తనియన్లు

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్ వరవరమునయే నమ:

తనియన్లు సంగ్రహ శ్లోకాలు. ప్రతి ప్రబంధమునకు ముందు తనియన్లు ఉంటాయి. కొన్ని నిత్య (పొదు) తనియన్లు ఉంటాయి. వీటిని సేవా కాలమునకు ముందుగా కోవెలలలోను, మఠములందు, శ్రీ వైష్ణవ గృహము లందు సేవించుట సంప్రదాయముగా ఉన్నది. ఇక్కడ వాటి అర్థములను చూద్దాము.

srivaishna-guruparamparai

ఈ తనియన్ శ్రీ రంగ నాధులచే అనుగ్రహింప బడినది. ఇందు మణవాళమాముణులను ప్రస్తుతించారు.

శ్రీశైలేశ దయా పాత్రం ధీ భక్త్యాది గుణార్ణవం |
యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం ||

భావము: శ్రీ శైలాంశ సంభూతులై ‘తిరుమలై ఆళ్వార్’ అని ప్రసిద్దిచెందిన ‘తిరువాయ్మొళి పిళ్ళై’ అను శ్రీశైలనాధుల దివ్య నిర్మల కరుణాపూరమునకు ఉత్తమ పాత్రభూతులును, ఙ్ఞాన భక్తి వైరాగ్యాది పరమ కల్యాణ గుణ గణ పరిపూర్ణులగు శ్రీ భగవత్ రామానుజ సంయమింద్రుల దివ్యమంగళచరణ పంకేరుహములందు అత్యన్త ప్రవణులై, తదేకాంతిక అత్యంతిక పర భక్తి యోగ నిష్ఠులై, ఏకలవ్యుని వలె వారికి అనన్యార్హ శిశ్యభూతులైయుండు శ్రీ అళగియ మణవాళ మహాముణులకు సర్వదేశ సర్వకాల సర్వావస్థల యందును త్రికరణ శుద్దిగా నమస్కరించుచు సేవించుచున్నాను.

శ్రీ ప్రతివాది భయంకర అణ్ణంగరాచార్యుల వ్యాఖ్యానము.

“ఇప్పువియిల్ అరంగేసఱుక్కు ఈదళిత్తాన్ వాళియే” (ఈ భువిలో శ్రీరంగనాధులకు ఈడు వ్యాఖ్యానము చేసినవారు వర్థిల్లుగాక) మణవాళమాముణులు శ్రీ రంగనాధులకు నమ్మాళ్వార్ల “తిరువాయ్మొళి” కి వ్యాఖ్యానము చెప్పారు. దానినే ఈడు వ్యాఖ్యానము అంటారు. శాత్తుముఱై నాడు (ముగింపు రోజున) శ్రీరంగనాధులు మాముణులున్న సభలోనికి ఒక చిన్న పిల్లవాడిలాగ వచ్చి ఈ తనియనును చెప్పారు. వేదమునకు ఓం కారములాగా దివ్య ప్రబంధము ప్రారంభములోను, ముగింపు నందు ఈ తనియన్ను అందరు తప్పక సేవించాలని శ్రీ రంగనాధులు శ్రీ వైష్ణవులందరిని ఆఙ్ఞాపించారు.

కూరత్తాళ్వాన్ అనుగ్రహించిన ఈ తనియన్లో మన గురుపరంపర ప్రస్తుతించబడింది.

లక్ష్మీ నాధ సమారంభాం నాధ యామున మధ్యమామ్
అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం

లక్ష్మీనాథ సమారంభముగా నాధయామున మధ్యవారికీ స్వాచార్య పర్యంతమున్న గురుపరంపరకు వందనములు

భావముతిరుమంత్ర ద్వయ చరమ శ్లోకాదుల ప్రప్రధముగా ఉపదేశించుటచే ప్రథమాచార్యులగు శ్రీమన్నారాయణుని మొదటగా, శ్రీమన్నాధ యామునులను మద్యమునను, అస్మదాచార్యవర్యుల అంత్యము నందు కలిగి, నిత్య నిరవద్యమై తేజరిల్లు మన అచార్య పరంపరా రత్న మాలికను సర్వదేశ సర్వావస్థల యందు త్రికరణ శుద్దితో సేవించుదును.

కూరత్తాళ్వాన్ అనుగ్రహించిన ఈ తనియన్లో శ్రీమద్ రామానుజాచార్యుల వైభవము ప్రస్తుతించబడింది.

యోనిత్య మచ్యుత పదామ్భుజ యుగ్మ రుక్మ
వ్యామోహత స్తధితరాణి తృణాయ మేనే
అస్మద్గురోః భగవతోస్య దయైకసింధోః
రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే

ఎవరైతే అచ్యుతుని పాదాంభుజ యుగ్మములను ఆశ్రయించారో
సమస్త వ్యామోహాదులను త్రుణముగా భావించారో అట్టి
దయాసింధువైన మా ఆచార్యులైన రామానుజచార్యుల చరణములే నాకు శరణ్యము

భావముభగద్వ్యతిరిక్త సమస్త విషయములు నిస్సారములని తీర్మానించి వానినన్నిటినీ తృణీకరించి, సర్వ దేశ సర్వకాల సర్వావస్థల యందు శ్రీమన్నారాయణుని శ్రీ మచ్చరణనళినయుగమను దివ్య సువర్ణ నిధియందు నిరవదిక ప్రావణ్యము కలిగినవారలును, నిఖిలహేయ ప్రత్యనీక కళ్యాణ గుణ గణ మహార్ణవులును, కారుణ్యామృత దుగ్దసింధువులును, శ్రీ వైష్ణవ బృందములకెల్ల నిరుపాధిక పరమ విలక్షణాచార్య సార్వభౌములునగు శ్రీ భగవత్ రామానుజులు పాద పద్మములను, నేననన్య శరణ్యుడనై శరణు జొచ్చుచున్నాను.

ఆళవందార్లు అనుగ్రహించిన ఈ తనియన్ నమ్మాళ్వార్ల ఔన్నత్యమును తెలుపుతున్నది.

మాతా పితా యువతయ స్థనయా విభూతిః
సర్వం య దేవ నియమేన మదన్వయానాం
ఆద్యస్యనః కులపతేర్వకుళాభి రామం
శ్రీమత్తదంఘ్రి యుగళం ప్రణమామి మూర్ధ్నా

భావముఎవరైతే తల్లి, తండ్రి, సంతానము, సంపద మరియు సమస్తమో, శ్రీ వైష్ణవ కులభూషణమో, ప్రపన్న జన కూటస్థులగు అట్టి నమ్మాళ్వార్లకు మరియు వకుళ మాలికా నిత్యాలంకృతమగు శ్రీమత్పాదారవింద యుళమునకు శిరస్సాష్టాంగ దండవత్ప్రణామములను సమర్పించుచున్నాను శిరసు వంచి నమస్కరిస్తున్నాను.

పరాశర భట్టర్ అనుగ్రహించిన ఈ తనియన్లో ఆళ్వార్లు ఎంపెరుమానార్లు స్తుతించబడ్డారు. ఈ శ్లోకమును ఒకసారి నంజీయర్ల కోరిక మేరకు భట్టరు వారు అనుగ్రహించారు.

భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ
శ్రీ భక్తిసార కులశేకర యోగివాహాన్
భక్తాంఘ్రి రేణు పరకాల యతీంధ్ర మిశ్రాన్
శ్రీమత్ పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యం

భావము: నేను నిరంతరము నమ్మాళ్వార్, భూదత్తాళ్వార్, పొయిగై ఆళ్వార్, పేయాళ్వార్, పెరియాళ్వార్, తిరుమళిసై ఆళ్వార్, కులశేకర ఆళ్వార్, తిరుప్పాణాళ్వార్, తొందరడిప్పొడి ఆళ్వార్, తిరుమంగై ఆళ్వార్ మరియు ఎంపెరుమానార్లను సేవిస్తాను.

శ్రీ ప్రతివాది భయంకర అణ్ణంగరాచార్యుల వ్యాఖ్యానము.

పది మంది ఆళ్వార్లను, ఎంపెరుమానార్లను ప్రస్తుతించే ఈ శ్లోకమును ప్రతి దినము శ్రీవైష్ణవులందరు సేవించుకోవాలి. కొందరు ఈ శ్లోకములో ఆళ్వార్ల నామములు క్రమముగా లేదని భావించవచ్చు.

“కాసార భూత మహధాహ్వయ భక్తిసారాన్ శ్రీమచ్చతారి కులశేకర భట్టనాతాన్, భక్తాంగ్రిరేణు మునివాహన కార్తికేయాన్ రామానుజంచ యమినం ప్రణతోస్మి నిత్యం“అని కూర్చటమేమి కష్టము కాదు. భట్టరు వారు”భూతం సరస్చ….” అని ప్రాంభించటములో ఒక విశేషమున్నది.

నమ్మాళ్వార్లు తక్కిన ఆళ్వార్లందరికి నాయకులుగా మన పూర్వాచార్యులు కొన్ని శ్లోకాములలో కీర్తించివున్నారు. వీరిని “అవయవి” (శరీరము) అంటారు. తక్కిన ఆళ్వార్లందరు వీరి అవయవము అనగా శిరస్సు, నేత్రాలు, చెవులు…ఈ శ్లోకములో భూదత్తాళ్వార్లను – శిరస్సుగాను, పొయిగై ఆళ్వార్లను,పేయాళ్వార్-కళ్ళుగాను, పెరియాళ్వార్లను- ముఖముగాను, తిరుమళిసై ఆళ్వార్లను-కంఠముగాను, కులశేకర ఆళ్వార్లను, తిరుప్పాణాళ్వార్లను-కరములుగాను, తొండరడిప్పొడి ఆళ్వార్లను-హృదయముగాను, తిరుమంగై ఆళ్వార్లను-నాభిగాను మరియు ఎంపెరుమానార్లను-శ్రీచరణములుగాను వర్ణించారు.

పై శ్లోకము వలన ప్రపన్నజన కూటస్థులైన నమ్మాళ్వార్లను శరీరముగాను తక్కిన ఆళ్వార్లను వారి అవయవములుగాను భట్టరు వర్ణించారని గ్రహించాలి.

( ఇది కాంచీపురము ప్రతివాది భయంకరం అణ్ణంగరాచార్యస్వామి అనుగ్రహించిన నిత్యానుసంధానము వ్యాఖ్యానము ఆధారముగా రాసినది.)

దొడ్డైయ్యంగార్ అప్పై ఈ తనియన్ పొన్నడిక్కల్ జీయరును ప్రస్తుతించి అనుగ్రహించారు. (వీరు పొన్నడిక్కల్ జీయర్ శిష్యులైన అష్టధిగ్గజములలో ఒకరు.)

రమ్యజామాతృ యోగీంద్ర పాదరేఖా మయం సదా
తతా యతాత్మ సత్తాధిం రామానుజ మునిం భజే

భావముమణవాళమాముణుల పాద రేఖ వంటి వారు, దాసులు, వారి పరికరము వంటివారు అయిన వానమామలై జీయర్ (పొన్నడిక్కాల్ జీయర్) శ్రీ పాదములను ఆశ్రయిస్తాను.

పొన్నడిక్కాల్ జీయరు (మాముణుల శిష్యులు, శ్రీరంగనాధుల మరియు మాముణుల ఆనతి మేరకు వానమామలై / తోతాద్రి మఠములను స్థాపించినవారు.) తనియన్ వానమామలై దివ్య దేశమునందును, నవ తిరుపతులలోను, వానమామలై మఠములలోను వారి శిష్యుల గృహములందును సేవిస్తారు. శ్రీశైలేశ దయాపాత్రం తనియన్ సేవించగానే ఈ తనియన్ సేవిస్తారు. ఈ తనియన్ ఆచార్య పురుషుల తిరుమాళిగైలలో కూడా సేవించుదురు ఆత్తాన్ తిరుమాళిగై (ఆళ్వార్ తిరునగరి), ముదలియాణ్డాన్ తిరుమాళిగై (అప్పాచియారణ్ణా – అణ్ణవిలప్పన్ వారసులు), మొదలగు వారి యొక్క మొదటి ఆచార్యులు పొన్నడిక్కాల్ జీయర్ శిష్యులు.

అడియేన్ చూడామని రామానుజదాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/thaniyans-invocation/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

0 thoughts on “తనియన్లు”

Leave a Comment