కణ్ణినుణ్ శిరుత్తాంబు – అవతారిక

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

కణ్ణినుణ్ శిరుత్తాంబు

తనియన్

Nammazhwar-kanchi-3నమ్మాళ్వార్లకుకాంచీపురము

madhurakavi-2మధురకవి ఆళ్వార్ – తిరుక్కోళూర్

నంజీయర్ల అవతారిక

జీవాత్మకు, పురుషార్థము (లక్ష్యము) మూడు స్థాయిలలో వుంటుంది. ఉత్తమం, మధ్యమం ,అథమం. ఈశ్వర కైంకర్యము ఉత్తమమైనది. ఆత్మానుభవము మధ్యమమైనది. లౌకిక విషయ వాంఛలు అథమమైన లక్ష్యము. లౌకిక వాంఛలు తాత్కాలికం అల్ప ప్రయొజనములను ఇచ్చేవి. ఆత్మానుభవములో ఆనందము లభించినా భగవంతుడి గుణానుభవముతో పోలిస్తే అది కూడా అల్పముగానే ఉంటుంది. అందువలన భగవత్ గుణానుభవము, కైంకర్యము అందునా కృష్ణావతారము, బాల్య చేష్ఠితములు వ్రజభూమిలో వెన్నను దొంగిలించుట, యశోదచే కట్టబడుట, కొట్టబడుట ….ఇత్యాది చేష్ఠితములనుభవించుట ఉన్నతమైన లక్ష్యములు.

మధురకవి ఆళ్వార్లు, శ్రీవైష్ణవులైన వారందరికీ కృష్ణావతార చేష్ఠితములలో మునగటమే ఉన్నత లక్ష్యమని, అభ్యున్నతని నిశ్చయముగా తలచినవారు. వీరు శ్రీరాముడిని కూడా మరచి భరతుడికే శేషిగా ఉండిన శత్రుఘ్నుల వంటి వారు. నమ్మాళ్వార్లకు ఎంపెరుమాన్ యందు, శ్రీవైష్ణవుల యందు ఎటువంటి భావాలు, కోరికలు ఉండినవో అటువంటి భావాలు, కోరికలు మధురకవి ఆళ్వార్లకు, నమ్మాళ్వార్ల శ్రీపాదముల యందు వుండేవని ఈ ప్రబంధము వలన తెలుస్తున్నది.

నంపిళ్ళై అవతారిక

ఋషులు – ఐశ్వర్యము, కైవల్యము, భగవత్కైంకర్యము అనే పురుషార్థములన్నింటిపై దృష్ఠి సారించాలని శాస్త్రములు తెలుపుతున్నాయి. ఆళ్వార్లు భగవత్కైంకర్యము నందు మాత్రమే దృష్ఠిని సారించారు. మధురకవి ఆళ్వార్లు చరమ పర్వనిష్ఠ అయిన భాగవత శేషత్వముపై దృష్ఠిని నిలిపారు. నమ్మాళ్వార్ల ప్రబంధములలో తిరువాయ్ మొళిలోని (2.7) “పయిలుం శుడరొళి” పదిగము, (8.10) “నెడుమాఱ్కడిమై” పదిగములలో భాగవతశేషత్వము యొక్క ఔన్నత్యాన్ని మధురకవులు స్వీకరించారు.

శ్రీరామాయణములో కూడా ఈ విషయము స్పష్ఠముగా చెప్పబడింది. శ్రీరాముడు తల్లిదండ్రులు, గురువుల యందు సామాన్య ధర్మమును ఆచరించగా, లక్ష్మణస్వామి భగవత్కైంకర్యము మీద దృష్ఠి నిలపగా, భరతుడు భగవత్పారతంత్ర్యమును పాటించాడు. అది ఎలాగనగా, లక్ష్మణస్వామి, శ్రీరాముడి వెంట అడవికి వెళ్ళి కైంకర్యము చేయగా, భరతుడు శ్రీరాముడి ఆనతి  మేరకు రాజ్య భారమును వహించాడు. శతృఘ్నుడు భగవత్కైంకర్యము కంటే భాగవతకైంకర్యములోనే తరించినవాడు. భాగవతులు భగవంతునకు విత్తనం నుండి వచ్చిన మొదటి పంటలాగా ప్రీతి పాత్రులు. ప్రత్యక్షముగా భగవంతుడితో సంభాషించగలవారు. మధురకవులు, నమ్మాళ్వార్లనే ఈ విషయములలో ఆదర్శముగా తీసుకొని వారి అడుగుజాడలలోనే నడచిన వారు.

పెరియవాచ్చాన్ పిళ్ళై అవతారిక

నంపిళ్ళై అవతారికలో చెప్పిన విషయాలకు పెరియ వాచ్చాన్ పిళ్ళై మరికొన్ని అంశాలను జోడించారు. అవి భీష్ముడి వద్ద ధర్మ శాస్త్రమునకు సంబంధించిన ముఖ్య మైన విషయాలన్ని తెలుసుకున్న తరువాత, యుధిష్టరుడు , “అన్నింటిని మించిన ఉత్తమ ధర్మమేది?” అని ఒక ప్రశ్న వేశాడు. దానికి భీష్ముడు చిరునవ్వుతో శ్రీకృష్ణుని చూసి ,”ఆయనకు ఏది ఇష్ఠమో అది” అని సమాధానము చెప్పాడు. యుధిష్టరుడు కూడా దానినే ఆనందముగా అంగీకరించాడు. అలాగే శ్రీరామానుజుల శిష్యులైన త్రిపురా దేవిని ఒకరు,”శాస్త్ర ప్రమాణముల ఆధారముగా శ్రీమన్నారాయణుడే రక్షకుడని అంగీకరిస్తారా?” అని అడగగా ఆమె, “లేదు. శ్రీరామానుజులు ఈశాన్యదేవతైన రుద్రుడిని అంగీకరిస్తే మేము కూడా ఆ దేవతను అంగీకరిస్తాము?” అని బదులిచ్చింది. ( శ్రీరామానుజులు శాస్త్ర ప్రమాణములలో అత్యున్నత అధికారము గలవారు). అలాగే మధురకవులు, నమ్మాళ్వార్ల ఎడల తదీయ శేషత్వమును పాటించారు.

అళగియ మణవాళ పెరుమళ్ నాయనార్ అవతారిక

నాయనార్ పై అవతారికలను ఇంకా విస్తృతంగా వివరించారు. నమ్మాళ్వార్, మధురకవి ఆళ్వార్ల మధ్య భేధమును చాలా చక్కగా చూపించారు. నమ్మాళ్వార్ ప్రథమ పర్వ నిష్ఠకు ప్రతీక కాగా ,మధురకవి ఆళ్వార్ చరమ పర్వనిష్ఠకు ప్రతీకగా నిలిచారు.

నమ్మాళ్వార్ ప్రణవములోని “ఉ” కారార్థమును జీవాత్మ పరమాత్మకు మాత్రమే శేషభూతమనే అంశముపై దృష్ఠి నిలపగా, మధురకవి ఆళ్వార్ “ఉ” అనగా “నమ:” అని, అర్థాత్ జీవాత్మ భాగవతులకు మాత్రమే శేషభూతమనే అంశముపై దృష్ఠి నిలిపారు.

నమ్మాళ్వార్లను నాయనార్, అనన్య భోగత్వములో శ్రీమహాలక్ష్మితో పోల్చారు. కైంకర్య త్వరలో లక్ష్మణ స్వామితోనూ, సంసారులు కష్ఠ సాగరమును దాటుటకు చేసిన ఉపదేశములో ప్రహ్లాదుడితో పోల్చారు.

అలాగే మధురకవి ఆళ్వార్లను తదీయ పారతంత్ర్యయములో ఆణ్దాళ్ తో  ( ఆణ్దాళ్ పెరియాళ్వార్లకు పారతంత్రురాలయినట్లుగా), నిత్యసూరులలో శత్రుఘ్నుడితోను ( భాగవత పారతంత్ర్యయము), ముముక్షువులలో ఆళవందార్లతోను ( నమ్మాళ్వార్లే మాతా పితా అనే విశ్వాసము) పోల్చారు.

నాయనార్ వేదమును దివ్య ప్రబంధమును చక్కగా పోల్చారు. నాయనార్ వేదమును దివ్య ప్రబంధమును చక్కగా పోల్చారు. భగవద్గీతలో “త్రైగుణ్య విషయా వేదా:“ అని చెప్పినట్లుగా మూడు గుణముల వారికి విడివిడిగా, విస్తారముగా ఉపదేశించగా, నమ్మళ్వార్ల తిరువాయిమొళిలో 1102 పాశురములలో సుళువుగా సులభముగా ఎంపెరుమాన్ గుణములను వివరించారు. తిరువాయ్ మొళి వేద సారము కాగా, కణ్ణినుణ్ శిఱుతాంబు తిరువాయ్ మొళి సారము అని నాయనార్ చెప్పారు.

నాయనార్ ఇంకా ముముక్షువులకు ఇష్టమైనవారు నలుగురిని గురించి ప్రస్తావించారు. వారు సర్వేశ్వరుడు, (శ్రీమన్నారాయణుడు), శ్రీమహాలక్ష్మి, ఆచార్యులు, శ్రీవైష్ణవులు. సర్వేశ్వరుడు, జీవాత్మను సంసార క్లేశముల నుండి నిరంతరము రక్షించు వాడు. సర్వేశ్వరుడు, శ్రీ మహాలక్ష్మి, ఆచార్యులు, శ్రీవైష్ణవులు జీవాత్మను సంసార క్లేశముల నుండి నిరంతరము రక్షించు వారు. శ్రీమహాలక్ష్మి జీవాత్మలకు తల్లి. సర్వేశ్వరుడిని చేతనోధ్ధరణ చేయమని పరమపదములో నిత్య కైంకర్యప్రాప్తిని ప్రసాదించమని పురుషకారము చేస్తుంది. ఆచార్యులు అమ్మవారి యొక్క స్వామి యొక్క ఔన్నత్యాన్ని శాస్త్రములోని విధివిధానాలను చేతనుడికి తెలియజేస్తారు. శ్రీవైష్ణవులు భగవంతుడి మీద ప్రీతిని, భగవత్ విషయములో ఙ్ఞానాన్ని కలిగిస్తారు. గోష్ఠిలో ఉండి ఆచార్య నిష్ఠను పెంచుకోవటానికి సహకరిస్తారు. అంతేకాక లౌకిక విషయాలలో కొట్టుకుపోతున్న వారికి భగవంతుడి విషయములో కలిగే అనేక సందేహాలను నివృత్తి చేస్తారు. అందుకనే ఈ నలుగురిని శ్రుతి లో (తైత్తరీయ ఉపనిషద్ –శిక్షావల్లి)  “మాతృ దేవో భవ, పితృ దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిధి దేవో భవ“ అని చెప్పిబడినది. అతిధి అంటే సాధారణ అర్థము ఆగంతకుడు. అతిధిని ఎవరైనా సరే తప్పక ఆదరించాలి. అందునా శ్రీవైష్ణవులైన వారికి తప్పనిసరి. వచ్చిన వారి వివరములు అడగకుండానే భగవత్స్వరూపముగా భావించి ఆతిధ్యమివాలి. లేకుంటే పాపము మూటకట్టుకొవటమే కాక స్వరూప హాని కూడ జరుగుతుంది.

పైన చెప్పిన నలుగురిలోను ఆచార్యులది ప్రథమ స్థానము. అందువలననే మధురకవి ఆళ్వార్లు ఆచార్యుల ఔన్నత్యమును తెలిసినవారై తమ ఆచార్యులైన నమ్మాళ్వార్ల శ్రీపాదములనే ప్రపత్తి చేసారు. నమ్మాళ్వార్లనే కీర్తించారు. నమ్మాళ్వార్ల ప్రబంధములనే పాడుకున్నారు. నమ్మాళ్వార్లను తప్ప వేరెవరిని ఆశ్రయించనని చెప్పారు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

Source: https://divyaprabandham.koyil.org/index.php/2015/01/kanninun-chiru-thambu-introduction-avatharikai/

archived in https://divyaprabandham.koyil.org

pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org/
pramAthA (preceptors) – https://acharyas.koyil.org/
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

0 thoughts on “కణ్ణినుణ్ శిరుత్తాంబు – అవతారిక”

Leave a Comment