన్ను కలంగనివ్వవు, నా లక్ష్యము (నిన్ను చేరుట) నుండి  దారిని మలుచజాలరు. నేను ఇంద్రుడి తో  చెప్పాను “అటువంటి భోగములు నాకు వొద్దు, అనింటికన్నా గొప్ప ఐశ్వర్యం శ్రీ రాముని దాసుడిగా ఉండటమే”. శరభంగ ముని బ్రహ్మపదమును  ఒక వస్తువుగా కూడా గణించలేదు. పరమపదమే ఉన్నతమైన సంపద అని కోరుకొని దానినే  పొందారు. సత్యమును తెలుసుకున్న జ్ఞానులు ఇతరములైన వాటిని తృణప్రాయముగా చూస్తారు అని ఈ చరిత్ర వలన తెలుస్తున్నది.

వ్యాఖ్యానము

పండై నాళాలే నిన్ఱిరువరుళుం పంగయతాళ్ తిరువరుళుం కొండు ” తిరువాయ్మొళి (9.2.1) ( అనాది కాలముగా అమ్మతో కూడి అనుగ్రహిస్తున్న పాదపంకజముల వాడి కృప వలన) భగవంతుడు, పిరాట్టి ఇద్దరి అనుగ్రహము అపారముగా ఉన్నపుడు ప్రాచీన పాపముల నుండి బయట పడగలము అని నమ్మాళ్వార్లు  అన్నారు.  ” యానే యెన్నై అరియగిలాతే , యానే యనతనతే ఎన్రిరుందేన్. యానే నీ ఎన్ ఉడైమైయుం నీయే “( నేను నన్ను తెలుసుకోకుండా నేనే నాది అని అని వున్నాను, నేనే నువ్వు నాదంతా నువ్వే) అనేట్లుగా మారుతారు. ఇలాంటి వారు భగవంతుడికి దాసులుగా వుండుట తమకు గొప్ప చిహ్నముగా భావించి , ఆయనకు ప్రీతికరమైన కైంకర్యములు చేయుటలో నిమగ్నమై   ఆనందమును పొందగలుగుతారు.”అప్పూమిశైయోన్ అండం ఒరు పొరుళా ఆదరియార్ “( ఆ తామరను పూయించిన వాడి అండమును ఒక వస్తువుగా ఆదరించరు) సంప్రదాయ గ్రంథములలో ఉన్నతమైన సంపదగా చెప్పబడేది పరమపదము. చతుర్ముఖుడైన బ్రహ్మ పరమాత్మ నాభికమలము నుండి ఉద్భవించిన వాడు, భగవంతుడి ఆనందమునకు హేతువుగా పదునాలుగు లోకములు ఉన్న ఈ బ్రహ్మాండమును ఆయన దాసులు ఏ మాత్రము గణిించరట.

అపూమిశైయోన్ అండం ఒరు పోరుళా ఆదరియార్: శరణాగతులు ఎటువంటి సంపదను కాలతోస్తున్నారో తెలుస్తుతే, వారి గొప్పతనమును మనము అర్థం చేసుకోగలము. మనకు అర్థం అవుటకు 1౦౦౦౦౦౦ ట్రిలియన్ రుపాయలు మరియు ఇల్లు , ఆభరణములు ఇంకనూ మన ఆలోచనకు తోచినటువంటి సంపద కలిగి ఉండే మనిషి యొక్క ఆనందమును 1 యూనిట్ మనిషి  ఆనందము  అనుకుందాం.అటువంటి ఆనందమునకు 1౦౦౦ రెట్లు గంధర్వ ఆనందము. గంధర్వ ఆనందమునకు 1౦౦౦ రెట్లు ఇతర  దేవతలది. దేవతల ఆనందమునకు 1౦౦౦ రెట్లు బ్రహ్మ యొక్క ఆనందము. అటువంటి బ్రహ్మ ఆనందమును ఒక శరణగతునికి , ఉదా: శరభంగ మునికి ఇస్తే , వారు దానిని ఒక ఆనందముగాను గణించరు ఎందుకంటే వారికి కలిగే గొప్ప ఆనందమును విలువ కట్టలేనిది. పెరుమాళ్, తాయార్ మరియు దాసులకు చేసే కైంకర్యము  విలువైనది, దానిని కొలువుట సాధ్యం కానిది. ఇతర సంపదలకు సమయ సంబంధము  ఉండును, కైంకర్యము అనే సంపదకు సమయము తో సంబంధము లేకుండా ఉంటుంది ఎందుకనగా శ్రీ వైకుంఠం లో సమయము అనే విషయము ఉండదు.

శరీరానికి, ప్రాణానికి భేదము పాటించని  శరీరమేప్రాణమని బ్రమించే అజ్ఞానులకు ఈ ఆత్మ భగవంతుడికి దాసుడని తెలియక ,నేను-నాది, అని తనను స్వతంత్రముగా భావించే మూఢులకు భౌతికమైన సంపదలు ఆనంద దాయకము కావచ్చును.భగవంతుడికి దాసులమని భావించే వారికి  సంపదలు ఆనంద దాయకము కాక పోగా అసహ్యముగా తోస్తుంది. అందువలన అటువంటి సంపదలను భగవంతుడి దాసులు  ఆదరిస్తారా? సంపదలు మహా  ఆకర్షములు. ఎలాంటి వారినైన ఆకర్షించకుండా వుండదు. మనసును చలింప చేస్తుంది. “మండి మలంగ ఒరు మీన్ పురండ మాత్తిరతాల్ ఆర్తు కలంగిడుమో మున్నిర్ కడల్?”( చేప ఒకటి తన బలము నుపయోగించి నెట్టినంత మాత్రాన మున్నీరైన సముద్రమునకు ముప్పు ఎముంటుంది ) అని ఈ ప్రశ్నకు జవాబు చెప్పారు . అనగా ఒక చేప తన బలమునంతా కూడగట్టి తోసినా సముద్రము కొంచము కూడా కదలదు. అలాగే భగవంతుడి దాసులు లౌకిక సంపదలు ఎంత ఆకర్షించినా వాటి వలన ఏ మాత్రము కదలి పోరు. సముద్రమును మున్నీరని అంటారు. ఊరిన నీరు, నదుల నుండి చేరిన నీరు, పైనుండి వానగా కురిసిన నీరు ఉండటము చేత దానికి ఆ పేరు వచ్చింది. చేప యొక్క చర్యలు బ్రహ్మలోకమంతటి సంపదను సూచకమైతే , సముద్రము భగవంతుని యొక్క దాసులై , పెరుమాళ్, పిరాట్టి మరియు వారి దాసులకు చేసే కైంకర్యమునకు ప్రతీతి.

అడియేన్ చుడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/02/gyana-saram-6-pundarigai-kelvan/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

జ్ఞానసారము 5

Published by:

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

జ్ఞానసారము

<< పాశురం 4

 

పాశురము-5

cd

తీర్త్త ముయన్ఱాడువదుం చెయ్తవంగళ్ చెయ్వనవుం

పార్తనై మున్ కాత్త పిరాన్ పార్పతన్ మున్ చీర్తువరై

మన్నన్ అడియో మెన్నుం వాళ్వు నమక్కీంత్తర్పిన్

ఎన్న కుఱై వేండుం ఇని

ప్రతిపదార్థము:

మున్ = మహాభారత యుధ్ధములో(పార్తనై) మనసు చలించి పోయిన అర్జునుని

కాత్త పిరాన్ = గీతోపదేశము చేసి మనో చాంచల్యమును పోగొట్టిన శ్రీకృష్ణుడు

పార్పతన్ మున్ = వీక్షించక ముందు

తీర్తo = పుణ్య నదీ  (పాపములను పోగొట్టుకొనుట కోసము)

ముయన్ఱా = ప్రయత్నములు చేసి

ఆడువదుం = స్నానములు చేయుట

చెయ్తవగళ్ = శరీరమును కృశింపచేయు నోములు

చెయ్వనవుం = ఇంకా ఇతర పుణ్య కార్యములు

శీర్తువరై = ఉన్నతమైన ద్వారకాపతి అయిన శ్రీకృష్ణుడు

నమక్కు = ఆయన దాసులమైన మనకు

అడియోమె = దాసత్వమనే

ఎన్నుం వాళ్వు = సంపదను

ఈంత్తర్పిన్ = అనుగ్రహించిన తరువాత

ఇని = ఇంక ముందు కాలమంతా

వేండుం  కుఱై ఎన్న = సాధనముల గురించి, ఫలితముల గురించి కొరత ఏముంది?

అవతారిక:

ద్వయమహామంత్రం లోని పూర్వ భాగం సారార్థం భగవంతునికి శరణాగతి చేయుటే. దీనినే సిద్ధోపాయవరణం అని అంటారు.

సిద్ధోపాయం అనగా ఉపాయమైన పెరుమాళ్ అతి సులుభుడై  ఎల్లప్పుడూ శరణ్గాతుల రక్షకై సిద్ధంగా ఉండుట. అందుకే తనను సిద్ధోపాయం అని వ్యవహరిస్తారు.  “నీవే నాకు ఉపాయం” అని సిద్ధోపాయమైన పెరుమాళ్ దగ్గర శరణాగతి   చేయుట సమయములో మన దగ్గర ఎటువంటి ఇతర ఉపాయముల సంబంధము ఉండకూడదు. అటువంటి సంబంధం ఉన్నచో , వాటిని పూర్తిగా తొలిగించుకొని పెరుమాళ్ ను శరణువేడాలి. ఇట్లు పూర్తిగా ఇతర ఉపాయములు తొలిగించుకోవుట కూడా శరణాగతి లో భాగంగా భావిస్తారు. ఈ విషయం గీతచరమశ్లోకం లో స్పష్టంగా చెప్పారు. చరమశ్లోకం పూర్తిగా తెలుసుకుని పెరుమాళ్ ని  శరణాగతి చేసిన వారు ఇతర ఉపాయములలో చలువచూపరు.  శేషత్వం అనే ఆత్మ స్వరూపం కు తగినట్లుగా ప్రవర్తిస్తారు. తమ భారమును  పెరుమాళ్ పై వదిలివేసి , సంతోషముగా జీవిస్తారు.  ఎవరైతే “మన మంచిచెడులు చూచుకొనుట ఇక ఎమ్పెరుమాన్ యొక్క బాధ్యత  , మనము ఏమియును చేయనకర్లేదు ” అని తలిచేవారికి మనసు  ప్రశాంతంగా ఉంటుంది. స్వామి అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్ తాను కూడా ఇటువంటి అధికారి అని , ఈ పాశురములో అటువంటి స్థితి కలిగిన అధికారి యొక్క మనోస్థితిగురుంచి చెప్పారు.

వ్యాఖ్యానము:

తీర్త్త ముయన్ఱాడువదుం: గంగ, యమున, సరస్వతి వంటి పుణ్య నదులలో శారీరిక , మానసిక క్లేశములను, పాపములను పోగొట్టుకొనుట కొరకు స్నానము చేయుట.

చెయ్తవగళ్ చెయ్వనవుం: “ఊన్వాడఉణ్ణాదుపొరుప్పిడైయేనిండ్రుంపునల్ కులితుమైందునెరుప్పిడైయేనిండ్రుం వీళ్ కనియుమూళిఐయుమెన్నుమివైయేనుగర్న్దుఉడలమ్ తాన్వరుంది” అని ఆళ్వార్ల పాశురములలో చెప్పినట్టుగా  తమ పాపములు తొలిగించుకోవుటకు ఉపవాసములు చేయుట, పంచాగ్నుల మధ్య నిలబడి తపస్సు చేయుట, రాలిపోయిన ఆకులను మాత్రమే భుజించి శరీరమును కృశింప చేయుట వంటి అనేక రకములైన తపస్సులు చేసి శరీరమును కృశింపచేస్తారు. “తవంగల్” అని బహు వచనములో చెప్పినందుకు  సాత్విక దానము, యాగము మొదలగు పుణ్య కార్యములు కూడా ఇందులో చేరి వున్నాయి.

పార్తనై మున్ కాత్త పిరాన్ పార్పతన్ మున్ : కర్మ,జ్ఞాన , భక్తి యోగములను భగవంతుడిని పొందుటకు  ఉపాయములుగా భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించాడు. అది విన్న అర్జునుడు భగవంతుడికి జీవుడు దాసుడు కదా! దాసుడు స్వతంత్రించి పై ఉపాయములను ఆచరించ వచ్చునా? అన్న సందేహము కలిగింది. దానికి శ్రీకృష్ణుడు ” అర్జునా!  పై ఉపాయములను నువ్వు ఆచరించవలసిన అవసరము లేదు. వాటిని పూర్తిగా మరచిపో.,  నేను గుణ పరిపూర్ణుడను , దాసులకు సులభుడను, దాసుల తప్పులను చూడని వాడను,  దాసుల తప్పులను క్షమించు వాడను, సుజ్ఞానము కలవాడను, వాత్సల్యము  కలవాడను,ఫలములనిచ్చు వాడను, ఇలాంటి అనేక గుణములు గల నన్ను మాత్రమే నువ్వు ఉపాయముగా స్వీకరిస్తే చాలు. అలా నన్ను  ఉపాయముగా స్వీకరించేటప్పుడు ” కృష్ణుడు మన దగ్గర ఏమీ ఎదురు చూడడు, ఆయనకు ఎమీ ఇవ్వనవసరము లేదు. అని పరిపూర్ణముగా విశ్వసించి నన్ను ఆశ్రయించాలి.” అలాగ  నువ్వు శరణాగతి చేస్తే జ్ఞానము, శీలము  మొదలగు సకల గుణములు కల  భగవంతుడినైన నేను , నీ అజ్ఞానము, అలసట, అశక్తత మొదలగు గుణములను సహిస్తాను. నీభారమంతా నామీద ఉంచినట్లుగా భావిస్తాను. ” ఈ స్థితిలో వున్న నిన్ను నేను ఎప్పటికీ వదలి వేయను.” నన్ను పొందడానికి అడ్డంకిగా నీవద్ద ఏ ఏ పాపాలున్నాయో వాటన్నింటినుండీ నిన్ను విడిపిస్తాను. అందువలన నువ్వు శోకించకు.” అని అర్జునుడికి ఉపదేశించి అతని శోకమును పోగొట్టీ అనుగ్రహించాడు. ఇంతటి ఉపకారము చేసిన భగవంతుడి కృపా దృక్కులు పొందుటకు ముందు అని అర్థము.( కృష్ణుడు చెప్పిన మాటలు మనసుకు చేరి స్థిరపడక ముందు).స్వామి అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్ “పా ర్పదన్మున్” (చూడక ముందే)  అనగా పరమాత్ముడైన శ్రీ కృష్ణుడు చూడక మరియు మన తో మాటలు పలుకుటకు (అర్జునిని తో చెప్పినవి)  ముందే  అని ప్రయోగం చేసారు (మన మనస్సు అర్థము చేసుకునే లోపే అని సూచించుటకు).

వరై మన్నన్ : “పదినారమాయిరవర్ దేవిమార్ పణిశెయ్యతువరైఎన్నుమదిల్నాయకరాగివీత్ ఇరుందమనవాళర్”  అనగా పదునారు వేల మంది  భార్యలు సేవించు చుండగా ద్వారకలో వేంచేసి వున్న మానస చోరుడు” ఆళ్వార్ అన్నట్లు తనను పొందుటయే ఫలముగా భావించి మరొక ఫలమును కోరని వారు, మరొకరిని ఆశ్రయించని వారు, తనకొక్కడికే భోగ్యోపకరణ మైన వారైన తన దేవేరులకు మానసచోరుడైన ద్వారకాధిపతి.

అడియో మెన్నుం వాళ్వు : వాడికి మనము దాసులమని  పూర్ణముగా నమ్మి, ” తనను కాపాడుకోవటానికి స్వప్రయత్నము చేయవలసిన అవసరము లేదని నమ్మి,  ఆయనకోసమే ఎదురుచూసే మంచి బుధ్ధిని మనకు ఇచ్చిన తరువాత మనము బాధ పడనవసరం లేదు అని అర్థము. ఆత్మ జ్ఞాన, ఆనంద, శేషత్వ వంటి ఎన్నో గుణములకు  స్థానము అయినప్పటికీ వాటి కంటే దాసత్వమే దానికి నిజమైన స్థితి అని తెలుస్తున్నది. ఈ గుణమే నిజమైన సంకేతమవుతుంది. ఉజ్జీవమనగా ఈ దాసగుణమును తెలుసుకునే సమయములో , స్వప్రయత్నమును వీడుట మొదలగు మంచి గుణములు ఏర్పడతాయి. ఇవియే ఆత్మకు ధనము. ఇటువంటి  జ్ఞానము కలిగి దాసులుగా జీవించుటయే జీవితము అని అర్థం.

నమక్కీన్దదర్పిన్   : ఈ దాసగుణము ఆత్మకు స్వత సిధ్ధమే కొత్తగా సిద్ధమైనది కాదు.  జీవాత్మ కు పరమాత్మ కు గల 9 సంబంధము నిత్యమైనవి. ఈ వాక్యము , ఒక జీవాత్మకు ఇటువంటి సంబంధము కలదని నమ్మి, ఒప్పుకునే సమయ సందర్భమున చెప్పునది. ఇటువంటి జ్ఞానము కలుగుటకు కేవలం శ్రీ వారి నిర్హేతుక జాయమాన కటాక్షంవలనే లభిస్తుంది. చెప్పాలంటే , పెరుమాళ్ “జీవాత్మ పరమాత్మ యొక్క సేవకుడు”అనే జ్ఞానమును కలుగుటకు ఒక సమయమును నిర్ణయించిపెట్టారు.

ఎన్న కుఱై వేండుం ఇని : ఇక కొరత ఏమున్నది? ఇక ముందు ఎటువంటి ఉపాయములను ఆశ్రయించవలసిన పని లేదు. ఆందు వలన కృష్ణుడు అర్జునుడిని చూసి “మాశుచః” శోకింపకు అన్నాడు . అలాగే మనము కూడా భారమును పూర్తిగా భగవంతుడి మీద ఉంచి ప్రశాంతముగా ఉండాలని అర్థము.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/02/gyana-saram-5-thirtha-muyandraduvadhum/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

జ్ఞానసారము 4

Published by:

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

జ్ఞానసారము

<< పాశురం 3

పాశురం 4

543439_636314269732920_1530777401_n

“మఱ్ఱొన్ఱై ఎణ్ణాదే మాదవనుక్కు ఆట్చెయలే

ఉఱ్ఱతు ఇతు ఎన్ఱు ఉళం తెళిందు-పెఱ్ఱ

పెరుం పేఱ్ఱిన్ మేలుళ్ళదో పేర్ ఎన్ఱు ఇరుప్పార్

అరుం పేరు వానత్తవర్ క్కు”

ప్రతి పదార్థము:

మఱ్ఱొన్ఱై= = సంపద మొదలగు కోరికలను

ఎణ్ణాదే = లక్ష్యముగా చేసుకోకు

మాదవనుక్కు = భగవంతుడికి

ఆట్చెయలే  = దాసత్వము పాటించడములో

ఇతు ఉఱ్ఱతు = ఇది ఉన్నతమైనది

ఎన్ఱు = అని నిర్ణయించు కొని

ఉళం తెళిందు- = హృదయము తెలిసిన

పెఱ్ఱ పెరుం పేఱ్ఱిన్ మేల్ = పొందిన ఈ పెద్ద ఉపకారమునకు

పేర్ ఉళ్ళదో = వేరొక ప్రయోజనము ఉన్నదా

ఎన్ఱు ఇరుప్పార్ = అన్న దృఢ విశ్వాసముతో ఉంటారు

వానత్తవర్కు = వైకుంఠములో ఉన్న నిత్య ముక్తులకు

అరుం పేరు = (ఇట్లు జీవించే వారు) చాలా విలువైన దుర్లభులైన దాసులు

అవతారిక:

“ఊన ఉడల్”   మొదటి పాశురములలో ద్వయ మంత్రములోని మొదటి పాదములో చెప్పిన శరణాగతి ఔన్నత్యమును వివరించారు. శరణాగతి చేయడానికి కారణము జనన మరణ ధుఃఖమును సహించలేక పోవుట. ఈ స్థితినే పర భక్తి  అంటారు. ఇది  “నరగo స్వర్గమాగుం ” అనే రెండవ పాశురములో వివరించారు. దాని కంటే ఉన్నతమైన స్థితి  పరమ భక్తి , అనగా విశ్లేషణలో ప్రాణములే పొవునన్నంత క్లేశము ఏర్పడు   విషయాన్ని ” ఆనై ఇడర్ కడింద ” అన్న మూడవ పాశురములో చెప్పారు. ఇప్పుడు ద్వయ మంత్రములోని రెండవ భాగమైన కైంకర్యము ( భగవంతునికి, తాయారు మరియు దాసులు కు చేయు సేవ ) యొక్క గొప్పతనమును  తెలుసుకున్నావారై , ఇతర ప్రయోజనములు వీడి మరియు స్వరూపమునకు తగిన కైంకర్యము చేయుటలోనే దృఢ నిశ్చయులైన దాసుల యొక్క గొప్ప తనమును చెప్పుతున్నారు .

