ఆర్తి ప్రబంధం – 55

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 54

పరిచయము:

నిజమైన శిష్యుడిగా,  గొప్ప అనుచరుడిగా మనము రెండు విషయాలను తెలుసుకోవాలి.

(1) తమ ఆచార్యుడు తనకు చేసిన అన్ని ఉపకారాలను గురించి ధ్యానించడం.

(2) భవిష్యత్తులో ఆచార్యుడు అతనికి చేయబోయే వాటి పట్ల ఆసక్తి చూపించడం.

ఈ పాశురము ప్రత్యేకంగా మొదటి విషయము గురించి వివరిస్తుంది. ఎంబెరుమానార్లు తనకి ప్రసాదించిన అద్భుత గుణాలను మాముణులు కీర్తిస్తున్నారు. వారు ప్రతి ఒక్కటిని గుర్తు చేసుకొని, ఎంబెరుమానార్ల కృప కారణంగా తాను ఈ గుణాలను పొందగలిగారని మాముణులు చెప్పుచున్నారు.  

పాశురము 53:

తెన్నరంగర్ శీర్ అరుళుక్కు ఇలక్కాగ ప్పెఱ్ఱోం
తిరువరంగం తిరుపదియే ఇరుప్పాగ ప్పెఱ్ఱోం
మన్నియ శీర్ మాఱంకలై ఉణవాగ ప్పెఱ్ఱోం
మధురకవి శొఱ్పడియే నిలైయాగ ప్పెఱ్ఱోం
మున్నవరాం నంకురవర్ మొళిగళుళ్ళ ప్పెఱ్ఱోం
ముళుదుం నమక్కవై పొళుదుపోక్కాగ  ప్పెఱ్ఱోం
పిన్నై ఒన్ఱు తనిల్ నెంజు పేరామఱ్పెఱోం
పిఱర్ మినుక్కం పొఱామయిల్లా ప్పెరుమైయుం ప్పెఱ్ఱోమే!!!

ప్రతి పద్ధార్ధములు:

