శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:
అవతారిక:
మధురకవి ఆళ్వార్లు కిందటి పాశురములో చెప్పుకున్న లోపాలను ఈ పాశురములో వివరిస్తున్నారని నంజీయరు అభిప్రాయ పడుతున్నారు. అవి ఏమిటంటే ఇతరుల భార్యలను, సంపదను కోరుతున్నాను, కాని నమ్మాళ్వార్ల నిర్హేతుకమైన కృప వలన నేను సంస్కరింపబడ్డాను. వారి అపారమైన కరుణకు సదా కృతఙుడనై ఉంటాను అని మధురకవి ఆళ్వార్లు చెప్పుకున్నారు.
నంపిళ్ళై మరియు పెరియవాచ్చాన్ పిళ్ళై ఈ పాశురములో మధురకవి ఆళ్వార్లు కిందటి పాశురములో చెప్పుకున్న లోపాలను నమ్మాళ్వార్లు ఎలా తొలగించి సంస్కరించారో వివరిస్తున్నారని అభిప్రాయ పడుతున్నారు.
అలగియ మణవాళ పెరుమళ్ నాయనారు కిందటి పాశురములో చెప్పుకున్న లోపాలను తెలుసుకొని ఎవరు వాటి నుండి బయట పడటానికి సహకరించారో తెలుపుతున్నారని చెపుతున్నారు. అన్నాదిగా నేను సంపదలమీద,భోగముల మీద కోరిక కలిగి వున్నాను. అది కూడా స్త్రీ వ్యామోహము అపారముగా గల వాడను.దానికోసం అపారమైన సంపదను కోరుకున్నాను. దానిద్వారా స్త్రీలను ఆకర్షించవచ్చని భావించాను. అలా ఎన్నో ప్రాంతాలు తిరుగుతూ బగారు గోడలు గల ఆళ్వార్తిరునగరి చేరాను. అప్పుడు నమ్మాళ్వార్లు నన్ను చూసి అనుగ్రహించారు. వారిచే ఆకర్షింపబడి, సంస్కరింపబడి, అక్కడే కైంకర్యము చేస్తూ ఉండి పోయాను. ఇదే నా ప్రస్తుత స్తితి అని అంటున్నారు మధురకవి ఆళ్వార్లు.
పాశురము-5
నంబినేన్ పిఱర్ నంపొరుళ్ తన్నైయుం
నంబినేన్ మడవారైయుం మున్నెలామ్
శెమ్బొన్మాడ,తిరుక్కురుగూర్ నమ్బిక్కు
అన్బనాయ్,అడియేన్ శదిర్తేనిన్ఱే
ప్రతిపదార్థము:
అడియేన్ = దాసుడు
మున్ బెల్లాం = గతములో
పిఱర్ = ఇతరుల
నంపొరుళ్ తన్నైయుం = సుగుణాలన్నీ
నంబినేన్ = కోరుకున్నాను (వాటిని)
మడవారైయుం = ఇతర స్త్రీలను
నంబినేన్ = కోరుకున్నాను (వారిని)
ఇన్ఱే = నేడు
సెంపొన్ మాడ = బంగారముతో నిర్మిపబడిన నగరాలు
తిరు కురుగూర్ నంబిక్కు = తిరు కురుగూర్ నాయకుడైన నమ్మళ్వార్ల
అన్ బనాయ్ = అభిమానినై
సతిర్ త్తేన్ = (వారి శ్రీ పాదములను) చేరుకున్నాను
ప్రతిపదార్థము:
దాసుడు గతంలో సంపదల కోసము, లౌకిక సుఖముల కోసము, ఇతర స్ర్తీల కోసము పాకులాడాను. కాని ఇప్పుడు కురుగూర్ లోని బంగారు మేడలను చూసిన తరువాత నమ్మాళ్వార్ల అనుగ్రహము వలన వాటన్నిటినీ త్యజించి కురుగూర్ నాయకుడైన నమ్మాళ్వార్ల శ్రీపాదములను ఆశ్రయించాను.
నంజీయర్ వ్యాఖ్యానము:
*పిఱర్ నన్ పొరుళ్ – “చోరేణ ఆత్మ బహాఱిణా” అన్నట్లు ఆత్మను దొగిలించాను అంటున్నారు. ఆత్మ, పరమాత్మకు చెంది నది. కాని చేతనులు ఆత్మను తమదిగా భావిస్తారు.
*“మడవార్” దేహ సౌఖ్యముల కోసము జార స్ర్రీల పట్ల ఆకర్షితుడినై తిరిగాను.
* ఇప్పుడు వాటన్నిటినీ వదిలి నమ్మాళ్వార్ల శ్రీపాదములను ఆశ్రయించాను.
నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానము:
*సామాన్యముగా పొరుళ్ అనగా ధనము. కాని ఇక్కడ ఆత్మ అని అర్థము. “కళ్వనేనానేన్” (దొంగనైతిని) అని తిరుమొళి 1.1.5 తిరుమంగై ఆళ్వార్ అన్నారు. తిరువాయిమొళిలో 5.1.4 “వంకళ్వన్”(గొప్ప దొంగ) అని నమ్మాళ్వార్లు అన్నారు. మధురకవులు కూడా అదే చెపుతున్నారు. జీవాత్మ, మొదట భగవంతుడికి, తరవాత నమ్మాళ్వార్లకు (ఆచార్యునికి)దాసుడు. మధురకవులు నమ్మాళ్వార్లకు (ఆచార్యునికి) దాసులు కానంత వరకు జీవాత్మను దొంగిలించినట్లు భావించారు. అందుకే తనను దొంగగా చెప్పుకున్నారు.
*పిఱర్-భగవంతుడి హృదయ పీఠము మీద సదా ఉండే కౌస్తుభ మణి జీవాత్మకు ప్రతీక. దానికి యజమాని భగవంతుడు. అటువంటీ గొప్ప వస్తువును దొంగిలించిన వాడికి కఠినమైన శిక్ష తప్పదు.
*భగవంతుడి సొమ్మునే అపహరించిన దొంగ ఎంతటి తెంపరి? వాడు పర స్త్రీలను కూడ అపహరించాడు.
*నంబి(గుణ పరి పూర్ణుడు)-ఇంతటి దుర్మార్గుడిని కూడా క్షమించి అనుగ్రహించిన నమ్మళ్వార్లు గుణ పరిపూర్ణుడు.
*నమ్మళ్వార్ల శిష్యుడిని కానప్పుడు దాసుడు చాలా నీచుడు. వారి కృప వలన ఉన్నత స్థాయికి చేరుకున్నాడు.
పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానము:
వీరి వ్యాఖ్యానము నంపిళ్ళై వ్యాఖ్యానమును పోలి వుంటూంది.
*నంపొరుళ్ అనగా ఆత్మ. పిఱర్ అనగా భగవంతుడు. నిత్యసూరులు, ముక్తాత్మలు, బధ్ధాత్మలు అన్ని మధురకవులకు ఇతరులే. గీతా శ్లోకములు 15.16, 15.17, మరియు 15.18 “ఉత్తమ పురుషుడు”గురించి చేప్పినట్లుగా ఇతర జీవాత్మలకంటే భిన్నమైనవాడు.
*మున్నెలాం అనగా ఎప్పటి నుండో ఇప్పటిదాకా అని అర్థము. ఈశ్వరుడు, ఆత్మ కూడా శాశ్వతమైనవి. కాలమునకు కూడా అచిత్ సంబంధం ఎక్కువగా లేదు. ఈ సంసారములోనికి మనము హఠాత్తుగా వచ్చి పడలేదు. అనాదిగా మనకు దీనితో సంబంధము ఉంది.
*నేను లౌకిక సుఖముల కోసము సంపన్నవంతమైన ఆళ్వార్ తిరునగరి చేరుకున్నారు. కాని నాకు అక్కడ “మానిధి” మహానిధి దొరికింది. తిరుక్కోళూర్ పెరుమాళ్ళు వైత్తమానిధి (పాతర పెట్టిన సంపద). ఆళ్వార్ తిరునగరిలో మధురకవి ఆళ్వా ర్ల, నమ్మాల్వార్ల శ్రీపాదములే “ వైత్తమానిధి.”
* ఇళైయ పెరుమాళ్ (లక్ష్మణులు) శ్రీ రామాయణం కిష్కింద కాణ్ద 4.12 లో “గుణైర్ దాస్యం ఉపాగత:”అన్నాడు (శ్రీరాముడి గుణములకు దాసుడనయ్యాను). మధురకవి ఆళ్వార్ ఇక్కడ “అడియేన్” అని నమ్మాళ్వార్ల గుణములకు దాసులయ్యారు.
అళగియ మణవాళ పెరుమళ్ నాయనార్ వ్యాఖ్యనము:
*“పరద్రవ్యాపహారం”, “పరధారాపహారం” ఘోరమైనవి. “ఆత్మాపహారం “ఘోరాతి ఘోరమనది. (భగవంతుడి సొత్తైన ఆత్మను తనది అనుకోవటము, స్వతంత్రుడిని అనుకోవటము)
*నంపొరుళ్ – విలక్షణ ద్రవ్యము – అచిత్ అనిత్యము, అనవరత వికారాస్పధము , అత్యంత హేయము, అఙ్ఞానము, అసుఖము, అభోగ్యము . చిత్ (జీవాత్మ ) నిత్యము , నిర్వికారము , అత్యంత విలక్షణము, స్వయం ప్రకాశమయము , సుఖమయము ,స్వభావతో భోగ్యము.
*పిఱర్ – అన్య –ఇతరులలో వున్నా వారితో కలసిపోని తత్వము. భగవంతుడు చిత్, అచిత్ లో వున్నా వాటి లోని లోపాలు, పాపాలు అంటని వాడు. అంర్యామిగా అన్నింటా వున్నా ఆయనను “అపహతపాప్మా” అంటారు.ఈ గుణములన్ని మధురకవి ఆళ్వార్లు, నమ్మాళ్వార్ల పాశురములలో విన్నారు.
*ఆత్మాపహారము అంటే స్వాతంత్రియము ప్రకటించుట. దేహాత్మాబిమానము అనగా దేహమునే ఆత్మగా భావించుట ఆనందించుట.
* ఆళ్వార్ తిరునగరికి వెళ్ళి, అష్టాక్షర సంసిధ్ధతను పొంది, తిరుమంత్రమును పొదుట వలన, నమ్మాళ్వార్ల సమక్షములో ఉండుట వలన , క్షత్రబంధు ఒక భాగవతుని సమీపములో ఉండటము వలన ఉన్నత గతిని పొందినట్లుగా నేను మా ఆచార్యుల సమీపములో ఉండటము వలన ఉన్నత గతిని పొంద గలను.
*తిరువాయిమొళి 6.5.1 “తువళిల్ మణి మాడం ఓంగు తులైవిల్లిమంగలం“ అని నమ్మాళ్వార్లు అన్నట్లుగా, మధురకవి ఆళ్వార్లు, ఆళ్వార్తిరునగరి “సెంపొన్ మాడం” నకు ఆకర్షితులయ్యారు.
*కిందటి పాశురములో “అన్నైయాయ్ అత్తనాయ్” అని“మాతా పితా” అనే అర్థములో చెప్పారు. ఈ పాశురములో “మడవార్ … సెంపొన్ మాడం”, “యువతయ:”, “విభూతి:” అనే ప్రయోగాలు నమ్మాళ్వార్ల విషయములొ ఆళవందార్ చెప్పిన “మాతా పితా” తనియను పోలి ఉన్నది.
*ఇన్ఱే – నమ్మాళ్వార్ల అనుగ్రహము వలన ఈ క్షణము నుండి మిగిలిన కర్మ వదిలి విరజను చేరి స్నానమాడీ పునీతుడనవుతాను. భగవంతుడు అంతర్యామిగా వున్నా ఈ సంసారము వదలటము లేదు. నమ్మాళ్వార్ల అనుగ్రహము వలన ఈ సంసారము నుండి విడివడ్డాను.
అడియేన్ చుడామణి రామానుజ దాసి
Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/01/kanninun-chiru-thambu-5-nambinen/
archived in http://divyaprabandham.koyil.org
pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://guruparamparai.wordpress.com
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org