వ్యాఖ్యానము:

మఱ్ఱొన్ఱై  ఎణ్ణాదే:   కైంకర్యము భగవంతుడికి ఇష్టమైన క్రియ . చేతనులు పొందవలసిన అంతిమ లక్ష్యము. ఇంతకంటే ఉన్నతమైనది మరొకటి లేదు. ఇక్కడ మరొకొటి అనగా ఇహ లోకములోని తాత్కాలిక సుఖములు ,పరలోక సుఖములైన స్వర్గము ,  ఆత్మానుభవమైన కైవల్యము మొదలైనవి. ఈ మూడు కైంకర్యానికి భిన్నమైన  విషయములు. ఆత్మానుభవము అనగా తనను తానే అనుభవించుట, అనగా  దేహాత్మ సంబంధము  లేక పోవుట . అనగా ఆత్మ శరీర సంబంధము లేక ఆనందానుభవమును పొందుట. ఆ స్థితినే మోక్షమని కొందరు అంటారు. అది భగవత్ కైంకర్యమునకు భిన్నమైనది. దాని పేరు కూడా చెప్పటము ఇష్టము లేక మఱ్ఱొన్ఱై అంటే మరొకటి అన్నారు. ” కోరకు ” అనటానికి బదులుగా ఎంచకు అని చెప్పారు. ఇటువంటి దాసులు ఇతర విషయములను ఎంచరు అనగా తలవరు కూడా  ఇక ఆశ పడుట గురించి ప్రశక్తిరాదు.  ఇహ లోకములోని తాత్కాలిక సుఖములు , పరలోక సుఖములైన స్వర్గము ,  ఆత్మానుభవమైన కైవల్యమును కోరు కొను వారికి భగవద్ కైంకర్యములో కోరిక వుండదు. భగవద్ కైంకర్యములో కోరిక వున్నవారికి పై మూడింటిలో ఆశక్తి ఉండదు. ఎవరికైతే కైంకర్యంలో ని విలువ తెలుసుకుంటారో ఇతర విషయములను ఉప్పు నీటి తో పోలుస్తారు మరియు అటువంటి విషయముల ఉన్నట్లుగాను వారు గుర్తించరు.

మాధవనుక్కు ఆట్చెయల్: మాధవుడికి కైంకర్యము అనగా అమ్మతోకూడిన స్వామికి చేసే కైంకర్యమును (అమ్మ తో కూడిన స్వామి యొక్క సేవయే లక్ష్యము అని మాధవ అనే ప్రయోగం చేసారు)
ద్వయ మంత్రములోని “శ్రీమతే ” అన్న రెండవ భాగములోని మొదటి పదము ఈ విషయాన్నే తెలియజేస్తుంది. తిరుమంత్రములోని (ఓం నమో నారాయణాయ) మూడవ పదమైన ” నారాయణాయ ” కూడా దాసుల కైంకర్యమును స్వీకరించువారు అమ్మతో కలసి వున్న స్వామి అన్న రహస్యార్థమును  తెలియజేస్తున్నది. దానిని ద్వయ మంత్రము వివరిస్తున్నది.  పిళ్ళై లోకాచార్యులు తమ ముముక్షుపడి లో “ఇంగు తిరుమంత్రతిల్ శొన్న ప్రాప్యత్తై విశదంఆగానుసందికిరదు(ముముక్షుపడి, ద్వయప్రకరణము చుర్నికై ౧౬౮)  ” అనగా ” ఇందులో తిరుమంత్రములో చెప్పిన ప్రాప్యమును విశదముగా అనుగ్రహిస్తున్నది” అని అనుగ్రహించారు. “భగవద్ కైంకర్యమే ఒరువన్ వేండియ లక్ష్యం” (భగవద్ కైంకర్యమే చేతనుడు పొందవలసిన లక్ష్యము ) అన్నారు.”ఒళివిల్ కాలమెల్లం ఉడనాయ్ మన్ని వళువిలా అడిమై శెయ్యవేండుం నాన్ ” అని నమ్మాళ్వార్లు అన్నారు.

ఉఱ్ఱతు ఇతు ఎన్ఱు : “ఇదే పరమ పురుషార్ధం” అని అర్థం.  ఆళ్వార్ “నీళ్ కుడక్కుతనుక్కు ఆట్చేయ్వదే ” అని అన్నారు.  “ఉఱ్ఱతు” అనగా  తగినది (ఒక జీవాత్మ కు) . అనగా వేరొక ఏ విషయములు కూడా జీవాత్మ యొక్క శేషత్వము యొక్క నిర్వచమునకు తగనివి.అందువలన , అవి జీవాత్మకు తగనివికావని తీసివేసారు. వేదాంతం సారముగా “మాధవనుక్కు”  మరియు  “ఆట్చెయల్ ”  అను రెండు పదములతో  ఒక జీవాత్మ పిరాట్టి మరియు పెరుమాళ్ కు ఇద్దరికీ దాసభుతులని  మరియు వారికి కైంకర్యము చేయుటయే పరమ పురుషార్ధం అని  నిరూపణ చేసారు. స్వామి పెరియాళ్వార్  “తిరుమాలేనానుమునక్కుపళవడియేన్ ” (తిరుపల్లాండు 11) అని సాయించారు అనగా జీవాత్మ పిరాట్టి మరియు పెరుమాళ్కు దాసభుతులని. అదే విధంగా “అడిమైశెయ్ వార్తిరుమాలుక్కే”  మరియు “శేన్ఱాల్కుడయామ్, ఇరున్దాల్శింగా.

ఉళం తెళిందు : పైన చెప్పిన విధముగా ఆత్మ కైంకర్య ప్రాప్తిని పొందుటకు అన్య ప్రయోజనములందు విరక్తుడవ్వాలి,అలా కావడానికి ఆటంకముగా నిలిచే” నేను “,” నాది ” అన్న భావన పూర్తిగా తొలగిపోవాలి. భగవద్ ప్రీతి కొరకే కైంకర్యము చేయాలి. దీనినే నమ్మాళ్వార్లు ‘తనక్కే ఆగ ఎన్నై క్కొళ్ళుమీదే ‘ ( తనకోసమే నన్ను స్వీకరించాలి) అన్నారు. ‘ ఉనక్కే నాం ఆట్చెయ్వోం ‘ ( నీకే మేము కైంకర్యము చేస్తాము) అని ఆండాళ్ తల్లి చెప్పింది . కైంకర్యమొక్కటే ఆత్మకు ఉన్నతమైన ఉపయోగమని చెప్పినదానికి తగినట్లుగా హృద్యమున విశ్వాసము కలిగి ఉండి చెయ్యాలి. దీని వలన ద్వయ మంత్రము లోని చివరి పదమైన ” నమః ” పదము యొక్క అర్థము చెప్పబడింది.

పెఱ్ఱ పేరుం పేఱ్ఱి మేలుళదో పేరెన్రిరుప్పార్ : అర్థాత్ కైంకర్యము ప్రాప్తి లభిస్తే ఇంతకంటే ఉన్నతమైన ఫలితముమరొకటి లేదని తలుస్తారు. పరమ పదము ఎప్పటికీ మారకుండా ఒకే విధముగ ఉంటుంది. శుధ్ధసత్వ తత్వముగా ఉంటుంది. జ్ఞాన , ఆనందములకు నిలయము.  అందువలన కైంకర్యమును నిర్విఘ్నముగా చేయుటకు అనువైన ప్రదేశము. ఈ కారణముల వలననే జ్ఞానులు దీనినే కోరుకుంటారు. కైంకర్యము కంటే ఉన్నతమైన ఫలితము వేరొకటుంటుందా? అనడములో ఎలాంటి సందేహానికి తావు లేదు. ఇంత ఉన్నతమైన కైంకర్యములో ధృఢముగావుండు వారు అని అర్థము.