ఇలక్కాగ ప్పెఱ్ఱోం – (మనము) లక్ష్యము అవుతాము
శీర్ అరుళుక్కు– నిర్హేతుక కృప
తెన్నరంగర్ – పెరియ పెరుమాళ్ళు, దక్షిణ దిశలో శ్రీలంక వైపు చూస్తూ, కళ్ళకు చాలా ఆహ్లాదకరమైన “కోయిల్” అనే చోటులో శయనించి, తన భక్తులను ఆకర్షిస్తూ అనుగ్రహిస్తున్నారు. (“అరుళ్ కొడుతిట్టు అడియవరై ఆట్ క్కొళ్వాన్ అమరుం ఊర్” (పెరియాళ్వార్ తిరుమోళి 4.9.3)
ఇరుప్పాగ ప్పెఱ్ఱోం –  “తెన్నాడుం వడనాడుం తోళ  నిన్ఱ తిరువరంగం తిరుప్పది (పెరియాళ్వార్ తిరుమోళి  4.9.11)”, “ఆరామం శూళ్ంద అరంగం (శిరియ తిరుమడళ్ 71)”, తలైయరంగం (ఇరండాం తిరువందాది 70) అని శ్రీరాంగ క్షేత్రాన్ని మన ఆళ్వార్లు వర్ణించిన ‘తిరువరంగం తిరుపదియే’లో నిత్య వాసము ఉండే అద్భుత  మహద్భాగ్యం లభించింది. ఈ క్షేత్రము అన్ని 108 దివ్య దేశాలలో ప్రధానమైనది.
ఉణవాగ ప్పెఱ్ఱోం – మా ఆహారము
కలై  – అతి మధురమైన పాశురములు (భక్తులకు తేనెలగా భగవానుడికి మాలగా)
మారన్ – నమ్మాళ్వార్లు
మన్నియ శీర్ – పరభక్తి మొదలైన శుభ లక్షణాలతో నిండి ఉన్నవాడు
నిలైయాగ ప్పెఱ్ఱోం –  “చరమ పర్వ నిష్ఠ” యొక్క చివరి దశకి చేరుకున్నము, దీనిని “యతీంద్రమేవ నీరంద్రం హిశేవే ధైవతంబరం” అని కీర్తిస్తారు. “ఉన్నయొళియ ఒరు దెయ్వం మఱ్ఱఱియా మన్నుపుగళ్ శేర్ వడుగనంబి తన్నిలైయై (అర్తి ప్రబంధం 11) అని నేను, నా సహచరులు కీర్తించడం ప్రారంభించాము.
శొఱ్పడియే – (ఈ చరమ పర్వ నిష్ఠ (సమస్థం మన ఆచార్యులే నని భావించుట) మధురకవుల దివ్య పలుకుల నుండి తీసుకోబడినవి. మధురకవి – “తేవు మఱ్ఱఱియేన్ (కణ్ణినున్ శిరుత్తాంబు 2)” అని మధురకవి ఆళ్వార్లు చెప్పినట్లు . (మనము మధురకవి ఆళ్వార్ల సిద్ధాంతాలకు అనుగుణంగా జీవించాలి).
మున్నవరాం నంకురవర్ మొళిగళుళ్ళ ప్పెఱ్ఱోం – మనము మన పూర్వాచార్యుల రచనలు, వారి దివ్య రహస్య ఉద్దేశ్యాలను అనుసరిస్తూ జీవించాలి. ఆళ్వారులు చూపిన బాటను అనుసరిస్తూ జీవించిన ఆచార్యుల రచనలు ఇవి.
ముళుదుం నమక్కవై పొళుదుపోక్కాగ  ప్పెఱ్ఱోం – మనము మన సమయాన్ని వారికి కైంకర్యము చేస్తూ గడిపాలి. మన పూర్వాచార్యుల ఈ దివ్య రచనలను అనుసరిస్తూ వేళ్ళగలిగితే మన మనస్సు భ్రమించదు.
పిన్నై ఒన్ఱు తనిల్ నెంజు పేరామఱ్పెఱోం – మన పూర్వాచార్యుల ఈ రచనలు మన మనస్సులను ఎన్నడూ ఎక్కడికీ వెళ్ళ నివ్వవు,
ఒన్ఱు తనిల్ – మన పూర్వాచార్యుల రచనలు తప్పించి ఇతర రచనలు
పిఱర్ మినుక్కం పొఱామయిల్లా –  ఎంబెరుమానార్ల దయతో  మనకు లభించిన ఈ గుణాలు తక్కెడలో ఒక వైపు ఉంచితే, నేను ఇప్పుడు చెప్పబోయేది పైన పేర్కొన్న వాటికి సమానమైనది లేదా బరువైనదిగా ఉంటుంది. “ఇప్పడి ఇరుక్కుం శ్రీవైష్ణవర్గల్ ఎఱ్ఱం అఱిందు ఉగందు ఇరుక్కైయుం (ముముక్షుపడి ద్వయ ప్రకణం 116)” లో వర్ణించినట్లు పైన చెప్పిన అన్ని గుణాలతో అంత అరుదైన శ్రీవైష్ణవుడు ఎదురైతే, వారిని చూసి ఎప్పుడూ మనము అసూయపడము. ఎంబెరుమానార్లు మనకి ఇచ్చిన కీర్తి అలాంటిది.
ప్పెరుమైయుం ప్పెఱ్ఱోమే – మనకు అది దొరికింది! అయ్యో! మనము ఎంత అదృష్టవంతులము. ఎంబెరుమానార్ల నిర్హేతుక కృపకు ధన్యవాదాలు.

సరళ అనువాదము:

ఈ పాశురములో, మాముణులు ఎంబెరుమానార్ల  దయని కీర్తిస్తున్నారు. ఎంబెరుమానార్లకు తన పట్ల ఉన్న అనంతమైన దయ కారణంగానే అతనిలో కొన్ని విలువైన గుణాలు వచ్చాయని మాముణులు వివరిస్తున్నారు. పెరియ పెరుమాళ్ళ అనుగ్రహం అందించడం కోసం వాళ్ళను (తాను, ఇతర శ్రీవైష్ణవ సహచరులు) ఎంచుకున్నారని, మొత్తం 108 దివ్య దేశాలలో ప్రముఖమైన శ్రీరంగంలో నివాసముండే అద్భుతమైన అవకాశం వారికి లభించిందని, వారు భుజించడానికి, త్రాగడానికి, పీల్చుకోడానికి నమ్మాళ్వార్ల రచనలు ప్రతి రోజు లభించే అరుదైన ఆశీర్వాదాలు పొందారని మాముణులు కీర్తిస్తున్నారు. చరమ పర్వ నిష్ఠ (తమ ఆచార్యులే సర్వస్వము అని భావించుట) ని మధురకవి ఆళ్వార్లు ప్రతిపాదించిన సిద్ధాంతాల ప్రకారం జీవించడానికి వారికి చక్కని అవకాశము లభించిందని వారు కీర్తిస్తున్నారు. ఇలా అతి అరుదుగా జరుగుతుంది. ఆళ్వార్ల దివ్య సూచనలను అనుసరిస్తూ జీవించిన మన పూర్వాచార్యులు (వారు శ్రీవైష్ణవ గ్రంథాలు తప్ప మరే ఇతర వాటి వద్దకు వెళ్ళలేదు. వాటిని అనుసరిస్తూ తమ జీవితాలను గడిపారు), వాళ్ళ బాటలో నడుచుకునే భాగ్యము మనకి లభించినది.  చివరగా అతి ముఖ్యమైనది, పైన పేర్కొన్న అన్ని లక్షణాలతో అటువంటి శ్రీవైష్ణవుడు ఎదురుపడితే, వారిని చూసి ఎప్పుడూ అసూయ చెందరు. పైగా సంతోషిస్తారు అని వివరిస్తూ తమకు లభించిన ఈ అదృష్టాలన్నీ కేవలం ఎంబెరుమానార్ల  ఆశీర్వాదం వల్లనే అని మాముణులు కీర్తిస్తున్నారు.

వివరణ: 

