అమలనాదిపిరాన్

శ్రీ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమత్ వరవరమునయే నమ:
శ్రీ వానాచల మహామునయే నమ:

periyaperumal-thiruppanazhwarపెరియ పెరుమాళ్ తిరుప్పాణాళ్వార్)

తనియన్

ఆపాదచూడ మనుభూయ హరిం శయానం
మధ్యే కవేరతుహితర్ ముదితాంతరాత్మా|
అద్రష్టతాం నయనయోర్ విషయాంతరాణాం
యో నిశ్చికాయ మనవై మునివాహనం తం||

ప్రతిపదార్థము
కవేరదుహితు: = కావేరి నది
మధ్యే = మధ్యలో
ఆపాదచూడం = పాదములు మొదలు శిరస్సు దాకా
అనుభూయ = అనుభవించి
నయనయో: విషయాంతరాణాం అద్రష్టతాం = తమ కన్నులు(ఆ పెరుమాళ్ళను తప్ప)మరి వేటిని చూడాజాలక పోవుట
నిశ్చికాయ = కృపతో అనుగ్రహించిన
మునివాహనం = లోక సారంగ మునులను వాహనముగా చేసుకున్న తిరుప్పాణాళ్వార్లను
తం= అలాంటి
మనవై = స్మరిస్తున్నాను
భావము:

ఎవరైతే(తిరుప్పాణాళ్వార్) కావేరి మధ్యలో పాదములు మొదలు శిరస్సు దాకా అనుభవించి తమ కన్నులు(ఆ పెరుమాళ్ళను తప్ప) మరి వేటిని చూడాజాలక పోవుటతో కృపతో అనుగ్రహించిన లోక సారంగ మునులను వాహనముగా చేసుకున్న తిరుప్పాణాళ్వార్లను స్మరిస్తున్నాను.

పిళ్ళైలోకం జీయర్ అనుగ్రహించిన తనియన్ వ్యాఖ్యానము.

అవతారిక: (ఆపాదచూడం ఇత్యాది) ఇందులో “గరుడవాహనుడు నిలబడగా “అని, || “అంశిరైప్పుట్పాకనై యాన్ కండతు తెన్ అరంగత్తే” అని చెప్పినట్లు పెరియ పెరుమాళ్ ను కనులారా అనుభవించిన మునివాహనులను మనసులో స్మరించుట. గరుడవాహనత్వము, శేషశాయిత్వము, శ్రియ:పతిత్వము కలిగి సర్వశేషియైన సర్వాధిక వస్తువులకు లక్షణుడై, సర్వాధిక లక్షణ వస్తువులను సక్రమముగా అనుభవించునట్లు చెప్పుట.

వ్యాఖ్యానము:

(ఆపాదచూడం) పాదాది కేశ పర్యంతము (అనుభూయ) అమలనాదిపిరానుని అనుభవించుట.(హరిం శయానం) “శ్రీమాన్ సుక సుప్తహ:” అన్నట్లు శయనించి యుండుట. అలాగే వుండి లోపలి అసురులందరిని సంహరించినది వీరే “హరతీతి హరి:” అనుకూలుల మనస్సులను ప్రతికూలుల ప్రాణములను హరించువాడు. అనుకూలుని “దృష్ఠి చిత్తాపహారం చేయునట్లు “కిడందదోర్ కిడకై కండు ఎడ్రుం మరందు వాళ్గేన్” ‘ఏరార్ కోలం తికళ్ కిడందాయ్ కండేన్” అన్నట్లుగా తాపహరుడైన వాడు .ఆయనే ‘అరవినణై మిశై మేయమాయనారాన ముగిల్ వణ్ణనిరే.” ఇలా అనుకూల ప్రతికూల రక్షణ శిక్షణలను చేయువాడిని

(కవేరదుహితుర్మద్యే) కావేరి మద్యేలో .”గంగ పునీతమైన కావేరి మధ్యలో అడవి ఉన్నది. “వణ్ణ పొన్ని, తిరుకైయ్యాల వరుడ, తిరు వాళనినితాక వా య్తు, తిరు కణ్గల్ వళరుగిన్ఱదు.)

తిరుమల నంబి అనుగ్రహించిన తనియన్

కాట్టవేకండ పాదకమల నల్లాడైయుంది
తేట్టరు ముదరబంద తిరుమార్వు కండచ్చెవాయ్
వాట్టమిల్ కణ్గళ్ మేని ముని యేరి తని పుగుందు
పాట్టినాల్ కండు వాళుం పాణర్ తాళ్ పరవినోమే

.
ప్రతి పదార్థము
ముని యేరి = లోకసారంగమునుల భుజములపై ఎక్కి
తని పుగుందు = ఒంటరిగా లోపలికి వెళ్ళి
కాట్టవే కండ = ఆ ముని చూపినట్టు చూసి సేవించుకున్న
పాదకమలం = కమలముల వంటి శ్రీపాదములు
నల్లాడై = ఉన్నతమైన పీతాంబరము
యుంది = నాభియు
తేట్టరుం = అపురూపమైన
ఉదరబందం = బంగరు మొలత్రాడు
తిరుమార్వు = శ్రీ మహాలక్ష్మి నివసించే హృదయము
కండం =కంఠము
చ్చెవాయుం = ఎర్రని నోరు
వాట్టమిల్ = అలుపులేని
కణ్గళ్ = కన్నులు (వీటన్నింటితో కూడిన)
తిరు మేని = సుందరమైన దేహము
పాట్టినాల్ కండు వాళుం = పాశురమును అనుసంధానము చేస్తూ సేవించి ఆనందించే
తాళ్ = శ్రీపాదములను
పరవినోమే = ఆశ్రయించాము
భావము:

లోకసారంగమును భుజములపై ఎక్కి ఒంటరిగా లోపలికి వెళ్ళి ఆ ముని చూపినట్టు చూసి సేవించుకున్న కమలముల వంటి శ్రీపాదము, ఉన్నతమైన పీతాంబరము , నాభియు, అపురూపమైన బంగరు మొలత్రాడు, శ్రీమహాలక్ష్మి నివసించే హృదయము కంఠము, ఎర్రని నోరు, అలుపులేని కన్నులు, (వీటన్నింటితో కూడిన)సుందరమైన దేహమును పాశురమును అనుసంధానము చేస్తూ సేవించి ఆనందించే తిరుప్పాణాళ్వార్ శ్రీపాదములను ఆశ్రయించాము

అమల నాదిపిరా నడియార్కెన్నై యాట్పడుత్త
విమలన్ విణ్ణవర్ కోన్విరై యార్పొళిల్ వేంగడవన్
నిమలన్ నిన్మలన్ నీదివానవన్ నీళ్మదిళ్ అరగత్తమ్మాన్ తిరు
క్కమలపాదం వందెన్ కణ్ణినుళ్ వొక్కిన్ఱతే (1)

అమలన్ = పరిశుధ్ధమైన
ఆది = జగత్కారణుడైన
పిరాన్ = ఉపకారకుడై
ఎన్నై = నన్ను(కడ జాతి వాడైన)
అడియార్కు = తన దాసులైన భాగవతులకు
యాట్పడుత్త = చూపించుటవలన
విమలన్ = ఔన్నత్యము కలవాడు
విణ్ణవర్ కోన్ = నిత్యసూరులకు నాయకుడైనా
(దాసులకోసము)
విరై యార్పొళిల్ =సువాసనలు వెదజల్లు తోటలుగల
వేంగడవన్ = తిరుమలలో నిత్య నివాసము చేయువాడు
నిమలన్ = ఆశ్రిత పారతంత్ర్యము గలవాడు
నిన్మలన్ = దాసుల తప్పులను చూచు దోష గుణము లేని వాత్సల్య రూపుడు
నీదివానవన్ = శేషి శేష సంబంధము చెడకుండా న్యాయమును చెప్ప గలవాడు
నీళ్మదిళ్ = ఉన్నతమైన ప్రాకారములు గల
అరగత్తు = శ్రీరంగములో(శేషసాయి అయిన)
అమ్మాన్ = స్వామి అయిన శ్రీరంగనాథుడు
తిరు క్కమలపాదం = శ్రీపాదములు
వంతు = వచ్చి
ఎన్ కణ్ణినుళ్ = నాకన్నులలో
వొక్కిన్ఱతే = స్థిరముగా నిలిచినవి

ఈ పాశురములో శ్రీరంగనాథుని శ్రీపాదముల అందము తన మీద పడి పరవశింప చేసినట్లుగా తిరుప్పాణాళ్వార్ చెపుతున్నారు. అమలన్, విమలన్. నిమలన్. నిన్మలన్ అనే నాలుగు శబ్దాలకు అర్థము ఒకటే అయినా తాత్పర్య భేధమును గ్రహించవలసి ఉన్నది. పరమహీనమైన తాను సన్నిధిలోకి ప్రవేశించటము చేత పెరుమాళ్ళకు అవధ్యము జరుగుతుందేమేనని సందేహిస్తున్నారు. ఆ అవధ్యమును తొలగించువాడు కనుక అమలన్ అంటున్నారు. హేయప్రతిపటుడు – అనగా హేయవస్తు సంబంధము వలన తనకు ఎటువంటి కీడు జరగకుండా చేసుకోగల వాడు అని భావము.

దాసుడి హైన్యమును లెక్కచేయకుండా తనను భాగవతులకు చూపి ఒక గొప్ప వస్తువులాగా చేయుట వలన పెరుమాళ్ తిరుమేనిలో ఒక విలక్షణ తేజస్సును అనుభవించువారు ‘విమలన్’ అంటున్నారు పాణర్. తనదైన ఒక వస్తువు గుర్తింపు పొందితే స్వామి యొక్క తిరుమేని ప్రకాశిస్తుంది కదా!

బ్రహ్మరుద్రాది దేవతలే దరిచేరడానికి జంకే ఐశ్వర్య సమృధ్ధి వుండి కూడా కురువరత్తినంబికి నిత్య సంశ్లేషమునునిచ్చి తన ఈశ్వరత్వమైన “ఆశ్రయణ విరోధి దోషమును” దాచి….”అర్చక పరాధీనాఖిలాత్మస్థితి:” అన్నట్లు దాసులకు సులభుడైన గుణమును బహిర్పచినవాడు నిమలన్ కాన అంటున్నారు. ఇక నిన్మలన్ అనగా దాసుల దోషములను చూచుట అనే దోషము లేనివాడు. ఒకవేళ చూసినా వాటిని భోగ్యములుగా స్వీకరిస్తాడు.

మొదటి పాదములో , ఆది అన్నపదానికి వ్యాఖ్యానము చేస్తూ వేదాంతదేశికులు “ఈ కారణత్వము మోక్షప్రదత్వము ఛత్ర చామరముల లాగా సర్వలోక శరణ్యునుకి విశేష చిహ్నములు” అన్నారు. జగత్ కారణత్వము మోక్షప్రదత్వములో అమ్మవారికి కూడ అన్వయము కలదు.

లోకసారంగముని భుజములమీద ఎక్కిన తిరుప్పాణర్ శేషిత్వమును ప్రశంసించారే తప్ప శేషత్వమును గురించి చెప్పలేదు కాని “అడియార్కెన్నైఆడ్పడుత్త విమలన్” అన్నారే అన్న శంఖ కలగవచ్చు. శేషత్వమునకు అర్హమై శ్రీపాదముల వద్ద వుండవలసిన తులసి శిరస్సునధిరోహించటము వలన దాని శేషత్వమునకు లోటేమీ లేదు కదా! అదే విధముగా ఇక్కడ స్వీకరించవలసి వుంది.

పిళ్ళై తిరునరైయూర్ నంబిని కొందరు “ శ్రీరంగనాథుని అనుభవించ వలసిన వీరు తిరువేంకటాచలపతి పక్కకు పోనేల?” అని ప్రశ్నించారట. దానికి వారు, “ఏటిలో దిగినవాడు ప్రవాహములో కొట్టుకు పోకుండా ఒక కాలును నీటి అడుగున నేలమీద తాటించినట్లుగా పాణర్ శ్రీరంగనాథుని సౌందర్య ప్రవాహములో కొట్టుకు పోకుండా ఒక కాలును తిరువేంకటాచలము మీద మోపారు” అన్నారట.

“ఒకరి గురించి కవిత్వము చెప్పే సమయములో వీరి చరిత్రని చెప్పవలసి వుంది. పరమపదములో వుండి మధురాపురిలో అవతరించి, గోకులమునకు వచ్చినట్టుగా శ్రీవైకుంఠము నుండి తిరుమలలో నిలిచి శ్రీరంగమునకు వచ్చిన చరిత్ర చెప్పనట్లుగాను స్వీకరించవచ్చు.

ఉవంద ఉళ్ళత్తినాయ్ ఉలగం అళందండం ఉఱ్
నివంద నీళ్ముడియన్ అన్ఱు నేరంద నిశాశరరై
కవరంద వెంగణై క్కాగుత్తన్ కడియార్ పొళిల్ అరంగత్తమ్మాన్ అరై
చ్చివంద ఆడైయిన్ మేల్ శెన్ఱదాం శిందనైయే (2)

ప్రతి పదార్థము:
ఉవంద ఉళ్ళత్తినాయ్ = ఆనంద ప్రదమైన హృదయము కలవాడై
ఉలగం అళందు = ముల్లోకములను కొలిచి
అండం ఉఱ్ = బ్రహ్మాండము దాకా త్రావి
నివంద = ఉన్నతిని పొందిన
నీళ్ముడియన్ = నిడుపాటి శిఖ గలవాడు
అన్ఱు = ఆ కాలములో
నేర్ద = ఎదురు నిలిచిన
నిశాశరరై = రాక్షసులను
కవర్దద = సంహరించిన
వెంగణై = ఉన్నతమైన శరములు కలవాడైన
క్కాగుత్తన్ = శ్రీరాముడు
కడియార్ = పరిమళములు వెదజల్లు
పొళిల్ = వనములు గల
అరంగత్తు = శ్రీరంగములో వేంచేసి వున్న
అమ్మాన్ = ఎంపిరాన్ నుని(శ్రీ రంగనాథుని)
అరై = గర్భ గృహములో
చ్చివంద ఆడైయిన్ మేల్ = స్వామి ధరించిన పీతాంబరము మీద
శిందనైయే = నా మనసు
శెన్ఱదాం = నిలిచింది
భావము:

క్రిందటి పాశురంలో “తిరు క్కమలపాదం వందు” అన్నది, ఈ పాశురంలో “ఆడైయిన్ మేల్ శెండ్రదామెన శిందనై” అన్నవి కలిపి చూడవలసి ఉంది. మొదట పెరుమాళ్ తానుగా ఆళ్వార్లను దాసునిగా చేసుకోవాలని మీద పడినట్టు పిదప ఆళ్వార్లు రుచి తెలిసి తానే పెరుమాళ్ళ మీద పడినట్టు ద్యోతకమవుతున్నది. ఈనిన ఆవు మొదట తన బిడ్డకు పాల రుచి తెలియనందు వలన తనే సిరను దూడ నోటిలో పెడుతుంది. రుచి తెలిసిన తరువాత దూడ తల్లి వెనక పడి పోతుంది. అదే విధముగా స్వామి శ్రీ పాదములు తానుగా వచ్చి తన కన్నులలో పడినట్టు మొదటి పాశురంలో చెప్పగా ఏ పాశురంలో తన మనసు రుచి తెలిసి ఆయన మీద పడ్డట్టుగా చెపుతున్నారు.

ముల్లోకములను కొలిచిన చరిత్ర :

మహాబలి అనే రాక్షసుడు తన బలముతో, ఇంద్రాది దేవతలను జయించిన గర్వముతో రాజ్యమేలు చుండగా, రాజ్యము పోగొట్టుకున్న దేవతలు స్వామిని శరణాగతి చేసి ప్రార్థించగా , అతిధి కశ్యపుల కుమారుడై వామనుడిగా అవతరించి బ్రాహ్మణ వటువుగా మహాబలి వద్దకు వెళ్ళి, ఇవ్వటమేగాని అడగటమే ఎరగని స్వామి తాను తపము చేయటము కోసము తన పాదములతో మూడడుగుల నేలను యాచించటము,

దానముగా పొందిన వెంటనే త్రివిక్రముడుగా ఎదుగుట:

ఒక పాదముతో ఆకాశము, మరొక పాదముతో భూలోకమును కొలిచి దానముగా పొందిన మూడవ అడుగు పెట్టడానికి చోటేదని అడుగగా ఆ బలి తన శిరస్సు మీద పెట్టమని కోరాడు. అలాగే శిరస్సు మీద పెట్టి అతనిని పాతాళమునకు నెట్టి గర్వ భంగము చేశారని చరిత్ర. అలా భూలోకమును కొలిచిన సమయములో భూమి కింద వున్న పాతాళము కూడా కొలవటము వలన ఆయన సర్వలోక శరణ్యుడు. దుష్థుల గర్వమణచటమే కాక శిష్టులను సదా శరణ్యులను చేసుకునే తంత్రము తెలిసిన వాడని ఈ చరిత్ర వలన తెలుస్తున్నది.

“ఉవంద వుళ్ళత్తినై..”అన్న ప్రయోగముతో లోకమును కొలిచే సమయములో తన భక్తులనే కాక విరక్తులను కూడా సమానముగా చూసి అందరి పైన తన శ్రీపాదములనుంచు తున్నానని పెరుమాళ్ హృదయము పొంగి పోయిందని ఆళ్వార్ల భావన

నిశాశరర్-రాత్రులలో తిరిగేవాడు

కాకుత్తన్-కకుస్థుడని ప్రసిద్ది గాంచిన రాజవంశములో జన్మించినవాడు (శ్రీరాముడు)ఎద్దు రూపములో నున్న ఇంద్రుడిమీద ఎక్కి యుద్దము చేయటము వలన ఈ వంశము వారికి ఈ పేరు వచ్చింది.(కకుత్-ఎద్దు,స్తన్-ఉండువాడు)

నిమిర్ద్ నీణ్ముడియన్- అనేది మూలము

మందిప్పాయ్ వడవేంగడ మామలై వానవర్గళ్
సందిశెయ్య నిన్ఱాన్ అరంగత్తరవిన్ అణైయాన్
అంది పోల్ నిఱై త్తాడైయుం అదన్ మేల్ అయనై ప్పడైత్తదోర్ ఎళిల్
ఉంది మేలదన్ఱో అడియేన్ ఉళ్ళత్తిన్ ఉయిరే (3)

ప్రతి పదార్థము:
మంది = వానర జాతి అయిన
ప్పాయ్ = తావు(ఒక కొమ్మనుండి మరొక కొమ్మకు దుముకుట)
వడవేంగడ మామలై = ఉత్తరాన ఉన్న తిరుమల (శ్రీ రంగమునకు తిరుమల ఉత్తరాన ఉంటుంది)
వానవర్గళ్ = నిత్యసూరులు
శందిశెయ్య నిన్ఱాన్ = పూవులతో ఆరాధనము చేస్తూ నిలబడిన
అరంగత్తు = కోవెలలో(శ్రీ రంగములో)
అరవిన్ అణైయాన్ = శ్రీ అనంతళ్వానైన ఆది శేషునిపై సుఖముగా పవళించిన అళగియ మణవాళుడనబడే శ్రీరంగనాథుని
అంది పోల్ నిఱైత్తాడైయుం = ఎర్రని ఆకాశాము వంటి పీతాంబరమును
అదన్ మేల్ = ఆ పీతాంబరము మీద
అయనై ప్పడైత్తదోర్ ఎళిల్ ఉంది మేలదన్ఱో = బ్రహ్మను సృజించిన అందమైన నాభి కమలమును
అడియేన్ ఉళ్ళత్తిన్ ఉయిరే = నా మనసులో రూపుకట్టిన తీయనైన ఆత్మ స్వరూపమును
భావము:

“అడియేన్ ఉళ్ళత్తిన్ ఉయిరుంది మేలదన్ఱో”అని ఇక్కడ వానరములను చెప్పుట చపలచిత్తులైన సంసారులకు సంకేతము. “నిన్నవానిలా నెంజినై ఉడైయారాయి ఒన్రై విట్టు ఒన్రై పట్రికర క్షాత్రబల కామికళా”న ( నిలచిన చోటనిలవని, ఒకదానిని వదిలి మరొకదానిని పట్టే) సంసారులకు వానరములే చక్కటి నిదర్శనము.

పరమపదములో కైంకర్య సామ్రాజ్యమునకు పట్టాబిషుక్తులైన ముక్తులు, నిత్యులు, దేశోచితమైన దేహములను పరిగ్రహించి తిరుమలకు వచ్చి కైంకర్యము చేయగా, వాటి పెంపుగా అక్కడ నిత్య సన్నిహితులుగా వుండే శ్రీరంగనాథుని పీతాంబరము మీద నాభికమలము మీద నా మనసు నిలిచిందని భావము.

“వడ వేంగడమాలై నిన్రాన్” అనగా మనవంటి వారికి పరమపదముతో సమానమైన తిరుమలకు దీక్షతో వెళ్ళాలి కదా…. ఎంత కష్టం ..అనుకోగానే, “అరంగత్తరవినణైయాన్” అని సౌలభ్యమును చెప్పారు.

“అందిపోల్ నిరం” అనగా దాసుల అఙ్ఞానమును పొగొట్టి ఙ్ఞానమునొసగు సూర్యోదయమైన పూర్వ సంధ్యను సంకేతముగా, తెలిపారు. వారి తాపత్రయమును పోగొట్టుటకు పూర్వ సంధ్యలాగా నిలిచారని భావము.

మొదటి పాశురంలో “ఆది”అనే పదము ద్వారా తెలిపిన పరమాత్మయొక్క జగత్కారణత్వమును ఈ పాటలో స్థిరపరుస్తున్నారు.

“త్రయోదేవా స్తుల్యా, త్రితయ మితమత్వైతమతికం

త్రికాతస్మాత్ తత్వం పరమితి వితర్కాన్ వికటయన్
విభోర్నాభిపద్మో విధిసివ నిధానం భగవత
తతన్యత్ భ్రూబంగీపరవతితి సిధ్ధాంతయతి న”
అనే శ్రీరంగరాజస్తవ సూక్తిని ఇక్కడ అనుసంధానము చేసుకోవాలి.

“సంధి శెయ్యనిన్రాన్” అనే ప్రయోగానికి ఆరాధనమని గ్రహించాలి ఎందుకంటే “సంధి” అనగా సంధ్యావందనము అనే వాడుక వున్నది. శ్రీ భగవదాఙ్ఞ భగవత్ కైంకర్యరూపమైనది. దానిని “లక్ష్మీతలక్ష్మణై” లాగా గ్రహించాలి.

శదుర మామదిళ్ శూళ్ ఇలంగైక్కిరైవన్ తలైప
త్తుదిర ఓట్టి ఓర్ వెంగణనై ఉయ్తవన్ ఓద వణ్ణన్
మదుర మావండు పాడ మా మయిలాడ అరంగత్తమ్మాన్ తిరు వయ
ఱ్ఱుదర బందం ఎన్ ఉళ్ళత్తుళ్ నిన్ఱులాగిన్ఱదే (4)

ప్రతిపధార్థము
శదురం = చతురముగా
మా = ఉన్నతమైన
మదిళ్ శూళ్ = భవనములతో ఒప్పుతున్న
ఇలంగైక్కు = లంకకు
క్కిరైవన్ = అధిపతి అయిన రావణాసురుని
ఓట్టి = మొదటి దినముననే యుధ్ధములో ఓడి పరుగులు తీయునట్లు చేసిన
(మరుసటి దినము)
తలైపత్తు = పది తలలను
ఉదిర = రాలి పడునట్లు
ఓర్ = అనుపమానమైన
వెంగణనై = వాడి అయిన అస్త్రమును
ఉయ్త్తవన్ = ప్రయోగించినవాడు
ఓదం వణ్ణన్ = సముద్రపు(నీలి,చల్లని)రంగు గలవాడును
వండు = తేనెటీగలు
పాడ = పాడగా
(దానికి తగినట్లుగా)
మా మయిలాడ = ఉన్నతమైన (అందమైన)నెమళ్ళు నాట్యమాడగా
అరంగత్తమ్మాన్ = శ్రీరంగములో వేంచేసియుండు శ్రీరంగనాథుడు
తిరువయఱ్ఱుదర బందం = ఉదర బంధములాగా ధరియించివున్న దివ్యమైన మొలత్రాడు
ఎన్ ఉళ్ళత్తుళ్ నిన్ఱు = నా మనసులో స్థిరముగా నిలిచి
ఉలాగిన్ఱదు = విహరిస్తున్నది(మనసంతా నిండినది).
భావము:

కులపర్వతములన్నిటిని ఒక్క చోట చేర్చినట్టుగా అందము, ధృడత్వము కలిగియుండి, అష్టదిగ్పాలకులు కూడా ఏరిపార చూడలేని బ్రహ్మాండములైన భవనములతో ఒప్పారుతున్న లంకకు అధిపతి అయిన రావణుని

మొదటి దినముననే యుధ్ధములో “చచాల చాపలచ్య ముమోచవీర:” అన్నట్టు ఓడి అలసి పోయి, విల్లు కూడా విరిగిపోగా ఏమీ చేయలేని దీనస్థితిలో వుండగా అతనిని మీద దయతో “నాయనా ఈదినము చాలా అలసి పోయావు, ఇప్పుడు నిన్ను ఒక్క క్షణములో సంహరించవచ్చు, కాని అది ధర్మము కాదు” అని వదిలి వేసెను. “ఈ దినము వెళ్ళి రేపు రా” అని చెప్పి పంపి, మరుసటి దినమున వాడు బలము కూడదీసుకుని వచ్చి నిలబడగా బ్రహ్మాస్త్రమును ప్రయోగించి వాడి పది తలలను త్రుంచివేసిన చరిత్ర మొదటి రెండు పాదాలలో చెప్పబడింది.

“ఓట్టి”(తరిమి) అనే పదానికి రావణుని తరిమి అన్న అర్థము తీసుకోవచ్చు, ఓర్ వెంగణనై(అనుపమానమైన వాడి అయిన అస్త్రమును ప్రయోగించిన)అని కూడ గ్రహించవచ్చు.

“ఓద వణ్ణన్”-చూసిన వారి పాపములను, తాపములను పోగొట్టగల సముద్రవర్ణుడైన వాడు. “తిరువయిరు, ఉదరం” అని ఒకే అర్థమునిచ్చు ద్రావిడ, సంస్కృత పదాలకు పునరుక్తి దోషము స్వీకరించరాదు.”ఉదర బంధం”అనేది మొలత్రాడుకు పేరు. అది శ్రీరంగనాథుని ఉన్నతమైన ఉదరమును చుట్టుకొని ఉన్నదని “తిరువయిరు” ప్రయోగమును గ్రహించాలి.

“తిరువయిత్రుదరబందం”అని కూడా పాఠము కలదు.

పారం ఆయ పళవినై పఱ్ఱఱుత్తు ఎన్నై త్తన్
వారం ఆక్కి వైత్తాన్ వైత్తానన్ఱి ఎన్నుళ్ పుగుందాన్
కోర మాదవం శెయ్తనన్ కోల్ అఱియేన్ అరంగత్తమ్మాన్ తిరు
ఆర మార్వదన్ఱో అడియేనై ఆట్కొడదే (5)

ప్రతిపదార్థము:
పారం ఆయ = భరించరానంత బరువైన
పళవినై = అనాది పాపముల
పఱ్ఱఱుత్తు = సంబంధమును త్రెంచి
ఎన్నై = (పాప విమోచనముపొందిన)దాసుడిని
త్తన్ వాతం ఆక్కి వైత్తాన్ = తన భక్తునిగా చేసాడు
వైత్తానన్ఱి = ఇంతే కాక
ఎన్నుళ్ పుగుందాన్ = నా హృదయములో ప్రవేశించాడు
(ఇంత గొప్ప భాగ్యమును పొందిన దాసుడు)
కోర మాదవం = ఉగ్రమైన తపస్సు
శెయ్తనన్ కోల్ = (పూర్వ జన్మలో)చేసానేమో
అఱియేన్ = తెలియను
అరంగత్తమ్మాన్ = శ్రీరంగనాథుడైన
తిరుఅరం = శ్రీమహాలక్ష్మిని, ముక్తహారములను కలిగియున్న
మార్పు అదన్ఱో = హృదయము కాదా
అడియేనై = దాసుడిని
ఆట్కొడదే = దాసాను దాసునిగా చేసుకున్నది
భావము:

దాసుల పక్షము ఉండి కాపాడే శ్రీదేవియు, సర్వరక్షకత్వమును ప్రకటించే హారములు కలిగివున్న విశాల హృదయము యొక్క సౌదర్యమును నన్ను వశపరచుకున్నవని చెపుతున్నారు.

కాల ప్రమాణమున్నంతవరకు ప్రాయిశ్చిత్తము చేసినా తీరని నా తొలి పాపాములను సమూలముగా త్రెంచివేసి నన్ను నిష్కళంకునిగా చేసి తన పక్షపాతిగా చేసుకోవటముతో ఆగక , ఇంత కాలముగా పాపములకు ఆలవాలముగా వున్న నా గళ సీమనుండి ఆ పాపములను తొలగించి తన నివాసస్థానముగా చేసుకున్న ఘనుడు ఆ శ్రీరంగనాథుడని మొదటి పాదములో చెప్పారు.

“కల్లుం కనైకడలుం వైకుందవానోడుం, పుల్లెండ్రొళింతనకొల్ ఏపావం-వెల్ల నెడియన్ నిఱంకనియానుళ్ పుకుందు నీంగళ్,అడియేనతుళ్ళత్తకం” అనే పెరియ తిరువందాది పాశురము ఇక్కడ అనుసంధానము చేసుకోవాలి.

స్వగృహమును తాననుభవించ వీలు లేకుండా చాలాకాలముగా ఎవరో దుష్ఠులు అక్రమించుకోగా ఈ నాటికి వారిని తన పరాక్రమముతో వెడలగొట్టి విజకేతనము ఎగురవేసిన మహారాజులాగా, దాసుడి హృదయసీమను తనది చేసుకున్న పెరుమాళ్ళ కృపకు పాత్రుడనైనందుకు ఏజన్మలో ఎంతటి తపస్సు ఆచరించానో కదా! అని ఆళ్వార్లు ఉబ్బితబ్బి పోవడానిని మూడవ పాదములో చూడవచ్చు. “పెణ్ణులాం చటైయినాలుం పిరమనుమున్నై కాణప్పాన్.ఎణ్ణిలావూళియూళి తవంశైదార్ వెళిక్కినిర్ప” అనునట్లుగా నిజముగా తపము చేసిన పెద్దలు కూడా పొందలేక తపించిపోతుండగా, తమకు ఆయాచితముగా లభించిన అపూర్వమైన తపఃఫలమై వుంటుందని ఆ తపస్సు స్వప్రయత్నముతో జరిగినది కాదని పెరుమాళ్ళే నోమునోచి పొందిన ఫలమని అంతరార్థము.

ఇక, “చేసెను” అన్న పదానిని క్రియగా కాక కర్తగా తీసుకుంటే, ఈ విధముగా నా హృదయములో ప్రవేశించుటకు పెరుమాళ్ళు ఉభయ కావేరి మధ్య నిలిచి ఎంత కఠోర తపస్సు చేసారో కదా? అని త్తూప్పుళ్ పిళ్ళై స్వామి చేసిన వ్యాఖ్యానము చాలా సమంజసమైనది. ఆ ముని వాహన భోగములో, “ఇతు అతివాదగర్ప్ మాక ఉత్ర్పేక్షిత్తపడి”(ఇది అతి పద్ద ఉత్పేక్ష) అని వెంటనే ఒక వాక్యము రాసి అచ్చొత్తించుట కొందరికి చేతిలోని పని. ఒక దాసుని పొందుటకు పరమాత్మ పడే కష్ఠము ఈ పిచ్చివారికేమి తెలుసు? అనావృత్తి సూత్ర శ్రీభాష్యములో “……..నచ పరమ పురుషస్సత్య సంకల్పః అత్యర్తప్రియం ఙ్ఞాని నం లభ్ద్వా” అని ఎంపెరుమానార్ అనుగ్రహించిన శ్రీసూక్తిలో “లభ్ద్వా”ప్రయోగానికి దేశికాచార్యులు పెరియవాచ్చాన్ పిళ్ళై శ్రీపాదముల వద్ద అర్థములను తెలుసుకొని సరిచేసి చెప్పారు.

వారం అనగా పక్షపాతము అని అర్థము.
తుండ వెణ్పిఱై యాన్ తుయర్ తీర్తవన్ అంజిరై
వండువాళ్ పొళిల్ శూళ్ అరంగత్తు మేయవన్
అండర్ రండ బగిరండతొరు మానిలం ఎళుమాల్ వరై ముఱ్ఱుం

ఉండ కండగండీ రడియేనై ఉయ్యకొండదే (6)

ప్రతి పదార్థము
తుండం = ఒక ముక్క లాగా (కళా మాత్రముగా)
వెణ్పిఱైయన్ = తెల్లని చంద్రుడిని(శిరస్సు మీద)ధరించిన శివుని
తుయర్ = (బిచ్చమెత్తు బాధను)పాతకమును
తీర్తవన్ = పోగొట్టినవాడు
అంజిఱైయవండు = అందమైన రెక్కలు గల తుమ్మెదలు
వాళ్ = ఉజ్జీవించేచోటైన
పొళిల్ శూళ్ = తోటలతో నిండిన
అరంగ నగర్ = శ్రీరంగములో
మేయ = నాయకుడైనిలిచిన
అప్పన్ = స్వామి అయిన శ్రీరంగనాథుని
అండర్ = అండములలో వశించు దేవాదివర్గములును
అండం = అండములయొక్క
పగిరండం = అండముల ఆవరణములను
ఒరు మానిలం = అనుపమానమైన మహా పృధ్విని
ఆళు మాల్ వరై = ఏడు కులపర్వతములను
ముఱ్ఱుం = పేర్కొనిన పేర్కొనని సమస్తములను (మొత్తము)
ఉండ = భుజించిన
కండం కండీర్ = శ్రీ కంఠమును చూసారా
అడియేనై = దాసుడైన నన్ను
ఉయ్యక్కొండదే = ఉజ్జీవించినది
భావము:

ఒకానొక కాలములో, పరమశివుడు,తనలాగా బ్రహ్మకు కూడా ఐదు తలలు కలిగి వుండడము, అందరూ చూసి పరవశించుటకు కారణమవుతున్నదని భావించి బ్రహ్మ శిరస్సునొకదానిని త్రుంచి వేయగా, ఆ కపాలము అలాగే శివుని చేతిలో అంటుకొనిపోయినది, అప్పుడు శివుడు “దీనికి పరిహారమేమి?”యని చింతించగా, దేవతలు మునులు “ఈ పాపము తొలగుటకు బిచ్చమెత్తాలని, ఎప్పుడు కపాలము నిండితే, అప్పుడు ఇది చేతినుండి విడివడుతుందని” చెప్పగా, శివుడు చాలాకాలము పలు క్షేత్రములలో బిచ్చమెత్తినా ఆ కపాలము ఆయన చేతిని విడిచి పోలేదు. పిదప ఒక దినము బదరికాశ్రమముచేరి అక్కడ వేంచేసి ఉన్న నారాయణ మూర్తిని సేవించినప్పుడు ఆయన “అక్షయం” అని బిక్ష పెట్టగా, వెంటనే ఆ కపాలము నిండి, చేతి నుండి విడివడింది. ఈ చరిత్ర వలన శ్రీమన్నారాయణుని పరత్వము బోధపడుతుంది. ఈశ్వరుడని పేరు గల రుద్రుడు కర్మవశ్యుడని, తనను తాను రక్షించుకొలేనివాడు, ఇతరులకు నిరపేక్ష రక్షకుడు కాజాలడని, శ్రీమన్నారాయణుడే సర్వ అనిష్ఠ నివారకుడని ప్రకటితమగుతున్నది.

అందమైన రెక్కలుగల తుమ్మెద అనగా ఙ్ఞానానుష్ఠానములు బాగుగాగల ఆచార్యులని అర్థము. పలు పూవులలోని మకరందమును ఆ పూవు యొక్క స్వరూప స్వభావములు చెడకుండా గ్రహించగల శక్తి గలవి తుమ్మెదలు. అలాగే ఆచార్యులు పలు శాస్త్రములను అవగాహన చేసి ఆయా గ్రంథముల భావము చెడకుండా గ్రహించి అనుభవించు శక్తి గలవారు.

రెక్కలు, తుమ్మెదలు ప్రయాణించుటకు సాధనములైనట్లు, ఙ్ఞానానుష్ఠానములు ఆచార్యులకు ఉన్నతగతిని పొందుటకు సాధనములవుతున్నవి.

క్రింది పాదములలో, కారణావస్థలో అన్ని కార్యములను తనలోనికి ఉప సంహరింపచేసి, పిదప సృష్ఠికాలములో “వె`ర్రిపోర్ క్కడలరైన్ విళుగామల్ తాన్ విళుంగి ఉయ్యకొండద”అన్నట్లు సకల పదార్థములను ప్రళయ మహాప్రవాహము నుండి తప్పించి తన ఉదరములో చేర్చుకొనిన పరమకారుణునికుని, ఇప్పుడు కూడా తమను సంసార సాగరము నుండి తప్పించిన ఉపకారికత్వమును ఆనందముగా చెపుతున్నారు.

పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానములో “చంద్రనిన్ క్షయత్తై పోక్కినానెఱ్రుమాం”(చంద్రుని క్షయమును తొలగించారు)అని అర్థమును అనుగ్రహించారు.”తుండవెణ్పిఱైయన్” అని కూడ పాఠము కలదు.

కైయిర్ ఆర్ శురి శంగనంగల్ ఆళియర్ నీళ్వరై పోల్
మెయ్యనార్ తుబళ విరైయార్ కమళ నీళ్ ముడి ఎం
ఐయ్యనార్ అణి అరంగనార్ అరవిన్ అణైమిశై మేయ మాయనార్
శెయ్య వాయ్ ఐయో అయ్యో ఎన్ చ్చిందై కవరందదువే (7)

ప్రతిపదార్థము:
కైయిన్ = శ్రీకరములలో
ఆర్ = అమరియున్న
శురి శంగు = వృత్తములు గల శంఖమును
అనంగల్ ఆళియర్ = నిప్పులు కక్కుచున్న శ్రీచక్రమును కలిగివున్న
నీళ్వరై పోల్ = పెద్ద పర్వతములాగా
మెయ్యనార్ = దేహము గలవారు
తుబళ విరైయార్ = తులసి పరిమళవలన
కమళ్ = పరిమళములతో ఒప్పారుతున్న
నీళ్ ముడి = ఉన్నతమైన అభిషేకము కలవారైన(నిడుపాటి శిఖ గలవారై)
ఎం ఐయ్యనార్ = మాస్వామి అయిన
అణి అరంగనార్ = అందమైన శ్రీరంగమునకు నిద్రాభిరంగడుగా అనుగ్రహమును ప్రసాదించువాడై
అరవిన్ అణైమిశై మేయ = శ్రీ ఆదిశేషుని శయ్యగా గలవాడైన
మాయనార్ = ఆశ్చర్యకరములైన చేష్ఠితములుగల శ్రీరంగనాథుని
శెయ్య వాయ్ = ఎర్రని పగడముల వంటి నోరుగల
ఎన్నై = దాసుని
చ్చిందై = హృదయమును
కవరందదువే = కొల్లగొట్టినది
ఐయో = అయ్యో(ఆనందాతిశయము)
భావము:

శ్రీకరములకు ఆయుధముగాను, ఆభరణముగాను ఒప్పుచున్నశంఖ చక్రములు గలవాడైన, చర్మచక్షువులైన మనవంటివారికి గోచరమగునట్లుగా, పచ్చని పర్వతమువంటి దేహమును కలవాడై, సమస్త జీవరాశిని రక్షించుటకు సిద్దముగుతున్నట్లుగా, శ్రీరంగములో శ్రీ ఆదిశేషశయ్యపై శయనించిన అళగియమణవాళుని దొండపండు వంటి ఎర్రని అధరములు దాసుని హృదయమును కొల్లగొట్టినది కదా! ఏమి చేతును! అని ఆనంద పారవశ్యముతో ఆళ్వార్లు పాడుతున్నారు.

ఎంపెరుమాన్ ను పూర్తిగా అనుభవింప ప్రయత్నము చేయుచుండగా మధ్యలోనే అథరములు హృదయమును కొల్లగొట్టినది కదా ఏమి చేతును! అని వాపోతున్నారు. “పండే నెంజై పరికొడుత్తవెన్న అనియాయం శెయ్వతే!అని పిలుస్తున్నారు అని పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానించారు.” అయ్యో” అనటము ఆశ్చర్యము వలన, అరుదైన అనుభవమగుట వలన, అనుభవ రసమును ప్రకటిస్తున్నది అని తూప్పళ్ పిళ్ళై అన్నారు.

సురి శంగు-శంఖముయొక్క లక్షణము

పరియన్ ఆగి వంద అవుణన్ ఉడల్ కీండ అమరర్
క్కరియ ఆది పిరాన్ అరంగత్తమలన్ ముగత్తు
కరియ ఆగి ప్పుడై పరందు మిళిరందు శెవ్వరి ఓడి నీండ అ
ప్పెరియ వాయ కణ్గళ్ ఎన్నై ప్పేదై మై శెయ్దనవే (8)

పరియన్ ఆగి = మహాస్థూల శరీరముగల
వంద = (ప్రహ్లాద రక్షణకోసము)వచ్చిన
అవుణన్ = అసురుడైన హిరణ్యాక్షుని
ఉడల్ = శరీరమును
కీండ = చీల్చి ముక్కలు చేసినవాడు
అమరరుక్కు = బ్రహ్మాది దేవతలకు
అరియ = అంతుచిక్కనివాడు
ఆది = జగత్కారణ భూతుడు
పిరాన్ = మహోపకారుడు
అరంగత్తు = శ్రీరంగములో వేంచేసివున్న
అమలన్ = పరమ పవిత్రుడైన ఎంపెరుమానుల
ముగత్తు = శ్రీముఖమండలములో
కరియ ఆగి = నల్లని రంగులో వున్న
పుడై పరందు = విశాలముగల
మిళిరందు = ప్రకాశము గలవాడై
శెవ్వరి ఓడి = ఎర్రని రేఖలు గలిగి
నీండ = చెవులదాకా విస్తరించి
అప్పెరియ వాయ = గొప్పవైన
కణ్గళ్ = ఆకన్నులు
ఎన్నై = దాసుని
ప్పేదై మై శెయ్దనవే = ఉన్మత్తుని చేస్తున్నవి
భావము:

ఇప్పుడు అళగియ మణవాళుని దివ్యనేత్రముల ఔన్నత్యాన్ని తమ నోరార ఎందరో “వీడు భూతము” అని స్తుతినింద చేసి ఉన్మత్త స్థితిని పొందినట్లుగా అనుగ్రహిస్తున్నారు. “ఏళయరావియు ణ్ణుమిణై క్కూరంగొలోవఱియేన్, ఆళియంకణ్ణపిరాన్ తిరుకణ్ణ్గల్కొలోవఱియేన్,చూళవుంతామరై నాణ్మలర్పోల్ వందు తోండ్రుంకండీర్, తోళియర్కాళ్ననైమీర్!ఎన్ శేయ్ తేన్ తుయరాట్టియేనే” అని కన్నులలో నీరు నిండగా నమ్మాళ్వర్లు పడ్డ పాట్లు వీరు పడ్డారు కాబోలు.

రాక్షసుని శరీరమును చీల్చిన చరిత్ర: సమస్త దేవతలు జంతువులాదిగా గల ప్రాణికోటి నుండి, పగలు, రాత్రి, భూమి మీద, ఆకాశములో, ఇంటి లోపల బయట తనకు మరణము లేకుండా వరము పొందినవాడు హిరణ్యుడు. దేవాదులకు ఇబ్బందులు కలిగిస్తూ,తననేదైవముగా అందరూ భావించి పూజలు చేయాలని కట్టడి చేయటము వలన వాడి కుమారుడైన ప్రహ్లాదుడు బాల్యము నుండే మహావిష్ణువు భక్తుడై తండ్రిగారి ఆఙ్ఞ మేరకు ముందుగా వాడి పేరును చెప్పి విద్య నేర్వకుండా నారాయణ నామమునే చెప్పగా చెడ్డ కోపముతో హిరణ్యుడు ప్రహ్లాదుని తన దారిలోకి తెచ్చుకోవటానికి పలు విధముల ప్రయత్నించి సాధ్యపడక పిల్లవాడిని చంపటానికి ఎన్ని ఉపాయాలు చేసినా పరమాత్మ అనుగ్రహముచే మరణించలేదు కాని, ఒకరోజు సాయంకాలము తండ్రి కుమారుని చూచి ‘ఓరీ! నువ్వు చెప్పే నారాయణుడు అనేవాడు ఎక్కడ ఉన్నాడు? చూపూ! అన్నాడు. ఆ పిల్లవాడు ‘ఆ స్తంభములోనూ వున్నాడు అణువు అణువు ఉన్నాడు అంతటా ఉన్నాడని నిశ్చయముగా చెప్పగా, వెంటనే హరణ్యుడు ‘ఇక్కడవున్నాడా?’ అని ఎదురుగావున్న స్తంభమును చ్చేదించగా, అందుండి వెంటనే పరమాత్మ నరసింహ అవతారములో అవతరించి హిరణ్యకశిపుని పట్టుకొని గడప మీద తన ఒడిలో పెట్టుకొని తన చేతి గోళ్ళతో వాడి గుండెను చీల్చి సంహరించి ప్రహ్లాదుని బ్రోచాడని చరిత్ర.

ఎంపెరుమానుని దయను మాత్రమే నమ్మి వాడి చరణములే శరణమని విశ్వాసము లేక స్వప్రయత్నముచే వాడిని పొందవచ్చని భావించేవారు దేవతలైనప్పటికీ, వారికి కృప చూపేవాడు ఎంపెరుమాన్ అంటారు. ‘అమరర్కళ్ అఱియా’ అని ముందరి పాదములలో చెప్పితరువాతి పాదములలో దివ్య నేత్ర సౌదర్యమును చెప్పారు ఆళ్వార్. నల్లని రంగు కలిగి వుండుట, విశాలముగా వుండుట, ప్రకాశముగా వుండుట,ఎర్రని రేఖలు కలిగివుండుట, చెవులదాకా వ్యాపించి వుండుట మొదలగునవి నేత్రముల గొప్పతనమును తెలియ జేస్తున్నవి. పేదమై- బుద్ది నశించిపోవుట ,ఉన్మత్తము.

ఆల మా మరత్తిన్ ఇలై మేల్ ఒరు పాలకనాయ్
ఞాలం ఏళుం ఉండాన్ అరంగత్తరవిన్ అణైయాన్
కోలమా మణి ఆరముం ముత్తు త్తామముం ముడి విల్లదోర్ ఎళిల్
నీల మేని ఐయ్యో నిఱై కొండదెన్ నెంజినైయే (9)

ప్రతిపదార్థము:
మా = పెద్దదైన
ఆలమరత్తిన్ = మర్రి వృక్షము యొక్క
ఇలై మేల్ = (చిన్న)ఆకు మీద
ఒరు బాలకనాయ్ = ఒక బాలుడై
ఞాలం ఏళుం ఉండాన్ = ఏడు భువనములను తన చిరు బొజ్జలో ఉంచుకొని చూసినవాడు
అరంగత్తిన్ = (శ్రీరంగములో)కోవెలలో
అరవుఇన్ అణైయాన్ = ఆది శేష శయ్యపై పవళించిన శ్రీరంగనాథుడి
కోలం = అందమైన
మా = గొప్పదైన
మణి ఆరముం = రత్నములచే కూర్పబడిన హారము
ముత్తు త్తామముం = ముత్యాలహారము(ఇంకా ఇటువంటి అనేకానేక ఆభరణములు)
ముడివు ఇల్లదు = అంతులేని అపరిమితమైన దయా స్వరూపుడిగా నిలిచిన
ఓర్ ఎళిల్ = అనుపమానమైన అందముగల
నీలం = అసతీపుష్ప చ్చాయలో
మేని = దివ్య దేహమును
నెంజినైయే = దాసుని మనసు యొక్క
నిఱై = నిండుతనమును
కొండదు = కొల్లగొట్టేసి పోయింది
ఐయ్యో దీని కేమి చేయగలను?అని వాపోతున్నారు.
భావము:

ఒక్కొక్క అవయవమును చూసి మురిసిపోయిన ఆళ్వార్లు ఇప్పుడు అవయవి అయిన దివ్యదేహమును అనుభంచి తన మనసు పరవశించగా ఆ ఆనందమును పాడుతున్నారు.

ఒక అవాంతర ప్రళయములో, శాఖోపశాఖలుగా, బాగా పెద్దగా పెరిగిన అశ్వథ్థవృక్షము యొక్క ఒక చిన్న చిగురుటాకు మీద, తల్లిదండ్రులు లేక ఒంటరిగా పడుకొని సకల లోకములను తన చిరుబొజ్జలో పెట్టుకొని కరుణతో చూసి అనుగ్రహించిన శ్రీరంగనాథుని, సకల ఆభరణములచే అలంకరింపబడిన నల్లని మేని నన్ను అనుగ్రహించి నా మనసు యొక్క గాంభీర్యమును కొల్లగొట్టినది కదా! అంటున్నారు.

‘ఎన్ నెంజినైయే’

“ఐయ్యో !పచ్చై చట్టై ధరిత్తు తనక్కుళ్ళత్తై యడయకాట్టి ఎనక్కుళ్ళత్తై యడైయ కొండానే!”(ఐయ్యో పచ్చని అంగీ ధరించి తనకున్నదంతా చూపి నాకున్నదంతా దోచాడే!) అంటారు పెరియవాచ్చాన్ పిళ్ళై.”నాన్ ఎల్లావఱ్ఱైయుం నిన్ఱు నిన్ఱు అనుభవిక్క వేణుమెన్నుఱిక్క అనుభవపరికరమాగ ఎన్ నెంజై తన్ పక్కలిలే ఇళుత్తుకొళ్వదే!ఐయ్యో!”(నేను అన్నింటిని ఆగి ఆగి అనుభవించాలనుకొంటే, అనుభవ పరికరముగా నా మనసును తన పక్కకు లాగివేసారే! అయ్యో!)అని అళగియ మణవాళ ప్పెరుమాళ్ నయనార్ అంటారు.

కోలమా మణి ఆరముం, ముత్తు త్తామమౌం, ముడి విల్లదోర్ ఎళిల్, నీల మేని ఐయో నెంజినైయే నిఱై కొండ

అందమైన మణి హారములు, ముత్యాల హారములు, అంతులేని సౌందర్యము,నీలి మేని నామనసును మోహపరవశములో

పడవేసినది కదా!

కొండల్ వణ్ణనై క్కోవలనాయ్ వెణ్ణెయ్
ఉండ వాయన్ ఎన్ ఉళ్ళం కవర్దానై
అండర్ కోన్ అణి అరంగన్ ఎన్ అముదినై
కండ కణ్గళ్ మఱ్ఱొన్ఱినై క్కాణావే (10)

కొండల్ వణ్ణనై = కాలమేఘము వంటి రూపము గలవానిని
క్కోవలనాయ్ వెణ్ణెయ్ ఉండ వాయన్ = గోప కులములో అవతరించి వెన్న తినిన నోరు కలవాడిని
ఎన్ ఉళ్ళం = నామనసుని
కవర్దానై = కొల్లగొట్టినవాడిని
అండర్ కోన్ = నిత్యసూరుల నాయకుడైన
అణి అరంగన్ = (భూమండలమునకు)అలంకారమైన శ్రీరంగనాథుడుగా పవళించిన వాడును
ఎన్ అముదినై = నాకు పరమభోగ్యమైన అమృత స్వరూపుడైన అళిగియ మణవాళుని
కండ కణ్గళ్ = కాంచిన కన్నులు(పరమపద వాసునైనా)
కాణా = చూడలేవు
భావము:

ఈ ఆళ్వార్లు ‘దాసుడను ‘ అని తప్ప ఈ ప్రబంధ ఆసాంతము వరకు తన పేరు, ఊరు చెప్పుట మరిచి పోయినట్లుగా తాను పొందిన అనుభవమునకు ఎటువంటి విచ్చేధము జరుగకుండా పెరియపెరుమాళ్ అయిన శ్రీరంగనాథుని కృప పొందిన విధమును చూసి ఆశ్చర్యచకితులై పెరుమాళ్ దివ్య దేహము నందు ఐక్యమైపోయిన విధమును తెలిపారు.

కొండల్వణ్ణన్- సముద్రపు నీటినంతా త్రావి కావేరీ మధ్యన వచ్చి పడుకున్న ఒక కాలమేఘము లాగా అందరి కష్ఠములను తీర్చగల తిరుమేని కలిగినవాడు. అంతే కాక, ఎత్తుపల్లాలను భేదము లేక చిన్న వారిని, గొప్పవారిని ఉజ్జీవింపజేసే కరుణా రసమును వర్షించు వాడని గ్రహించాలి. కొండల్-ఒక వృత్తి పేరు.

సుందరబాహుస్తవములో “…..యశోతాంకుళ్ యగ్రోన్నమిత భకాగ్రాణముదితౌ కపోలావత్యాపి హంతు భరత తత్త్రషమకౌ’ అన్నట్లుగా ఆళ్వాన్, పూర్వము యశోదపిరాట్టి ముద్దు పెట్టిన గుర్తులు ఇప్పటికీ అళగర్(అందగాడు-కృష్ణుడు) కపోలములందు అందముగా నిలిచి ఉండటమును అనుభవించినట్టు, వీరు, పూర్వము వెన్న తిన్న వాసన ఇప్పటికీ పెరియపెరుమాళ్ పగడపు నోటియందు గుబాళిస్తున్నట్టు అనుభవిస్తున్నారు. కోవలనాయ్-ఇత్యాదులు…దశరధ చక్రవర్తి తన రాజైశ్వర్యమును అనుభవించుటకు నాకొక కుమారుడు కావాలని నోములు నోచి పెరుమాళ్ ను కనినట్లుగా, శ్రీ నందగోపులు “కానాయన్ కడిమనైయిల్ తయిరుండు నెయ్ పరుగ నందన్ పెఱ్ఱ ఆనాయన్” అనునట్లుగా గోకులములో అపార సంపద పాడైపోకుండా దానిని ఆరగించటము కోసము నోములు నోచి కన్న బిడ్డ శ్రీకృష్ణుడు. పెరియపెరుమాళ్ గురకను వాసన చూస్తే ఇప్పటికీ వెన్న వాసన వస్తుందట.

ఉప్పు నీరులాగా అందని చోట వుండే దేవతల అమృతములా కాక పరమ మథురముగా పరమ సులభముగా వుంటుంది నేను చూసిన అమృతము అంటున్నారు. “అముదనై” అని కొందరంటారు. ఆ పాఠము రసహీనముగా ఉండుట వలన తృణీకరించదగినది. ఆళ్వార్లకు అమృత తాధాత్మ్యము వివక్షితముకాదు అమృత తాద్రూపము వివక్షితము లేక గ్రహించాలి. “అళప్పరియ ఆరముతై” అంటారు తిరుమంగై ఆళ్వార్లు.

మఱ్ఱొండ్రినై కాణా-అమృతపానము చేసినవారు పాలను అన్నమును కన్నెత్తి చూస్తారా?”……పావో నాన్యత్ర కచ్చిత్” అని హనుమ చెప్పినట్లుగా వీరు కూడా “మిగిలిన దేనినీ “ అంటున్నారు. పేరు చెప్పడానికి కూడా జంకుతున్నట్లుగా పరవ్యూహాదులు ఇతర అర్చావతారములు వేటిని చూడననుట స్పష్ట మగుచున్నది.

“పణ్కొల్ శోలైవళుదినాడన్ కురుగూర్ శఠగోపన్“అని, “అంకమలత్తడవయల్చూళ్ ఆలినాడన్ అరుళ్మారి అరట్టముక్కి అడైయార్ చీయం, కొంగు మలర్ కుళలియర్ వేళ్ మంగై వేందన్ కొఱ్ఱవన్ పరకాలన్ కలియన్” అని ఇతర ఆళ్వార్లు తమ ఊరును, పేరును, పాశుర సంఖ్యను చెప్పుకున్నట్లుగా వీరు ఏమీ చెప్పుకోలేదు ఎందుకనగా, “మాఱ్ఱొడ్రినై కాణా”అన్నవాటిలో ఇవి కూడా వున్నవి. పరవ్యూహాది ఇతర అర్చావతారములను మరచి పోయినట్లుగానే తమ పేరును, ఊరును, పాటను కూడా మరచి పోయారు.

అళగియ మణవాళ పెరుమాళ్ నయనార్ వ్యాఖ్యానములో “అల్లతార్ తిరునామపాట్టు ప్పోల తవామ్మై చ్చొల్లిఱ్ఱిలర్”, విస్సహ దషాతా నా:విస్సమార తదాత్మానం” అన్నట్లుగా తాము వెళ్ళుటకు సిద్ధపడి తమను మరచుట. ఫలితము ‘సదాపశ్యంతి” అగుట వలన అది ఇక్కదే సిద్ధించుట వలన ఫలమునకు ఫలము కోరినట్లగునని ఫలము చెప్పలేదు.

ఈ పాట అనుగ్రహించగానే పెరియపెరుమాళ్ ఆ దేహము తోనే ఆళ్వార్లను అంగీకరించి తన దివ్య దేహములో చేర్చుకున్నారు. కరిగించిన ఇనుమును మింగి నీరైనవారనే సంప్రదాయము తెలిసిన పెద్దలు అనుగ్రహించిన విషయము విదితము.

శ్రీ కంచి ప్రతివాది భయంకర అణ్ణంగరాచార్య స్వామికి భక్తితో ప్రణమిల్లుతున్నాను. వారి వ్యాఖ్యానమును తెలుగులొనికి అనువదించే భాగ్యము దొరకటము”నే చేసిన పూజా ఫలమో నాదు పూర్వజుల పుణ్య ఫలమో “.సదా వారి కారుణ్య దృక్కులు దాసి పై ప్రసరించాలని ఆ పెరుందేవి తాయారు సహిత వరదరాజులను ప్రార్థన చేస్తు మరొకసారి పి.బి.ఎ. స్వామికి కృతఙ్ఞతలు సమర్పించుకుంటున్నాను.

అడియెన్ చూడామణి రామానుజ దాసి

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://guruparamparai.wordpress.com
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

0 thoughts on “అమలనాదిపిరాన్”

  1. I beg pardon for big mistake. I could read Amalanaadippiraan instead thiruvaimoli. I just entering into divyaprabhandam literature. I once beg pardon for my ignorance. Adyien.

    Reply

Leave a Comment