అరుంపేరు వానత్తవర్క్కు: ముందు చెప్పిన దాసులు సహజముగానే తమను భగవంతుడి దాసులుగా భావించు వారు.  భగవద్  కైంకర్యములోనే ఎల్లప్పుడూ నిమగ్నమై వుండు వారు. భగవంతుడినే గొప్ప సంపదగా భావించు వారు. ఇలాంటి వారు ఈ లోకములో కనపడుట దుర్లభము. వీరు పరమపదమునకు వెళ్తే  అక్కడ వున్న నిత్య సూరులు మొదలైన వారికి ఆనంద హేతువవుతారు. అందువలన ఎల్లప్పుడు అతృప్తామృతమైన భగవంతుని అనుభవించు భాగ్యము పొందిన నిత్యసూరులకు ఆ భగవద్విషయము కంటే వీరిని అనుభవించుట దుర్లభమైన సంపదగా తోస్తుంది అని అర్థము.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/02/gyana-saram-4-matrondrai-ennadhe/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

జ్ఞానసారము 3

Published by:

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

జ్ఞానసారము

<< పాశురం 2

పాశురము-3

215617_193460284032348_5892816_n-248x300

ఆనై యిడర్ కడింద ఆళి అంగై అంపుయత్తాళ్
కోనై విడిల్ నీరిల్ కుదిత్తెళుంద మీన్ ఎనవే
ఆక్కై ముడియుంపడి  పిఱ్ఱత్తల్ అన్నవంత్తాళ్
నీక్క మిల్లా  అన్బర్ నిలై 

ప్రతిపదార్థము

ఆనై = గజేంద్రుడికి

యిడర్ = మొసలి వలన ఏర్పడిన కష్ఠము

కడింద = పోగొట్టిన

ఆళి అంగై = సుదర్శనమనే శంఖమును చేతిలో ధరించిన వాడు

అంపుయత్తాళ్   కోనై = లక్ష్మి దేవికి నాయకుడిని

విడిల్ = విడిపోవుట

నీరిల్ = నీటి నుండి

కుదిత్తెళుంద = ఎగిరి దూకిన

మీనెనవే = చేప లాగ

ఆక్కై ముడియుంపడి పిఱ్ఱత్తల్  = శరీరమే నశించి పోవు స్థితి ఏర్పడినట్లు

అన్నవంత్తాళ్ = ఆ శ్రీదేవికి స్వామి అయిన వాడి శ్రీపాదములను

నీక్క మిల్లా = ఎడబాటు లేకుండా వుండటము

అన్బర్ నిలై = అభిమానులు కోరుకునే స్థితి

భావము

విశ్లేషములోని దుఃఖమును, సంశ్లేషములోని ఆనందము అనే పర భక్తి స్థితిని గురించి మునుపు చెప్పారు. ఈ పాశురములో పర భక్తి తరువాతి స్థితి అయిన పరమ భక్తిని గురించి చెప్పారు. అనగా విశ్లేషమును భరించలేక ప్రాణములు విడుచు వరకు భక్తి పార్వశ్యమును పొందుటను ఉదాహరణ సహితముగా చెపుతున్నారు.

వ్యాఖ్యానము

పురాణములలోను, ఆళ్వార్ల పాశురములలోను గజేంద్ర మోక్షము చరిత్ర తరచుగా వస్తూవుంటుంది. గజేంద్రుండంటే  ఏనుగుల రాజు. అది ఒక తామర పూవును శ్రీమన్నారాయణుని శ్రీపాదములకు సమర్పించాలని తామరల కొలనులోనీకి దిగి స్నానము చేసి , ఒక తామరను కోసి వొడ్డు ఎక్కుతూ వున్నప్పుడు ,  శాపవశాత్తు చాలా కాలముగా ఆ కొలనులోఈ ఏనుగుకొసము ఎదురు చూస్తూ వున్న మొసలి దాని కాలిని పట్టేసింది . ఏనుగు వొడ్డుకు, మొసలి నీటీలోకి లాగుతూ1000 దేవ సంవత్సరములు గడచి పోయాయి. మొసలికి నీటిలో బలముఎక్కువ . ఏనుగుకు నీటిలో బలము తక్కువ శ్రీమన్నారాయణుని శ్రీపాదములకు తామరను సమర్పించలేక పోయానన్న భాదతోను దాని బలము తగ్గసాగింది.

ఇక ఏ మాత్రము దు:ఖమును భరింప జాలనని గజేంద్రుడు భక్త రక్షకుడైన శ్రీమన్నారాయణుడే రక్షకుడని భావించి ,”నారాయణా !మణివర్ణా, పన్నగ శయనా ,నా బాధలను తొలగించవా ” అని పిలవగానే భగవంతుడు పరుగు పరుగున వచ్చి మకరిని సమ్హరించి గజేంద్రుని దుఃఖమును తీర్చాడు.  గజేంద్రుని దుఃఖము మకరి నోటిలో పడి తన శరీరము బలమును కోల్పోయి మరణము సమీపించినందులకు కాదు. తాను తొండముతో తుంచి పట్టుకున్న తామర పూవును శ్రీమన్నారాయణుని శ్రీపాదాలకు సమర్పించలేక పోయినందుకు. శ్రీమన్నారాయణుడు పరుగున వచ్చి  గజేంద్రుడు  పట్టుకొని వున్న తామర పూవును స్వీకరించి దాని దుఃఖమును తీర్చాడు అని చరిత్ర. ఇక్కడ ” యానై ఇడర్ కడింద ‘ అన్న ప్రయోగము వలన తెలుస్తున్నది.

ఆళి అంగై –”  చేతిలో చక్రమును ధరించి యున్న ” అని అర్థము. గజేంద్రుడినిరక్షించడానికి దాని శత్రువైన మకరిని సంహరించడానికి వెళ్ళినప్పుడు  చేతిలో చక్రమును ధరించారని చెపుతున్నారు.

” మళుంగద వైన్నుదియ చక్కర నల్ వలత్తై

తొళుంగాదర్ కళిరళిప్పాన్ పుళ్ళూర్దు తోడ్రినయే ”

అని నమ్మాళ్వార్లు పాడారు. గజేంద్రుడిని రక్షించడనికి చేతిలో చక్రాయుధమును ధరించి వచ్చారు అన్నది స్పష్టము, కాని చేతిలో చక్రాయుధమును ధరించినది కూడా గుర్తు లేదు . అలా అయితే ఉన్న చోటు నుండే ఆయుధమును ప్రయోగించ వచ్చు కదా అని ఒక సందేహము. చేతిలో చక్రాయుధమును ధరించిన విషయము గుర్తు వుంది. అందుకనే ఆ ఆయుధముతో పరుగున వచ్చి సమ్రక్షించారు అని ఒక భావము. కారణము,గజేంద్రుడు భక్తితో భగవంతుడిని పిలిచాడు అని ఆళ్వార్లు చెపుతున్నారు. గజేంద్రుడు భగవంతుడు చేతిలో చక్రాయుధమును ధరించివుండే అందమును చూడాలనుకున్నాడు. ఆయనకు తామర పూవును సమర్పించాలని ఆశతో వున్నాడు. అందుకని తానున్న చోటు నుండి కాక గజేంద్రుడు ఉన్నతామర కొలనుకు  వెళ్ళి రక్షించాడు .  ‘ తనను దర్శించాలని కోరుకున్న భక్తులకు వారు కోరుకున్నట్లుగానే దర్శనమిస్తాడని అర్థము.

విడిల్: తన భక్తుల పట్ల ఇలా ప్రేమ ఉన్న వాడిని వీడి వుందవలసి వస్తే

నీరిల్ కుదిత్తెళుంద మీనెనవే: నీటిని విడిచి పైకి లేచిన చేపలాగా

ఆక్కై ముడియుంబడి పిరందాల్: శరీరము నశించు పోవు స్థితి ఏర్పడుతుంది. కలిసి వున్నప్పుడు సుఖము, విడిపోయినప్పుడు దుఃఖము అనేది ప్రేమ వ్యాకరణము. దానికంటే భక్తిలో ఆ భావన ఇంకా ఎక్కువగా వుంటుంది. అంటే వీడి వున్నప్పుడు  ప్రాణములే పోవు స్థితి. ఇదే భక్తిలోని గొప్పదనము. దీనినే నీటిని వీడిన చేప లాగా అని ఉదహరించారు.

అన్నవన్: ” అంబుయత్తళ్కోన్ “_ ఆయుధమును ధరించిన భగవంతుడు ” అన్నవన్ “,అనగా అలాంటి వాడు అని ఒక అర్థము. చేపలకు నీటి లాగా భక్తులకు భగవంతుడు అని మరొక అర్థము .

తాళ్ నీక్క మిల్లా అంబర్ నిలై  : వాడి శ్రీపాదములను వీడి దరింపలేని వాడు. అలా జరిగితే నీటిని వీడిన చేపలాగా ప్రాణములను విడుస్తాడు. ఇది పరమ భక్తి స్థితి.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/02/gyana-saram-3-anai-idar/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

జ్ఞానసారము 2

Published by:

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

జ్ఞానసారము

<< పాశురము -1

2వ పాశురం

R

నరకుం సువర్గముం నాణ్మలరళ్ కోనై
ప్పిరివు పిరియామైయుమాయ్- త్తురిసఱ్ఱు
సాదకం పోల నాదన్ తనదరుళే పార్తిరుత్తల్
కోతిలడియార్ గుణం

ప్రతి పదార్థము

నాణ్మలరళ్ కోనై = పద్మోద్భవ ప్రియుడిని( స్వామిని)

ప్పిరివు = వీడి వుండుట

నరకుం = నరకము అర్థాత్ కష్టము

పిరియామై = వీడకుండుట

సువర్గముం = స్వర్గము, సుఖము

త్తురిసఱ్ఱు = దోషములు లేక

సాదకం పోల  = చాతక పక్షి  లాగా (వాన కోసము ఎదురు చూస్తూ)

నాదన్ తనదు = భగవంతుడి

అరుళ్  = కృపను

పార్తిరుత్తల్ = ఎదురుచూడటము

కోతిలడియార్  = దోషములే లేని దాసుల

గుణం = సహజ గుణము

భావము

నరకము, స్వర్గము అనే పదాలు దుఖఃమును , సుఖమును తెలియజేస్తాయి. “తున్బం ఇన్బం ” అన్న తిరువాయ్మొళి పాశురములో ” ఇన్బయిల్  వెన్నరగాగి ఇనియ నల్వాన్ సువర్గంగుళుమాయ్ ” అన్న చోట చూస్తే ” సుఖదుఃఖములు” అన్న అర్థము స్పురిస్తున్నది. అందు వలన నరకము అంటే దుఃఖము స్వర్గము అంటే సుఖము అని గ్రహించాలి.

పర  భక్తి గల వారికి ఏది దుఃఖము? ఏది సుఖము? అంటే (పద్మోద్భవ ప్రియుడు ) నారాయణుని వీడి వుండుట  దుఃఖము, వీడకుండుట సుఖము. పర భక్తి అనగా విడిపోవుటను తాళ లేక పోవుట.  శ్రీ రామాయణములో శ్రీరాముడు అడవికి బయలుదేరునప్పుడు సీతా దేవి తాను కూడా వస్తానని ప్రార్థించగా ,  శ్రీరాముడు నగర వాసమునకు ,వన వాసమునకు ఉన్న భేదములను చెప్పి అందు వలన అడవికి రాకుండ అంతఃపురములోనే వుండవలసినదిగా చెప్పారు. అది విన్న సీత  సుఖదుఃఖములు మీరు చెప్పినట్లు ఉండవు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా వుంటుంది. నాకు మీతో చేరి వుండటము  సుఖము, మిమ్ము వీడి వుంటే అది దుఃఖము . ఈ వాస్తవము తమరికి తెలియక పోతే నన్ను అడిగి తెలుసుకోగలరు . తమరికి తెలియనివి ఇతరులను అడిగి తెలుసుకోవాలి, అది తప్పు కాదు కదా! తమరిలాగా మేము కొలత కొలిచి ప్రేమించలేదే! మాకు మీమీద ఉన్న ప్రేమ అపారమైనది.” అని చెప్పింది.  దీనికి శ్రీరాముడు ” మాకంటే నీకు ప్రేమ కొండంత ఉన్నట్లుగా చెప్పావు కదా! దానికి ప్రతిగా మమ్మల్ని ఏమి చేయమంటావు? ” అన్నారు. అప్పుడు సీత ” నేను ముందుగా నడుస్తాను. మీరు వెనకాల రండి ” అన్నది అని పెరియవాచ్చన్ పిళ్ళై వ్యాఖ్యానము చేసారు.

ఇక్కడ ఒక వేదాంత సారము కనపడుతుంది. సీత , రాముడిని చూసి మీతో వుండడటము సుఖము, మిమ్మి వీడి వుండుట దుఃఖము  అని చెప్పింది కదా! ఇది ఆమెకు తగినదే. అలాగే జీవాత్మ పరమాత్మను చూసి ఇలా చెప్పటము పద్దతి కాదు. పిరాట్టి పర్మాత్మనే సుఖముగ భావించినది. జీవాత్మలు పర్మాత్మను,   పిరాట్టిని చేరి సుఖముగా వుంటాయి. అందు వలన పిరాట్టికి  ఏకాయణ  అని జీవాత్మలను మిధునాయనులని అంటారు. ఏకాయణ న భగవంతుడొక్కడినే సుఖముగా భావిస్తుంది. జీవాత్మలు  పరమాత్మను , పిరాట్టినిల   మిధునమును సుఖముగా భావిస్తారు. దీనిని  పిరాట్టికి, జీవాత్మలకు వున్న భేదముగా గ్రహించాలి.

” నాణ్మలరాళ్ కోనై పిరివుం పిరియామైయుమాయ్ ” –  పిరాట్టితో కూడిన పరమాత్మను వీడి  వుండుట, పిరాట్టితో కూడిన పరమాత్మను విడకుండుట – దుఃఖము , సుఖముగా చెప్పబడుతున్నాయి. లక్ష్మణుడు రాముడితో “సీత ఎలా మిమ్మల్ని వీడి వుండ లేదో అలాగే నేను కూడా మిమ్మల్ని వీడి వుండ లేను ” అన్నాడు. ఇందులో లక్ష్మణుడు  తనను సీతతో సమానముగా చెప్పుకున్నాడు. అయితే అది కేవలము రాముడిని వీడి అనుభవించే దుఃఖములో మాత్రమే వర్తిస్తుంది. అంతే కాని రాముడీని మాత్రమే ఆశ్రయించిన సీత లాగా అన్న అర్థమును తీసుకోకూడదు.  లక్ష్మణుడుకి సీతరాముల కూడి వుండగా సేవ చేయటమే ఆనందము.

” భవాంస్తు సహ వైదేహ్యా గిరిసానుష  రంస్యతే అహం సర్వం కరిష్యామి ”  మీరు, సీత గిరి సానువుల మధ్య విహరిస్తున్నప్పుడు , నిద్రిస్తున్నప్పుడు   , మేలుకొని ఉన్నప్పుడు దాసుడు సకల కైంకర్యములను చేస్తాడు, అని చెప్పాడు. ఇలాంటి కైంకర్యము చేయటమే సకల ఆత్మలకు విధియైఉన్నది.

తురిసఱ్ఱు-తురిసు-కుఱ్ఱం – దోషము లేని-అనగా పరమాత్మను పిరాట్టిని వీడితే దుఃఖములు కలుగుతాయి. వారితో కూడి వుంటే దుఃఖములు కలుగవు ,  సుఖములు కలుగుతాయి , భక్తి కలుగుతాయి . అలా భక్తి కలిగితే దానిని అధికారి విశేషణము అంటారు. భోజనము చేయడానికి ఆకలి కలిగి వుండడమే అర్హత అయినట్లుగానే భగవంతుడిని అనుభవించటానికి భక్తి కలిగి వుండాలి. ఈ భక్తి సాధనము కాదు. ఉపాసకులు భక్తిని సాధనముగా భావిస్తున్నారు. శరణాగతులు మాత్రము దీనిని సాధనముగా భావించరు. అలా చేస్తే అది దోషమవుతుంది. ఇక్కడ దోష రహితులంటే భక్తిని సాధనముగా స్వీకరించని వారని అర్థము.

” సాదకం పోల్ నాదన్ తనదరుళే పార్తిరుప్పార్ ” అనగా చాతక పక్షి వాననీటి కోసమే చూస్తూ వుంటుంది , కాని వేరే నీటిని స్వీకరించదు. అలాగ ఆత్మ కూడా భగవంతుడి కృప కోసమే ఎదురుచూస్తూ వుంటుంది. ఆ కృప మాత్రమే ఆయనను పొందడానికి సాధనమనే దృడ అధ్యవసాయము కలిగి వుండటమే దాసుల గుణము . ”  తుణియేనిని నిన్నరుళల్లదు నిన్నరుళే పురిందిరుందేన్”  అన్న తిరుమంగై ఆళ్వార్ల పాశురము మరియు పెరియాళ్వార్ యొక్క పెరియాళ్వార్ తిరుమొళి
శెన్నియోంగు(5.4.1) లో “నిన్ అరుళే పురిందు ఇరున్దేన్ ”  కూడా ఇదే చెపుబడుతున్నది.

” కోదిలడియార్గుణం” – దాసులనటానికి వేరు వేరు అర్థాలలోను,   వేరు వేరు సాదనములలోను సంబంధము కలిగివున్న దోషరహితులని ఆర్థం. తమ దాసత్వమునకు భగవంతుడినే ప్రాప్తగాను ,ప్రాపకముగాను , ప్రాప్యముగాను భావిస్తాడు. పొందవలసినది ప్రాప్త ,  అది పొందుటకు మార్గము ప్రాపకము , పొందిన తరువాత ఈ ఆత్మకు భగవంతుడే నాయకుడు అవుతాడను సత్యము, అదే ప్రాప్యము. శ్రీ వచన భూషణం లో చెప్పినట్టుగా  భక్తుని ఆలోచన ఏ విధముగా ఉండుననగా “ప్రాప్త మరియు ప్రాపకము రెండూను పరమాత్మే, మనలను పొందుటలో సంతోషము తనకే చెందుతుంది ” అని భావిస్తాడు. ప్రపన్నుడు పెరుమాళ్ యొక్క వస్తువు కాబట్టి ఎప్పుడైతే వస్తువు ప్రప్పత్తి ద్వారా తనను చేరుకుంటాడో, అప్పుడు లభించే ఆనందము ఆ పరమాత్మదే కాని జీవాత్మది కాదు.పరమాత్ముని సంతోషముగాంచి జీవాత్మ ఆనందిస్తాడు.అందు వలన ఈ పాటలో మొదటి పాశుములో స్వామి అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్  ఫలము భగవంతుడే అని చూపి, ఆ ఫలము పొందుటకు సాధనము కూడా భగవంతుడే అని చెప్పారు. ఇది కోదిలడియార్ల్ (దోషములు లేని భక్తులు) యొక్క స్వభావికమైన గుణము అందువలననే ” కోదిలడియార్గుణం” అని అన్నారు.

అడియేన్  చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2014/11/gyana-saram-2-naragum-suvargamum/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

జ్ఞానసారము 1

Published by:

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

జ్ఞానసారము

పరిచయం

   మొదటి పాటకు అవతారిక

                    ఆత్మకు అపారమైన ఆనందమును ఇవ్వగలిగినది కుటుంబపు పేరు. దానిని పొందుటకు 1. తిరు మంత్రము 2. ద్వయ మంత్రము   3. చరమశ్లోకము అను మూడు మంత్రముల సారమును ఆచార్య ముఖముగా తెలుసుకోవలసి వుంది. ఈ మూడింటిని  రహస్య త్రయములని అంటారు. దీనిని తెలుసుకోవాలన్న కోరిక వున్న వారికి తప్ప అన్యులకు చెప్పరాదను నియమము కలదు. అందు వలననే వీటిని రహస్య మంత్రములని పేరు. ఈ మూడు మంత్రములు సమస్త వేద సారములుగా విరాజిల్లుతున్నవి. పైగా ఇవి పరమాత్మ స్వరూపమును, ఆయనను పొందు ఉపాయమును, ఆయనను అనుభవించటము వలన కలుగు అపార ఆనందమును తెలియ జేస్తాయి. ఇవి జనన మరణ చక్రములో పడి కొట్టుకొను చేతనులకు ముక్తి మార్గమును తెలుపునవి , మోక్షమును ఇచ్చునవి,  భగవతుడి చేత చెప్పబడినవి.”తిరుమంత్రము ” బదరికాశ్రమములో భగవంతుడు తానే  నరుడిగా  శిష్యుడై అవతరించి ,  నారాయణుడిగా ఆచార్యుడై  అవతరించి ఉపదేశించారు.  ” ద్వయ మంత్రమును ” శ్రీ వైకుంఠములో శ్రీమహాలక్ష్మి కి ఉపదేశించారు.  ” చరమ శ్లోకమును ” మహాభారత యుధ్ధ సమయములో అర్జునుడికి రథము మీద ఉండి చెప్పిన శ్రీమద్భగవద్గీత చివరలో   ఉపదేశించారు. ఈ మూడు మంత్రములు  అనాదిగా గురుపరంపర ద్వారా తరతరాలుగా ఉపదేశింబడుతున్నవి. వీటి ఔన్నత్యము తెలిసిన మన పూర్వాచార్యులకు ఇది పెన్నిధిగా విరాజిల్లినది. అంతే కాక నిత్య అనుసంధానముగా అమరినవి. ((ఈ మూడు రహస్యములు బీరువాలో దాచి పెట్టిన లౌకికమైన సొత్తు వలెకాకుండా , ఎంత ఉపయోగ పరచ గలిగితే అంత ఉపయోగపడేవి. మన పూర్వాచార్యులు వీటిని తమ దినచర్యలో భాగముగా పొందుపరిచారు. అటువంటి గొప్ప ఔనత్యము కలిగినవి ఇవి.

తిరుమంత్రము ” ను  మొదటి రహస్యమని అంటారు. ఇది మూడు పదములతో కూడిన మంత్రము. అవి “ఓం “, “నమః” , “నారాయణాయ ” అనునవి.  “ఓం “,అనే పదము ప్రణవము యొక్క అర్థమును సూక్ష్మముగా తెలియజేస్తున్నది.  “నమః”,”నారాయణాయ ” అనే  పదములు ఓంకారములో చెప్పిన అర్థములను వివరిస్తున్నట్లుగా అమరినవి.( జీవాత్మ, పరమాత్మా స్వరూపం , శేష శేషి సంబంధం, ఈ సంబంధం యొక్క మొదలు, ఎప్పటివరకు ఉంటుందో మరియు ఈ జీవుడు మరి ఇంక ఎవరికైనను శేషిగా ఉండే విషయముల గురించి చెప్పబడినది.)

తిరుమంత్రములోని మధ్యమ పదమైన “నమః” ,చివరి పదమైన “నారాయణాయ ” లోని అర్థాలు క్రమముగా ద్వయ మంత్రములో మొదటి భాగములోను  చివరి భాగములోను చెప్పబడినది. ఈ విధముగా రెండు భాగములతో వున్న ద్వయ మంత్రము , మంత్రములన్నింటిలోను ఉన్నతమైనది .అందువలన ఇది మంత్ర రత్నమని పొగడబదింది. ఇందులోని మొదటి భాగములో భగవంతుడిని శరణాగతి చేయు  మార్గములు చెప్పబడింది. భగవంతుడిని శరణాగతి చేయు నప్పుడు ఇతర సంబంధములన్నింటినీ పూర్తిగా వదిలివేయాలి, అలా చెసే శరణాగతి కూడ ఇతర ప్రయోజనములను పొందడానికి కాక భగవంతుడిని పొందడమే ప్రయోజనముగా వుండాలి. ఇంకను , ఈ శరణాగతి కూడా ఉపాయముగా భావించవలదు.( ఎందుకనగా, అలా భావించిన భగవానుని శ్రీ చరణములు కాకుండా మరి వేరే యొక్క అనగా మనము చేసే శరణాగతి కూడా మోక్షము ను ఇవ్వగలుగుతుంది అన్నట్టుగా ఉంది. మనము చేసేశరణాగతి ఎట్టి పరిస్థితులో మోక్షం ఇవ్వజాలదు).  భగవంతుడి  శ్రీపాదములే శరణమన్న భావనతో శరణాగతి చేయాలి. ద్వయ మంత్రములోని చివరి భాగములో ధృడ అధ్యవసాయము కలవారికి పురుషార్థమైన మహాలక్ష్మితో కూడిన స్వామికి , అర్థాత్ ఆ దివ్య దంపతుల మిథునమునకు కైంకర్యము చేయుట గురించి చెప్పబడింది. 

ఇది శ్రీరామాయణములో సీతారాములకు లక్ష్మణుడు చేసిన కైంకర్యము వంటిది. ఈ  కైంకర్య భాగ్యము విరోధి స్వరూపమిలన్ని తొలగిపోయిన తరువాతనే లభిస్తుంది. రెండు భాగములతో కూడిన ఈ ద్వయ మంత్ర సారమును చరమశ్లోకమనే మూడవ మంత్రములో  వివరించబడము జరిగింది.  ఈ మూడు మంత్రములలోను ద్వయ మంత్రమే ముఖ్యమైనదిగా మన పూర్వాచార్యులు భావించారు.

ద్వయ మంత్రం  తిరుమంత్రము మరియు చరమ శ్లోకం నడుమ అమరినది. ఇది తిరుమంత్రములోని  నమః మరియు నారాయణ పదముల  అర్థమును వివరిస్తుంది అదే సమయము ద్వయములో ని కొన్ని నిగూఢ అర్థంలు వివరించు  చరమ శ్లోకం నుకు ఒక పునాది వేస్తుంది. తిరుమంత్రమునకు మరియు చరమ శ్లోకం లో శ్రీ సంబంధము ఉన్నప్పటికిని  కేవలము ద్వయములోనే ప్రస్ఫుంటగా శ్రీ శబ్దం చెప్పబడినది. ఇంత గొప్పదైన ద్వయ మంత్రములోని మొదటి భాగములో ఏమి చెప్పబడింది. భగవంతుడి శ్రీపాదములకు శరణాగతి చేయటము. అవి రెండు విధములు. ఇప్పుడే పరమపదము పొందాలని కోరటము ఒకటి,అలా కాక నీ శ్రీపాదములకు శరణాగతి చేస్తాను. నువ్వు ఎప్పుడు పరమపదము ఇస్తావో అప్పుడే ఇవ్వు అనటము రెండవది. ఇందులో మొదటిది కోరతగనదిగాను, రెండవది కోరతగనిదిగాను పెద్దలు చెపుతారు. ఇప్పుడే పరమపదము పొందలని చేయు శరణాగతిని గురించి  ఈ జ్ఞానసారములోని మొదటి పాశురమైన  ”  ఊన ఒడల్ శిరై ” లో  చెప్పారు.

pattabhishekam

పాశురము-1

ఊన ఒడల్ శిరై నీత్తు ఒణ్ కమల కేళ్వనడి

త్తేన్ నుగరుం ఆశైమిగు సిందై యారాయ్దానే

పళుంత్తాళ్ విళుం కని పోల్ పత్తత్తు విళుం

విళుక్కాటే తాన్ అరుళుం వీడు

ప్రతి పదార్థము;

ఊన = చీము,నెత్తురుతో కూడిన

ఒడల్ = శరీరము

శిరై = చెరసాల నుండి

నీత్తు = బయటపడి

ఒణ్ కమల కేళ్వన్ = అందమైన తామరయే నెలవైన లక్ష్మీ దేవికి నాథుడైన శ్రీమన్నారాయణుని

అడిత్తేన్ = శ్రీపాదములనె తేనెలను

నుగరుం = అనుభవించు

ఆశైమిగు సిందై యారాయ్ =కోరిక గలవారై

పళువీడుత్తాళ్ = ముదర పండితే

దానే విళుం = తానుగా పడిపోయే

కని పోల్ = పండులాగా

పత్తత్తు = వైరాగ్యముతో (భవ బంధములను చేధించుకొని)

వీళుం = శరణాగతి చేయు

విళుక్కాడు తానే = వైరాగ్యమే

వీడు  అరుళుం = ఉన్నత స్థానమును కల్పించగలదు

వివరణ:

శరీరము, చీము నెత్తురు, మాంసములతోను, నరములు, ఎముకలు, మజ్జ, మలమూత్రములతో కూడినది. దీనిని ” పుండారము” అంటారు. శరీరము మీద ఈగ రెక్కంత తోలు లేచి పోతే , ఈగ,చీమ, కాకి వంటివి వచ్చి వాలుతాయి ( “నాలడియార్ తురవరవియల్”-తూయ్ తన్మై లో -1) . శరీరము లోపలి భాగము బయటి భాగము చేస్తే కాకులను తోలటమే జీవితమవుతుంది.

ఇటువంటి హీనమైన శరీరములోని దోషాలను తెలుసుకొన్న వారికి , ” నేను” అని చెప్పబడే ఆత్మ దీనిలో బందీ అయిన ఖైదీలా (తినుట, వస్త్రము కట్టుకొనుట, జీవించుట) తోస్తుంది. కుండలో పెట్టిన మాణిక్యము యొక్క ప్రకాశము కుండలోనే ఉండి పోయినట్లు, దేహములో ఉన్న ఆత్మ గుణములు దేహములోనే బందీ అయి ఉన్నవి. ఆత్మ ,శరీరములో దాగి ఉన్నది.  ఇది ఆత్మకు భగవంతుడు ఇచ్చిన చెఱశాల దండన అని తెలుసుకోవాలి. దీనిని చెఱశాల శిక్షగా భావించక , భోగముగా భావించుట  మూఢత్వమే అవుతుంది. కావున శరీరము యొక్క వాస్తమైన స్థితిని తెలుసుకున్న వారు జ్ఞానులవుతారు. వారు లౌకిక జీవనము నుండి బయట పడుటకు ప్రయత్నము చేస్తారు. అలా ప్రవర్తించే జ్ఞానులు భగవంతుని దగ్గర శరణాగతి చేయటము తప్ప మరే ఇతర మార్గమును చూడ లేరు. ఈ చెఱ నుండి విడిపించు వాడు భగవంతుడే అని భగద్గీతలో  ఆయనే చెప్పారు.  ఆత్మకు శరీరము ఏర్పడుట పురాకృత కర్మ వలన. అటువంటి కర్మను పోగొట్టుకొనుటకు శరణాగతి ఒక్కటే తప్ప మరేదీ ఉపాయము కాదు. నా పాదములను పట్టి శరణాగతి చేస్తే ఆ చెర నుండి నేను తప్పిస్తాను అన్నాడు భగవంతుడు.

ఒక (బంగారు) పిచ్చుక కట్టిన గూటిని మనము విడదీయ లేము, అలాంటిది భగవంతుడు కట్టిన ఈ శరీరమనే గూటిని మనము విడదీయగలమా? చెఱలో చిక్కిన శ్రీమంతుడికి దానినుండి బయట పడి సుఖభోగములననుభవించిటము కంటే చెఱ నుండి బయటకు రావడమే ముఖ్యముగా తోస్తుంది. అలాగే ఆత్మ ఈశరీరము నుండి బయట పడుటే పెద్ద  విషయముగా తోస్తుంది. కానీ అది అంత సులభము కాదు. దానికి శరణాగతి చేయటము ఒకటే మార్గము. ఆ శ్రియః పతి శ్రీచరణాలలో శరణాగతి చేయటము తేనె లాగా ఎంతో తియ్యనిధి. ఆ  తియ్యదనమును అనుభవించిన వారికి,  మిక్కిలి ప్రీతితో దానిలోనే మునిగి వుండాలని అనిపిస్తుంది. బిడ్డ తల్లి పాలకోసము ఎలా ఆశతో చూస్తుందో ,అలాగే శరణాగతి చేయు వారు, భగవంతుడి శ్రీపాదముల తేనేను ఆస్వాదించుటకు ఆత్రుతతో వుంటారు.  ఆ ఆత్రుతలో తాను గతములో పట్టుకున్న లౌకిక విషయములను వదిలి వేస్తాడు. అవి కూడ వీరిని వదిలి వేస్తాయి అని ఈ పాటలో భావము. చెట్ట మీద పండిన పండు తానే ఎలా పడి పోతుందే, అలాగే భగవంతుని శ్రీపాదములకు చేసే శరణాగతి లౌకిక బంధనాలు తామే వదిలివేసే విధముగా కృప చేస్తుంది.