మాముణులు ఇలా అంటాడు, “శ్రీలంక దిశలో దక్షిణం వైపు ఉన్న ఆహ్లాదకరంగా “కోయిల్” లో శయనించి ఉన్న పెరియ పెరుమాళ్ళ కారణ రహిత కృపకు మేము పాత్రులమైనాము. “అరుళ్ కొడుతిట్టు ఆడియవరై ఆట్కొళ్వాన్ అమరుం ఊర్” అని పెరియాళ్వార్ తిరుమొళి 4.9.3వ పాశురములో చెప్పినట్లుగా, అందరినీ ఆకర్షిస్తూ పెరియ పెరుమాళ్ళ తన భక్తులను ఆశీర్వదిస్తున్నారు. “తెన్నాడుం వడనాడుం తొళ నిన్ఱ తిరువరంగం తిరుప్పది” అని పెరియాళ్వార్ తిరుమొళి 4.9.11 వ పాశురములో వర్ణించినట్లుగా , “ఆరామమ్ శూళ్ంద అరంగం” అని శిరియ తిరుమడల్ 71వ పాశురములో చెప్పినట్లుగా, “తలైయరంగం” అని ఇరండాం తిరువందాది 70వ పాశురములో వర్ణించినట్లుగా, అటువంటి శ్రీరంగంలో నివాసము ఉండే అద్భుత అవకాశం మాకు లభించింది. అన్ని 108 దివ్య దేశాలలోకి శ్రీ రంగము ప్రధానమైనది. పరభక్తి మొదలైన పవిత్ర గుణాలతో, మాధుర్యముతో నిండి ఉన్న నమ్మాళ్వార్ల పాశురములు ఇక్కడ మాకు ఆహారము. “యతీంద్రమేవ నీరంద్రం హిశేవే దైవతంబరం” అని కీర్తించబడే “చరమ పర్వ నిష్ట” కి మనము చేరుకున్నాము. నేను, నా సహచరులు దానిని మనమము చేయ ప్రారంభించాము. “ఉన్నైయొళియ ఒరు దెయ్వం మఱ్ఱఱియా మన్నుపుగళ్ శేర్ వడుగనంబి తన్నిలైయై” అని ఆర్థి ప్రబంధం 11 వ పాశురములో చెప్పినట్లుగా, నా సహచరులతో నేను వాటి గురించి చర్చించడం మొదలుపెట్టాము. చరమ పర్వ నిష్ఠ యొక్క ఈ సిద్ధాంతం (సమస్థము తమ ఆచార్యులే అన్న నిష్ఠ)  “తేవు మఱ్ఱఱియేన్” అని కణ్ణినున్ చిరుత్తాంబు 2 వ పాశురములోని మధురకవి ఆళ్వార్ల దివ్య పలుకుల నుండి ఉద్భవించింది. మధురకవి ఆళ్వార్ల నిష్ఠని మనము అనుసరించి నడుచుకోవాలి. మధురకవి ఆళ్వార్లని సూచిస్తూ, “అవర్గళై చ్చిరిత్తిరుప్పార్ ఒరువర్ ఉణ్డిరే” అని శ్రీ వచన భూషణము 409 వ సూత్రములో వివరించబడింది. (ఇతర 10 ఆళ్వార్లను చూసి, పెరుమాళ్ళను చేరుకోవటానికి వారి విధానంలో విశ్వసనీయత లేదని, మధురకవి ఆళ్వార్ల విషయంలో వారికి సర్వస్వము నమ్మాళ్వార్లు అని వారి భావన). మనము మన పూర్వాచార్యుల రచనలను పరిశోదిస్తూ వారి దివ్య రహస్యాలను శ్వాసిస్తూ జీవించాలి. ఆళ్వార్లు చూపించిన బాటలో నడుచుకొన్న మన పూర్వాచర్యుల రచనలు ఇవి. ఈ రచనలలో జీవితము సాగిస్తూ సమయము గడిపాము. మన పూర్వాచర్యుల ఈ దివ్య రచనలలో మన మనస్సు ఎంతగా ఇమిడిపోయి ఉందంటే వీరి రచనలు తప్పా ఇతరమైన దేనిపైన మనము ఆధరపడే అవసరము ఉండదు.

ఎంబెరుమానార్ల దయతో మనము పొందిన ఈ పైన పేర్కొన్న గుణాలను తక్కేడలో ఒక వైపున ఉంచితే, నేను ఇప్పుడు చెప్పబోయేది పైన పేర్కొన్న వాటికి సమానమైనది లేదా బరువైనదిగా ఉంటుంది. “ఇప్పడి ఇరుక్కుం శ్రీవైష్ణవర్గల్ ఏఱ్ఱం అన్ఱిదు ఉగందు ఇరుక్కైయుం” అని ముముక్షుపడి ద్వయ ప్రకరణం 116వ సూత్రములో చెప్పినట్లుగా ఈ గుణాలతో ఉన్న అటువంటి అరుదైన శ్రీవైష్ణవుడు కనబడితే, వాళ్ళను చూసి ఈర్ష్యానుభవం మనకు కలగదు. అటువంటి గుణము మనకి ఎంబెరుమానార్ల దయతో లభించింది. ఆహా! ఎంతటి అదృష్థము.  ఎంబెరుమానార్ల నిష్కామ కృపకి ధన్యవాదాలు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2017/03/arththi-prabandham-55/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment