తిరుప్పావై – సరళ వ్యాఖ్యానము – పాశురములు 21 – 30

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

తిరుప్పావై << పాశురములు 16 – 20 “భగవాన్ ని అనుభవించడములో నేనూ మీతో ఉన్నాను”  అని నప్పిన్నై పిరాట్టి కూడా ఆండాళ్ సమూహములో చేరుతుంది. ఇరవై ఒకటవ పాశురము:  ఇందులో, ఆమె నందగోపుని  వంశంలో శ్రీకృష్ణుని పుట్టుకను, అతని ఆధిపత్యమును మరియు వేదముల ద్వారా స్థాపించబడిన అతని గుణాలను స్తుతిస్తుంది. ఏఱ్ఱ కలంగళ్ ఎదిర్ పొంగి మీదళిప్ప మాఱ్ఱాదే పాల్ శొరియుమ్ వళ్లల్ పెరుమ్ పశుక్కళ్ ఆఱ్ఱ ప్పడైత్తాన్ మగనే అఱివుఱాయ్ ఊఱ్ఱముడైయాయ్  పెరియాయ్  ఉలగినిల్ తోఱ్ఱమాయ్ నిన్ఱ శుడరే  తుయిలెళాయ్ మాఱ్ఱార్ ఉనక్కు వలి తొలైన్దు ఉన్ వాశల్ కణ్ ఆఱ్ఱాదు వన్దు ఉన్నడి పణియుమా ప్పోలే పోఱ్ఱియామ్ వన్దోమ్ పుగళ్ న్దు ఏలోరెమ్బావాయ్ పొదుగు క్రిందనుంచిన కడవలు చరచరనిండి పొంగిపొరలునట్లు ఆగక, పాలు స్రవించు అసంఖ్యాకములగు, ఉదారములగు, బలసిన ఆవులుగల నందగోపుని  కుమారుడా! మేల్కొనుము. ప్రమాణదార్డ్యముగల పరబ్రహ్మ స్వరూపా! ఆశ్రిత రక్షణ ప్రతిఙ్ఞాదార్డ్యముగల మహామహిమ సంపన్నా! ఈ లోకములో ఆవిర్భవించిన జ్యోతి స్వరూపా! నిద్ర నుండి లెమ్ము. శత్రువులు నీ పరాక్రమమునకు లొంగి మేముకూడ నిన్ను వీడి ఉండలేక నీ పాదములనే స్తుతించి మంగళాశాసనము చేయుటకై నీ విశాలమైన భవన ముఖ ద్వారము వద్దకు వచ్చితిమి. ఇరవై రెండవ పాశురము: ఇందులో తనకూ తన స్నేహితులకు వేరే ఆశ్రయం లేదని,  శ్రీ రామునికి శరణాగతి చేయడానికి విభీషణుడు వచ్చినట్లే వారూ అతని వద్దకు వచ్చారని ఆండాళ్ ఎంబెరుమాన్ కి విన్నవించుకుంటుంది. అన్ని కోరికలు వదులుకొని, కేవలము వారి అనుగ్రహమే ఆశించి వచ్చామని తెలియజేస్తుంది. అంగణ్ మాజ్ఞాలత్తరశర్ అభిమాన బఙ్గమాయ్ వన్దు నిన్ పళ్ళి క్కట్టిల్ కీళే శంగ ఇరుప్పార్ పోల్ వన్దు తలైప్పెయ్ దోమ్ కింగిణి వాయ్ చ్చెయద తామరై ప్పూప్పోలే శెంగణ్ శిఱుచ్చిరిదే ఎమ్మేల్ విళియావో తింగళు మాదిత్తియను మెళున్దార్పోల్ అంగణిరఱణ్డుం కొణ్డు ఎంగళ్ మేల్ నోక్కుదియేల్ ఎంగళ్ మేల్ శాబం ఇళిన్దేలోర్ ఎమ్బావాయ్. సుందరము విశాలము నగు మాహా పృధివీ మండలము నంతను ఏలిన రాజులు తమ కంటె గొప్పవారు లేరనే అహంకారమును వీడి తమను జయించిన సార్వభౌముని సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరి ఉన్నట్లు, మేమును అభిమాన భంగమై వచ్చి నీ సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరి ఉన్నాము. చిరుగంట ముఖమువలె విడియున్న తామర పువ్వువలె వాత్సల్యముచే ఎఱ్ఱగా ఉన్న నీ కన్నులను మెల్ల మెల్లాగా విచ్చి మాపై ప్రసరింపజేయుము. సూర్యచంద్రు లిరువురు ఒక్కసారి ఆకాశమున ఉదయించునట్లుండెడి నీ రెండు నేత్రములతో మావైపు కటాక్షించితివా! మేము అనుభవించియే తీరవలెనని శాపము వంటి కర్మ కూడా మమ్ములను వీడిపోవును. ఇరవై మూడవ పాశురము:  ఇందులో,  చాలా కాలము ఆండాళ్ని వేచి ఉంచిన తరువాత,  శ్రీ కృష్ణ పరమాత్మ తన కోరిక ఏమిటో అడుగుతారు. దానికి బదులుగా ఆమె శ్రీ క్రిష్ణుడిని ఒక రారాజు లాగా తన సింహాసనము వద్దకు నడిచి వచ్చి సభలో అందరి సమక్షములో ఈ ప్రశ్న అడగమని చెబుతుంది. మారి మలై ముళఞ్జిల్ మన్ని క్కిడన్దుఱంగుమ్ శీరియ శింగం అఱివిఱ్ఱుత్తీ విళిత్తు వేరి మయిర్ పొంగ వెప్పాడుమ్ పేర్ న్దుదరి మూరి నిమిర్ న్దు ముళంగి ప్పురప్పట్టు పోదరుమా పోలే, నీ పూవైప్పూవణ్ణా ఉన్ కోయిల్ నిన్ఱిఙ్గనే పోన్దరుళి కోప్పుడైయ శీరియ శింగాసనత్తిరున్దు యామ్ వన్ద కారియ మారాయ్ న్దరుళేలో రెమ్బావాయ్ పర్వతగుహలో వర్షాకాలమున కదలక మెదలక పరుండి నిద్రించుచున్న శౌర్యముగల సింహము మేల్కొని, తీక్ష్ణమగు చూపులతో ఇటు అటుచూచి, ఒక విధమగు వాసనగల తన ఒంటి వెండ్రుకలు నిగుడునట్లు చేసి, అన్ని వైపులకు దొర్లి, దులుపుకొని, వెనుకకు ముందుకు శరీరమును చాపి, గర్జించి, గుహనుండి బయటికి వచ్చునట్లు, ఓ అతసీపుష్ప సవర్ణ! నీవు నీ భవనము నుండి ఇట్లే బయటికి వేంచేసి రమణీయ సన్నివేశముగల లోకోత్తరమగు సింహాసనమును అధిష్ఠించి మేము వచ్చిన కార్యమును ఎరుంగ ప్రార్థించుచున్నాము. ఇరవై నాలుగవ పాశురము: తాను ఆసీనుడైన తరువాత, ఆమె అతనికి మంగళాశాసనము చేయటం ప్రారంభిస్తుంది.  పరమాత్మకు మంగళాసాసనము చేయడమే పెరియాళ్వార్ యొక్క ముద్దు బిడ్డ అయిన ఆండాళ్ యొక్క లక్ష్యము. అతని నడకను చూసి ఆండాళ్ మరియు ఆమె స్నేహిస్తులు సీతా పిరాట్టి లాగా, దండకారణ్యములోని మునులులాగా, పెరియాళ్వార్ మాదిరిగా మంగళాశాసనము గావిస్తారు. లేత పాదాలు గలిగిన శ్రీకృష్ణ పరమాత్మను నడిపించామే నని వారు బాధ చెందుతారు. అన్ఱు వ్వులగ మళన్దాయ్ ఆడిపోఱ్ఱి శెన్ఱంగు త్తెన్నిలగై శెఱ్ఱాయ్ తిఱల్ పోఱ్ఱి పొన్ఱ చ్చగడ ముదైత్తాయ్  పుగళ్ పోఱ్ఱి కన్ఱు కుణిలా వెఱిన్దాయ్ కళల్ పోఱ్ఱి కున్ఱుకుడైయా వెడుత్తాయ్ గుణమ్ పోఱ్ఱి వెన్ఱు పగై క్కెడుక్కుమ్ నిన్ కైయిల్ వేల్ పోఱ్ఱి ఎన్ఱెన్ఱున్ శేవగమే యేత్తి ప్పఱై కొళ్వాన్ ఇన్ఱియామ్ వన్దోమ్ ఇరంగేలో రెమ్బావాయ్. “పోత్తి” అన్న పదము “చిరకాలము వర్ధిల్లు” అని మంగళాశాసనమును సూచిస్తుంది. ఆనాడు దేవతల కోసము ముల్లోకాలను కొలిచిన మీ దివ్య పాదారవిందములకు మంగళము. సుందరమైన  లంకకి వెళ్లి రావణుడిని చెండాడిన మీ బాహుపరాక్రమమునకు మంగళము. శ్రీ కృష్ణునకు రక్షణకై ఉంచిన బండిపై ఆవేశించిన రాక్షసుని చంపుటకై ఆ బండికి తగునట్లు కాలుచాచి నేలకూల్చిన మీ ప్రతిమ కీర్తికి మంగళము. వత్సముపై ఆవేశించిన అసురునితో వెలగచెట్టుపై నావేశించిన అసురుని చంపుటకై రాయిని విసినట్లుగా వెలగ చెట్టుపైకి  దూడను విసురునపుడు ముందు వెనకకు పాదములుంచి నిలిచిన మీ దివ్య పాదములకు మంగళము. గోవర్ధన పర్వతమును గొడుగువలె ఎత్తిన మీ వాత్సల్యమునకు మంగళము. శత్రువులను సమూలముగా పెకలించి విజయము నార్జించి ఇచ్చెడి మీ హస్తము నందలి వేలాయుధమునకు  మంగళము. ఈ ప్రకారముగా నీ వీర చరిత్రములనే కీర్తించి పఱ అనే వ్రతసాధనము నందున మేమీనాడు వచ్చినారము అనుగ్రహింపుము. ఇరవై ఐదవ పాశురము: వారి నోమును కొనసాగించికోవడానికి తమకు ఏదైనా అవసరమా అని ఎంబెరుమాన్ వారిని అడిగినప్పుడు,  వారు తనకు మంగళాశాసనము చేసిన తరువాత వారి బాధలన్నీ మటు మాయమయ్యాయని,  వారు ఇక కోరుకునేది ఒక్క కైంకర్యమేనని వారు విన్నపిస్తారు. ఒరుత్తి మగనాయ్ పిఱన్దు ఓరిరవిల్ ఒరుత్తి మగనాయ్ ఒళిత్తు వళర, తరక్కిలా నాగిత్తాన్ తీంగునినైన్ద కరుత్తై ప్పిళ్ళైపిత్తు క్కఞ్జన్ వయిఱ్ఱిల్ నెరుప్పెన్న నిన్ఱ నెడుమాలే యున్నై అరుత్తిత్తు వన్దోమ్  పఱై తరుతియాగిల్ తిరుత్తక్క శెల్వముమ్ శేవగముమ్ యామ్పాడి వరుత్తముమ్ తీర్ న్దు మగిళిన్దు ఏలో రెమ్బావాయ్. సాటిలేని దేవకీ దేవికి కుమారునిగా జన్మించి, శ్రీ కృష్ణుని లీలలను పరిపూర్ణముగా అనుభవించిన అద్వితీయ వైభవము గల యశోదకు కుమారుడివై దాగి పెరిగినవాడా! అట్లు పెరుగుచున్న నిన్ను చూచి ఓర్వలేక చంపవలెనని దుష్టభావముతో ఉన్న కంసుని అభిప్రాయమును వ్యర్థము చేసి వాని కడుపులో చిచ్చువై నిన్ను చంపవలెనని తలంచిన వానిని నీవే చంపిన ఆశ్రిత వ్యామోహము గలవాడా! నిన్నే కోరి వచ్చినవారము.పఱయను వాద్యమునిచ్చిన ఇమ్ము. సాక్షాత్తు లక్ష్మియే పొందవలెనని కోరదగిన నీ ఐశ్వర్యమును, నీ వీరచరిత్రమును, కీర్తించి శ్రమను వీడి ఆనందించుచున్నాము. ఇరవై ఆరవ పాశురము: దీనిలో, ఆమె అతనికి నోముకి అవసరమైన ఉపకరణాలు గురించి వివరిస్తుంది. ఇంతకు ముందు ఏమీ అవసరం లేదని ఆమె చెప్పినప్పటికీ, ఆమె ఇప్పుడు మంగళాశాసనము చేయడానికి పాంచజన్యమును, అతని శ్రీముఖాన్ని స్పష్టంగా చూడటానికి దీపము, దివ్య పతాకము,  పందిరి మొదలైన ఉపకరణాలను కోరుతుంది. తన కృష్ణానుభవానికి సంపూర్ణతకై ఆండాళ్ వీటిని కోరుతున్నట్లు మన పుర్వచార్యులు వివరిస్తున్నారు. మాలే  మణివణ్ణా మార్గళి నీరాడువాన్ మేలైయార్ శెయ్ వనగళ్ వేణ్డువన కేట్టియేల్ ఞాలత్తై యెల్లామ్ నడుంగ మురల్వన పాలన్న వణ్ణత్తు ఉన్ పాఞ్చశన్నియమే పోల్వన శంగంగళ్, పోయ్ ప్పాడుడై యనవే శాల ప్పెరుమ్ పఱైయే, పల్లాణ్డిశైప్పారే కోల విళక్కే కొడియే విదామే ఆలిన్ అలైయాయ్ అరుళేలో రెమ్బావాయ్. ఆశ్రిత వ్యామోహము కలవాడా! ఇంద్రనీలమణిని పోలిన కాంతియు, స్వభావమును కలవాడా! అఘటిత ఘటనా సామర్థ్యముచే చిన్న మర్రియాకుపై అమరి పరుండువాడా! మేము మార్గశీర్ష స్నానము చేయగోరి దానికి కావలసిన పరికరము లర్థించి నీ వద్దకు వచ్చితిమి. ఆ స్నాన వ్రతమును మా పూర్యులు శిష్టులు ఆచరించినారు. నీవు విన్నచో దానికి కావలసిన పరికరములను విన్నవించెదము. ఈ భూమండల మంతను వణకునట్లు శబ్దము చేయు, పాలవలె తెల్లనైన, నీ పాంచజన్యమనెడి శంఖమును బోలిన శంఖములు కావలెను. పెద్ద ‘పఱ’ యను వాద్యములు కావలెను. మంగళ గానము చేయు భాగవతులు కావలెను. మంగళ  దీపములు కావలెను. ధ్వజములు కావలెను. మేలుకట్లు కావలెను. పై పరికరములను కృప చేయుము అని గోపికలు శ్రీ కృష్ణుని ప్రార్థించిరి. ఇరవై ఏడవ పాశురము: తన వైపు అనుకూల ప్రతికూలమైన తత్వాలను కూడా ఆకర్షించగల ఎంబెరుమాన్  యొక్క ప్రత్యేకమైన గుణాన్ని ఆండాళ్ వివరిస్తుంది. అంతే కాకుండా, అతని నుండి విడనాడకుండా నిరంతరము కైంకర్యము చేయగల సాయుజ్య మోక్షము అత్యున్నత పురుషార్థమని ఆమె తెలియజేస్తుంది. ఇరవై ఏడవ మరియు ఇరవై ఎనిమిది పాశురములలో ఎంబెరుమాన్ మాత్రమే మనకు లక్ష్యము మరియు వారిని చేరగలిగే సాధనము కూడా అని ఆమె ధృవీకరిస్తుంది. కూడారై వెల్లుమ్ శీర్ గోవిందా ఉన్దన్నై ప్పాడిప్పఱై కొణ్డు యామ్ పెఱు శెమ్మానమ్ నాడు పుగళుమ్ పరిశినాల్ నన్ఱాగ శూడగమే తోళ్ వళైయే తోడే శెవిప్పూవే పాడగమే ఎన్ఱనైయ పల్ కలనుమ్ యామణివోమ్ ఆడై  ఉడుప్పోమ్, అదన్ పిన్నే పాల్ శోఱు మూడ నెయ్ పెయ్ దు ముళంగై వళివార కూడి యిరున్దు కుళిర్ న్దేలోరెమ్బావాయ్ తనతో కూడని శత్రువులను జయించెడి కళ్యాణ గుణ సంపద గల గోవిందా! నిన్ను కీర్తించి వ్రతసాధనమగు పఱ యను వాద్యమును పొంది పొందదలచిన ఘనసన్మానము లోకులందరు పొగడెడి తీరులో నుండవలెను. చేతులకు గాజులు మొదలగు ఆభరణములు, బాహువులకు దండకడియములు, చెవి క్రింద భాగమున దాల్చెడి దుద్దు, పై భాగమున పెట్టుకొనెడి కర్ణపూవులు, కాలియందెలు మొదలగు అనేకాభరణములను మేము దాల్పవలయును. తరువాత మంచి చీరలను దాల్పవలయును. దాని తరువాత పాలు అన్నము మునునట్లు నేయ్యి పోసి ఆ మధుర పదార్థము మోచేతి వెంబడి కారునట్లు నీతో కలిసి కూర్చొని చల్లగా హాయిగా భుజింపవలెను – అని గోపికలు తమ వ్రతఫలమును ఇందు విన్నపించిరి. ఇరవై ఎనిమిదవ పాశురము: దీనిలో, అన్ని ఆత్మలకూ పరమాత్మకు మధ్య కారణ రహిత సంబంధమును, ఏ ఇతర మార్గాలనూ ఆమె అనిసరించలేదని, ఎంబెరుమాన్ యొక్క గొప్పతనాన్ని, ప్రతిఫలంగా ఏమీ ఆశించక ప్రతి ఒక్కరినీ ఉద్ధరించే అతని గుణాన్ని ఆమె వివరిస్తుంది. కఱవైగళ్ పిన్ శెన్ఱు క్కానమ్ శేర్ న్దుణ్బోమ్ అఱి వొన్ఱు మిల్లాద వాయ్ క్కులత్తు ఉన్దన్నై ప్పిఱవి పెఱున్దనై పుణ్ణియమ్ యామ్ ఉడైయోమ్ కుఱైవొన్ఱుమ్ ఇల్లాద గోవిందా ఉన్దన్నోడు ఉఱవేల్ నమక్కింగు ఒళిక్క వొళియాదు అఱియాద పిళ్ళైగళోమ్ అన్బినాల్ ఉన్దన్నై చిఱు పేర్ అళైత్తనవుమ్ శీఱి అరుళాదే ఇఱైవా నీ తారాయ్ పఱైయేలో రెమ్బావాయ్. పశువుల వెంట వానిని మేపుటకై అడవికి పోయి, అచటనే శుచి నియమములు లేక తిని, జీవించియుండుటయే ప్రయోజనముగా తిని, తిరిగెడి వారము. ఏమియు జ్ఞానము లేని మాగోప వంశమున మాతో సజాతీయుడవై నీవు జన్మించిన పుణ్యమే మాకున్న పుణ్యము. మాకు ఎన్ని లోపములున్ననూ తీర్చగల్గినట్లు ఏ లోపము లేని వాడవు కదా నీవు. గోవిందా! ఓ స్వామీ! నీతో మాకు గల సంబంధము పోగొట్టుకొన వీలుకాదు. లోక మర్యాద ఎరుగని పిల్లలము. ఇందుచే ప్రేమ వలన నిన్ను చిన్న పేరు పెట్టి పిలిచినాము. దానికి కోపము తెచ్చుకొని మమ్ములను అనుగ్రహింపక యుండకుము. మాకు అపేక్షితమగు పఱను ఒసంగుము. ఇరవై తొమ్మిదవ పాశురము: కైంకర్యము చేయడం మన ఆనందం కోసం కాదని, అది అతని ఆనందం కోసం మాత్రమే అని ఇక్కడ ఆమె ఒక ముఖ్యమైన సూత్రాన్ని వెల్లడిస్తుంది. ఇంకా, ఆమె కృష్ణానుభవముపై తనకున్న అగాఢ కోరిక కారణంగా, ఈ నోమును కేవలం తానొక సాకుగా ఆచరిస్తుందని ఆమె తెలిజేస్తుంచి. శిఱ్ఱమ్ శిఱుకాలే వన్దున్నై చ్చేవిత్తు ఉన్ ప్పొఱ్ఱామరై అడియే ప్పోఱ్ఱుమ్ పోరుళ్ కేళాయ్ పెఱ్ఱమ్మేయ్ త్తుణ్ణం కులత్తిల్ పిఱందు నీ కుఱ్ఱేవల్ ఎంగళై క్కొళ్ళామల్ పోగాదు ఇఱ్ఱై పఱై కొళ్వాన్ అన్ఱుకాణ్ గోవిందా ఎఱ్ఱైక్కుమ్ ఏళేల్ పిఱవిక్కుమ్ ఉన్దన్నోడు ఉఱ్ఱోమే యావోం ఉనక్కే నామ్ ఆట్చెయ్ వోమ్ మఱ్ఱైనమ్ కామంగళ్ మాఱ్ఱేలో రెమ్బావాయ్ బాగుగా తెల్లవారకమునుపే నీవున్నచోటికి మేము వచ్చి నిన్ను సేవించి, బంగారు తామరపూవుల వలె సుందరములు, స్పృహణీయములు అయిన చరణములకు మంగళము పాడుటకు ప్రయోజనమును వినుము. పశువులను మేపి, అవి మేసిన తరువాతనే తాము భుజించెడి గోపకులమున పుట్టిన నీవు మేము చేయు అంతరంగ కైంకర్యములను స్వీకరింపకుండుట తగదు. నేడు నీ నుండి పఱను పుచ్చుకొని పోవుటకు వచ్చినవారముకాము. ఏనాటికిని, ఏడేడు జన్మలకును నీతో విడరాని బంధుత్వము కలవారమే కావలెను. నీకే సేవలు చేయువారము కావలెను. మాకు ఇతరములైన కోరికలేవియూ లేకుండునట్లు చేయుము. ముప్పైయవ  పాశురము:  పరమాత్మ తన కోరికలను నెరవేరుస్తానని ఆశ్వాసమునిచ్చినందున, ఆమె పరమానందముతో  ఈ పాశురమును పాడింది. ఈ పాశురములను ఎవరు పాడినా, తాననుసరించినంత స్వచ్చమైన మనస్సుతో చేయక పోయినా ఆమె సాధించిన కైంకర్యము వారూ పొందుదురని ఆమె ధృవీకరించినది. మరో మాటలో చెప్పాలంటే, వ్రేవల్లెలో శ్రీ కృష్ణునితో సహ జీవనము చేసిన గొల్ల భామలకు అతనిపై ప్రగాఢ ప్రేముండేది. శ్రీవిల్లిపుత్తుర్లో అదే గోపికల మనోస్థితితో ఉన్న ఆండాళ్, ఈ పాశురములను నేర్చుకొని పాడిన వారెవరైన సరే అదే ప్రయోజనాన్ని పొందుతారు. దూడ చచ్చినా గడ్డితో నింపిన ఆ దూడ ప్రతిమను జూచి ఆవు పాలెలా ఇచ్చునో అలాగే పరమాత్మకు ప్రియమైన ఈ పాశురములు పాడిన వారికి పరమాత్మకు ప్రియమైన వారు పొందే ప్రయోజనము వారూ పొందుతారు అని భట్టర్ తెలియజేస్తున్నారు. క్షీర మహాసముద్రమును చిలికిన సంఘటనను వివరిస్తూ అండాళ్ ఈ ప్రబంధాన్ని ముగిస్తుంది. ఎందుకంటే, గోప బాలికలు పరమాత్మను పొందాలనుకున్నారు. పరమాత్మను పొందాలంటే పిరాట్టి యొక్క పురుషాకారము అవసరము. సముద్రము నుండి పిరాట్టిని పొంది వివాహమాడాలనే  ఉద్దేశ్యముతో పరమాత్మ సముద్ర మథనము చేసిరి.  కావున అండాళ్ కూడా ఈ సంఘటనను ప్రస్తావించి ఈ ప్రబంధాన్ని ముగిస్తుంది. ఆచార్యాభిమాన స్థితిలో ఉన్న  అండాళ్ భట్టర్పిరాన్ కోదై (పెరియాళ్వార్ కుమార్తె) అని చూపించి ఈ ప్రబంధాన్ని ముగిస్తుంది. వంగ క్కడల్ కడైన్ద మాదవనై కేశవనై తింగళ్ తిరుముగత్తు చ్చేయిళైయార్ శెన్నిరైంజి అంగ ప్పరై కొణ్డ వాఱ్ఱై అణి పుదువై పైంగమల త్తణ్ తెరియల్ పట్టర్ పిరాన్ కోదై శొన్న శంగ త్తమిళ్ మాలై ముప్పదుమ్ తప్పామే ఇంగు ప్పరిశురై ప్పార్ ఈరిరణ్డు మాల్వరై త్తోళ్ శెంగణ్ తిరుముగత్తు చ్చెల్వ త్తిరుమాలాల్ ఎంగుం తిరువరుళ్ పెఱ్ఱిన్బురువ రెమ్బావాయ్ ఓడలతో నిండియున్న క్షీర సముద్రమును మథింపజేసి లక్ష్మీ దేవిని పొంది మాధవుడైన వానిని, బ్రహ్మరుద్రులకు కూడా నిర్వహకుడైన వానిని ఆనాడు వ్రేపల్లెలో చంద్రముఖులగు వారును, విలక్షణాభరణములను దాల్చిన వారును అగు గోపికలు చేరి, మంగళము పాడి, cఱయను వాద్యమును  లోకుల కొరకును, భగద్దాస్యమును తమకొరకును పొందిరి. ఆ ప్రకారమునంతను, లోకమునకు ఆభరణమైయున్న శ్రీ విల్లిపుత్తూరులో అవతరించి, సర్వదా తామర పూసలమాలను మెడలో ధరించియుండు శ్రీ భట్టనాథుల పుత్రిక యగు గోదాదేవి ద్రావిడ భాషలో ముప్పది పాశురములతో మాలికగా కూర్చినది. ఎవరు ఈ ముప్పది పాశురములను క్రమము తప్ప కుండా చదువుదురో, వారు ఆనాడు గోపికలా శ్రీ కృష్ణుని నుండి పొందిన ఫలమును, గోదాదేవి వ్రతము నాచరించి పొందిన ఫలమును కూడా పొందుదురు. కేవలము అధ్యయనము చేయుటచేతనే, పుండరీకాక్షుడును, పర్వత శిఖరముల వంటి బాహు శిరస్సులు గలవాడును శ్రీవల్లభుడును, చతుర్భుజుడును అగు శ్రీమన్నారాయణుడే వారికి సర్వత్ర సర్వదా ఆనందమును ప్రసాదించును. అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2020/05/thiruppavai-pasurams-21-30-simple/ పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org ప్రమేయము (లక్ష్యము) – http://koyil.org ప్రమాణము (గ్రంథములు) – http://granthams.koyil.org ప్రమాత (పూర్వాచార్యులు) – http://acharyas.koyil.org శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment