ప్రమేయసారము 1

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ప్రమేయసారము

<< అవతారిక

acharya-sishya-instruction

 

అవతారిక

తిరుమంత్రములోని ప్రణవమనబడే “ఓం ” కారార్థాన్ని ఈ మొదటి  పాశురములో సంక్షిప్తంగా వివరించారు.

అవ్వానవర్కు మవ్వానవర్ ఎల్లాం

ఉవ్వానవరడిమై ఎన్ఱు ఉరైత్తార్

ఇవ్వాఱు కేట్టిరుపాఱుక్కు ఆళ్ ఎన్ఱు కణ్డిరుప్పార్ మీట్చియిల్లా

నాట్టిరుప్పార్ ఎన్ఱు ఇరుప్పన్ నాన్

 

ఫ్రతిపదార్థం:

అవ్వానవర్కు = “అ” కారవాచ్యుడైన  శ్రీమన్ నారాయణునికి

మవ్వానవర్ ఎల్లాం = సమిష్టిగా “మ” కారం ద్వారా సూచించబడే ఆత్మలన్నీ

అడిమై = సేవకులు అని

ఉవ్వానవర్ = ఆచార్యులు

ఉరైత్తార్ = చెప్పారు

ఇవ్వారు ఇమ్మురైగళ్= ఇలా చెప్పబడినవి

కేట్టు ఇరుప్పార్కు  = జాగ్రత్తగా తెలుసుకున్నవారికి

ఆళ్ ఎన్ఱు =సేవకులు అని

కణ్దిరుప్పార్ =  తమ స్థితిని తెలుసుకున్నవారికి

మీట్చియిల్లా = మరు జన్మ లేని

నాడు  = పరమపధములో

ఇరుప్పార్ ఎన్ఱు = నిత్యులు , ముక్తులు మొదలైన వారితో చేరి వుంటారని

నాన్ = శ్రీ రామానుజుల   దాసుడిని అయిన నేను

ఇరుప్పన్ = గట్టి విశ్వాసముతో ఉంటాను

వ్యాఖ్యానము:

అవ్వానవర్కు…..  శ్రీమన్నారాయణుడు ” అ ”  కార వాచ్యుడని  వేదాలలో చెప్పబడింది. పదానికి , అర్థానికి ఉన్న విడదీయరాని సంబంధమే ఇలా చెప్పడాంకి కారణము .  మహాకవి కాళిదాసు   “రఘువంశము”  లో వాక్కుకు  అర్థానికి వున్న సంబందాన్ని , శ్రీమన్నారాయణునికి శ్రీ మహాలక్ష్మికీ వున్న సంబంధముతో పోలుస్తూ

“వాగర్థా వివ సంపృక్తౌ శాగర్థ ప్రతిపత్తయే

జగతౌ పితరం వందే పార్వతిపరమేశ్వరం!!”

అని చెప్పాడు.  శబ్ధము అర్థాన్ని విడిచి వుండదు , అర్థము శబ్ధాన్ని విడిచి వుండదు. ఉప్పదనమనే గుణాన్ని బట్టే ‘ ఉప్పును ‘ ఉప్పు అని చెప్పినట్టుగా ఇక్కడ ‘ ఆ కారమంటే శ్రీమన్నారాయణుడు అని  చెప్పబడింది . భగవద్గీత పదవ అధ్యాయములో శ్రీ కృష్ణుడే ‘ అక్షరాణాం అకారోస్మి  ‘ అని చెప్పుకున్నాడు. ఇదే విషయాన్ని తిరువళ్ళువర్   “అగర ముదల ఎళుతెల్లాం ఆదిభగవన్ ముదఱ్ఱే ఉలగు” (లోకంలో అక్షరాలన్నింటీకీ ఆది ఆ భగవంతుడే మూలము)అన్నారు.

‘ అ ‘ అనే అక్షరము శ్రీమన్నారాయణుని తెలియజేస్తుంది. ‘ అవ రక్షణే ‘ అన్నదే దీనికి మూల ధాతువు.

అనగా రక్షించు అని అర్థము . శ్రీమన్నారాయణుడే అన్నింటికీ మూలము.  ‘ అ ‘ అంటే శ్రీమన్నారాయణుడని ,ఆయన మాత్రమే అని ఎందుకు అంటారో వేదంలో చక్కగా   వివరించబడింది. ఈ విషయం వేదాలలోనే  కాక , ఉపనిషత్తులలో, దివ్యప్రబంధాలలో , ఇతిహాసాలలో వివరంగా చెప్పబడింది. అన్నింటికీ , అంతటా వాడే కారణ  భూతుడుగా వున్నాడు. అలాగే అక్షరాలలో అన్నింటికీ ప్రాణము ‘ అ ‘ కారము.

‘పూ మగళ్ పొరుళుం ‘ అని కంబర్ బాలకాండం కడిమన పడలంలో చెప్పారు.  ఒకదానితో ఒకటి చేరి వున్న వాటిగురించి చెప్పెటప్పుడు ఒకదాని గురించి చెపితే  రెండవదాని అర్థము దానంతట అదే వస్తుంది.  అలాగే ‘ఆకారము గురించి చెప్పినప్పుడే దానికి కారణ భూతుడైన భగవంతుడు కూడా చెప్పబడినట్లే అవుతుంది. అవ్వానవర్క్అంటే భగవతుడికి అన్న అర్థం వస్తుంది.

మవ్వానవర్ ఎల్లాం: “మ” కారము సమస్త స్వరములకు మూలము. “మ” కారము జీవమున్న శబ్దమని శాస్త్రము చెపుతున్నది.  ఇది ఏకవచనమే అయినప్పటికీ వడ్ల గింజ వంటిది. జాత్యేక వాచకము. మూడు జాతులను తెలియ జేస్తుంది. 1. కర్మ వశమున మళ్ళీ మళ్ళీ పుడుతూ చస్తూ వుండే  బధ్ధులు , 2. భగవంతుడి నిర్హేతుక కృప వలన జనన మరణ చక్రము నుండి విడివడిన  ముక్తులు, 3. కర్మ వశమున జనన మరణ చక్రములో పడక నిత్యము భగవంతుడి కైంకర్యము చేసే నిత్యులు అని మూడు రకాల ఆత్మలను తెలియ జేస్తుంది. ఇక్కడ ‘ మవ్వానవర్ ఎల్లాం ‘అని 1.బధ్ధులు , 2.  ముక్తులు, 3.  నిత్యులు అని మూడు రకాల వారిని పేర్కొన్నారు.

ఉవ్వానవర్: ‘ ఉ ‘ కారము శ్రీమహాలక్ష్మికి, ఆచార్యులకు సంకేతముగా చెప్పబడింది . ఆమె  శ్రీమన్నారాయణుడికి , చేతనుడికి మధ్యలో వుండి ఇద్దరిని కలిపే ఘటికురాలు. అలాగే అచార్యులు కూడ భగవంతుడికి , చేతనుడికి మధ్యలో వుండి ఇద్దరిని కలిపే స్వభావము గల వాడు. శ్రీమహాలక్ష్మికి , ఆచార్యులకు వృత్తి రీత్యా ఐక్యత వుండటము వలన ఉకారము  ఆచార్యులకు సంకేతముగా చెప్పబడింది . ఆచార్యులు , శ్రీమహాలక్ష్మి  శ్రీపాదాలను చేరి భక్తి చేసి, ఆమె కృప వలన తన శిష్యులను ఆమె దగ్గరకు చేర్చి అమ్మవారి కృపకు పాత్రులను చేస్తారు. ఈ విధంగా ఆచార్యులను చేరిన చేతనులకు పరమాత్మ కృపకు పాత్రులవుతారు. పరమాత్మకు  సిఫారసు చేయటం ,అమ్మవారి కృపకు పాత్రులను చేయటం వలన ఆచార్యులు ‘ ఉ ‘ కార వాచ్యులుగా చెప్పబడ్డారు.

దీనికి సంబంధించిన ఒక సంఘటన చూస్తే విషయం సుబోధకంగా వుంటుంది. భగ్వద్రామానుజులు ఒకరోజు ఆనందంగా ఉన్నప్పుడు తన పక్కనే ఉన్న ప్రధాన శిష్యుడైన మొదలియాండాన్లకు ‘ఉ ‘ కారార్థాన్ని ఉపదేశించారు. దానిని మొదలియాండాన్లు తమ కుమారులైన కందాడై ఆండాన్లకు  ఉపదేశించారు. వారు భట్టరుకు చెప్పారు. భట్టరు ఆ విషయాన్నే ‘ప్రణవ సంగ్రహం ‘అనే గ్రంధంలో వివరించారు. అందులో చెప్పిన విధంగానే ఇక్కడ ‘ఉ ‘ కారము ఆచార్య వాచ్యంగా చెప్పబడింది. ఈ ‘ప్రమేయ సారం ‘  రాసిన అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్లు భగ్వద్రామానుజులకు దీర్ఘ కాలం కైంకర్యం చేసినవారు. అందు వలన వీరికి కూడా భగ్వద్రామానుజులు ‘ఉ ‘ కారార్థాన్ని ఉపదేశించి ఉండవచ్చు. భగ్వద్రామానుజుల ప్రియశిష్యులందరూ వారి ద్వారానే ‘ఉ ‘ కారార్థాన్ని తెలుసుకున్నారు.

అడిమై ఎన్ఱు ఉరైత్తార్ : జీవాత్మలు పరమాత్మకు దాసులు అని చెప్పబడింది. ఈ జీవ పర సంబంధాన్ని తెలిపేదే  ‘ఉ ‘ కారము. “అవ్వానవర్కు మవ్వానవర్ ఎల్లాం ఉవ్వానవర్ అడిమై ఎన్ఱు ఉరైత్తార్ ” ఆచార్యులు, యజమానికి -దాసుడికి ఉండే సంబంధాన్ని తెలిపారని అర్థము. తిరువాయిమొళి ఈడు వ్యాక్యానంలో చెప్పిన కథ ఇక్కడ చూడతగినది .

ఒక వ్యాపారి వివిధ ప్రాంతాలకు తిరిగి వ్యాపారం చేసేవాడు. అతని భార్య గర్భవతిగా ఉండగా అతను సముద్రం దాటి వెళ్ళి అక్కడ వ్యాపరం చేయవలసి వచ్చింది. వెళ్ళేటప్పుడు అతను భార్యతో ‘ నేను సముద్రం దాటి దూరప్రాంతాలకు  వ్యాపారం చేయడనికి వెళ్ళ్తున్నాను , పుట్టిన బిడ్డకు వ్యాపారం నేర్పించు ‘ అని చెప్పి వెళ్ళాడు. తరువాత ఆమె ప్రసవించింది. మగ పిల్లవాడు పుట్టాడు . క్రమంగా ఎదిగి వ్యాపార మెళకువలు నేర్చుకున్నాడు. అతను కూడా దేశాంతర వ్యాపారానికి బయలు దేరాల్సిన సమయం వచ్చింది. కదాచిత్తుగా అతను కూడా తండ్రి వెళ్ళిన దేశానికే వెళ్ళి , తండ్రి చేసిన వ్యాపారమే చేశాడు. ఒక రోజు తండ్రి కొడుకుల మధ్య వ్యాపార నిబంధనల మీద మాట పట్టింపు వచ్చి అది పెద్ద తగాదాగా మారింది. వాళ్ళ వాగ్వివాదాన్ని చూడడానికి ఊళ్ళోని వాళ్ళంతా వచ్చారు.  వాగ్వివాదం పెరిగి తీవ్రంగా సాగుతూ ఉంది. అంతలో అక్కడ కూడిన వారిలో వాళ్ళిద్దరిని తెలిసిన ముసలి వాడు కల్పించుకొని ‘ ఎందుకు అనవసరంగా పోట్లాడుతున్నారు? మీరిద్దరూ తండ్రికొడుకులు ‘ అని చెప్పి ఆ వాగ్వివాదాన్ని ఆపాడు. అప్పుడు వాళ్ళిద్దరి ఆనందానికి హద్దులు లేవు . ఎంతో సంతోషించారు. వాళ్ళ మధ్య సంబంధం కొత్తది కాదు .ఎప్పటినుంచో ఉన్నదే .అది తెలియక తలపడ్డారు తెలిసుకున్న తరువాత ఆనందించారు. ముసలి వాడు  కొత్తసంబంధాన్ని చెప్పలేదు ఉన్న సంబంధాన్నే తెలియజేసాడు. ఆ సంబంధాన్ని  తండ్రి కొడుకులు  తెలుసుకున్నారు.

ఆచార్యులు పరమాత్మను జీవాత్మను అనుసందానము చేసేవారు. అంతే కాక  ఆచార్యులు పరమాత్మ మాత్రమే తల్లి, తండ్రి బంధువు,సఖుడు , ఈ సంబంధము అనాది కాలంగా సాగుతున్నది ,ఎప్పటికీ విడదీయ లేనిది అని శిష్యులకు తెలియచెపుతారు . అలాగే పరమాత్మతో, ఈ జీవుడితో సంబంధము విడదీయలేనిదని , వాడి దోషాలన్నింటినీ మన్నించి కృప చూపి శ్రీపాదాల దగ్గరికి చేర్చుకోమని చెపుతారు. ఈ విధంగా అచార్యుల పురుషకారాన్ని ఈ పాశురంలో వివరంగా చెప్పారు.

ఇవ్వా~ౠ కేట్టిరుపార్కు : “అ” కార, “ఉ” కార  “మ” కారార్థములను ఆచార్య ముఖంగా  తెలుసుకొన్న వారు అని అర్థము. తిరుమంత్రంలో ఉన్న ‘ నారాయణ ‘ శబ్దాన్ని ‘  నార ‘, ‘ అయణ ‘ అని విడడదీసిగా చూస్తే ‘ నార ‘జీవాత్మలను,  ‘ అయణ ‘ నారాయణుని తెలియజేస్తాయి. ‘జీవాత్మ ఎప్పుడు  నారాయణునికి దాసుడని ఆచార్యులు బోధిస్తారు. ఆచార్య ముఖంగ ఇది తెలుసుకున్న వారు దానికి కట్టుబడి నడచుకుంటారు.

ఆళ్ ఎన్ఱు కండిరుప్పార్ : పైన చెప్పినట్లుగా ఉండే శిష్యులు అతి తక్కువగా ఉంటారు. అలాంటి వారిని ఆచార్యులు కూడా తమ సర్వశ్వంగ భావిస్తారు. శ్రీమన్నారాయణునికి కైంకర్యం చేయటం మొదటి మెట్టు కాగా , ఆయన దాసులకు చేసే కైంకర్యం చివరి మెట్టు కాబట్టి ఇక్కడ ‘ ఆళ్ ఎన్ఱు కండిరుప్పార్ ‘ అంటే భగవంతుని దాసులకు దాసులమని తెలుసుకున్న వారని అర్థము .

తిరుమంత్రములో జీవాత్మలకు మూడు లక్షణాలు చెప్పబడ్డయి. అవి 1. ఈ జీవాత్మలు పరమాత్మకు తప్ప వేరెవరికి దాసులు కావు. 2. జీవాత్మలకు పరమాత్మ తప్ప వేరె దిక్కు లేదు.3.  జీవాత్మలకు పరమాత్మ తప్ప వేరె ఆనందములేదు. ఇదే అంశాన్ని దాసుల  పరంగా చూస్తే  1. దాసులకు తప్ప వేరెవరికి దాసులు కారు. 2. జీవాత్మకు దాసులు  తప్ప వేరె దిక్కు లేదు.3.  జీవాత్మలకు దాసులు తప్ప వేరె ఆనందమ లేదు. అంటే దాసులకు దాసులమన్న భావన గల వారు అని అర్థము.

 మీట్చి యిల్లా నాట్టిరుప్పార్ ఎన్ఱు ఇరుపన్ నాన్ : ఇక్కడ ‘ నాన్ ‘ అన్న పదాన్ని నొక్కిచెపుతున్నారు. ఈ ప్రబంధమును  రాసిన  స్వామి అరుళాళ పెరుమాళ్ ఎంబెరు మానార్లు వేదములోని నిగూఢ విశేషములను తమ ఆచార్యులైన  స్వామి రామానుజుల ద్వరా తెలుసుకున్న వారు . అందువలన ఎవరైతే భగవంతుని దాసులకు దాసు​లుగా,​ వారికి మరల మరల పుట్టనవసరము లేని పరమపదము తప్పక లభిస్తుందని , వారు నిత్యసూరుల గొష్టిలో చేరి నిరంతరము భగవద్ కైంక​ర్య​ము చేసే భాగ్యమును పొందుతారని దృఢంగా విశ్వసించారు.

ఆడియెన్ చూడామణి రామానుజ దాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2015/12/prameya-saram-1/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

 

Leave a Comment