కావున , శరీరముతో జీవించుటను చెఱగా  గ్రహించి ,దాని నుండి విడివడుటకు భగవంతుని శ్రీపాదములను అనుభవించు కోరిక గలవారు అమ్మవారి కృపతో లౌకిక జీవనముపై గల  కోరికలను పూర్తిగా వదిలి వేసి పురుషకారముతో, భగవంతుని శ్రీపాదములను శారణాగతి చేస్తే  ఆయన వేంటనె  మోక్షమును ప్రసాదిస్తాడు అని ఈ పాటలో చెపుతున్నారు.

ఇంటి పేరు అనగా జనన మరణ చక్రమును వీడి భగవంతుని వద్దకు చేరడము. అటు వైపున ఉండే లౌకిక విషయముల కడు కష్టములు అనే సముద్రమును దాటి ఇటు వైపున ఉండే  శ్రీ  చరణములు చేరుట ” అక్కరై ఎన్నుం అనర్త కడలుళ్ అళుంది ఇక్కరై యేరి ఇళైత్తిరుందేన్ ” (అద్దరి అనే అనర్దమైన సముద్రములో మునిగి ఇద్దరి చేరి చిక్కిపోఅయాను) (  పెరియాళ్వార్ తిరుమొళి-5-3-7) అన్నారు  పెరియాళ్వార్లు.

ఇక్కడ ఒక వేదాంత చర్చ చేయబడింది. శరణాగతియే మోక్షమునిస్తుందని అంటే, భగవంతుడు మోక్షమునిస్తాడని చెప్పటానిని ఖండిస్తుంది కదా? పైగా  శరణాగతి అనే విషయమే తెలియకుండా చేసే చర్యలకు మోక్షమునిచ్చే శక్తి వుందని చెప్పటము వాస్తవానికి వ్యతిరేకము కాదా? అనే ప్రశ్నలు ఉదయిస్తాయి.

వీటికి సమాదానాలేమిటో చూద్దము:

భక్తుడు చేసే శరణాగతియో, భక్తియో, తపస్సో, నోములో, ఏవైనా సరే భక్తుడిని మోక్షము పొందుటకు అర్హుడిని  చేస్తుంది ,అంతే కాని  మోక్షముని వ్వదు.   శరణాగతికి కరిగి భగవంతుడే  మోక్షమునిస్తాడు. దీనిని,  ” అధికారి విశేషణము”అని శాస్త్రము చెపుతుంది. దీనికి ఉదాహరణ – మెరక ప్రాంతమును తవ్వి లోతు చేసి కట్ట వేస్తారు. వాన పడినప్పుడు నీళ్ళు నిండుతాయి. ఏరు ఏర్పడుతుంది. ఏరు కట్టటము  వాన పడుటకు కారణము కాదు. కాని, వాన పడేటప్పుడు ఏరు వుంటేనే నీరు నిండుతుంది.  అలాగే ఆత్మలు చేసే శరణాగతి మొదలైన వేవీ భగవంతుడు కృప చేయుటకు కారణము కాదు. భగవంతుడి కృప ఏ కారణము వలన ఏర్పడదు. సహజ సిద్దమైనది. అలాంటి సహజ సిద్దమైన కరుణ ఏర్పడునప్పుడు దానిని పొందుటకు ఆత్మలు అర్హత కలిగి వుండాలి. ఆ అర్హత ” శరణాగతి ” అనీ ” భక్తి” అనీ నోము అనీ పుణ్యములనీ చెప్పబడుతున్నాయి. ఇలా అర్హతలుండడమే కారణములుగా చెప్పలేము.” వనత్తిడరై ఏరియాం వణ్ణం ఇయఱ్ఱుం ఇతువల్లాల్ మారి యార్ పొయిగిర్పార్?మఱ్ఱు ఎన్ఱు ” ( అడవిలో ఏరు ఏర్పడడానికి కారణము ఎవరు?)అని భూదత్తళ్వార్లు చెప్పారు. ” ఇవి శరణాగతి చేయుటకు అర్హతను కల్పిస్తాయి. భగవంతుడు స్వయముగా మోక్షమునిస్తాడు. అన్న యదార్దములు ఇక్కడ తెలుస్తున్నాయి.  మాంసమయమైన శరీరములో జీవించుట చెఱ వాసము లాగా భావించి  విడుదల పొందుటకు మనసు పరితపించాలి. లక్ష్మీనారాయణుని శ్రీపాదములను చేరుటే శరణాగతి అవుతుంది. అది పండిన పండు కాడ నుండి విడివడినట్లు సకల బంధములను వదిలి వేయుట అవుతుంది.

మోక్షమును పొందుటకు శరీరము విరోధి అవుతుంది. ఆ  విరోధిని వదిలించుకోవటానికి భగవంతుడి శ్రీపాదముల వద్ద చేసే శరణాగతియే సాధనము అవుతుంది. దీకి వివరణగా రామాయణములో భరతుడు,విభీషణుడు శ్రీరాముడి శ్రీపాదములకు  శరణాగతి చేసిన విధమును చూడవచ్చు.  భరతుడు, తన తల్లి వలన కష్టముల పాలయ్యాడు. విభీషణుడు తన అన్న వలన కష్టముల పాలయ్యాడు. ఇద్దరూ తమ కష్టటములను తాళలేని వారే.

” తొళుదు ఉయర్ కైయినన్, తువండ మేనియన్,

అళుదు అళి కణ్ణినన్, ‘అవలం ఈదూ ఎన

ఎళుదియ పడివం ఒత్తు ఎయిదువాన్

‘భరతనుం తొళుతు తోన్నినాణ్ మలరడి వందు వీళ్దనన్”

( కంబ రామాయణం- అయో-49 తిరువడి సూట్టు పడలం) ( జోడించిన చేతులు, వేలాడిపోయిన శరీరము, దుఃఖము వలన ఎర్రబారిన కన్నులు, అశక్తుడినని వాపోతూ పాదముల మీద వచ్చి వాలాడు భరతుడు)

ఇది భరతుడి శరణాగతి. ” అధికారి విశేషణము” .ఇదే భగవంతుడు కృప చేయుటకు  అర్హత అవితుంది.

” కరంగళ్ మీచ్చుమందు సెల్లుం కదిర్ మణి ముడియన్, కల్లుం

మరంగళుం ఉరుగ నోక్కుం కాదలన్,కరుణై వళ్ళల్

ఇరంగినన్ నోక్కుం తోలుం ,ఇరునిలంత్తు ఇరైంజుగిన్రన్

వరంగళిన్ వారి అన్నతాళ్ ఇణై వందు వీళ్దాన్ ”

( కంబ రామాయణం-యుధ్ధ-విభీషణుడి  శరణాగతి-137)

పై రెంటిలోను ఆత్మ శరీరమనే చెఱ నుండి విడివడుట వలన భగవంతుడి శ్రీపాదములందు శరణాగతి చేయుటకు అర్హమైనవి. భరతుడికి కైక వలన వచ్చిన కష్టము, విభీషణుడికి అన్న వలన వచ్చిన కష్టము , ఆత్మకు శరీరము వలన వచ్చిన కష్టము , ఎటువంటి కష్టమైనా అది తీరుటకు భగవంతుడి శ్రీపాదములందు శరణాగతి చేయుటే ఉపాయము కాగలదు. అలాగే ఈ ఆత్మ శరీరమనే చెఱ నుండి విడివడుటానికి ఆర్తితో  భగవంతుడి శ్రీపాదములందు శరణాగతి చేసాడు.

” ఈ ప్రాణములను స్వీకరించవా? ” అని కరిగి పోయాడు,ఆగాడు- కృష్ణుని కన్నులనే పుండరీకములు కృపను వర్షించగా – వాడు ప్రంపంచమంతా నిండి పొంగి పోయాడు.

” అయావుయిర్త్తు, అళుకణీర్ అరువి మార్పిది

ఉయర్వుర ,తిరువుళ్ళం ఉరుగ, పుల్లినాన్

నియాయం అత్తనైక్కుం ఓర్ నిలై ఆయినన్

తయా ముదల్ అఱ్త్తినై త్తళి ఇయతు ఎన్నవే ”

( కంబ రామాయణం- అయో-55 తిరువడి సూట్టు పడలం)

ఇది భరతుడి యందు రాముడు  చూపిన దయ

”  గునోడు ఐవర్ ఆనోం మున్బుపిన్ కున్రు సూళ్వాన్

మగనోడు అరువర్ ఆనోం, ఎం ముళై అంబు వంద

అగన్ అమర్ కాదల్ ఐయ! నిన్నోడుం ఎళువర్ ఆనోం

పుగల్ అరుంగానం తంతు పుదల్వరాల్ పొలిందాన్-నుందై”

( కంబ రామాయణం- యుధ్ధ-143విభీషణ  పడలం)

తిరువడి ముడియిన్ సూడి ,సెంకతిర్ ఉచ్చి సేర్ న్ద

అరువరై ఎన్న, నిన్ర అరక్కర్ తం అరసై నోక్కి

ఇరువరుం ఉవకై కూరందార్, యావరుం ఇంబం ఉత్తార్,

పొరు అరుం అమరర్ వాళ్తి, పూమళై పొళివదానార్”

( కంబ రామాయణం- యుధ్ధ-145విభీషణ  శరణాగతి)

తేడువోర్ తేడ నిన్రసేవడి , తానుం తేడి

నాడువాన్ అన్రు కండ నాన్ముగన్ కళీ ఇయ నల్ నీర్

ఆడువార్ పావం ఐందుం   నీంగి, మేల్ అమరర్ ఆవార్,

సూడువార్ ఎయితుం తన్మై సొల్వార్ యావర్? సొల్లీర్”

( కంబ రామాయణం- యుధ్ధ-150 విభీషణ  శరణాగతి)

ఇలా ఆర్తితో శరణాగతి చేయు ఆత్మలకు భగవంతుడు తాను దిగివచ్చి కృప చేస్తాడు, అని సారము. దీనిని ” కరుణ ,ఉపాయము, తీయని ఉపేయము ” అని ఆచార్యులు చెప్పారు.

పైన చెప్పిన భరత, విభీషణ శరణాగతులలో , విభీషణ శరణాగతి ఫలించినదిగాను, భరత  శరణాగతి ఫలించనదిగాను తెలుస్తున్నది. “భరతుడికి మంచే చెడుగా పరిణమించినది.” అన్న మాట చూడవచ్చు.(ఈ విషయం ఇంకొక చర్చగా ఉంది. ఎందులకు భరతుని శరణాగతి ఫలించలేదు కాని విభీషణ శరణాగతి ఫలించినది అని. శ్రీ రాముడు భరతుని శరణాగతి కు అనుగ్రహము చేయుట ఆ సమయము తగదని భావించారు. శ్రీ రామునుకి ఒక విస్తారమైన ప్రణాళిక ఉండింది..14  వనవాసము చేయుట, ఋషులను రాక్షసుల బారినుండి కాపాడుట, విభిషనుని తన గోష్ఠి లో చేర్చుకొనుట, రావణ సంహారం మొదలగునవి.  మన శరణాగతిని  అనుగ్రహించు సమయమును కేవలం భగవంతుడే స్వాతంత్రడై నిరణయము చేస్తారు. భరతుని విషయములో ఏరి త్రోవ్వి పెట్టినను, వాన కురువటకు అది తగు సమయం కాదు.  ) అందు వలన శరణాగతి మొదలైన వన్ని అధికారి విశేషణములుగా చెప్పబడీనవే కాని ఉపాయములుగా చెప్పబడ లేదు.  శరణాగతి మొక్షమునిస్తుందనటము కాల విలంబనము లేక మొక్షమునిస్తుందన్న అర్థములోనే తప్ప దానికి మొక్షమునిచ్చే శక్తి వుందని కాదు అర్థము. ఈ విధముగా  శరణాగతి శాస్త్రమును ఈ పాటలో మామునులు వివరించారు.

అడియేన్  చూడామణి రామానుజ దాసి

మూలము:  http://divyaprabandham.koyil.org/index.php/2014/11/gyana-saram-1-una-udal/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

జ్ఞానసారము – అవతారిక

Published by:

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

జ్ఞానసారము

<< తనియన్

శ్రీ అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్లు శ్రీమద్రామానుజుల శ్రీపాదములను ఆశ్రయించిన వారు. వేదము మొదలైన సకల శాస్త్రముల అంతరార్థములను ఆచార్యుల ముఖతా తెలుసుకున్న వారు. కావున పరమాత్మను ఆశ్రయించి పొందే ఆనందమును బాగుగా తెలిసినవారు. ఆచార్యుల దగ్గర ఉండి, వారి శ్రీపాదములను సేవించి, వారి అభిమతానుసారముగా నడచుకొన్న వారు. అపారమైన గురుభక్తి గలవారగుటచే శ్రీ అరుళాళ ప్పెరుమాళ్ ఎంబెరుమానార్లు తమ గురువుగారి వద్ద నేర్చిన తత్వ రహస్యార్థములను ప్రజలందరూ నేర్వాలన్న ఆకాంక్షతో ,తాము తెలుసుకొన్న పరమాత్మకు సంబంధించిన వాస్తవములను, పరమాత్మను పొందే మార్గమును, పొందిన తరువాత లభించే ఆనందమును సులభమైన శైలిలో, తమిళములో “జ్ఞానసారము” అను గ్రంథముగా ఆవిష్కరించారు. ” వెణ్పా” అనే దేశీయ చందములో ఈ గ్రంథము కూర్చబడినది 

అడియేన్ ఇందుమతి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2014/11/gyana-saram-introduction/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

జ్ఞానసారము – తనియన్

Published by:

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

జ్ఞానసారము

తనియన్

కార్తికే భరణిజాతమ్ యతీంద్రాచార్యమ్ ఆశ్రయే
జ్ఞాన ప్రమేయ సారాభి వక్తారమ్ వరదమ్ మునిమ్

భావం: కార్తిక మాసము, భరణి నక్షత్రములో అవతరించినవారు, యతీంద్రులైన భగవద్రామానుజులను ఆశ్రయించినవారు, తమ జ్ఞానసార, ప్రమేయసారములలో ఆచార్యుల ఔన్నత్యమును చాటినవారు అయిన అరుళాళ మామునులను ఆశ్రయిస్తున్నాను.

రామానుజార్య సచ్చిష్యం వేద శాస్త్రార్థ సంపదం
చతుర్దాశ్రమ సంపన్నం దేవరాజ మునిం భజే

భావం: రామానుజాచార్యులకు మంచి శిష్యులు, వేదాది సకలశాస్త్ర పారంగతులు, నాలుగవ ఆశ్రమమైన సన్యాశాస్రమును స్వీకరించిన  అరుళాళ మామునులను ఆశ్రయిస్తున్నాను.

సూచిక – (రామానుజార్య సచ్చిష్యం)   పూర్వాశ్రమలో  వీరు యఙ్ఞమూర్తి అనే తిరునామముతో ఉన్నప్పుడు పద్దెనిమిది రోజులు  తర్కం మొదలగు వేదాంత భాగములపై రామానుజాచార్యులతో  వాద వివాదం చేసి వారిని సంప్రదాయం ఎట్లు కాపాడవలెనో అని చింతామగ్నులుగా చేసారు.అప్పుడు , పరమ కృపాసాగరులు హస్తిగిరి  వరదరాజులు రామానుజాచార్యులకు స్వప్నములో కనపడి ఎంబెరుమానారే మీరు  అలసిపోవలదు. మీకు ఒక ఉత్తమ శిష్యులను అనుగ్రహిస్తున్నాను, అతడి పైగెలుస్తారు అని అన్నారని గురుపరంపర ప్రభావములో ఉన్న విషయమును ఇక్కడ గుర్తు చేసుకోవాలి.

(వేద శాస్త్రార్థ సంపదం) –       రామానుజాచార్యులతో పద్దెనిమిది రోజులు వేదాంత చర్చ చేసిన ప్రజ్ఞ వలన  ,ఙ్ఞానసార ప్రమేయసార గ్రంథములలో వేదము మొదలగు శాస్రములలోని సారవంతమైన అంశములను చక్కని వెణపా  అనే ఛందస్సులో కూర్చడము వలన వీరి ప్రజ్ఞా పాటవములు బోధపడుతున్నది.

(దేవరాజ మునిం) – కృపాసాగరుడైన దేవరాజ పెరుమాళ్ళ వలన రామానుజాచార్యులకు శిష్యులైన ఔన్నత్యము, జ్ఞాన, భక్తి ,వైరాగ్యముల పరాకాష్ట కావటము , రామానుజమునికి సమానముగా ప్రకాశించటము వలన  వీరు అరుళాళముని అన్న తిరునామమును పొందారు.

ఙ్ఞానసార తనియన్-

సురుళార్ కరుంకుళల్ తోగైయార్ వేల్ విళియిల్ తువళుమ్
మరుళామ్ వినై కెడుమ్ మార్గం  పెత్తేన్ మఱైనాన్గుమ్ శొన్న
పొరుళ్ ఙ్ఞాన సారత్తై పుందియిల్ తందవన్  పొంగొళిశేర్
అరుళాళ మామునియమ్ పొఱ్కళల్ గళ్ అడైంద పిన్నే

భావము – నాలుగు వేదములనుండి అంతరార్థములను వెలికితీసి ,తిరుమంత్రములోని సారమును చేర్చి, జ్ఞానసారము, ప్రమేయసారములను గ్రంథములను చేసి లోకములో జ్ఞానమును పెంచి జ్ఞానజ్యోతిగా ప్రకాశించిన వారు  అరుళాళ మాముని అనే నామధేయులైన ఆచార్యులు.   అందమైన, అందరు పొంద దగిన వారి శ్రీపాదములను చేరిన తరువాత  ఆత్మ స్వరూపమును తెలుసుకొనే మార్గమును కనుగొన్నాను.

అనాది కాలములందు చేయు కర్మముల వలన, ఆత్మ నిజ స్వరూపం యొక్క జ్ఞానము తగ్గుతుంది. అలా తగ్గడం వలన స్త్రీ విషయములో మోహమును పెంచుతున్నది.  ఆ మోహమునకు కారణమైన ఉంగరములు తిరిగిన కురులు, బాణముల వంటి చూపులలో చిక్కిన మనసు జారిపోతున్నది.  అరుళాళ మామునుల శ్రీపాదములనాశ్రయించిన తరువాత కామము వంటి తుచ్చమైన కోరికల నుండి విముక్తి దొరికింది.

అరుళాళ పెరుమాళ్  శ్రీపాదములనాశ్రయించిన తరువాత వారనుగ్రహించిన జ్ఞానసారము, ప్రమేయసారము అనే ప్రబంధముల వలన బుద్ది వికసించింది.  స్త్రీ వ్యామోహముతో పాటు కోపము, లోభము, మోహము, మదము, ఈర్ష్య, అసూయ, మొదలగు దోషములు కూడా తొలగి పోతాయి.  కామము, అజ్ఞానము,  మొహము ఆజీవితము వరకు ఉండే రోగాలు అని తిరుక్కురళ్ లో చెప్పినట్లు  మనుష్యుల సంస్కారానికి హాని కలిగించే దోషములు అయినప్పటికీ ఆచార్యులను ఆశ్రయించటము వలన తొలగిపోతాయి అని గ్రహించాలి. ఈ తనియన్ వలన ఆచార్య వైభవం తెలుసుకున్నాము.

అడియేన్ ఇందుమతి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2014/11/gyana-saram-thaniyan-invocation/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org