Category Archives: nAchchiyAr thirumozhi

నాచ్చియార్ తిరుమొళి – సరళ వ్యాఖ్యానము – పదినాంగాం తిరుమొళి – పట్టి మెయ్ందోర్

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

నాచ్చియార్ తిరుమొళి

<< పదిన్మూన్ఱాం తిరుమొళి – కణ్ణన్ ఎన్నుం

తిరుప్పావైలో, ఆండాళ్ ప్రాప్యం (అంతిమ ప్రయోజనం) మరియు ప్రాపకం (దానిని పొందుటకు సాధనము అని అర్థం) స్థాపితము చేసింది. ఆమె ఫలితాన్ని పొందలేదు కాబట్టి, ఆమె ఆందోళనతో నాచ్చియార్ తిరుమొళిలో, మొదట్లో కాముని (మన్మధుడు) పాదాలను ఆశ్రయించింది. ఆ తర్వాత, ఆమె తెల్లవారుజామున స్నానము (పనినీరాట్టం) ఆచరించింది; ఆమె కోరిక నెరవేరుతుందో లేదో తెలుసుకోవడానికి వలయాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నించింది; కోకిల పలుకులు వినింది; ఎంబెరుమానుని ప్రత్యక్షంగా దర్శించుకోవాలనుకుంది, కానీ అది కూడా ఫలించకపోవడంతో, తన కలలలో అతడిని అనుభవించి తనను తాను కాస్త నిలపుకుంది; ఎంబెరుమానుని దివ్య నోటి అమృతాన్ని గురించి శ్రీ పాంచజన్య ఆళ్వాన్ని అడిగి తెలుసుకోవాలని ప్రయత్నించింది; ఎంబెరుమానుని గురించి మేఘాలను అడిగి తెలుసుకోవాలని ప్రయత్నించింది, ఆ మేఘాలను అతని వద్దకి దూతగా పంపించి; నిండుగా వికసించిన పుష్పాలు ఎంబెరుమానుని గుర్తుచేస్తున్నాయని దుఃఖించింది; అవి ఆమెను ఎలా హింసించాయో వర్ణించింది; ఆమె ఆడపిల్లగా ఎలా పుట్టిందో గుర్తు చేసుకుంది, ఇంకా  ఎంబెరుమానుని చూడలేకపోయేసరికి ఆతడు పెరియాళ్వార్ల కోసం తప్పక వస్తాడని తనను తాను ఓదార్చుకుంది, అయినా రాకపోయేసరికి ఎలాగైనా సరే ఆతడి నివాస ప్రదేశాలకు తీసుకెళ్లమని చుట్టు పక్కల ఉన్న వారిని ప్రార్థించింది; తనను తాను నిలబెట్టుకోడానికి ఆతడు ధరించిన పీతాంబరము, మాల మొదలైన వస్తువులను తీసుకురమ్మని వారిని కోరింది;  అప్పుడు కూడా ఎంబెరుమానుడు రాలేదు.

ఆమె ప్రపన్న కులంలో జన్మించినప్పటికీ, ఎంబెరుమానుడు పట్ల ఆమెకున్న అమితమైన ప్రేమయే ఆమె ఈ స్థితికి కారణము. ఎంబెరుమానుడు కూడా ఆమె పరమభక్తి స్థితిని చేరుకోవాలని వేచి ఉన్నాడు (భగవానుడితో కలిసి ఉంటేనే జీవించగలరు, భగవానుడి నుంది విడిపోతే జీవించలేని స్థితి). నమ్మాళ్వార్లలాగా, అతన్ని బలవంత పెట్టినా సరే, భగవానుని చేరుకోవాలని ఆండాళ్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విరహ వేదన పొంగి ప్రవహించుటచే, ఆమె దయతో ఈ పదిగంలో “కండీరే” (ఎవరో ప్రశ్న అడుగుతున్నట్లు) మరియు “కండోమే” (ఆ వ్యక్తి ప్రతిస్పందిస్తున్నట్లు) తెలుపుతుంది.

ఆమె ప్రయత్నాలను చూస్తుంటే, ఆమె అతడిని పొందడానికి భగవానుడు తప్పా ఇతరోపాయాలని ప్రయత్నిస్తోందని మనం చెప్పగలమా? లేదు, అలా చెప్పలేము. ఆమె ఈ పరిస్థితికి కారణం ఎంబెరుమానునిపైన ఆమెకున్న అత్యధిక ప్రేమ, ఎంబెరుమానుని ఔన్నత్యము, అతని విరహం భరించలేకపోవడం వల్ల మాత్రమే; ఆమె ఇతరోపాయములను అనుసరించి ఈ చర్యలను చేయలేదు. అవి ఆమె స్వరూపానికి తగినవి కావు. భగవానుడే సాధనము అని భావించేవారు ఇతర మార్గాల గురించి ఆలోచించరు.

మొదటి పాశురము: తన పరమపద అనుభవాన్ని పక్కన బెట్టి,  శ్రీగోకులంలోని వెన్నని అనుభవించాలని, నప్పిన్నై పిరాట్టితో వివాహమాడాలన్న కోరికతో ఇక్కడ అవతరించాడు. తన కోరిక ప్రకారం వృందావనం (బృందావనం) లో స్వేచ్ఛగా విహరించి గొప్పతనాన్ని పొందాడు.

పట్టి మేయ్ందోర్ కారేఱు బలదేవఱ్కు ఓర్ కీళ్ క్కన్ఱాయ్
ఇట్టీరిట్టు విళైయాడి ఇంగే పోదక్కండీరే?
ఇట్టమాన పశుక్కళై ఇనిదు మఱిత్తు నీరూట్టి
విట్టుక్కొండు విళైయాడ విరుందావనత్తే కండోమే

నల్లని వృషభములా (ఎద్దు) ఉండే కృష్ణుడు, తనకి సాటిలేని వాడిలా  ఎలాంటి నిర్బంధం లేకుండా స్వేచ్ఛగా వృందావనంలో విహరించేవాడు. ఆతడు బలదేవుడి (బలరాముడు) విధేయుడైన విశేష సోదరుడు. ఆతడి సంతోషం కోసం అన్నో ఆటలాడి అతనిని మెప్పించేవాడు. మీరు అవన్నీ చూశారా? వృందావనంలో, తనకి ఇష్టమైన పేర్లతో కృష్ణుడు ఆవులను పిలవడం, వాటిని నీళ్లు తాగడానికి తీసుకెళ్లడం, వాటిని మేపడానికి తీసుకెళ్లడం, ఆడుకోవడం మేము చూశాము అని అంటున్నారు.

రెండవ పాశురము: ఆతడు వనమాల వైజయంతిని (దివ్య మాల) ధరించి వృందావనంలో తన సఖులతో ఆడుకోవడం వాళ్ళు చూశారని ఆమె తెలుపుతుంది.

అనుంగ ఎన్నైప్పిరివు శెయ్దు ఆయర్పాడి కవర్ందుణ్ణుం
కుణుంగు నాఱిక్కుట్టేఱ్ఱై గోవర్థనైక్కండీరే?
కణంగళోడు మిన్మేగం కలందార్పోల్ వనమాలై
మినుంగ నిన్ఱు విళైయాడ విరుందావనత్తే కండోమే

నా నుండి దూరమై నన్ను దుఃఖ సాగరంలో ముంచి, శ్రీగోకులాన్ని చేజిక్కించుకొని, ఆవులను మేపుతూ, ఆనందిస్తూ, వెన్న వాసనతో ఉన్ననల్లని ఎద్దులా కనిపించే కృష్ణుడిని మీరు చూశారా? నల్లని మేఘం మరియు మెరుపులు ఒకేసారి కనిపిస్తున్నట్లుగా, తన నల్లటి దివ్య స్వరూపంపై తెల్లటి వనమాలతో వృందావనంలో ఆతడి మిత్రులతో ఆడుకోవడం మేము చూశాము.

మూడవ పాశురము: వృందావనం ఆకాశంలో గరుడాళ్వాన్ తన రెక్కలను కృష్ణుడిపై గొడుగులా చాచి కైంకర్యం చేస్తుండటం వాళ్ళు చూశారని ఆమె తెలుపుతుంది.

మాలాయ్ ప్పిఱంద నంబియై మాలే శెయ్యుం మణళానై
ఏలా ప్పొయ్గళ్ ఉరైప్పానై ఇంగే పోదక్కండీరే?
మేలాల్ పరంద వెయిల్ కాప్పాన్ వినదై శిఱువన్ శిఱగెన్నుం
మేలాప్పిన్ కీళ్ వరువానై విరుందావనత్తే కండోమే

అన్నీ అబద్ధాలు చెప్పేవాడు, అందరికీ ప్రియ వరుడైనవాడు, గోపికలకై దివ్య అవతారము ఎత్తిన ఆ కృష్ణుడిని ఇక్కడెక్కడైనా చూశారా? దహించే సూర్య కిరణాలు ఎంబెరుమానుడి నల్లని దివ్య తిరుమేనిపైన పడకూడదని, ఆకాశంలో గరుడాళ్వాన్ తన రెక్కలను గొడుగులా చాచి ఉండటం మేము వృందావనంలో చూశామని అంటున్నారు.

నాలుగవ పాశురము: నల్లని ఏనుగు పిల్లలా కనిపించే అద్భుతమైన ఎమ్పెరుమానుని చూచి ఆమె ఆనందిస్తుంది.

కార్ త్తణ్ కమలక్కణ్ ఎన్నుం నెడుంగయిఱు పడుత్తి ఎన్నై
ఈర్ త్తుక్కొండు విళైయాడుం ఈశన్ తన్నైక్కండీరే?
పోర్ త్తముత్తిన్ కుప్పాయ ప్పుగర్మాల్ యానై క్కన్ఱే పోల్
వేర్ త్తు నిన్ఱు విళైయాడ విరుందావనత్తే కండోమే

నల్లని మేఘములపై వికసించిన చల్లని తామరపువ్వుల వంటి దివ్య నేత్రాలు కలిగి ఉన్నవాడు ఎమ్పెరుమానుడు. ఆ దివ్య నేత్రాలు ఒక తాడులా నన్ను కట్టివేసుకుని, నా హృదయాన్ని తన వైపుకి లాక్కుని ఆడుకుంటున్న సర్వేశ్వర భగవానునుని మీరు చూశారా? తన వొల్లంతా ముత్యాలలా మెరిసే చెమట బిందువులతో ఆడుకుంటూ ఒక ఏనుగు పిల్లలా ఉన్న అతడిని వృందావనంలో మేము చూశాము అని వారు అంటున్నారు.

ఐదవ పాశురము: నల్లని మేఘాల మద్య మెరుపులు మెరుస్తున్నట్లుగా ఎమ్పెరుమానుడు తన దివ్య పితాంబరాన్ని ధరించి వీధిలో తిరుగుతున్నాడని ఆమె వివరిస్తుంది.

మాదవన్ ఎన్ మణియినై వలైయిల్ పిళైత్త పన్ఱి పోల్
ఏదుం ఒన్ఱుం కొళత్తారా ఈశన్ తన్నైక్కండీరే?
పీదగ ఆడై ఉడై తాళప్పెరుంగార్ మేగక్కన్ఱే పోల్
వీదియార వరువనై విరుందావనత్తే కండోమే

నీలిమణిలా నాకు అతి మధురమైనవాడు, వల నుండి తప్పించుకున్న వరాహంలా గర్వంగా ఉన్నవాడు, తన వద్ద ఉన్న వాటిని ఎవ్వరికీ ఇవ్వనివాడు, శ్రీమహాలక్ష్మికి పతి అయిన గొప్ప సర్వేశ్వరుని మీరు చూశారా? నల్లని మెఘవర్ణంతో ఉన్న ఎమ్పెరుమానుడు క్రిందకు వ్రేలాడుతూ తన దివ్య పీతాంబరాన్ని ధరించి వృందావనం వీధులలో స్వేచ్ఛగా విహరిస్తుండగా మేము చూశాము.

ఆరవ పాశురము: ఉదయగిరి (సూర్యుడు ఉదయించే పర్వతం) నుండి ఉదయించే సూర్యుని మాదిరిగానే ఎర్రటి తేజస్సుతో తన నల్లని దివ్య స్వరూపంతో వాళ్ళు ఆతడిని చూశారని ఆమె వివరిస్తుంది.

దరుమం అఱియక్కుఱుంబనై త్తన్ కైచ్చార్ంగం అదువే పోల్
పురువ వట్టం అళగియ పొరుత్త మిలియై క్కండీరే?
ఉరువు కరిదాయ్ ముగం శెయ్ధాయ్ ఉదయప్పరుప్పదత్తిన్ మేల్
విరియుం కదిరే పోల్వానై విరుందావనత్తే కండోమే

నిత్యం అల్లరి చేస్తూ ఉండేవాడు, తాను చేత పట్టిన ‘సార్న్గ’ విల్లువంటి దివ్య కనుబొమ్మలతో అందంగా అలంకరించబడినవాడు, దయ అనే మాటకి అర్థం తెలియనివాడు, తన అనుచరులతో పొందిక లేని ఎంబెరుమానుడిని మీరు చూశారా? వృందావన పర్వతం నుండి ఉదయించే సూర్యుని వలె ఎర్రటి తేజస్సును కలిగి దివ్య స్వరూపముతో ఉన్న ఆతడిని మేము చూశాము.

ఏడవ పాశురము: ఆకాశంలో తారలలాగా వృందావనంలో ఎంబెరుమానుడు తన స్నేహితులతో కలిసి రావడం వాళ్ళు చూశారని ఆమె తెలిపింది.

పొరుత్తం ఉడైయ నంబియై ప్పుఱం పోల్ ఉళ్ళుం కరియానై
కరుత్తై పిళైత్తు నిన్ఱ అక్కరుమా ముగిలై క్కండీరే?
అరుత్తి త్తారా కణంగళాల్ ఆరప్పెరుగు వానం పోల్
విరుత్తం పెరిదాయ్ వరువానై విరుందావనత్తే కండోమే

తన దివ్య స్వరూపం వలె నల్లని హృదయం కూడా కలవాడు [ఎటువంటి దయ లేని], నా భావనలకు భిన్నమైన ఆ నల్లని మేఘవర్ణుడు, అందరికీ స్వామి అయిన కృష్ణుడిని మీరు చూశారా? నక్షత్రాలతో నిండిన ఆకాశంలా, అనేక మంది తన స్నేహితుల మధ్య ఉన్న ఎంబెరుమానుడిని  వృందావనంలో మేము చూశాము.

ఎనిమిదవ పాశురము: తన దివ్య భుజాల వరకు మెరుస్తున్న అందమైన శిరోజాలతో ఎమ్పెరుమాన్ ఆడుకోవడం వాళ్ళు చూశారని ఆమె వివరిస్తుంది.

వెళియ శంగు ఒన్ఱు ఉడైయానై ప్పీదగ ఆడై ఉడైయానై
ఆళి నంగుడైయ తిరుమాలై ఆళియానై క్కండీరే?
కళి వండు ఎంగుం కలందాఱ్పోళ్ కమళ్ పూంగుళల్గళ్ తడందోళ్ మేల్
మిళిర నిన్ఱు విళైయాడ విరుందావనత్తే  కండోమే

సాటిలేని తెల్లటి శ్రీ పాంచజన్యం (దివ్య శంఖం), దివ్య పట్టు పీతాంబరములు ధరించినవాడు, కరుణామయుడు, దివ్య చక్రాన్ని ధరించిన శ్రీమహాలక్ష్మికి పతి అయిన ఆ కృష్ణుడిని మీరు చూశారా? తేనేను త్రాగిన భ్రమరాలు ఆనందంతో విహరిస్తున్నట్లు సుగంధభరితమైన ఆతడి దివ్య శిరోజములు తన దివ్య భుజాలపై శోభాయమానంగా వేలాడుతుండగా ఆయన మాకు వృందావనంలో దర్శనమిచ్చాడు.

తొమ్మిదవ పాశురము: వృందావన అడవుల్లో రాక్షసులను వేటాడే ఎంబెరుమానుడిని వాళ్ళు చూశారని ఆమె వివరిస్తుంది.

నాట్టై పడై ఎన్ఱు అయన్ ముదళాత్తండ నళిర్ మామలర్ ఉంది
వీట్టై పణ్ణి విళైయాడుం విమలన్ తన్నై క్కండీరే?
కాట్టై నాడి త్తేనుగనుం కళిఱుం పుళ్ళుం ఉడన్ మడియ
వేట్టై ఆడి వరువానై విరుందావనత్తే  కండోమే

బ్రహ్మ మరియు అతను ఉండుటకు నివాసాన్ని తన నాభీ కమలములో సృష్థించినవాడు. ఆపై ప్రజాపతులకు (సృష్థి చేయువారు) సృష్థి కార్యము చెయ్యమని ఆదేశించి తాను ఆడే రసాన్ని ఆనందించిన ఆ ఎంబెరుమానుని మీరు చూశారా? ధేనుకాసురుడిని, కువలయాపీడమ్ ఏనుగుని, బకాసురుడిని వధించిన కృష్ణుడిని మేము చూశాము.

పదవ పాశురము: ఈ పది పాశురాలని నిత్యం ధ్యానించేవారు ఎంబెరుమానునితో విడదీయరాని విధంగా ఉంటారని, ఆయనకు కైంకర్యాన్ని నిర్వహిస్తారని చెబుతూ ఆమె ఈ పదిగాన్ని పూర్తి చేస్తుంది.

పరుందాల్ కళిఱ్ఱుక్కు అరుళ్ శెయ్ద పరమన్ తన్నై పారిన్ మేల్
విరుందావనత్తే కండమై విట్టుచిత్తన్ కోదై శొల్
మరుందాం ఎన్ఱు తం మనత్తే వైత్తుక్కొండు వాళ్వార్గళ్
పెరుందాళ్ ఉడైయ పిరాన్ అడిక్కీళ్ పిరియాదెన్ఱుం ఇరుప్పారే

బలిష్టమైన కాళ్లు ఉన్న శ్రీ గజేంద్రాళ్వాన్ (ఏనుగు)పై తన కృపను కురిపించిన సర్వేశ్వరుని ఆరాధిస్తూ ఈ పాశురములను పెరియాళ్వార్ల దివ్య కుమార్తె అయిన ఆండాళ్ దయతో పాడింది. పుట్టుక అనే వ్యాధికి విరుగుడుగా ఈ పాశురాలను మనస్సులో ధ్యానించేవారు, ఎన్నడూ విడిపోకుండా ఎంబెరుమానుని దివ్య పాదాల వద్ద శాశ్వత కైంకర్యము పొందుతారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2020/05/nachchiyar-thirumozhi-14-simple/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

నాచ్చియార్ తిరుమొళి – సరళ వ్యాఖ్యానము – పదిమూన్డ్ఱామ్ తిరుమొళి – కణ్ణన్ ఎన్నుం

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

నాచ్చియార్ తిరుమొళి

< పన్నిరండాం తిరుమొళి – మఱ్ఱు ఇరుందీర్గట్కు

ఎక్కడికీ వెళ్లలేని ఆమె పరిస్థితిని చూసి వారు జాలిపడి విచారించారు. ప్రయత్నిస్తే అతి కష్థం మీద ఆమెను ఒక మంచములో పరుండ పెట్టి మాత్రమే తీసుకువెళ్లగలరు. ఈ స్థితిలో కూడా, ఆమె వారితో “మీరు నా స్థితిని చక్కదిద్దాలనుకుంటే, ఎంబెరుమానుడికి సంబంధించిన  ఏ వస్తువైన తీసుకువచ్చి నాపైన మర్దన చేస్తే నా ప్రాణాలు దక్కుతాయి” అని ప్రార్థించింది.

“భగవానునిపై పూర్ణ భక్తిలో మునిగిన నీవు, నిజంగా ఇంత బాధపడాలా? అంతటి ఎంబెరుమానునికి శరణాగతి చేసిన తరువాత కూడా ఇంత దుఃఖాన్ని అనుభవించాలా? నీవు ఇలా చేస్తే ఎలా, అతడికి వచ్చే నింద గురించి ఆలోచించావా?” అని వారు ప్రశ్నించారు. ఆమె స్పందిస్తూ, “వంశానికి నింద రాకూడదని మీరు చెప్పే మాటలు నా ఈ ప్రస్తుత స్థితికి తగినవి కావు. నన్ను రక్షించాలనుకుంటే, ఎంబెరుమానుని నుండి ఏదైనా ఒక వస్తువుని తెచ్చి నాపైన మర్ధన చేయండి” అని ప్రార్థించింది.

మొదటి పాశురము: ఆతడు తన దివ్య తొడపై ధరించిన పచ్చని పట్టు పీతాంబరాన్ని తీసుకువచ్చి దానితో విసిరి తన బాధను తగ్గించమని ఆమె వారిని కోరుతుంది.

కణ్ణన్ ఎన్నుం కరుం దెయ్వం కాట్చి పళగిక్కిడప్పేనై
పుణ్ణిల్ పుళిప్పు ఎయ్ధార్పోల్ పుఱం నిన్ఱు అళగు పేశాదే
పెణ్ణిన్ వరుత్తం అఱియాద పెరుమాన్ అరైయిల్ పీదగ
వణ్ణ ఆడై కొణ్డు ఎన్నై వాట్టం తణియ వీశిరే

ఓ అమ్మలారా!  నేను భగవత్స్వరూపుడైన నల్లని ఆ కృష్ణుడి సాన్నిధ్యములో ఉన్నాను. పుండుపైన కారం చల్లినట్లు నాకు సలహాలిచ్చి అలా దూరంగా ఉండి నన్ను చికాకు పెట్టే బదులు, ఆడపిల్లల మనోవేదన తెలియని ఆ కృష్ణుడు నడుమున ధరించి ఉన్న పచ్చని దివ్యమైన వస్త్రాన్ని తెచ్చి నన్ను విసిరితే ఈ విరహవేదన బాద మాయమౌతుంది.

రెండవ పాశురము: ఆతడు ధరించిన ఆ దివ్యమైన తుళసీ మాలని తీసి, ఆమె శిరోజాలపై అలంకరించమని ఆమె వారిని కోరుతుంది.

పాల్ ఆలిలైయిల్ తుయిల్ కొణ్డ పరమన్ వలైప్పట్టు ఇరుందేనై
వేలాల్ తున్నం పెయ్దాఱ్పోల్ వేణ్డిఱ్ఱెల్లాం పేశాదే
కోలాల్ నిరై మేయ్ త్తు  ఆయనాయ్ క్కుడందైక్కిడంద కుడమాడి
నీలార్ తణ్ణం తుళాయ్ క్కొండు ఎన్నెఱి మెన్ కుళల్ మేల్ శూట్టీరే

చిన్న శిశువు రూపంలో లేత మర్రి ఆకుపై పడుకొని ఉన్న ఆ మహోన్నతుడి వలలో నేను చిక్కుకున్నాను. సూదులలా నన్ను గుచ్చుకుంటున్న మీ మాటలు ఆపండి. దాని బదులు, తిరుక్కుడన్దై లో శయనించి ఉన్న పశుకాపరి కృష్ణుడు ధరించిన అందమైన చల్లని తాజానైన తుళసి మాలను తెచ్చి నా మెత్తటి శిరోజాలపైన అలంకరించండి.

మూడవ పాశురము: ఆతని ఛాతీపై ఉన్న వనమాలను తీసుకొచ్చి, ఆతని చూపుల బాణంతో గాయమై ఉన్న నా ఛాతీపై దొర్లిస్తే చల్లబడుతుంది.

కంజైక్కాయ్ంద కరువిల్లి కడైక్కణ్ ఎన్నుం శిఱైక్కోలాల్
నెంజు ఊదురువ ఏవుండు నిలైయుం తళర్ందునై వేనై
అంజేల్ ఎన్నాన్ అవన్ ఒరువన్ అవన్ మార్వణింద వనమాలై
వంజియాదే తరుమాగిల్ మార్విల్ కొణర్ందు పురట్టీరే

కంసుడిని వధించిన విశాల బాణాలను పోలిన కనుబొమ్మలున్న కృష్ణుడు, చూపుల బాణాలతో నన్ను గాయపరచాడు. మనందరికీ భిన్నమైనవాడు, ఎంతో విశిష్టత కలిగిన ఆ ఎంబెరుమానుడు, “భయపడవద్దు” అని అనట్లేదు. ఆ ఎంబెరుమానుడు తాను ధరించిన వనమాలను, ఏ  మోసపోకుండా కృపతో ఇస్తే, దయచేసి దానిని తీసుకువచ్చి నా ఛాతీపై చుట్టండి.

నాలుగవ పాశురము: ఆమె ఎంబెరుమానుడు అయిన శ్రీమహాలక్ష్మీ పతి యొక్క దివ్య అదరములను తనలో ఇమిడ్చి తన అలసటను తొలగించమని ప్రార్థిస్తుంది.

ఆరే ఉలగత్తు ఆఱ్ఱువార్? ఆయర్పాడి కవర్ందుణ్ణుం
కారేఱుళక్క ఉళక్కుండు తళర్ందుం ముఱిందుం కిడప్పేనై
ఆరావముదం అనైయాన్ తన్ అముద వాయిల్ ఊఱియ
నీర్ తాన్ కొణర్ందు పులరామే పరుక్కి ఇళైప్పై నీక్కిరే

నల్లటి వృషభమును పోలిన కృష్ణుడు  తిరువాయ్ ప్పాడి (శ్రీగోకులం) మొత్తాన్ని దోచుకుని అనుభవించాడు. నన్ను హింసించి బలహీన పరచినవాడు, వేదనకు గురిచేసి నన్ను ఓదార్చ గలిగే వాడు కూడా ఆతడే. (“మేమందరం ఇక్కడ ఉన్నాము; నీకు ఏమి కావాలి?” అని అమ్మలు అడిగారు) ఎంత తాగినా దాహం తీరనటువంటి ఆతడి దివ్య నోటిలోని తేనె లాంటి రసాన్ని నా కోసము తీసుకురండి,  నా నిరుత్సాహాన్ని తొలగించగలిగినది, నా శరీరాన్ని వాడిపోవ్వని ఆ మకరందాన్ని నాకు తాగించి నన్ను సంతృప్తి పరచండి.

ఐదవ పాశురము: “నా కోసమే ఉన్న అతని పెదవుల దివ్యామృతం దొరకకపోతే, ఆతడు వేణువు ఊదుతున్నప్పుడు పడిన అదరామృత తేనె జల్లులను సేకరించి వచ్చి నా ముఖముపైన పూయండి” అని వారిని ప్రార్థించింది.

అళిలుం తొళిలుం ఉరుక్కాట్టాన్ అంజేల్ ఎన్ఱాన్ అవన్ ఒరువన్
తళువి ముళువిప్పుగుందు ఎన్నైచ్చుఱ్ఱి చ్చుళన్ఱు పోగానాల్
తళైయిన్ పొళిల్ వాయ్ నిరైప్పిన్నే నెడుమాల్ ఊది వరుగిన్ఱ
కుళైయిన్ తొళై వాయ్ నీర్ కొండు కుళిర ముగత్తు త్తడవీరే

కృష్ణుడు తనను పూజించినా, తన కోసము క్షోబించి క్షీణించినా, తాను దర్శనము ఇవ్వడు, “భయపడకుము” అని కూడా అనని గొప్పవాడు. ఆతడు  ఇక్కడికి వచ్చాడు, ముందు వెనుక నన్ను చుట్టుముట్టాడు, నన్ను గట్టిగా కౌగిలించుకున్నాడు. అయ్యో! ఇది కేవలము నా భ్రమ.  నెమలి ఈకలతో చేసిన గొడుగు మాదిరిగా గోవుల వెనుక నిలబడి ఉన్న కృష్ణుడి మురలి రంధ్రాల నుండి చిట్లిన తేనె జల్లులను తీసుకురండి. నా ముఖం మీద ఆ నీటి బిందువులను రాసి నన్ను చల్ల పరచండి.

ఆరవ పాశురము: కనీసం నిర్లజ్జుడైన ఆ కృష్ణుడి దివ్య పాదాల క్రింది ధూలినైనా తెచ్చి నా శరీరంపై పూయండి, నేను నా ప్రాణాన్ని నిలబెట్టుకోగలను.

నడై ఒన్ఱిల్లా ఉలగత్తు నందగోపన్ మగన్ అన్నుం
కొడియ కడియ తిరుమాలాల్ కుళప్పుక్కూఱు కొళప్పట్టు
పుడైయుం పెయరగిల్లేన్ యాన్ పోట్కన్ మిదిత్త అడిప్పాట్టిల్
పొడిత్తాన్ కొణర్ందు పూశీర్గళ్ పోగా ఉయిర్ ఎన్నుడంబైయే

శ్రీయః పతి (శ్రీ మహాలక్ష్మి భర్త), స్వార్ధపరుడు, కృపాహీనుడైన ఆ నందగోప తనయుడి కారణంగా,  అన్ని హద్దులు దాటి ఈ ప్రపంచంలో అనేక రకాలుగా హింసిపబడ్డాను నేను, కొంచెం కూడా కదలలేక, పూర్తి శక్తిహీనమై ఉన్నాను. ఆ నిర్లజ్జుడైన కృష్ణుడి దివ్య పాదాలు నడయాడిన మట్టిని సేకరించి నా శరీరంపై పూయండి, నా ప్రాణము దక్కించండి.

ఏడవ పాశురము: స్వయంగా ఆతడు తన వద్దకు రాకపోయినా సరే, తనని అతని వద్దకు తీసుకెళ్లగలిగితే, అది కూడా నాకు ఆమోదయోగ్యమేనని, అలా చేయమని ఆమె వారిని ప్రార్థించింది.

వెఱ్ఱి కరుళక్కొడియాన్ తన్ మీమీదు ఆడా ఉలగత్తు
వెఱ్ఱ వెఱిదే పెఱ్ఱ తాయ్ వేంబేయాగ వళర్ త్తాళే
కుఱ్ఱమఱ్ఱ ములై తన్నై క్కుమరన్ కోలప్పణైత్తోళోడు
అఱ్ఱ కుఱ్ఱం అవై తీర అణైయ అముక్కిక్కట్టీరే

గరుడ ధ్వజము కలిగి ఉన్న ఆ ఎంబెరుమానుడి ఆదేశాన్ని దాటేవారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు, ఆతడి తల్లి అయిన యశోద ఆతడికి భయము భక్తులు లేకుండా పెంచింది. అతను ఒక, చేదు వేప పండు వలె ఎవ్వరికీ ఎలాంటి ఫలితము లేకుండా అయ్యాడు. కల్ప వృక్షపు కొమ్మల వంటి యౌవనస్థుడైన ఎంబెరుమానుడి భుజాలతో నా స్థనములను బంధించండి, ఆయన తప్పా మరొకరిని ఇష్టపడే ఎలాంటి దోషం వాటికి అంటదు.

ఎనిమిదవ పాశురము: నన్ను బహిష్కరించిన అతన్ని నేను కలిసినప్పుడు, ఎందుకూ పనికిరాని నా స్థనములను పెలికి ఆతడి ఛాతీపై విసిరేస్తాను. అలాగైనా నా ఈ బాధల నుండి విముక్తి పొందుతాను.

ఉళ్ళే ఉరుగి నైవేనై ఉళళో ఇలళో ఎన్నాద
కొళ్ళై కొళ్ళిక్కుఱుంబనై గోవర్తననై క్కండక్కాల్
కొళ్ళుం పయన్ ఒన్ఱు ఇల్లాద కొంగై తన్నైక్కిళంగోడుం
అళ్ళిప్పఱిత్తిట్టు అవన్ మార్విల్ ఎఱిందు ఎన్ అళలై తీర్వేనే

గాయాలతో కరిగిపోయిన మనసుతో ఉన్న నా గురించి ఒక్కసారైనా “ఆమె బతికే ఉందా లేక మరణించిందా?” అని ఇంతవరకు ఆయన అడగ లేదు. అతను నా ఆస్తినంతా కాజేశాడు. నాకు ఇంత బాధను కలిగించిన ఆ కృష్ణుడిని ఒక వేళ నేను చూసినట్లయితే, నేను ఈ పనికిరాని స్థనములను పెలికి ఆతడి ఛాతీపై విసిరేస్తాను. నా వేదన కొంచం తగ్గుతుంది.

తొమ్మిదవ పాశురము: అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఆమెను తన అంతర్యామి ఎంబెరుమానుడిని అనుభవించమని చెప్పినప్పుడు,  “నేను ఆతడిని ఈ రూపంలోనే సేవించాలి; అతడిని నేను ఇతర ఏ రూపాలలోనూ అనుభవించ గోరను.” అని ఆమె తెలిపింది.

కొమ్మై ములైగళ్ ఇడర్ తీర గోవిందఱ్కు ఓర్ కుఱ్ఱేవల్
ఇమ్మై ప్పిఱవి శెయ్యాదే ఇనిప్పోయ్ చ్చెయ్యుం తవం తాన్ ఎన్?
శెమ్మై ఉడైయ తిరుమ్మార్విల్ శేర్తానేలుం ఒరు నాన్ఱు
మెయ్ మ్మై శొల్లి ముగం నోక్కి విడై తాన్ తరుమేల్ మిగ నన్ఱే

బాగా ఎదిగిన, బలిష్టమైన నా స్థనములతో కృష్ణుడికి ఈ జన్మలోనే అంతరంగ సేవ చేయుటకు బదులు, వేరే చోటికి వెళ్లి తపస్సు చేయడంలో అర్థమేముంది? తన భక్తులను ఆలింగనము చేసుకొనుటకు మాత్రమే ఉన్న ఆతడి దివ్య వక్ష స్థలముతో నన్ను ఆప్యాయతతో ఆయన ఆలింగనం చేసుకుంటే బావుంటుంది. ఒక రోజు నన్ను అతడు చూసి, “నువ్వు నాకు అక్కర లేదు” అని చెప్పినా సరే, ఇంకా బావుంటుంది.

పదవ పాశురము: ఈ దశకం నేర్చుకున్నవారికి తనలా దుఃఖానుభవము కాకుండా కేవలం సుఖాన్ని మాత్రమే అనుభవిస్తారని తెలుపుతూ పూర్తి చేసింది.

అల్లల్ విళైత్త పెరుమానై ఆయర్ పాడిక్కు అణివిళక్కై
విల్లి పుదువై నగర్ నంబి విట్టుచిత్తన్ వియన్ కోదై
విల్లైత్తొలైత్త పురువత్తాళ్ వేట్కై ఉఱ్ఱు మిగ విరుంబుం
శొల్లైత్తుదిక్క వళ్ళార్గళ్ తున్బ క్కడలుళ్ తువళారే

విల్లుని కూడా ఓడించిన కనుబొమ్మలు, అద్భుతమైన లక్షణాలను కలిగి ఉన్న ఆండాళ్,  శ్రీవిల్లిపుత్తూర్కి నాయకుడైన పెరియాళ్వార్ల దివ్య కుమార్తె.  శ్రీ గోకులంలో అల్లరి చేష్థితాలతో ఎన్నో లీలలు ఆడి శ్రీ గోకుల దీపము అని పేరు తెచ్చుకున్న కృష్ణుడిపై ఆమె కరుణతో సంకలనం చేసిన ఈ పాశురాలను పాడే సామర్థ్యం ఉన్నవారికి ఈ సంసార సాగరములో దుఃఖాలు ఉండవు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2020/05/nachchiyar-thirumozhi-13-simple/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

నాచ్చియార్ తిరుమొళి – సరళ వ్యాఖ్యానము – పన్నిరండాం తిరుమొళి – మఱ్ఱు ఇరుందీర్గట్కు

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

నాచ్చియార్ తిరుమొళి

<< పదినొన్ఱాం తిరుమొళి – తాం ఉగక్కుం

ఆతడు సర్వరక్షకుడని, అందరినీ రక్షిస్తాడని ఎంబెరుమానుడి మాటలను ఆమె నమ్మింది, కానీ ఫలించలేదు. పెరియాళ్వార్లతో తనకున్న సంబంధాన్ని ఆమె నమ్మింది. అది కూడా ఆమె ఆశించిన ఫలాన్ని ఇవ్వలేకపోయింది. వీటి చింతన చేస్తూ బాధని అనుభవించింది. ఎంబెరుమానుడు స్వతంత్రుడు అయినందున, ఆమె తన ఆచార్యులైన పెరియాళ్వార్ల ద్వారా ఆతనిని పొందాలని ప్రయత్నించింది. అది కూడా ఆమె ఆశించిన ఫలాన్ని ఇవ్వలేకపోయింది. ఆమె అనుకుంది “ఎంబెరుమానుడు స్వతంత్రుడు. తన భక్తులని ఆతడు కాపాడకపోతే, ఆతను అపకీర్తి పాలౌతాడు. ఆతడు ఎవరినైనా రక్షించాలను కుంటే దానిని ఆపేవారెవ్వరూ లేరు. అందువల్ల ఆతని స్వతంత్రతయే ఫలాన్ని పొందడానికి సాధనముగా పనిచేస్తుంది” అని తిరిగి అతడి వద్దకి వెళ్లడానికి ప్రయత్నించింది. ఆమె ఈ విషయంలో దృఢ నిశ్చయంగా ఉన్నప్పటికీ, ఆతను రాకపోయే సరికి, ఏమి చేయాలో తెలియక గాబరా పడింది. ప్రేమ అధికమై పొంగి ప్రవహిస్తున్న కారణంగా ఆమె ఆతను వచ్చే వరకు ఆగలేకపోయింది. భగవానుడికి పరతంత్రురాలన్న తన స్వరూపానికి విరుద్ధమైనప్పటికీ, ఏదో విధంగా అతనిని చేరుకోవాలని తాపత్రేయపడుతూ, తన చుట్టూ ఉన్న వాళ్ళని “భగవానుడు నిత్య నివాసుడై ఉండే ఉత్తర మథుర, ద్వారక వంటి స్థానాలకు చేర్చండి” అని ఆమె అభ్యర్థించింది.

మొదటి పాశురము: “ఎంబెరుమానుడు వచ్చే వరకు నువ్వు ఎదురుచూడాలి, ఇంత తాపత్రేయ పడే అవసరం లేదు” అని చుట్టూ ఉన్నవాళ్ళు అన్నారు. “నా పరిస్థి గురించి అర్థం కాని వారితో మాట్లాడి ఫలితం లేదు” అని ఆమె బదులిచ్చెను.

మఱ్ఱిరుందీర్గట్కు అఱియలాగా మాదవన్ ఎన్బదోర్ అన్బు తన్నై
ఉఱ్ఱిరుందేనుక్కు ఉరైప్పదెల్లాం ఊమైయరోడు శెవిడర్ వార్ త్తై
పెఱ్ఱిరుందాళై ఒళియవే పోయ్ ప్పేర్తొరు తాయిల్ వళర్ంద నంబి
మఱ్పొరుందామఱ్కళం అడైంద మదురై ప్పుఱత్తు ఎన్నై ఉయ్ త్తిడుమిన్

నా పరిస్థితి వేరు నీ పరిస్థితి వేరు. మాధవుడి (శ్రీ మహాలక్ష్మీకి పతి) పట్ల ప్రేమ ఎంతో ఎత్తుకి ఎదిగిన నాకు మీరు ఏమి చెప్పినా అది మూగ చెవిటి వాడి మధ్య సంభాషణ వలె వ్యర్థకరమైనది. మీరు చేయగలిగినది ఒక్కటే. తన కన్న తల్లి అయిన దేవకిని విడిచిపెట్టి యశోధ దగ్గర పెరిగిన కృష్ణుడు ఉన్న మధురకి నన్ను తీసుకెళ్లండి.

రెండవ పాశురము: “ఏది ఏమైనా, నీవు ఆతడి వెనకపడటం ఏమీ బాగోలేదు, ఆతడికి చెడ్డ పేరు వస్తుంది; నీవు నీ స్త్రీత్వాన్ని కూడా కాపాడుకోవాలి కదా?” అని చుట్టూ ఉన్న వారు అన్నారు.

నణి ఇనియోర్ కరుమం ఇల్లై నాల్ అయలారుం అఱిందొళిందార్
పాణియాదు ఎన్నై మరుందు శెయ్దు పండు పణ్డాక్క ఉఱుదిరాగిల్
మాణి ఉరువాయ్ ఉలగళంద మాయనై క్కాణిల్ తలైమఱియుం
ఆణైయాల్ నీర్ ఎన్నై క్కాక్క వేణ్డిల్ ఆయ్ ప్పాడిక్కే ఎన్నై ఉయ్ త్తిడుమిన్

సిగ్గుపడడంలో ఇక ప్రయోజనం లేదు. ఊరి జనాలకు అన్ని విషయాలు తెలుసిపోయాయి. నన్ను ఎంబెరుమానుడితో ఏకం కాక ముందు, అతని నుండి వీడి ఇలా బాధ పడక ముందు ఉన్న స్థితిలో నన్ను చూడాలనుకుంటే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా, నన్ను తిరువాయర్పాడి (శ్రీ గోకులం) కి తీసుకెళ్లండి. వామనుడి రూపంలో అవతరించి సమస్థ లోకాలను కొలిచిన ఆ భగవానుడిని ఆరాధిస్తే నా రోగం మాయమౌతుంది.

మూడవ పాశురము: కృష్ణుడి విషయంలో యశోదా పిరాట్టి పెంపకాన్ని నిందించి ప్రయోజనం లేదు. తండ్రిగా కృష్ణుడిని నియంత్రించాల్సిన శ్రీ నంద గోపుడి దివ్య భవనం ముందు తనను దిగబెట్టమని ఆమె వారికి కోరుతుంది.

తందైయుం తాయుం ఉఱ్ఱరుం నిఱ్కత్తని వళి పోయినాళ్ ఎన్నుం శొల్లు
వంద పిన్నై ప్పళి కాప్పరిదు మాయవన్ వందు ఉరుక్కాట్టుగిన్ఱాన్
కొందళమాక్కి ప్పరక్కళిత్తు క్కుఱుంబు శెయ్వాన్ ఓర్ మగనై ప్పెఱ్ఱ
నందగోపాలన్ కడైత్తలైక్కే నళ్ళీరుట్కన్ ఎన్నై ఉయ్ త్తిడిమిన్

ఊరంతా ఈ విషయము పాకిపోయింది.  తల్లి తండ్రులు బంధుమిత్రులు వీధిలో ఉండగా, వాళ్ళకి కళంకం తెచ్చే పని చేయకూడదు, కానీ ఒంటరిగా కూడా వెళ్లడం సాధ్యం కాదు. దివ్య లీలలు ఆడిన ఆ శ్రీ కృష్ణుడు తన దివ్య స్వరూపంతో నా ముందుకు వచ్చి నన్ను ఆకర్షిస్తున్నాడు. ఆడపిల్లలతో జగడాలు ఆడి, అల్లరి చేసి నాకు నిందలు తెచ్చిన ఆ శ్రీ నందగోప తనయుడి దివ్య భవనము యొక్క ప్రవేశ ద్వారం వద్దకు అర్ధరాత్రి వేళ నన్ను తీసుకెళ్లండి.

నాలుగవ పాశురము: ఎంబెరుమానుడికి పూర్ణ శరణాగతురాలైన ఆమెను యమునా తీరాన వెదలమని వాళ్ళని ఆమె ప్రార్థిస్తుంది.

అంగై త్తలత్తిడై ఆళి కొండాన్ అవన్ ముగత్తన్ఱి విళియేన్ ఎన్ఱు
శెంగచ్చుక్కొండు కణ్ణాడై ఆర్ త్తుచ్చిఱు మానిడవరైక్కాణిల్
నాణుం కొంగై త్తలమివై నోక్కిక్కాణీర్ గోవిందనుక్కల్లాల్ వాయిల్ పోగా
ఇంగుత్తై వాళ్వై ఒళియవే పోయ్ యమునైక్కరైక్కు ఎన్నై ఉయ్ త్తిడుమిన్

ఓ తల్లులారా! నా స్తనములను దగ్గరగా గమనించండి. అల్పమైన వాళ్ళని చూడటానికి సిగ్గుపడుతూ తమపైన ఎర్రటి వస్త్రాన్ని కప్పుకున్నాయి. అందమైన తన హస్థములో దివ్య చక్రాన్ని ధరించిన కృష్ణుడి ముఖం తప్పా మరెవ్వరినీ చూడనంటున్నాయి. గోవిందుడి ఇంటి ద్వారము తప్పా మరెవరి ఇంటి ద్వారాన్ని చూడనంటున్నాయి. ఇక్కడ ఇక ఉండలేను, కాబట్టి ఇక్కడ జీవించే కన్నా నన్ను యమునా తీరానికి తీసుకెళ్లండి.

ఐదవ పాశురము: అక్కడ ఉన్నవారు ఆమె బాధ ఏమిటో తెలుసుకుని సరైన పరిహారమేమిటో చేయాలని భావించారు. తనతో సంబంధం ఉన్నంత మాత్రాన తన బాధ ఏమిటో తెలుసుకోలేరని ఆమె ఆగ్రహించింది.

ఆర్ క్కుం ఎన్ నోయ్ ఇదు అఱియల్ ఆగాదు అమ్మనైమీర్! తుళదిప్పడాదే
కార్ క్కడల్ వణ్ణన్ ఎన్బాన్ ఒరువన్ కైకణ్డ యోగం తడవత్తీరుం
నిర్ క్కరై నిన్ఱ కడంబై ఏఱి క్కాళియన్ ఉచ్చియిల్ నట్టం పాయ్ంద
పోర్ క్కళమాగ నిరుత్తం శెయ్ద పొయ్గైక్కరైక్కు ఎన్నై ఉయ్ త్తిడుమిన్

ఓ మాతలారా! నా బాధ మీకెవ్వరికీ అర్థం కాదు. మీరు దుఃఖించకుండా, మీరు నన్ను యమునా తీరమున వదిలి పెట్టండి.  కదంబ వృక్షము పైకి ఎక్కిన కృష్ణుడు, కాలియ అనే సర్ప రాక్షసుడి శిరస్సుపైకి దూకి నటనమాడి యమున తీరముని యుద్ద భూమిగా మార్చాడు. నల్లటి సాగరపు వర్ణతో ఉన్న అటువంటి కృష్ణుడు తన దివ్య హస్తాలతో నన్ను మెల్లగా రాసి మందలిస్తే ఈ వ్యాధి నయమవుతుంది. తక్షణ పరిహారం కావాలంటే ఇది ఒక్కటే మార్గం.

ఆరవ పాశురము: ఋషిపత్నుల చేతుల నుండి కృష్ణుడు అన్నం తిన్న ప్రదేశంలో ఆమెను దింపమని ఆమె వారిని కోరుతుంది.

కార్ త్తణ్ ముగిలుం కరువిళైయుం కాయా మలరుం కమలప్పూవుం
ఈర్ త్తిడుగిన్ఱన ఎన్నై వందిట్టు ఇరుడీకేశన్ పక్కల్ పోగే ఎన్ఱు
వేర్ త్తుప్పశిత్తు వయిఱశైందు వేణ్డడిశిల్ ఉణ్ణుంబోదు ఈదెన్ఱు
పార్ త్తిరుందు నెడునోక్కు క్కొళ్ళుం పత్తవిలోశనత్తు ఉయ్ త్తిడుమిన్

వర్షాకాలంలో ఏర్పడిన మేఘాలు, కరువిళా పుష్పాలు, కాయాంబు పుష్పాలు, తామర పుష్పాలు నా ముందు నిలబడి “నువ్వు కూడా హృశీకేశుడి దగ్గరకు వెళ్ళు, అని నన్ను బలవంతం చేశాయి“. ఆవుల కాపరిగా భక్తవిలోచనుడు, ఆవులను మేపుటకు వెళ్లి చెమటలు కార్చుకుంటూ, ఆకలితో కృంశించుకు పోయిన కడుపుతో అలసిపోయి, అన్నం పట్టుకు వచ్చే ఋషిపత్నుల రాకకై ఎదురుచూసి, వాళ్ళు రాగానే “నువ్వు కావలసినంత తిను” అని లీల ఆడిన ప్రదేశానికి నన్ను  తీసుకెళ్లండి.

ఏడవ పాశురము: ఈ దుఃఖానికి అంతు ఎప్పుడు అని అడిగినప్పుడు, ఆతడి దివ్య తుళసి మాలను ధరిస్తేనే అది ముగుస్తుంది అని ఆమె తెలిపి, ఆతడి దివ్య దండను ఉంచిన చోటికి తీసుకెళ్లమని ఆమె వారిని కోరింది.

వణ్ణం తిరివుం మనం కుళైవుం మానం ఇలామైయుం వాయ్ వెళుప్పుం
ఉణ్ణల్ ఉఱామైయుం ఉళ్ మెలివుం ఓద నీర్ వణ్ణన్ ఎన్బాన్ ఒరువన్
తణ్ణందుళాయ్ ఎన్నుం మాలై కొండు శూట్ట త్తణియుం పిలంబన్ తన్నై
పణ్ణళియ ప్పలదేవన్ వెన్ఱ పాణ్డి వడత్తు ఎన్నై ఉయ్ త్తిడుమిన్

నా ముఖచాయలో మార్పు, మనస్సులో అలసట, నిర్లజ్జ స్థితి, పాలిపోయిన నా పెదవులు, ఆహారం సహించకపోవడం, జ్ఞానము క్షీణించుట వంటి ప్రేమ సూచనము నాలో కనిపిస్తున్నాయి. ఆ నీల వర్ణుడు అద్వితీయుడైన కృష్ణుడు ధరించిన చల్లని, అందమైన దివ్య తుళసి మాలను నేను ధరించినప్పుడు ఇవన్నీ నన్ను వదిలివేస్తాయి. మీరు దానిని ఇక్కడికి తీసుకురాలేరు కాబట్టి, నన్ను బాండీరం అనే మర్రి చెట్టు ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లండి. కృష్ణుడి సోదరుడైన బలరాముడు ప్రలంబాసురుడు అనే రాక్షసుడి ఎముకలు విరిచి  వధించిన ప్రదేశమది.

ఎనిమిదవ పాశురము: ఆతడు గోవులను రక్షించిన గోవర్ధనము వద్దకి తీకుకువెళ్ళమని ప్రార్థిస్తుంది.

కఱ్ఱినం  మెయ్ క్కిలుం మేయ్ క్కప్పెఱ్ఱాన్ కాడు వాళ్ శాదియుం ఆగప్పెఱ్ఱాన్
పఱ్ఱి ఉరలిడై ఆప్పుం ఉణ్డాన్ పావిగాళ్! ఉంగళుక్కు ఏచ్చుక్కొలో?
కఱ్ఱన పేశి వశవుణాదే కాలిగళ్ ఉయ్య మళై తడుత్తు
కొఱ్ఱ  కుడైయాగ ఏంది నిన్ఱ గోవర్తనత్తు ఎన్నై ఉయ్ త్తిడుమిన్

కృష్ణుడికి గోవులు, వాటి దూడల మందలని మేపుట వృత్తిగా ఉండేది. తమ ఇండ్లు వదిలి అడవులలో కాపరిగా నివసించే యాదవ వంశంలో జన్మించాడు. ఆతడు వెన్న దొంగిలిస్తూ పట్టుబడ్డాడు, రోటికి కూడా కాట్టివేయబడ్డాడు. ఆతడి గుణాలను అల్లరి పనులను తప్పుగా అర్థచేసుకునే వాళ్ళారా! నాచే మీరు తిట్టించుకోడానికి ఇవే కారణాలైనవి ! మీరు విన్నది నాకు చెప్పి నాతో తిట్టించుకునే బదులు, గొడుగులా కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి గోవులను ఆదుకున్న చోటికి నన్ను తీసుకెళ్లండి.

తొమ్మిదవ పాశురము: నిందల నుండి తప్పించు కోవాలనుకుంటే తనని ద్వారకకి తీకుకువెళ్ళమని ప్రార్థిస్తుంది.

కూట్టిల్ ఇరుందు కిళి ఎప్పోదుం గోవిందా! గోవిందా! ఎన్ఱు అళైక్కుం
ఊట్టు క్కొడాదు శెఱుప్పనాగిల్ ఉలగు అళందాన్ ఎన్ఱు ఉయరక్కూవుం
నాట్టిల్ తలైప్పళి ఎయ్ది ఉంగళ్ నన్మై ఇళందు తలైయిడాదే   
శూట్టుయర్ మాడంగళ్ శూళ్ందు తోన్ఱు తువరాపదిక్కు ఎన్నై ఉయ్ త్తిడుమిన్   

నేను పెంచుకుంటున్న చిలుక పంజరంలో నుండి  గోవిందా! గోవిందా !అని పిలుస్తోంది! నేను దానికి ఆహారాన్ని ఇవ్వకుండా శిక్షించినట్లయితే, అది ఉలగలంద పెరుమానే! అని అంటుంది. కానీ ఆ దివ్య నామాలను నేను వింటే మూర్చ వచ్చి పడిపోతున్నాను. అందుకే, ఈ ప్రపంచంలో పెద్ద నిందను సంపాదించి పేరు పాడుచేసుకొని, మీ తలలు వంచుకునే కంటే, ఎత్తైన భవనాలతో మెరిసిపోతున్న ద్వారకకు నన్ను తీసుకెళ్లండి.

పదవ పాశురము: ఎమ్పెరుమానుని నివాస స్థానాలకి తీసుకువెళ్లమని ప్రార్థిస్తూ ఆండాళ్ పాడిన ఈ పాశురములను పఠించిన వారు అర్చా మార్గం ద్వారా శ్రీవైకుంఠాన్ని పొందుతారని చెప్పి ఆమె ఈ పదిగాన్ని ముగించింది.

మన్ను మదురై తొడక్కమాగ వణ్ తువరాపది తన్నళవుం
తన్నై త్తమర్ ఉయ్ త్తుప్పెయ్య వేణ్డిత్తాళ్ కుళలాళ్ తుణింద తుణివై
పొన్నియల్ మాడం పొలిందు తోన్ఱుం పుదువైయర్కోన్ విట్టుశిత్తన్ కోదై
ఇన్నిశైయాల్ శొన్న శెంజొల్ మాలై ఏత్త వల్లార్ క్కు ఇడం వైగుందమే

బంగారు భవనాలతో ప్రకాశించే శ్రీవిల్లిపుత్తురుకి నాయకుడైన పెరియాళ్వార్ల దివ్య కుమార్తె ఆండాళ్, పొడగాటి శిరోజాలతో అతి సౌదర్యవతి అయిన ఆమె తన బంధువులను మధురతో ప్రారంభించి ద్వారక వరకు ఉన్న దివ్య స్థానాలకు తీసుకెళ్లమని ప్రార్థిస్తూ ఆమె ఈ పది పాశురాలను కూర్చింది. మధురమైన సంగీతాన్ని జోడించి పదాల మాల వంటి ఈ దివ్య కీర్తనలు పఠించగల సామర్థ్యం ఉన్నవారికి నివాస స్థలం ఖచ్చితంగా పరమపదమే.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2020/05/nachchiyar-thirumozhi-12-simple/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

నాచ్చియార్ తిరుమొళి – సరళ వ్యాఖ్యానము – పదినొన్ఱాం తిరుమొళి – తాం ఉగక్కుం

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

నాచ్చియార్ తిరుమొళి

<< పత్తాం తిరుమొళి – కార్కొడల్ పూక్కాళ్

అన్న మాట భగవానుడు తప్పడు; మమ్మల్ని తప్పకుండా రక్షిస్తాడు. ఒకవేళ ఇది విఫలమైనా, తాను పెరియాళ్వార్ల దివ్య పుత్రిక అయినందున తప్పకుండా ఆశ్రయం ఇస్తాడని ఆండాళ్ దృఢ విష్వాసముతో ఉంది.  అయిననూ ఆతడు రానందున, తన చుట్టు ఉన్న అనేక వస్తువులలో ఎంబెరుమానుడి రూపాన్ని గుర్తు చేసుకొని, అర్జునుడి బాణాలతో గాయపడి బాణాల శయ్యపైన పడుకొని బాధపడుతున్న భీష్ముడిలా తానూ క్షోభిస్తుంది. ఇది చూసిన తరువాత తల్లులందరూ, తన స్నేహితులు, మిగతా అందరూ అక్కడ గుమిగూడారు. “ఆతడు వస్తాడని ఖచ్చితంగా నమ్మాను; నా దశ స్థితికి ఈ వచ్చింది; ఈ స్థితిలో కూడా ఆతడు రాలేదు; ఆతడి స్వభావము చూడండి.” అని ఆమె వారితో తన ఆర్తిని చెప్పుకుంది.  ఆపై ఆమె తనను తాను ఓదార్చుకుంటూ, “అతడు ఇంతకు ముందు నాలాంటి కొంతమంది మహిళలకు సహాయం చేశాడు. నాకు కూడా చేస్తాడు, నన్ను కూడా స్వీకరిస్తాడు” అని తనను తాను మందలించుకుంది.

మొడటి పాశురము: “ఇంత బాధాకరమైన స్థితిలో కూడా వచ్చి ఎందుకు సాయం చేయడం లేదు” అన్న ఆమె ప్రశ్నకి సమాధానం ఇచ్చే బాధ్యత అతనికి ఉందా లేదా అడగమని ఆమె వారికి చెప్పింది. నాలో ఏ లోటు లేదు; అతనిలో కూడా ఏ లోటు లేదు; అయినా, అతడు ఎందుకు రావడం లేదు?

తాం ఉగక్కుం తం కైయిల్ శంగమే పోలావో?
యాం ఉగక్కుం ఎం కైయిల్ శంగముం ఏందిళైయీర్!
తీ ముగత్తు నాగణై మేల్ శేరుం తిరువరంగర్
ఆ! ముగత్తై నోక్కారేల్ అమ్మనే! అమ్మనే!

ఆభరణాలతో అలంకరించుకొని ఉన్న అమ్మాయిలారా! నేను ధరించిన ఈ కంకణాలు, ఆతడు సంతోషంగా తన దివ్య హస్థములో ధరించిన శంఖానికి సరిపోలి లేవా? ఆతడి విరహ వేదనలో క్రుంగి క్రుశించినది నా శరీరము.  క్రూరమైన ముఖాలతో ఉన్న తిరు అనంతునిపైన నిద్రించి ఉన్న తిరువరంగనాథుడు ఆ పడగ విప్పిన పాము ముఖాలను రోజూ చూస్తున్నాడు కానీ నా ముఖాన్ని ఇంకా చూడలేదు. అయ్యో!

రెండవ పాశురము: ఆమె ఎవరి నుండి అయితే తన స్థితిని దాచిపెట్టిందో,  ఆ తల్లులకు తన పరిస్థితిని తెలుపుకుంటుంది.

ఎళిల్ ఉడైయ అమ్మనైమీర్! ఎన్నరంగత్తు ఇన్నముదర్
కుళలళగర్ వాయళగర్ కణ్ణళగర్ కొప్పూళిల్
ఎళుకమల ప్పూవళగర్ ఎమ్మానార్ ఎన్నుడైయ
కళల్ వళైయై త్తాముం కళల్ వళైయే ఆక్కినరే

సుందరమైన ఓ తల్లులారా!  శ్రీరంగంవాసుడైన ఆతడి సౌదర్యము మన మాటలకి అందనిది. అతని అందమైన దివ్య శిరోజాలు, అందమైన దివ్య అదరములు, అందమైన దివ్య నేత్రములు, దివ్య నాభీ కమలం నాకు చూపించి నన్ను ఆతడి దాసిని చేశాడు. నా స్వామి అయిన అళగియ మణవాళర్ జారి పోని నా కంకణాలను జారిపోయేలా చేశాడు.

మూడవ పాశురము: “మీ పట్ల ప్రేమతో అతను నీ గాజులు తీసుకున్నాడు. అతని వద్ద గాజులు తక్కువై నందున, నీ నుండి తీసుకొని కొరత పూర్తి చేసుకున్నాడు” అని వాళ్ళు ఆమెతో అన్నారు. దానికి ఆండాళ్ స్పందిస్తూ “ఇది నిజం కాదు. దానికి ముందు అవి లేవని ఆతడు బాధపడ్డాడా, లేదా అవి పొందిన తరువాత అతడు సంతోష పడ్డాడా? అదేమీ కాదు”. తనని హింసించడానికి మాత్రమే అతడు అలా చేశాడని ఆమె అలక్ష్యం చేసింది..

పొంగోదం శూళ్ంద బువనియుం విణ్ణులగుం
అంగాదుం శోఱామే ఆళ్గిన్ఱ ఎంబెరుమాన్
శెంగోల్ ఉడైయ తిరువరంగ చ్చెల్వనార్
ఎంగోల్ వళైయాల్ ఇడర్ తీర్వర్ ఆగాదే?

సముద్రముతో కూడిన ఈ భూలోకాన్ని మరియు ఆ పరమపదాన్ని రెండింటికి ఎటువంటి లోటు లేకుండా ఆతడు పరిపాలిస్తాడు. “కోయిల్” అనబడు శ్రీరంగంలో శయనించి ఉండి తన రాజదండంతో సునాయాసంగా పరిపాలించగల సామర్థ్యము ఉన్నవాడు అతడు. ఆ శ్రీమాన్ కేవలం నా కంకణాలు మాత్రం తీసుకొని సంతోషిస్తాడా?

నాలుగవ పాశురము: “ఎంబెరుమానుడు నీపై ఉన్న ప్రేమ కారణంగా నీ గాజులు తీసుకున్నాడని సంతోష పడవచ్చుకదా?” అని వారు అడిగినప్పుడు, “ఆతడు ఉండలేక తన గాజులు తీసుకొని ఉండి ఉంటే, నేను ఉండే వీధికి కనీసం ఒక్కసారైనా వచ్చి ఉండ వచ్చుకా?” అని ఆమె అంటుంది.

మచ్చణి మాడ మదిళ్ అరంగర్ వామననార్
పచ్చై పశుం దేవర్ తాన్ పండు నీరేఱ్ఱ
పచ్చై క్కుఱైయాగి ఎన్నుడైయ పెయ్వళై మేల్
ఇచ్చై ఉడైయరేల్ ఇత్తెరువే పోదారే?

అందంగా అలంకరించబడిన అంతఃపురములు మరియు ప్రహరీ గోడలు ఉన్న శ్రీరంగములో దయతో నివాసుడై ఉన్నాడు ఆ భగవానుడు. నిత్య తాజాదనం కలిగి ఉన్న ఆ పెరియ పెరుమాళ్ళు అంతకు ముందు వామనుడిగా అవతారం దాల్చినాడు. అన్ని లోకాలను ఆతడు (మహాబలి నుండి) భిక్షగా తీసుకున్నప్పుడు, దానిలో ఏదైనా లోపం ఉండి ఉంటే, ఆ లోపాన్ని కప్పిబుచ్చడానికి నా కంకణాల మీద ఆతడికి కోరికే ఉంటే, కనికరించి ఆతడు ఈ వీధికి రాలేడా?

ఐదవ పాశురము: ఆమె తన గాజులే కాకుండా, నన్ను కూడా దోచుకున్నాడని అంటుంది.

పొల్లా క్కుఱళ్ ఉరువాయ్ పొఱ్కైయిల్ నీరేఱ్ఱు
ఎల్లా ఉలగుం అళందు కొండ ఎంబెరుమాన్
నల్లార్గళ్ వాళుం నళిర్ అరంగ నాగణైయాన్
ఇల్లాదోం కైప్పొరుళుం ఎయ్దువాన్ ఒత్తుళనే

అద్భుతమైన వామన రూపాన్ని దాల్చి తన చేతిలో జలాన్ని తీసుకుని (భిక్ష స్వీకరణకి చిహ్నంగా) సమస్థ లోకాలను కొలిచి తన నియంత్రణలో ఉంచుకున్నాడు. ఆతడు మహానుభావులు నివసించే చల్లని శ్రీరంగంలో పెరియ పెరుమాళ్ళుగా తిరువందాళ్వాన్ (ఆదిశేషుడు) ని తన పరుపుగా చేసుకొని ఉన్నాడు. అంతటి మహానుభావుడు నా ఆస్థి అయిన ఈ శరీరాన్ని కూడా దొంగిలించినట్లు కనిపిస్తున్నాడు.

ఆరవ పాశురము: ఆతను కోరి తనని దోచుకున్నాడని ఆమె తెలుపుతుంది.

కైప్పొరుళ్గళ్ మున్నమే కైక్కొండార్ కావిరి నీర్
శెయ్ ప్పురళ ఓడుం తిరువరంగ చ్చెల్వనార్
ఎప్పొరుట్కుం నిన్ఱార్ క్కుం ఎయ్దాదు నాన్మఱైయిన్
శొఱ్పొరుళాయ్ నిన్ఱార్ ఎన్ మెయ్ ప్పొరుళుం కొండారే

కావేరీ జలముతో సారవంతము అవ్వ బడిన తిరువరంగంలో దయతో శ్రీమాన్ (శ్రీ మహాలక్ష్మిని తన సంపదగా కలిగి ఉన్నవాడు) నివాసుడై ఉన్నాడు. కొందరికి అతి సులభుడైన ఆతడు మహంతులైన మరికొందరికి అతి దుర్లభుడు. చతుర్వేదాల పరమార్థము అయిన ఆ పెరియ పెరుమాళ్, నా చేతిలో ఉన్నవన్నీ దోచుకున్న తర్వాత, ఇప్పుడు నా ఈ శరీరాన్ని కూడా దోచుకుంటున్నాడు.

ఏడవ పాశురము: ఆతడు సీతా పిరాట్టిపై చూపించిన ప్రేమ తనపై చూపట్లేదని ఆమె మొర పెట్టుకుంటుంది.

ఉణ్ణాదు ఉఱంగాదు ఒలి కడలై ఊడఱుత్తు
పెణ్ణాక్కై ఆప్పుండు తాం ఉఱ్ఱ పోదెల్లాం
తిణ్ణార్ మదిళ్ శూళ్ తిరువరంగ చ్చెళ్వనార్
ఎణ్ణదే తమ్ముడైయ నన్మైగళే ఎణ్ణువరే

బలమైన గోడలతో చుట్టుముట్టబడిన తిరువరంగంలో శయనించి ఉన్న శ్రీ లక్ష్మి పతి ఎమ్పెరుమానుడు, శ్రీరామావతారం దాల్చినప్పుడు, సీతని కోరాడు. తన నిద్రాహారాలు మానుకొని మహా సముద్రంపై వంతెన కట్టాడు. నా విషయానికి వస్తే తన ఆ సరళతను మర్చిపోయి, తన అభిమానము గురించి ఆలోచిస్తున్నాడు.

ఎనిమిదవ పాశురము: ఎంబెరుమానుడి మంగళ గుణాలను ధ్యానిస్తూ తనను తాను ఆదుకుంటుందని, “ఎంబెరుమానుడిని మరచిపోడానికి ప్రయత్నిస్తున్నానని, కానీ సాధ్యమౌవ్వడం లేదు” అని ఆమె తెలుపుతుంది.

పాశి తూర్ త్తు క్కిడంద పార్ మగట్కు పండొరు నాళ్
మాశుడంబిల్ నీర్ వారా మానమిలా ప్పన్ఱియాం
తేశుడైయ తేవర్ తిరువరంగ చ్చెల్వనార్
పేశి ఇరుప్పనగళ్ పేర్ క్కవుం పేరావే

అంతకు ముందు యుగములో, పాచి (ఎక్కువ కాలము నీటిలో ఉన్న కారణంగా) పట్టి ఉన్న భూమి పిరాట్టి కొరకై, సిగ్గు విడిచి దివ్య ప్రకాశవంతుడైన శ్రీ రంగనాథుడు తన దివ్య స్వరూపమంతా బురదతో నీరు కార్చుకుంటూ (సముద్రంలో నుండి భూమి పిరాట్టి వెలికి తీసినందున) వరాహ (అడివి పంది) అవతారమెత్తాడు. ఆ వరాహ అవతారములో ఆతడు ఆడిన మాటలు ఎంత ప్రయత్నించినా నా హృదయంలో నుండి బయటకు తీయలేకపోతున్నాను.

తొమ్మిదవ పాశురము: ఎంబెరుమానుడు రుక్మిణి పిరాట్టికి చేసిన సహాయం, అందరికీ చేసిననట్లు (తనతో సహా) భావించి ఆమె తనను తాను ఓదార్చుకుంటుంది. ఇది శరణాగతులందరికీ వర్తించేట్లుగా భగవానుడు అర్జునుడికి [దుఃఖించవద్దు] చేసిన ఉపదేశాన్ని పోలినట్లు భావించాలి.

కణ్ణాలం కోడిత్తు క్కన్ని తన్నై క్కైప్పిడిప్పాన్
తిణ్ణార్ందిరుందు శిశుపాలన్ తేశళిందు
అణ్ణాందిరుక్కవే ఆంగవళై క్కైప్పిడిత్తు
పెణ్ణాలన్ పేణుం ఊర్ పేరుం అరంగమే

వివాహానికి సంబంధించిన అన్ని ఏర్పాటు పూర్తయిన తర్వాత, శిషుపాలుడు రుక్మిణీ పిరాట్టిని (శ్రీ మహాలక్ష్మి) వివాహమాడబోతున్నానని పూర్తి నమ్మకంతో ఉన్నాడు.  దయతో ఆ రుక్మిణీ పిరాట్టిని కృష్ణుడు వివాహం చేసుకుని ఆమెను ఆదుకున్నాడు. ఒక స్త్రీని ఆదుకున్నాడని ప్రసిద్ధికెక్కాడు.

పదవ పాశురము: ఆమె పెరియాళ్వార్ల దివ్య పుత్రిక అయిననూ ఎంబెరుమానుడు తనని స్వీకరించకనందుకు బాధపడుతుంది. ఏమి చేయాలో తెలియక ఆమె మదనపడుతుంది.

శెమ్మై ఉడైయ తిరువరంగర్ తాం పణిత్త
మెయ్ మ్మై ప్పెరువార్ త్తై విట్టు చిత్తర్ కేట్టు ఇరుప్పర్
తమ్మై ఉగప్పారై త్తాం ఉగప్పర్ ఎన్నుం శొల్
తమ్మిడైయే పొయ్యానాల్ శాదిప్పార్ ఆరినియే

సత్యమనే దివ్య గుణమున్న తిరువరంగనాథుడు, ఆతడు పలికిన సత్య వచనములను అమూల్యమైన చరమ శ్లోకమని పిలుస్తారు. నా తండ్రి ఆ మాటలు విని ఎలాంటి చింత లేకుండా ఉండగలిగాడు. “తనను ఇష్టపడేవారిని తాను ఇష్టపడతాడు” అనే సామెత తప్పు అయితే, అతన్ని ఆదేశించగల వారెవ్వరు?

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2020/05/nachchiyar-thirumozhi-11-simple/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

నాచ్చియార్ తిరుమొళి – సరళ వ్యాఖ్యానము – పత్తాం తిరుమొళి – కార్కొడల్ పూక్కాళ్

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

నాచ్చియార్ తిరుమొళి

<< ఒన్బదాం తిరుమొళి – శిందుర చ్చెంబొడి

మొదట్లో ఆమె కాముడు (మన్మథుడు), పక్షులు మరియు మేఘాల పాదాల వద్ద పడి కొంతవరకు ఓదార్పు పొందింది. కానీ ఫలితము లేకపోయింది. భగవానుడు రాకపోయినా, ఆతడిని పోలిన వాటిని చూసి ఆమె తనను తాను నిలబెట్టుకోగలదని అనుకుంది. వసంత కాలంలో వికసించే పూవులపైన విహరిస్తున్న పక్షులను చూసి ఆతడి దివ్య స్వరూపంలోని దివ్య అవయవాలు గుర్తుకు వచ్చి ఆమె బాధ పడింది. ఈ స్థితిలో, ఆమె పెరియాళ్వార్ల వంశంలో తన పుట్టుక మరియు భగవానుడి మాట మాత్రమే ఆమెను ఆదుకోగలవని ఆమె భావించింది. తాను సర్వ రక్షకుడని అందరికీ రక్షణనిస్తానని మాట ఇచ్చినప్పటికీ, ఆతడు సర్వ తంత్ర స్వతంత్రుడు అయినందున ఆతడిని ఎవరూ ప్రశ్నించలేరు. అందువల్ల పెరియాళ్వార్ల దివ్య కుమార్తెగా ఉన్న తన సంబంధమే తనను ఆదుకోగలదని, అదే ఏకైక మార్గమని ఆమె భావించింది. ఇక్కడ కూడా, “భగవానుడు నన్ను వదిలేస్తే?” అని ఆమెకు అనవసరమైన సందేహం ఒకటి కలిగింది, “ఇంకేదైనా జరగవచ్చు కానీ ఇది జరగకపోవచ్చు. అయితే, నాకూ పెరియాళ్వార్లకు మధ్య ఉన్న సంబంధం వృధా పోదు. ఇది ఆతని స్వతంత్ర్యాన్ని మార్చి నన్ను ఆతడి దివ్య పాదాల వద్దకు చేరుస్తుంది” అని తలచి ఆమె తనను తాను మందలించుకుంటుంది. ఒకవేళ “నేను నిన్ను విడిచిపెట్టను” అని భగవానుడు అనిననూ, అది జరగడానికి ఆచార్యుడు అవసరం (ఆచార్యుడు సిఫార్సు పాత్రను పోషిస్తాడు). వాణవదరైయన్ రాజును చూడటానికి పరాశర భట్టర్ శ్రీదేవిమంగళం అనే ప్రదేశంలో ఉన్నప్పుడు, “దేవుడు ఉన్నప్పుడు, ప్రజలందరూ నీ పట్ల భక్తిని చూపడానికి కారణం ఏమిటి?” అని రాజు భట్టర్ని ప్రశ్నించారు. “ఎంబెరుమానుడిని పొందడానికి, ఆతడి భక్తులు గటకర్లలా (కలిపేవారు) వ్యవహరిస్తారు. నేను కూరత్తాళ్వాన్ల కుమారుడిని కాబట్టి వీళ్ళందరూ నాపై గౌరవం చూపుతున్నారు” అని భట్టర్ దయతో బదులిచ్చిరి.

మొదటి పాశురము: ఆమె తన దీన స్థినిని పుష్పాలకు తెలుపుకుంటుంది.

కార్ క్కోడల్ పూక్కాళ్ కార్ క్కడల్ వణ్ణన్ ఎన్మేల్ ఉమ్మై
ప్పోర్ క్కోలం శెయ్దు పోర విడుత్తవన్ ఎంగుఱ్ఱాన్?
ఆర్ క్కో ఇనినాం పూశల్ ఇడువదు? అణి తుళాయ్
త్తార్ క్కోడుం నెంజం తన్నై ప్పడైక్క వల్లేన్ అందో!

ఓ నల్లని కాందళ్ పుష్పమా (ఒక రకమైన కలువ పుష్పము)! నిన్ను చక్కగా అలంకరించి, నాపై యుద్దానికి పంపిన నల్లని మహాసముద్రం వంటి దివ్య స్వరూపముతో ఉన్న ఆ కృష్ణ భగవానుడు ఎక్కడ ఉన్నాడు? నేను ఎవరి వద్దకి వెళ్లి నా మొర చెప్పుకోవాలో నాకు నిజంగా తెలియట్లేదు. నా మనస్సు కూడా నాకు సహకరించకుండా అందమైన ఆ తులసీ మాలను  కోరుతుంది. అయ్యో!

రెండవ పాశురము: ఈ బాధ నుండి తనను ముక్తి పరచమని ఆమె  కలువ పుష్పాలను ప్రార్థిస్తుంది.

మేల్ తోన్ఱి ప్పూక్కాళ్! మేల్ ఉలగంగళిన్ మీదు పోయ్
మేల్ తోన్ఱుం శోది వేద ముదల్వర్ వలం కైయిల్
మేల్ తోన్ఱుం ఆళియిన్ వెంజుడర్ పోలచ్చుడాదు ఎమ్మై
మాఱ్ఱోలై ప్పట్టవర్ కూట్టత్తు వైత్తు క్కొళ్గిఱ్ఱిరే

ఎత్తుకి ఎదిగిన ఓ కలువ పువ్వులారా! వేదములు వెల్లడించి నట్లు, ఉన్నత లోకమైన పరమపదములో నిత్య నివాసుడై ఉన్న సర్వోన్నతుడి దివ్య కుడి హస్థములో కనిపించే దివ్య చక్రమా! నీ దివ్య తేజముతో నన్ను ఇలా దహించక, కైవల్య నిష్ఠర్ల (తమ ఆత్మను తాము అనుభవించువారు) గోష్ఠిలో నన్ను చేర్చవా? అనగా ఇందులో అంతరార్ధం ఏమిటంటే, భగవానుడి నుండి ఇలా విరహ వేదనతో బాధ పడే కంటే కైవల్య మోక్షంలో తనను తాను అనుభవించడం మేలు అని అర్థం.

మూడవ పాశురము: పైనుండి ఆమె తన చూపుని మార్చి, పక్కనే మొక్కలపై వాలి ఉన్న దొండ తీగపై పడింది. తాను ముందు చూసిన పుష్పాల రంగు ఎంబెరుమానుడి దివ్య స్వరూపాన్ని గుర్తు చేసి మరింత బాధ పెట్టాయి. ఆ దొండ పండ్లు అతని దివ్య అధరములను గుర్తు చేసి హింసిస్తున్నాయి..

కోవై మణాట్టి! నీ ఉన్ కొళుం కని కొండు ఎమ్మై
ఆవి తొలైవియేల్ వాయళగర్ తమ్మై అంజుదుం
పావియేన్ తోన్ఱి ప్పాంబణైయార్ క్కుం తన్ పాంబు పోల్
నావుం ఇరండుళ ఆయ్ ఱ్ఱు నాణిలియేనుక్కే

దొండ తీగపై లేడిలా ఉన్న ఓ పండు! మీ అందమైన పండ్లతో నా ప్రాణాన్ని తీయకుమా! భగవానుడికి సంబంధించిన విషయాలంటే నాకెంతో భయము. నాకు సంబంధించిన విషయాలకు వస్తే శేషశాయి (ఆదిశేషునిపైన పవ్వలించి ఉన్నవాడు) అయిన ఆ భగవానుడికి రెండు నాలుకలు ఉన్నాయి. తాను శయనించి ఉన్న సర్పమువలే అతను కూడా ఒక నిర్లజ్జుడు.

నాలుగవ పాశురము: దొండ పండ్లు అతని దివ్య అధరములను గుర్తు చేసి బాధిస్తున్నందున, ఆమె తన దృష్టిని మరలించి మరొక వైపు చూసింది. నిండుగా వికసించిన మల్లె పువ్వులపై ఆమె చూపు పడింది. ఎంబెరుమానుడి తెల్లటి పలు వరుస ఆమెకు గుర్తుకు వచ్చి ఎలా బాధ పెడుతున్నాయో ఆమె తెలుపుతుంది.

ముల్లై ప్పిరాట్టి! నీ ఉన్ ముఱువల్గళ్ కొండు ఎమ్మై
అల్లల్ విళైవియేల్ ఆళి నాంగాయ్! ఉన్ అడైక్కలం
కొల్లై అరక్కియై మూక్కరిందిట్ట కుమరనార్
శొల్లుం పొయ్యానాల్ నానుం పిఱందమై పొయ్ అన్ఱే

ఓ లేడీ లాంటి మల్లె తీగా! లోతైన గుణం (ఆమె భావాలను సులభంగా బయటపెట్టదు) ఉన్నదానా! నీవు పుష్పించే తీరుతో నన్ను హింసించవద్దు, భగవానుడి ముత్యాల వంటి దివ్య పలు వరుస నాకు గుర్తుకు వస్తుంది. నేను నీకు లొంగిపోతున్నాను. శూర్పనఖ ముక్కుని కోసి తరిమికొట్టిన దశరథ చక్రవర్తి కుమారుడి మాట అబద్ధం అయితే, పెరియాళ్వార్ల కుమార్తెగా నా జన్మ కూడా అబద్ధం అవుతుంది (ప్రయోజనం ఉండదు).

ఐదవ పాశురము: తనను హింసిస్తున్న మల్లె పువ్వును చూసి ఆమె తన కళ్ళు మూసుకుంది. అయితే, ఆమె తన చెవులు మూసుకోలేక పోయింది.

పాడుం కుయిల్గాళ్! ఈదెన్న పాడల్? నల్ వేంగడ
నాడర్ నమక్కు ఒరు వాళ్వు తందాల్ వందు పాడుమిన్
ఆడుం కరుళక్కొడి ఉడైయార్ వందరుళ్ శెయ్దు
కూడువరాయిడిల్ కూవి నుమ్ పాట్టుక్కళ్ కేట్టుమే

ఓ కోకిలలారా!  ఎలాంటి అపస్వరమైన రాగాలు తీస్తున్నారు? ఎత్తైన తిరువేండం కొండలు తన నివాసముగా ఉన్న ఆ ఎంబెరుమానుడు వచ్చి నన్ను కుదుటపరచినపుడు వచ్చి అప్పుడు పాడుము. గరుడ ధ్వజము ఉన్న ఆ భగవానుడు ఇక్కడకు వచ్చి నాతో ఏకం అయినప్పుడు, నిన్ను పిలిచి నీ పాటలు వింటాము.

ఆరవ పాశురము: ఆమె నెమళ్ల పాదాల యందు పడి, ఎంబెరుమానుడు తనను కాపాడే మార్గాన్ని చూపమని ప్రార్థిస్తుంది.

కణమా మయిల్గాళ్! కణ్ణపిరాన్ తిరుక్కోలం పోన్ఱు
అణిమా నడం పయిన్ఱు ఆడుగిన్ఱీర్ క్కు అడి వీళ్గిన్ఱేన్
పణమాడు అరవణనై ప్పఱ్పల కాలముం పళ్ళి కొళ్
మణవాళర్ నమ్మై వైత్త పరిశిదు కాణ్మినే

గుంపులు గుంపులుగా ఉన్న ఓ నెమళ్ళారా! కృష్ణ పరమాత్ముని పోలిన అందమైన రూపముతో సుందర నృత్యం చేసే మీ దివ్య పాదాల వద్ద పడి నేను మిమ్ములను ప్రార్థిస్తున్నాను. దయచేసి మీ నృత్యాన్ని ఆపండి. విప్పిన వేయి పడగలతో ఆదిశేషుని శయ్యపై శాశ్వతంగా పవ్వలించి ఉండే అళగియ మణవాళన్ (అందమైన వరుడు) నన్ను సృష్టించినది మీ కాళ్లపై పడటం కొరకే.

ఏడవ పాశురము: నృత్యం చేస్తున్న నెమళ్లను చూసి ఆమె “నా స్థితిని గమనించి కూడా మీరు ఇలా నాట్యం చేయడం సరైనదేనా?” అని ప్రశ్నిస్తుంది.

నడమాడి త్తోగై విరిక్కిన్ఱ మామయిల్గాళ్! ఉమ్మై
నడమాట్టం కాణ ప్పావియేన్ నాన్ ఓర్ ముదలిలేన్
కుడమాడు కూత్తన్ గోవిందన్ కోమిఱై శెయ్దు ఎమ్మై
ఉడైమాడు కొణ్డాన్ ఉంగళుక్కు ఇని ఒన్ఱు పోదుమే?

పురి విప్పి నాట్యమాడే ఓ నెమళ్ళారా! మీ నాట్యాన్ని నా కళ్ళతో చూడలేని పాపిని నేను. కుండలతో నృత్యం చేసిన ఆ గోవిందుడు నన్ను పూర్తిగా మోహించి వేదించి బాధిస్తున్నాడు. నా ముందు మీరు ఇలా నాట్యమాడటం సరైనదేనా?

ఎనిమిదవ పాశురము: అన్నీ అలా ఆమెను హింసిస్తుండగా, మేఘాలు కూడా వర్షం కురిపించి హింసించసాగాయి. ఈ రెండు పాశురములతో పెరియ తిరుమలై నంబికి (భగవద్ రామానుజుల మేనమామగారు, వారి పంచ ఆచార్యులలో ఒకరు) లోతైన అనుబంధము ఉంది.  అతను ఈ రెండు పాశురముల ప్రస్తావన వచ్చినప్పుడు వారి కళ్ళు కన్నిటితో నిండిపోయి నోట మాట వచ్చేది కాదు వారికి.  ఈ కారణంగా, శ్రీవైష్ణవులందరూ ఈ రెండు పాశురాలను గంభీరముగా తీసుకోవాలి.

మళైయే! మళైయే! మణ్పుఱం పూశి ఉళ్ళాయ్ నిన్ఱ
మెళుగు ఊఱ్ఱినాఱ్పొళ్ ఊఱ్ఱు నల్ వేంగడత్తుళ్ నిన్ఱ
అళగ ప్పిరానార్ తమ్మై ఎన్ నెంజత్తు అగప్పడ
త్తళువ నిన్ఱు ఎన్నైత్తదైత్తు కొండు ఊఱ్ఱవుం వల్లైయే?

ఓ మేఘమా! పైన లేపనము చేసి  లోపల మైనము కరిగించినట్లే, ఎత్తైన తిరువేంకట కొండలపై నిత్య నివాసుడై ఉన్న ఆ ఎంబెరుమానుడు నన్ను బాహ్యంగా ఆలింగనం చేసుకున్నాడు కానీ లోపలి నుండి నా ప్రాణాన్ని కరిగించి నాశనం చేస్తున్నాడు. నాలో నివాసమై ఉన్న ఆ భగవానుని ఆలింగనము చేసుకొని ఏకం అయిన తర్వాత నీవు వర్షం కురిపిస్తావా?

తొమ్మిదవ పాశురము: దీని తరువాత, సముద్రంలో అలలు ఉప్పొంగగా, ఆ అలలను చూస్తూ ఆమె మాట్లాడసాగింది.

కడలే! కడలే! ఉన్నై క్కడైందు కలక్కుఱుత్తు
ఉడలుళ్ పుగుందు నిన్ఱు ఊరల్ అఱుత్తవఱ్కు ఎన్నైయుం
ఉడలుళ్ పుగుందు నిన్ఱు ఊరల్ అఱుక్కిన్ఱ మాయఱ్కు ఎన్
నడలైగళ్ ఎల్లాం నాగణైక్కే శెన్ఱు ఉరైత్తియే

ఓ మహా సముద్రమా! ఎంబెరుమానుడు నిన్ను అల్లకల్లోలము చేసి చిలికి నీలో ప్రవేశించి నీలో నుండి అమృత రసాన్ని [శ్రీ మహాలక్ష్మి] దొంగిలించాడు. అదే విధంగా, మహోపకారి అయిన ఆ ఎంబెరుమానుడు నాలో ప్రవేశించి నా జీవితాన్ని ఛిన్నాభిన్నము చేశాడు. నీవు వెళ్లి నా బాధని తన శయ్య అయిన తిరుఅనన్తాళ్వావ్ (ఆదిశేషుడు) కి వివరిస్తావా?

పదవ పాశురము: ఆమె తన కంటే ఎక్కువ బాధని అనుభవిస్తున్న తన ఒక చెలిని ఓదార్పు మాటలు చెప్పి ఈ పదిగాన్ని పూర్తి చేసింది.

నల్ల ఎన్ తోళి! నాగణై మిశై నం పరర్
శెల్వర్ పెరియర్ శిఱు మానిడర్ నాం శెయ్వదు ఎన్?
విల్లి పుదువై విట్టుచిత్తర్ తంగళ్ దేవరై
వల్ల పరిశు వరువిప్పరేల్ అదు కాండుమే

ఓ నా ప్రియ మిత్రమా! ఆదిశేషుని తల్పముపై పవ్వలించి ఉన్న మన భగవానుడు శ్రీ మహాలక్ష్మికి పతి అయినందున సుసంపన్నుడు. ఆతడు మహోన్నతుడు. మరోవైపు మనము అతి అల్పులము. ఇలాంటి స్థితిలో మనము ఏమి చేయగలము? శ్రీవిల్లిపుత్తూరుకి నాయకుడైన పెరియాళ్వార్లు తన నియంత్రణలో ఉన్న ఆ భగవానుడిని సాధ్యమైన రీతిలో వారు ఆహ్వానిస్తే, ఆ భగవానుడిని ఆరాధించే అదృష్టం మనకి కూడా కలుగుతుంది.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2020/05/nachchiyar-thirumozhi-10-simple/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

నాచ్చియార్ తిరుమొళి – సరళ వ్యాఖ్యానము – ఒన్బదాం తిరుమొళి – శిందుర చ్చెంబొడి

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

నాచ్చియార్ తిరుమొళి

<< ఎట్టాం తిరుమొళి – విణ్ణీల మేలప్పు

ఎనిమిదవ పదిగములో, ఆండాళ్ అతి శిథిలమైన స్థితిలో కొన ఊపిరిలో గోచరించింది. భగవానుని వద్దకు వెళ్లి ఆమె స్థితిని తెలపడానికి మేఘాలున్నప్పటికీ, ఎక్కడికీ వెళ్లకుండా అక్కడే వర్షించి మొత్తానికే మాయమయ్యాయి. ఆ వర్షం కురిసిన చోట్ల అనేక పుష్పాలు వికసించాయి. ఆ పుష్పాలు భగవానుని దివ్య అవయవ సౌందర్యముతో కూడిన ఆతడి దివ్య స్వరూపము గుర్తు చేసి ఆమెను మరింత బాధ పెట్ట సాగాయి. సాధారణంగా ఈ ప్రపంచములో నిండు చంద్రుడు, చల్లని గాలి, పువ్వులు మొదలైనవి తమ ప్రియునితో ఉన్నప్పుడు సంతోషాన్ని కలిగిస్తాయి, అదే ప్రియుడు తనతో లేనప్పుడు బాధను కలిగిస్తాయి. తీవ్ర విహర వేదనతో బాధపడుతుండడంతో, పైన పేర్కొన్నవి ఆమెను ఎలా కష్థ పెడుతున్నాయో ఈ పది పాశురములలో మరియు తరువాతి పది పాశురములలో (10వ పదిగము) ఆమె తెలిపింది. నమ్మాళ్వార్లు “ఇన్నుయిర్ చ్చేవల్”(తిరువాయ్మొళి 9-5 పదిగం) లో అనుభవించిన అనుభవాన్ని ఆమె ఈ రెండు పదిగములలో అనుభవిస్తోంది. ఈ పదిగము తిరుమాలిరుంజోలై ఎంబెరుమానునితో ఆమె అనుభవానికి సంబంధించినది.

మొదటి పాశురము:  సీతాకోక చిలుకలు అటు ఇటూ ఎగురుతూ తిరుమాలిరుంజోలైని కనిపించకుండా కప్పివేశాయి.  అళగర్ [అళగర్/ కళ్ళళగర్ సుందరత్తోళ్ ఉడైయాన్ అని తిరుమాలిరుంజోలైలో కొలువై ఉన్న భగవానుడి దివ్య నామాలు] వేసిన వలలో నుండి తప్పించు కోవడం మనకి సాధ్యమా అని ఆమె ఆశ్చర్యపోతోంది.

శిందురచ్చెంబొడి ప్పోల్ తిరుమాలిరుంజోలై ఎంగుం
ఇందిరగోపంగళే ఎళుందుం పరందిట్టనవాల్
మందరం నాట్టి అన్ఱు మదురక్కొళుం శాఱు కొండ
శుందరత్తోళ్ ఉడైయాన్ శుళలైయిల్ నిన్ఱు ఉయ్ దుంగొలో?

తిరుమాలిరుంజోలైలో ఎర్రటి సీతాకోక చిలుకలు తమ రెక్కలు విప్పుకొని అటు ఇటూ ఎగురుతున్నాయి. సీతాకోక చిలుకలు పుష్పాల నుండి తేనెను (పుష్పామృతం) తీసి త్రాగుతాయి. మంతర పర్వతముతో క్షీర సాగరాన్ని చిలికి దేవతలకి అమృతాన్ని ప్రసాదించిన సుందరత్తోళుడైయాన్ (తిరుమాలిరుంజోలైలో కొలువై ఉన్న భగవానుడు) అమృత రసం లాంటి పిరాట్టిని పొందారు. అయ్యో! అటువంటి భగవానుడి ప్రేమ వలలో నుండి బయటపడుట మనకు సాధ్యమా?

రెండవ పాశురము: అళగర్ ఎంబెరుమానుడు తన భుజాలపై ధరించిన మాలని నేను ఆశిస్తున్నాను. నా ఈ బాధను నేను ఎవరికి చెప్పుకోవాలి?

పోర్ క్కళిఱు పొరుం మాలిరుంజోలై అం పూంబుఱవిల్
తార్ క్కొడి ముల్లైగళుం తవళ నగై కాట్టుగిన్ఱ
కార్ క్కొళ్ పడాక్కళ్ నిన్ఱు కళఱి చ్చిరిక్కత్తరియేన్
ఆర్ క్కిడుగో? తోళి! అవన్ తార్ శెయ్ద పూశలైయే

యుద్ధ ఏనుగులు ఆడుకుంటూ పోట్లాడుకుంటూ ఉండే ప్రదేశం తిరుమాలిరుంజోలై. అటువంటి తిరుమాలిరుంజోలై కొండ లోయలలో మల్లె తీగలపై ఉన్న మల్లె మొగ్గలు నాకు అళగర్ల తెల్లటి చిరునవ్వుని గుర్తు చేస్తున్నాయి. పడా (ఒక ఔషధ గింజలు) మొక్కల పువ్వులు దృఢంగా నిలబడి “నీవు నా నుండి తప్పించుకోలేవు” అని నన్ను చూసి నవ్వుతూ అన్నట్లుగా కనిపిస్తున్నాయి. ఈ కారణంగా నన్ను నేను ఆపుకోలేకపోతున్నాను. ఓ మిత్రమా! ఆతడి దివ్య తోమాలను (భుజాలపైన వాలి ఉన్న మాల) గుర్తుచేసుకొని నేను అనుభవించిన క్షోభని ఎవరికి తెలుపుకోవాలి?

మూడవ పాశురము: ఆతని దివ్య ఛాయకి పోలిన పుష్పాలను చూస్తూ, “అతడు చేసినది న్యాయమేనా?” అని ఆమె అడుగుతుంది.

కరువిళై ఒణ్మలర్గాళ్! కాయా మలర్కాల్! తిరుమాల్
ఉరువొళి కాట్టుగిన్ఱీర్ ఎనక్కు ఉయ్వళక్కు ఒన్ఱు ఉరైయీర్
తిరువిళైయాడు తిణ్ తోళ్ తిరుమాలిరుంజోలై నంబి
వరి వళైయిల్ పుగుందు వంది పఱ్ఱుం వళక్కుళదే

ఓ అందమైన అపరాజిత (ముదురు నీలం రంగు పువ్వులు) పుష్పాలారా! ఓ అల్లి పుష్పాలారా! మీరు ఆ దివ్య తిరుమాల్ యొక్క దివ్య స్వరూపాన్ని నాకు గుర్తు చేస్తున్నారు. దయచేసి నేను తప్పించుకునే మార్గాన్ని చెప్పండి. పిరాట్టి విలయాడే ధృఢమైన భుజాలు వక్ష స్థలమున్న వాడు, గుణసంపూర్ణుడైన తిరుమాలిరుంజోలై అళగర్ నా ఇంట్లోకి ప్రవేశించి బలవంతంగా నా చేయి పట్టుకొని నా గాజులు దోచుకొని వెళ్లిపోయాడు. ఇది సరైనదేనా?

నాలుగవ పాశురము: ఆమెను హింసిస్తున్న ఐదు క్రూరమైన ద్రోహులను ఆమె దూషిస్తుంది.

పైంబొళిల్ వాళ్ కుయిల్గాళ్! మయిల్గాళ్! ఒణ్ కరువిళైగాళ్!
వంబ క్కళంగనిగాళ్! వణ్ణప్పూవై నఱుమలర్గాళ్!
ఐంబెరుం పాదగర్గాళ్! అణి మాలిరుంజోలై నిన్ఱ
ఎంబెరుమానుడైయ నిఱం ఉంగళుక్కు ఎన్ శెయ్వదే?

విశాల తోటలలో నివసించే కోకిలారా! ఓ నెమళ్లారా! ఓ అందమైన పుత్రంజీవిక (ముదురు నీలం) పుష్పమా! ఓ తాజా కస్తూరీ పుష్పమా! మంచి రంగు సువాసనతో ఉన్న ఓ కాయ పుష్పమా! ద్రోహులలైన మీ ఐదుగురికి అందమైన తిరుమాలిరుంజోలై అళగర్ని పోలిన అందమైన రంగు ఎందుకు ఉంది? (నన్ను బాధపెట్టడానికేనా?)

ఐదవ పాశురము: తాను ఎవరిని ఆశ్రయించాలో చెప్పమని అక్కడ ఉన్న తుమ్మెదలను, సెలయేరులను, తామర పువ్వులను ఆమె అడుగుతుంది.

తుంగ మలర్ ప్పొళిల్ శూళ్ తిరుమాలిరుంజోలై నిన్ఱ
శెంగణ్ కరుముగిలిన్ తిరు ఉరుప్పోల్ మలర్ మేల్
తొంగియ వండినంగాళ్! తొగు పూంజునైగాళ్! శునైయిల్
తంగు శెందామరైగాళ్! ఎనక్కు ఓర్ శరణ్ శాఱ్ఱుమినే

నీల మేఘ వర్ణుడు, అందమైన కమలముల వంటి ఎర్రని నేత్రములున్న వాడు, ఆహ్లాదకరమైన నందన వనాలతో నిండి ఉన్న తిరుమాలిరుంజోలైలో కొలువై ఉన్న అళగర్ ఎంబెరుమానుడి యొక్క సుందర రూపంలా కనిపించే అందమైన పుష్పముపై స్థిరపడిన భ్రమర సమూహమా! ఒకరి నొకరు తాకుతూ ప్రవహించే అందమైన ఓ సెలయేరులారా! ఆ సెలయేరులలో ఉన్న ఎర్రటి తామర పువ్వులారా! నేను ఎవరిని ఆశ్రయించాలో దయచేసి నాకు చెప్పండి.

ఆరవ పాశురము: ఆమె నూరు కుండల వెన్న మరియు నూరు కుండల చక్కెర పొంగలిని సమర్పించుకుంటానని ఆశించింది. ఎన్నో సంవత్సరాల తరువాత ఎంబెరుమానార్లు ఆమె కోరికను నెరవేర్చారు, ఆండాళ్ చేత “నం కోయిల్ అణ్ణర్ (శ్రీరంగం నుండి వచ్చిన నా అన్న)” అని  కొనియాడబడ్డారు.

నాఱు నఱుంపొళిల్ మాలిరుంజోలై నంబిక్కు నాన్
నూఱు తడావిల్ వెణ్ణెయ్ వాయ్ నేర్ందు పరావి వైత్తేన్
నూఱు తడా నిఱైంద అక్కారవడిశిల్ శొన్నేన్
ఏఱు తిరువుడైయాన్ ఇన్ఱు వందు ఇవై కొళ్ళుంగొలో?

సువాసనతో నిండిన సెలయేరులున్న తిరుమాలిరుంజోలైలో గుణ సంపూర్ణుడైన ఎంబెరుమానుడు నిత్య నివాసుడై ఉన్నాడు.  ఆ ఎంబెరుమానుడికి నూరు కుండల వెన్నని నా వాక్కు ద్వారా సమర్పించాను. ఆపై,  ఈ పలుకుల ద్వారా నూరు కుండల చక్కెర పొంగలిని సమర్పించుకున్నాను.  దినదినము తన సంపద ఎదిగిపోతున్న అళగర్ ఎంబెరుమానుడు, ఈ రోజు ఈ నా రెండు సమర్పణలను దయతో స్వీకరిస్తాడా?

ఏడవ పాశురము: అళగర్ ఎంబెరుమానుడు తన సమర్పణలను స్వీకరిస్తే, ఆతనికి మరిన్ని కైంకర్యాలు నిర్వహిస్తానని ఆమె తెలుపుతుంది.

ఇన్ఱు వందు ఇత్తనైయుం అముదు శెయ్దిడ ప్పెఱిల్ నాన్
ఒన్ఱు నూఱు ఆయిరమాగ క్కొడుత్తు ప్పిన్నుం ఆళుం శెయ్వన్
తెన్ఱల్ మణం కమళుం తిరుమాలిరుంజోలై తన్నుళ్
నిన్ఱ పిరాన్ అడయేన్ మనత్తే వందు నేర్ పడిలే

దక్షిణ దిశ నుండి సువాసనతో నిండిన  చల్లని గాలులు వీసే తిరుమాలిరుంజోలై కొండపై నా స్వామి అళగర్ నిత్య వాసుడై ఉన్నాడు. ఆ అళగర్ దయతో నూరు కుండల వెన్న మరియు నూరు కుండల చక్కెర పొంగలిని స్వీకరిస్తే, అంతటితో ఆగకుండా, ఆతడు నా మనస్సులో నివాసుడై ఉంటే, నేను వందల వేల కుండల వెన్న మరియు చక్కెర పొంగలిని సమర్పించుకొని ఆతడికి కైంకర్యాలు చేస్తాను.

ఎనిమిదవ పాశురము: అళగర్ రాక గురించి పిచ్చుకలు చెప్పిన మాటలు ప్రకటన నిజమేనా అని ఆమె అడుగుతుంది.

కాలై ఎళుందిరుందు కరియ కురువి క్కణంగళ్
మాలిన్ వరవు శొల్లి మరుళ్ పాడుదల్ మెయ్ మ్మైకొలో?
శోలై మలై ప్పెరుమాన్ తువరాబది ఎంబెరుమాన్
ఆలిన్ ఇలైప్పెరుమాన్ అవన్ వార్ త్తై ఉరైక్కిన్ఱదే

నల్లటి పిచ్చుకల మందలు ఉదయాన్నే లేచి, సర్వాధిపతి అయిన తిరుమాలిరుంజోలై ప్రభువు గురించి, లేత మర్రి ఆకుపై పవలించి ఉన్న శ్రీ ద్వారకాధిపతి గురించి మాట్లాడుకుంటున్నాయి. వాళ్ళు ‘పణ’ సంగీత రాగాలతో పాడుకుంటూ ఆతడి రాకను ప్రకటిస్తున్నాయి. ఇది నిజంగా జరుగుతుందా?

తొమ్మిదవ పాశురము: కొన్నపూవు చెట్టు వలె నన్ను నేను వృధా చేసుకుంటున్నాను, నేను ఎప్పుడు ఆ భగవానుడి శంఖ నాదము వింటానో, ఆతడి విల్లు యొక్క నారి శబ్దము ఎప్పుడు వింటానో?

కోంగలరుం పొళిల్ మాలిరుంజోలయిల్ కొన్ఱైగళ్ మేల్
తూంగు పొన్ మాలైగళోడు ఉడనాయ్ నిన్ఱు తూంగుగిన్ఱేన్
పూంగొళ్ తిరుముగత్తు మడుత్తు ఊదియ శంగొలియుం
శార్ంగ విల్ నాణొలియుం తలైప్పెయ్వదు ఎంజ్ఞాన్ఱు కొలో

తిరుమాలిరుంజోలైలో వృక్షాల తోటలు ఎన్నో ఉన్నాయి, ఆ కొండ లోయలలో బంగారు పుష్ప మాలల క్రిందకి వేలాడుతున్న కొన్న పుష్పాల మాదిరిగానే  నేను కూడా ఎటువంటి ఉపయోగం లేకుండా మిగిలిపోతున్నాను. ఎంబెరుమానుడి సుందర దివ్య అదరములపై ఉంచ బడిన శ్రీ పంచజన్య శబ్దం, ఆతడి శారంగ విల్లు యొక్క నారి (తీగ) శబ్దం ఎప్పుడు నా చెవిన పడుతుందో? (ఈ పుష్పాలను తిరుమాలిరుంజోలై అళగర్ స్వామికి సమర్పించరు)

పదవ పాశురము: ఈ పది పాశురములని పాడిన వారికి లభించే ఫలితాన్ని తెలియజేస్తూ ఆమె దశాబ్దాన్ని పూర్తి చేస్తుంది.

శందొడు కార్ అగిలుం శుమందు తడంగళ్ పొరుదు
వందు ఇళియుం శిలంబు ఆఱు ఉడై మాలిరుంజోలై నిన్ఱ
శుందరనై శురుంబార్ కుళల్ కోదై తొగుత్తు ఉరైత్త
శెందమిళ్ పత్తుం వల్లార్ తిరుమాళ్ అడి సేర్వర్గళే

రెండువైపులా చందనపు వృక్షాలతో సువాసనలు వెదజల్లుతూ నూపుర గంగ ప్రవహిస్తున్న తిరుమాలిరుంజోలైలో అళగర్ నిత్య నివాసుడై ఉంటాడు.  అందమైన పుష్పాలతో అలంకరించిన తన శిరోజాలపై భ్రమరాలు ఝంకారాలు చేస్తున్న ఆండాళ్, తిరుమలిరుంజోలైలో భగవానుడిపై దయతో ఈ పది పాసురాలను కూర్చింది. ఈ పది పాశురాలను పఠించగల సామర్థ్యం ఉన్నవారు శ్రీమన్నారాయణుని దివ్య చరణాలను పొందుతారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2020/05/nachchiyar-thirumozhi-9-simple/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

నాచ్చియార్ తిరుమొళి – సరళ వ్యాఖ్యానము – ఎట్టాం తిరుమొళి – విణ్ణీల మేలప్పు

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

నాచ్చియార్ తిరుమొళి

<< ఏళాం తిరుమొళి – కరుప్పూరం నాఱుమో

మునుపటి పాశురములో ఆమె శ్రీ పాంచజన్యముని ఎంబెరుమానుడి స్వభావము మరియు అదరామృత రుచి గురించి అడిగింది. ఆ తరువాత, మనస్సులో ఆమె అనుభవం ఎంబెరుమానుని చేరుకుంది. ఆ సమయంలో, వర్షాకాలపు నల్లని మేఘాలు అక్కడికి వచ్చి కమ్ముకున్నాయి. ఇరువురి వర్ణము మరియు ఔదార్య సారూప్యత కారణంగా, మేఘాలు ఆమెకు ఎంబెరుమానుడిలా కనిపించాయి. ఎంబెరుమానుడు స్వయంగా తన వద్దకు వచ్చినట్టు ఆమె భావించింది. కొంత స్పష్టత వచ్చిన తరువాత, ఎంబెరుమానుడు రాలేదని ఆమె గ్రహించింది. చుట్టూ తిరిగి ప్రయాణించే స్వభావము మేఘాలకు ఉన్నందున, వాటిని ఎంబెరుమానుడి వద్దకు దూతలుగా పంపాలని ఆమె నిశ్చయించుకుంది. విభవావతారాల (రామ, కృష్ణ మొదలైన) వద్దకి దూతలుగా పంపడానికి బదులుగా, ఆమె ఆ మేఘాలను తిరువేంగడంలోని అర్చా స్వరూపము వద్దకి దూతగా పంపుతుంది. రామావతారంలో, శ్రీ రాముని కుశల విషయాలను అందించడానికి  సీతా పిరాట్టి వద్ద గొప్ప విశిష్టత గల మహా జ్ఞాని అయిన హనుమానుడు ఉన్నాడు. ఇక్కడ ఎంబెరుమానుడి ప్రేమలో భ్రమించి పోయిన ఆండాళ్, ఆమె తన ప్రేమను తెలియపరచడానికి దూతగా ఒక అచేతన తత్వాన్ని (ఆలోచనా శక్తి లేనిది) పంపుతోంది. ఎంబెరుమానుడిపై ఉన్న మోహం కారణంగా, అర్చా స్వరూపంలో ఉన్న భగవానుడు దర్శనము మాత్రమే ఇస్తాడని, కదిలి రాలేడని ఆమె గ్రహించలేక పోతుంది.  ప్రేమ అయినా కామమైన ర్ండూ భక్తి స్వరూపాలే. మరో మాటలో చెప్పాలంటే, వారు (స్త్రీ పురుషులుగా) కలిసి ఉంటే ఉండగలరు, లేదా ఉండలేరు. ఈ గుణాలు స్త్రీలలో వారి స్వభావరూపేన ఉంటాయి. ఈ కారణంగానే ఆళ్వార్లు కరుణారస పూరితులైన ఎంబెరుమానుడి భార్య పాత్రలు వహించారు. పైగా, ఆండాళ్ విషయంలో, ఆమె భూమి పిరాట్టి అవతారము కాబట్టి, ఈ గుణాలు ఆమెలో స్వాభావికంగా ఉంటాయి.

మొదటి పాశురము: తన స్త్రీత్వాన్ని నాశనం చేయడం వల్ల ఆతడికి ఏ కీర్తి లభిస్తుందని తిరువేంగడముడయాన్ని అడగమని ఆమె మేఘాలకు చెబుతుంది.

విణ్ణీల మేలప్పు విరిత్తాఱ్పోల్ మెగంగాళ్
తెణ్ణీర్ పాయ్ వేంగడత్తు ఎన్ తిరుమాలుం పోందానే?
కణ్ణీర్గల్ ములై క్కువట్టిల్ తుళి శోరచ్చోర్వేనై
పెణ్ణీర్మై ఈడళిక్కుం ఇదు తమక్కోర్ పెరుమైయే?

నీలి ఆకాశములో పందిరిలా కనిపించే ఓ మేఘమా! స్వచ్ఛమైన సెలయేరులు ప్రవహించే తిరువేంగట గిరిపై నిత్య నివాసుడై ఉంటున్న నా స్వామి తిరుమాల్ మీతో పాటు వచ్చాడా? నా కన్నీటి చుక్కలు నా స్తనము అంచున పడేటంత క్షోభిస్తున్నాను. ఇది అతనికి ఏదైనా కీర్తిని తెచ్చిపెడుతుందా?

రెండవ పాశురము:  గాలితో ఇబ్బంది పడుతున్న ఆమె కోసము ఊరడించే మాటలు ఏవైన్నా ఎంబెరుమానుడు పంపించాడా అని ఆమె మేఘాలను అడుగుతుంది.

మాముత్త నిది శొరియుం మాముగిల్గాళ్! వేంగడత్తు
చ్చామత్తిన్ నిఱం కొణ్డ తాడాళన్ వార్ త్తై ఎన్నే?
కామత్తీయుళ్ పుగుందు కదువప్పట్టు ఇడైక్కంగుల్
ఏమత్తోర్ తెన్ఱలుక్కు ఎంగు ఇలక్కాయ్ నాన్ ఇరుప్పేనే

ముత్యాలు మరియు బంగారాన్ని కురిపించే ఓ మేఘాలారా! అద్భుతమైన నీల వర్ణుడు, తిరువెంగడంలో నిత్య నివాసుడై ఉన్న భగవానుడి నుండి ఏదైనా సందేశం తెచ్చారా? నాలో ప్రవేశించి నన్ను ఆవహించిన కామ జ్వాలతో నేను సతమతమౌతున్నాను. ఈ కారణంగా అర్ధరాత్రి వేళ ఈ చల్లని గాలి నన్ను బాధిస్తుంది.

మూడవ పాశురము: ఎంబెరుమానుడి దివ్య నామాలను పఠించి తనను తాను ఊరడించుకోగలదా అని ఆమె మేఘాలను అడుగుతుంది.

ఒళి వణ్ణం వళై శిందై ఉఱక్కత్తోడు ఇవై ఎల్లాం
ఎళిమైయాల్ ఇట్టు ఎన్నై ఈడళియ ప్పోయినవాల్
కుళిర్ అరువి వేంగడత్తు ఎన్ గోవిందన్ గుణం పాడి
అళియత్త మేగంగాళ్! ఎన్ ఆవి కాత్తిరుప్పేనే

ఓ దయగల మేఘాలారా! నా రూపం యొక్క తేజము, రంగు, నా కంకణాలు, మనస్సు మరియు నిద్ర నా దుఃఖ స్థితిని చూసి నన్ను విడిచిపెట్టి వెళ్ళి పోయాయి, నన్ను బలహీనము చేశాయి. అయ్యో! చల్లని సెలయేరులు ప్రవహించే తిరువేంగడంలో  నిత్యమూ నివసించే నా స్వామి గోవిందుడి దివ్య నామాలను మంగళ గుణాల చింతన చేస్తూ నన్ను నేను ఓదార్చుకోగలనా?

నాలుగవ పాశురము: సిఫార్సు వహించే పిరాట్టి (శ్రీ మహాలక్ష్మి) సమక్షంలో ఎంబెరుమానునికి తన కోరిక తెలియజేయమని  ఆమె మేఘాలను ప్రార్థిస్తుంది.

మిన్నాగత్తు ఎళుగిన్ఱ మేగంగాళ్! వేంగడత్తు
త్తన్నాగత్తిరుమంగై తంగియ శీర్ మాఱ్వర్ క్కు
ఎన్నాగత్తు ఇళం కొంగై విరుంబిత్త్ తాం నాళ్ తోఱుం
పొన్నాగం పుల్గుదఱ్కు ఎన్ పురివుడైమై శెప్పుమినే

ఓహ్, మెరుపుల చారలతో ఉన్నమేఘాలారా! తిరువేంగడంలో శాశ్వతంగా నివసించే ఎంబెరుమానుడు తన అందమైన దివ్య ఛాతిపై నా యవ్వన స్థనములను హత్తుకొని ఆలింగనం చేసుకోవాలని నాకు కోరికగా ఉంది. ఆతడి దివ్య వక్ష స్థలములో పిరాట్టి దయతో నివాసం ఉండే ఎంబెరుమానుడికి ఈ విషయం చెప్పుము.

ఐదవ పాశురము: తన భక్తుల విరోధులను తొలగించే ఎంబెరుమానునికి తన స్థితిని వెల్లడించమని ఆమె మేఘాలను ప్రార్థిస్తుంది.

వాన్ కొండు కిళర్ందు ఎళుంద మాముగిల్గాళ్! వేంగడత్తు
త్తేన్ కొండ మలర్ శిదఱత్తిరణ్డేఱి ప్పొళివీర్గాళ్!
ఊన్ కొండ వళ్ళుగిరాల్ ఇరణియనై ఉడల్ ఇడందాల్
తాన్ కొండ శరివళైగళ్ తరుమాగిల్ శాఱ్ఱుమినే

తిరువేండంపై ఆకాశాన్ని మ్రింగి వేస్తున్నట్లు నల్లని మేఘాలు అలుముకొని తేనెతో నిండి ఉన్న పుష్పాలు చెల్లాచెదురు అయ్యేటట్టు  ఆకాశం నుండి వర్షం కురిపిస్తున్న ఓ మేఘాలారా! హిరణ్య కశిపుడనే రాక్షసుడి దేహాన్ని తన పదునైన గోర్లతో చీల్చాడు ఎంబెరుమానుడు.  ఒకవేళ ఆ భగవానుడు నా నుండి తీసుకున్న కంకణాలను తిరిగి ఇస్తే, నా స్థితి గురించి అతనికి దయచేసి తెలియజేయుము.

ఆరవ పాశురము: తన సుఖాన్ని పోగొట్టిన నారాయణుడికి తన స్థితిని చెప్పమని ఆమె మేఘాలను ప్రార్థిస్తుంది.

శలం కొండు కిళర్ందెళుంద తణ్ ముగిల్గాళ్! మావలియై
నిలం కొండాన్ వేంగడత్తే నిరందేఱి ప్పొళివీర్గాళ్!
ఉలంగు ఉండ విళంగని పోల్ ఉళ్ మెలియప్పుగుందు ఎన్నై
నలం కొండ నారణఱ్కు ఎన్ నడలై నోయ్ శెప్పుమినే

చల్లని నీటిని త్రాగి పెద్దవైన మేఘాలారా! మహాబలి నుండి ప్రపంచాలను భిక్షగా పొందిన ఎంబెరుమానుడు నిత్య నివాసం ఉంటున్న తిరువేంగడం కొండపైకి ఎక్కి వ్యాపించిన మేఘాలారా! ఒక పండు నుండి పురుగు రసం లాగేసినట్లు, ఎంబెరుమానుడు నాలో ప్రవేశించి నా స్త్రీత్వాన్ని దొంగిలించాడు. బాధాకరమైన నా వ్యధ గురించి ఆ ఎంబెరుమానునికి తెలుపుము.

ఏడవ పాశురము: ఆమె ఆతన్ని ఆలింగనం చేసుకుంటే తప్ప తాను ఉండలేనని ఎంపెరుమానుడికి చెప్పమని ఆమె మేఘాలను ప్రార్థిస్తుంది.

శంగమా కడల్ కడైందాన్ తణ్ ముగిల్గాళ్! వేంగడత్తు
చ్చెంగణ్మాల్ శేవడిక్కీళ్ అడి వీళ్ చ్చి విణ్ణప్పం
కొంగై మేల్ కుంగుమత్తిన్ కుళంబళియ ప్పుగుందు ఒరు నాళ్
తంగు మేల్ ఎన్నావి తంగుమెన్ఱు ఉరైయీరే

అనేక శంఖములు మరియు మహా కీర్తి ఉన్న మహా సముద్రాన్ని భగవానుడు చిలికాడు. అటువంటి ఎమ్పెరుమాన్ నిత్య నివాసుడై ఉన్న తిరువేండం కొండల చుట్టూ విహరించే ఓ చల్లని మేఘాలారా! ఎర్రటి నేత్రాలున్న ఆ భగవానుని దివ్య ఎర్రటి పాదాలకు ఇది నా విన్నపము: నా స్థనములపై ఉన్న కేసరి నలుగు లేపనము రాలి పడేలా ఆ భగవానుడు ఒకరోజు ఇక్కడకు వచ్చి నాతో ఏకమైతేనే నా జీవితం నిలబడుతుంది. వెళ్లి అతనికి ఈ విషయం చెప్పుము.

ఎనిమిదవ పాశురము: ఇలా మౌనంగా ఉండటం సరికాదని, ఆతనికి చెప్పమని ఆమె మేఘాన్ని ప్రార్థిస్తుంది .

కార్ కాలత్తు ఎళుగిన్ఱ కార్ ముగిల్గాళ్! వేంగడత్తు
ప్పోర్ కాలత్తు ఎళుందరుళి ప్పొరుదవనార్ పేర్ శొళ్ళి
నీర్ కాలత్తు ఎరుక్కిలం పళవిలై పోల్ వీళ్వేనై
వార్ కాలత్తు ఒరు నాళ్ తం వాశగం తందరుళారే

వానాకాలంలో తిరువేంగడ కొండపై ఉన్న ఓ మేఘాలారా! యుద్ధ సమయంలో ఎంబెరుమానుడు దయతో యుద్ధరంగంలోకి ప్రవేశించి విజయుడై వస్తాడు. ఆ భగవానుని దివ్యనామాలను నేను పఠించి వానాకాలంలో అందమైన జిల్లెడు చెట్టు ఆకుల వలె క్రింద పడతాను. నా జీవితమింతేనా, ఒక్క రోజు కూడా దయతో ఊరడిల్లే ఒక్క మాట కూడా మాట్లాడడా?

తొమ్మిదవ పాశురము: ఆతడు ఆమెను ఇంకా ఇలా హింసిస్తూనే ఉంటే, అతని ప్రతిష్ట దెబ్బతింటుందని, ఇది అతనికి చెప్పమని ఆమె మేఘాలను ప్రార్థిస్తుంది.

మదయానై పోల్ ఎళుంద మాముగిల్గాళ్! వేంగడత్తై
ప్పదియాగ వాళ్వీర్గాళ్! పాంబణైయాన్ వార్ త్తై ఎన్నే!
గది ఎన్ఱుం తాన్ ఆవాన్ కరుదాదు ఓర్ పెణ్ కొడియై
వదై శెయ్దాన్ ఎన్నుం శొల్ వైయగత్తార్ మదియారే

ఆహ్లాదంగా తిరువెంగడ కొండలను నివాసముగా చేసుకొని మద్ద గజములలా ఉప్పొంగుతూ విలసిస్తున్న ఓ ప్రియమైన మేఘాలారా! ఆదిశేషునిపై పవ్వళించి ఉన్న ఆ ఎంబెరుమానుని సంగతి ఏమిటి! ఆతడు నన్ను ఇలానే నిర్లక్ష్యము చేస్తే, “సర్వ రక్షకుడైన ఆతడి స్వభావానికి మచ్చ కలిగిస్తుందని ఆలోచించకుండా ఒక అమ్మాయిని చంపాడు” అని ఈ ప్రపంచ ప్రజలు అనరా?

పదవ పాశురము: ఈ పది పాశురములను వారి మనస్సులో ధ్యానం చేస్తూ ఆస్వాదించేవారు ఆ భగవానుడి సేవకులై ఉన్నత స్థితికి చేరుకుంటారు అని తెలియజేస్తూ పదిగాన్ని ముగిస్తుంది.

నాగత్తిన్ అణైయానై నన్నుదలాల్ నయందురై శెయ్
మేగత్తై వేంగడక్కోన్ విడు తూదిల్ విణ్ణప్పం
బోగత్తిల్ వళువాద పుదువైయర్కోన్ కోదై తమిళ్
ఆగత్తు వైత్తు ఉరైప్పార్ అవర్ అడియార్ ఆగువరే

అందమైన దివ్య నుదురు, అందమైన దివ్య శ్రీ ముఖం ఉన్న ఎంబెరుమానుని పెరియాళ్వార్ల కుమార్తె అయిన ఆండాళ్ ఆనందించింది. ఆదిశేషుడు శయ్యగా ఉన్న భగవానుని ఆండాళ్ కోరుతూ, మేఘాలను దూతలుగా ఉపయోగించి ఈ పది పాశురములను దయతో మనకందించింది. ఈ తమిళ పాశురములను తమ హృదయాలలో ఉంచుకుని, వాటిని పఠించగల సామర్థ్యం ఉన్నవారు ప్రతిరోజూ కైంకర్యాలు చేస్తూ ఆతడి దాసులుగా ఉంటారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2020/05/nachchiyar-thirumozhi-8-simple/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

నాచ్చియార్ తిరుమొళి – సరళ వ్యాఖ్యానము – ఏళాం తిరుమొళి – కరుప్పూరం నాఱుమో

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

నాచ్చియార్ తిరుమొళి

<< ఆరాం తిరుమొళి – వారణమాయిరం

పెరుమాళ్ళ కుశల క్షేమాల గురించి వచ్చిన హనుమానునితో విచారించిన సీతా పిరాట్టి వలె కాకుండా, ఎంబెరుమానుని అంతరంగ దాసుడైన ఆచార్యుని (నిపుణుడు) నుండి, ఎంబెరుమానుని అనుభవం గురించి అడిగే అదృష్టం ఆండాళ్కి కలిగింది. ఆమెకి కలిగిన స్వప్నము చివరలో, ఎంబెరుమానునితో ఆమె ఐక్యమై ఉండవచ్చు. అందుకని ఆండాళ్, ఎంబెరుమానుని దివ్య అదర మకరంద స్మృతులను గుర్తుచేసుకుంటూ, దివ్య పంచాజన్యమైన శంఖత్తాళ్వాన్తో  అడిగి తెలుసుకుంటుంది.  ఎంబెరుమానుని దివ్య అదరముల మకరందము గురించి తెలుసుకోవడానికి కారణాలు ఇవి:

  1. సాధారణంగా రాజు మరియు రాణి సౌకర్యము కోసం రాణి యొక్క అంతఃపురంలో గూనులు, మరుగుజ్జులు ఉన్నట్లే, దివ్య శంఖం ఎంబెరుమానుని నుండి ఎన్నడూ వీడకుండా వారి ఏకాంత సమయంలో కూడా వారితోనే ఉంటారు.
  2. ఎమ్పెరుమానుడు శంఖాన్ని ఊదడానికి తన దివ్య అదరముల మధ్య ఉంచినప్పుడల్లా, శంఖము ఎమ్పెరుమానుడి అదరామృతాన్ని నిత్యము తాగుతుంది.
  3. ఆ పాంచజణ్యము ఎన్నడూ వీడకుండా ఎంబెరుమానుడితోనే ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే, ఎంబెరుమానుడు తన శత్రు నాశనం చేయడానికి సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తారు. ఈ సమయంలో చక్రాయుధము ఒక స్వల్ప కాలం పాటు భగవానుని నుండి వీడి ఉంటుంది. అయితే, దివ్య శంఖం మాత్రము భగవానుని నుండి ఎన్నడూ వీడదు. .
  4. అంతేకాక, నల్లని భగవానుడి దివ్య స్వరూపముపైన తెల్లని శంఖము యొక్క సంగమము ఆస్వాదించయోగ్యమైనది అనుభవించదగినది.

ఈ కారణాల వల్ల, దివ్య శంఖంతో మాట్లాడి అడిగి తెలుకోవడం అనేది భగవానునితో మాట్లాడి అడిగి తెలుకోవడం లాంటిది కనుక, ఆండాళ్ ఆ దివ్య శంఖాన్ని అడుగుతోంది. 

మొదటి పాశురము:  నిత్యము భగవానుని దివ్య అదరామృతాన్ని అస్వాదిస్తున్నందున, ఆ రుచి తెలిసిన శంఖాన్ని, ఆ రుచి ఎలా ఉంటుందో తెలపమని వారిని అడుగుతోంది.

కరుప్పూరం నాఱుమో కమలప్పూ  నాఱుమో
తిరుప్పవళ చ్చెవ్వాయ్ దాన్ తిత్తి త్తిరుక్కుమో?
మరుప్పొశిత్త మాదవన్ తన్ వాయ్ చ్చువైయుం నాఱ్ఱముం
విరుప్పుఱ్ఱుక్కేట్కిన్ఱేన్ శొల్లాళి వెణ్ శంగే

శ్వేత రంగులో ఉన్న ఓ శ్రీ పాంచజన్యమా!  కంసుడి రాచపు ఏనుగు అయిన కువలయాపీడం దంతాన్ని విరిచిన శ్రీ కృష్ణుడి దివ్య పెదవుల రుచి మరియు సువాసన ఎలా ఉంటుందని ఆశతో నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఎర్రటి రంగులో ఉండే ఆ ఎంబెరుమానుని దివ్య పెదవులు ఔషద కర్పూరంలా సువాసన కలిగి ఉంటాయా? లేదా తామర పుష్పపు సువాసన కలిగి ఉంటాయా? తీపి రుచి కలిగి ఉంటాయా? నువ్వు నాకు చెప్పాలి.

రెండవ పాశురము: దుష్థులు శిక్షింపబడినట్లే, భక్తులు కూడా రక్షింపబడాలి. తాను పుట్టి పెరిగింది పరోపకారము కొరకు కనుక, తన పనులు కూడా అలాగే ఉండాలి అని ఆమె దివ్య శంఖముతో అంటుంది.

కడలిల్ పిఱందు కరుదాదు పంచశనన్
ఉడలిల్ వళర్ందు పోయ్ ఊళియాన్ కైత్తల
త్తిడరిల్ కుడియేఱి త్తీయ అశురర్
నడలైప్పడ ముళంగుం తోఱ్ఱత్తాయ్ నఱ్చంగే

ఓ అందమైన శ్రీ పాంచజన్యమా! నీవు సముద్రపు లోతులో పంచశనుడు అనే రాక్షసుడి శరీరం నుండి జన్మించి అక్కడే పెరిగావు. కానీ దానితో నిమిత్తం లేకుండా, నీవు అక్కడే నిత్య నివాసుడైన ఎంబెరుమానుడి దివ్య హస్తము వంటి అత్యంత ఉన్నత దశకి చేరుకున్నావు. నీ ధ్వనితో రాక్షసులను భయపెట్టే గొప్పతనం నీకుంది. కాబట్టి ఈ ఉపకారం నీవు నాకు చేయాలి.

మూడవ పాశురము:  దివ్య పాంచజన్య సౌందర్యాన్ని ఆమె ఆస్వాదిస్తుంది.

తడవరైయిన్ మీదే శరఱ్కాల చందిరన్
ఇడైయువావిల్ వందు ఎళుందాలే పోల్ నీయుం
వడ మదురైయార్ మన్నన్ వాసుదేవన్ కైయిల్
కుడియేఱి వీఱ్ఱిరుందాయ్ కోలప్పెరుం శంగే

ఓ అందమైన, బ్రహ్మండమైన శ్రీ పాంచజన్యమా! శరదృతువు సమయంలో పౌర్ణమి రోజున, పర్వతాలనుండి చంద్రుడు ఉదయించినట్లు, నీ వైభవాన్నంతా  తెలియజేస్తూ, నీవు ఉత్తర మధురకి రాజు అయిన వాసుదేవ భగవానుడి దివ్య హస్తములో నిలయమై ఉన్నావు.

నాలుగవ పాశురము: అంతరంగ విషయాల గురించి మాట్లాడే సామర్థ్యం ఉన్న అతడిని, ఎంబెరుమానుడితో తన గురించి మాట్లాడమని ఆమె ప్రార్థిస్తుంది.

చందిర మండలం పోల్ దామోదరన్ కైయిల్
అందరం ఒన్ఱిన్ఱి ఏఱి అవన్ శెవియిల్
మందిరం కొళ్వాయే పోలుం వలంపురియే!
ఇందిరనుం ఉన్నోడు శెల్వత్తుక్కు ఏలానే

కుడివైపుకి మెలిక తిరిగి ఉన్న ఓ శంఖమా! చంద్ర మండలము వలె నీవు దామోదర భగవానుడి దివ్య హస్తములో మెలిక తిరిగి నిత్య నివాసము ఉండి, ఆతని చెవిలో రహస్య విషయాలు మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తున్నావు. స్వర్గాధి పతి అయిన ఇంద్రుడు కూడా నిజమైన నీ సేవా సంపదకి సరితూగలేడు.

ఐదవ పాశురము: ఇతర శంఖాలకి వారు సమానంగా కారని, ఎందుకంటే వారు నిరంతరం ఎంబెరుమానుడి అధర మకరందాన్ని ఆస్వదిస్తారని ఆమె పాంచజన్యముతో అంటుంది.

ఉన్నోడు ఉడనే ఒరు కడలిల్ వాళ్వారై
ఇన్నార్ ఇణైయార్ ఎన్ఱు ఎణ్ణువార్ ఇల్లై కాణ్
మన్నాగి నిన్ఱ మదుసూదన్ వాయ్ అముదం
పన్నాళుం ఉణ్గిన్ఱాయ్ పాంచశన్నియమే!

పాంచజన్యమా! అదే సముద్రంలో నీతో నివసిస్తున్న ఇతర శంఖాలను ఎవరూ పట్టించుకోరు గౌరవించరు.  ఎంతో కాలంగా ఎంబెరుమానుడి నోటి మకరందము నీవు మాత్రమే తాగుతున్నారు. కాబట్టి అదృష్టవంతుడివి నీవే.

ఆరవ పాశురము: ఎమ్పెరుమానుడి నోటిలోని దివ్య జలములో స్నానమాడే అదృష్టాన్ని పొందినందుకు ఆమె అతడిని కీర్తిస్తుంది.

పోయ్ త్తీర్ త్తం ఆడాదే నిన్ఱ పుణర్ మరుదం
శాయ్ త్తీర్ త్తాన్ కైత్తలత్తే ఏరిక్కుడికొండు
శేయ్ త్తీర్ త్తమాయ్ నిన్ఱ శెంగణ్మాల్ తన్నుడైయ
వాయ్ త్తీర్ త్తం పాయ్ందాడ వల్లాయ్ వలంపురియే!

కుడి వైపున మెలిక తిరిగిన ఓ శంఖమా! నిన్ను నీవు శుద్ధి చేసుకోవడానికి గంగా మొదలైన పవిత్ర నదులలో స్నానం మాడేందుకు దూర దూరం వేల్లాల్సిన అవసరం నీకు లేదు. బదులుగా, నారదుని శాపం కారణంగా వృక్ష రూపములో నిలబడి ఉన్న రాక్షసులని కూల్చి నేలమట్టం చేసిన కృష్ణుడి దివ్య హస్థాన్ని అధీష్థించావు. ఎర్రటి నేత్రములు [భక్తుల పట్ల ఆప్యాయతను ప్రతిబింబిస్తుంది] ఉన్న సర్వేశ్వరుని నోటి మకరందములో స్థిరమై ఉండే అదృష్టాన్ని నీవు పొందావు, నీవు నిత్య స్నానం అక్కడే చేసే అదృష్టాన్ని పొందావు.

ఏడవ పాశురము:  ఎంబెరుమానుడి దివ్య హస్తములో నిలయుడై ఉన్న దివ్య శ్రీ పాంచజన్యము యొక్క అదృష్థాన్ని ఆమె కీర్తిస్తుంది.

శెంగమల నాణ్మలర్ మేల్ తేనుగరుం అన్నన్ పోల్
శెంగణ్ కరుమేని వాసుదేవనుడైయ
అంగైత్తలం ఏఱి అన్నవశం శెయ్యిం
శంగరైయా! ఉన్ శెల్వం శాల అళగియదే

తాజాగా వికసించిన తామర పుష్పము నుండి తేనెలను త్రాగే హంసలాగే, నీవు ఎర్రటి నేత్రములు మరియు నల్లని స్వరూపమున్న కృష్ణ భగవానుడి అందమైన దివ్య హస్థాన్ని అధీష్థించావు. శంఖాలలో ప్రముఖుడివైన ఓ పాంచజన్యమా! నీ సేవా సంపద అపారమైనది.

ఎనిమిదవ పాశురము: శ్రీ పాంచజన్యం పట్ల అమ్మాయిలందరికీ ఉన్న కోపం గురించి ఆమె ప్రస్తావిస్తుంది.

ఉణ్బదు శొల్లిల్ ఉలగళందాన్ వాయ్ అముదం
కణ్ పడై కొళ్ళిల్ కడల్ వణ్ణన్ కైత్తలత్తే
పెణ్ పడైయార్ ఉన్ మేల్ పెరుం పూశల్ శాఱ్ఱుగిన్ఱార్
పణ్ పల శెయ్గిన్ఱాయ్ పాంచశన్నియమే!

పాంచజన్యమా! సమస్థ లోకాలను కొలిచిన ఎంబెరుమానుడి దివ్య నోటి మకరందము నీకు ఆహారము వంటిది. సముద్రము వలె నీల వర్ణుడైన ఆ ఎంబెరుమానుడి దివ్య హస్తము నీవు నిద్రించే చోటు. నీవు నిత్యము ఆతడి అదరములపై లేదా ఆతని హస్తములో ఉంటావు. నీవు ఇలా ఉన్నావు కాబట్టి, అమ్మాయిలందరూ నీపై ఈర్శ పడుతున్నారు.  మమ్మల్నందరినీ పక్కన పెట్టి ఈ అన్యాయమైన పని చేయుట నీకు న్యాయమా? ఇది సరైనదేనా?

తొమ్మిదవ పాశురము: మునుపటి పాశురములో మాదిరిగానే, ఈ పాశురములో కూడా శ్రీ పాంచజన్యముపైన అమ్మాయిలందరూ కోపం ఎలా పెంచుకుంటున్నారో, ఆ విషయము గురించి ఆమె ప్రస్తావిస్తుంది.

పదినాఱూం ఆయిరవర్ దేవిమార్ పార్ త్తిరుప్ప
మదు వాయిల్ కొణ్డాఱ్పోల్ మాదవన్ తన్ వాయ్ అముదం
పొదువాగ ఉణ్బదనైప్పుక్కు నీ ఉణ్డక్కాల్
శిదైయారో ఉన్నోడు? శెల్వప్పెరుం శంగే

నిరంతరం ఎంబెరుమానుడిని అనుభవించే సంపద కలిగిన ఓ పాంచజన్యమా! పదహారు వేల మంది భార్యలు (భగవానుడి) కృష్ణ భగవానుడి దివ్య మకరందాన్ని ఆస్వాదించాలని వేచి ఉన్నారు. ఆ భార్యలందరితో పంచుకోవాల్సిన ఎంబెరుమానుడి అదరామృతాన్ని ఆత్రముగా నీవొక్కడివే అనుభవిస్తే, ఆ స్థ్రీలు నీపై దాడికి రారా?

పదవ పాశురము: ఈ పది పాశురములను నేర్చుకొని పఠించిన వారికి లభ్యమైయ్యే ఫలితము గురించి తెలుపుతూ ఆమె ఈ పదిగాన్ని ముగిస్తుంది.

పాంచశన్నియత్తై ప్పఱ్పనాబనోడుం
వాయ్ంద పెరుం శుఱ్ఱం ఆక్కియ వణ్ పుదువై
ఏయ్ంద పుగళ్ ప్పట్టర్పిరాన్ కోదై తమిళ్ ఈరైందుం
ఆయ్ందేత్త వల్లార్ అవరుం అణుక్కరే

శ్రీ పాంచజన్యము మరియు భగవానుడి మధ్య లోతైన సంబంధాన్ని ఆండాళ్ ఈ పది పాశురముల ద్వారా స్పష్ఠీకరించింది. ఆమె శ్రీవిల్లిపుత్తుర్లో అవతరించింది. ఆమె పెరియాళ్వార్ల ముద్దు బిడ్డ, గొప్ప కీర్తివంతురాలు. ఆండాళ్ దయతో కూర్చిన ఈ పది పాశురాలను నేర్చుకున్నవారు భగవానుడికి నికట సంబంధులు అవుతారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2020/05/nachchiyar-thirumozhi-7-simple/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

నాచ్చియార్ తిరుమొళి – సరళ వ్యాఖ్యానము – ఆరాం తిరుమొళి – వారణమాయిరం

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

నాచ్చియార్ తిరుమొళి

<< ఐందాం తిరుమొళి – మన్ను పెరుం

తనని ఎంబెరుమానుడి వద్దకి చేర్చమని ఆండాళ్ కోకిలని ప్రార్థించింది. అలా జరగనందున ఆమె బాధలో ఉంది. ఆమె ప్రేమ తన పట్ల పరిపక్వం కావాలని, అయిన వెంటనే తన వద్దకి చేర్చుకుందామని మరోవైపు ఎంబెరుమాన్ వేచి చూస్తున్నాడు. నమ్మాళ్వార్లకి భగవానుడు ప్రారంభంలోనే భక్తి మరియు జ్ఞానాన్ని ప్రసాదించినప్పటికీ, ఆళ్వార్ని పరభక్తి (భగవత్ జ్ఞానం) మరియు పరజ్ఞానం (భగవానుడి మానసిక దర్శనము) వంటి దశలను దాటించిన తరువాత మాత్రమే వారికి పరమపదంలో నిత్య సేవను అనుగ్రహించారు. సీతా పిరాట్టి కూడా “పెరుమాళ్ళ రాక కోసం నేను ఒక నెల వరకు వేచి ఉంటాను” అని చెప్పింది. కానీ పెరుమాళ్ మాత్రం “నేను పిరాట్టి నుండి ఒక్క క్షణం కూడా వీడి ఉండ లేను” అని అన్నాడు. త్రిజడ వంటి వాళ్ళకి పెరుమాళ్ళు స్వప్నములో దర్శనమిచ్చేవారు, ఆమె ఆ కలల గురించి సీతా పిరాట్టికి చెప్పి, పిరాట్టికి ఓదార్పుని కలిగించేది. మరోవైపు, ఆండాళ్ తనుకి స్వయంగా భగవానుడి స్వప్నదర్శనము కలిగితేనే తనను తాను నిలుపుకోగలదు. లోకమంతా నిద్రలో ఉన్నప్పుడు ప్రజలందరికీ మంచి కలలను చూపించి ఆనందాన్ని ప్రసాదించేందుకు ఎంబెరుమానుడు తాను మేలుకొని ఉంటాడని శాస్త్రము చెబుతుంది. అదే విధంగా, తనతో కళ్యాణము జరిగినట్లు ఆమె స్వప్నంలో దర్శింపజేసి, ఆ స్వప్నము గురించి తన స్నెహితురాల్లకి వర్ణిస్తూ  తాను తృప్తిపడేలా ఎంబెరుమానుడు చేశారు. 

మొదటి పాశురము: “ఆతడు రానీ, వచ్చాక మేము ఆనందిద్దాము” అని చెప్పి కుదురుగా ఉండకుండా, ఆతడు వచ్చిన క్షణం నుండే అనుభవము పొందాలని ఆమె ఆతని రాక కోసం దీర్ఘాలోచన చేస్తోంది.

వారణం ఆయిరం శూళవలం శెయ్దు 
నారణ నంబి నడక్కిన్ఱాన్ ఎన్ఱెదిర్
పూరణ పొఱ్కుడం వైత్తుప్పుఱమెంగుం
తోరణం నాట్ట క్కనాక్కండేన్ తోళీ! నాన్ 

ఓ నా ప్రియమైన మిత్రమా! అన్ని శుభ లక్షణాలలో పరిపూర్ణుడు అయిన శ్రీమన్నారాయణుడు వెయ్యి ఏనుగులతో వస్తున్నాడు. బంగారు పూర్ణ కుంభాలు (అతిథులను నిండు కలశాలతో స్వాగతించే సాంప్రదాయ పద్ధతి) ఆతని ఎదుట ఉంచ బడ్డాయి. పట్టణం మొత్తం తోరణాలు మరియు స్తంభాలతో అలంకరించబడింది. స్వప్నంలో ఇవన్నీ చూసి నేను అనుభవించాను. 

రెండవ పాశురము: కృష్ణుడు పెళ్ళి పందిరిలోకి ప్రవేశించడం తాను చూసానని ఆమె తెలుపుతుంది. 

నాళై వదువై మణం ఎన్ఱు నాళిట్టు
పాళై కముగు పరిశుడైప్పందఱ్కీళ్
కోళరి మాదవన్ గోవిందన్ ఎన్బానోర్
కాళై పుగుద క్కనాక్కండేన్ తోళీ! నాన్ 

ఓ మిత్రమా! కళ్యాణానికి అనుకూలమైన శుభ ముహుర్తము రేపు నిర్ణయించబడింది. నా స్వప్నంలో, నరసింహ, మాధవ, గోవింద అనే సహస్ర దివ్య నామాలు ఉన్న ఒక యువకుడు, మంగళ కరమైన వక్క చెట్టు కోశముతో అలంకరించబడిన పెళ్ళి పందిరిలోకి ప్రవేశించడం నేను చూశాను.

మూడవ పాశురము:పెళ్ళి బట్టలు వర మాలలు ధరించిన తన అనుభూతిని అనుభవాన్ని ఆమె పంచుకుంటుంది.

ఇందిరనుళ్ళిట్ట దేవర్కుళాం ఎల్లాం
వందిరుందు ఎన్నై మగళ్ పేశి మందిరత్తు
మందిరక్కోడి ఉడుత్తి మణమాలై
అందరి శూట్ట క్కనాక్కండేన్ తోళీ! నాన్ 

ఓ మిత్రమా! ఇంద్రుడు మరియు ఇతర దేవలోక వాసులందరూ ఇక్కడకు వచ్చి పెళ్లి ఏర్పాట్ల గురించి, వధువుగా నాతో చర్చించారు. దుర్గా (నా భర్త సోదరి) నాకు పెళ్లి చీర కట్టడం, సుగంధ పూరితమైన పుష్పమాలలు వేయడం నేను నా స్వప్నములో చూసాను.

నాలుగవ పాశురము: కళ్యాణానికి ముందు జరిగే కంకణ ధారణ అనుభూతిని అనుభవాన్ని ఆమె పంచుకుంటుంది.

నాల్ తిశై త్తీర్ త్తం కొణర్ందు నని నల్గి
పార్పనచ్చిట్టర్గళ్ పల్లార్ ఎడుత్తేత్తి
పూప్పునైక్కణ్ణి ప్పునిదనోడు ఎన్ తన్నై
కాప్పు నాణ్ కట్ట క్కనాక్కండేన్ తోళీ! నాన్ 

ఓ మిత్రమా! అనేక మంది బ్రాహ్మనోత్తములు నాలుగు దిక్కుల నుండి పవిత్ర జలాలను తెచ్చినట్లు నేను స్వస్పములో చూశాను. వారు వేద మంత్రాలను ఉచ్చరిస్తూ ఆ ధ్వనుల మధ్య ఆ పవిత్ర జలాలను అన్ని చోట్లా చల్లడం చూశాను. పూమాలలు ధరించిన కృష్ణుడికి, వారితో పాటు నా చేతికి రక్షణ కంకణాన్ని వారు కట్టడం నేను చూశాను.

ఐదవ పాశురము:  ఎంబెరుమానుడిని మంగళ దీపాలతో పూర్ణ కుంభములతో స్వాగతించడం, ఆతడు పెళ్ళి పందిరిలోకి ప్రవేశించే అనుభూతిని అనుభవాన్ని ఆమె పంచుకుంటుంది.

కదిరొళి దీపం కలశ ముడనేంది
శదిరిళ మంగైయర్ తామ్ వందెదిర్ కొళ్ళ
మదురైయార్ మన్నన్ నడినిలై తొట్టు ఎంగుం
అదిర ప్పుగుద క్కనాక్కండేన్ తోళీ! నాన్ 

ఓ మిత్రమా!  సూర్య కాంతుల వంటి మంగళ దీపాలను, స్వర్ణ కలశాలను (పూర్ణకుంభం) అందమైన కన్యలు పట్టుకొని ఉత్తర మధురకి రారాజైన ఎంబెరుమానుని స్వాగతించారు. ఆతడు పాదుకలు ధరించి, అతని పాదాల క్రింద భూమి ప్రతిధ్వనిస్తున్నట్లు గంభీరంగా నడుస్తుండటం నేను నా స్వప్నములో చూశాను.

ఆరవ పాశురము:   మధుసూధన భగవానుడు పాణీ గ్రహణము చేస్తున్న అనుభూతిని అనుభవాన్ని ఆమె పంచుకుంటుంది.

మత్తళం కొట్ట వరిశంగం నిన్ఱు ఊదు
ముత్తుడైత్తామం నిరై తాళ్ంద పందఱ్కీళ్
మైత్తునన్ నంబి మదుసూదన్ వందు ఎన్నై
క్కైత్తలం పఱ్ఱ  క్కనాక్కండేన్ తోళీ! నాన్ 

ఓ మిత్రమా!  సర్వ గుణ పరిపూర్ణుడైన వాడు మధుసూదనుడు (ఎంబెరుమానుడు). అనేక ముత్యపు దండలతో అలంకరించి ఉన్న  పెళ్ళి పందిరిలో, తన చేతిలో నా చేతిని ఉంచి, పాణిగ్రహణము చేస్తూ నాతో పరిణయమాడబోతున్న నా అత్త కొడుకు (మధుసూదనుడు) ని నేను నా స్వప్నంలో చూశాను.

ఏడవ పాశురము:  ఎంబెరుమానుడితో తాను చేసిన అగ్ని ప్రదక్షిణల అనుభూతిని అనుభవాన్ని ఆమె పంచుకుంటుంది.

వాయ్ నల్లార్ నల్ల మఱై ఓది మందిరత్తాల్
పాశిలై నాణల్ పడుత్తు ప్పరిదివైత్తు
కాయ్శినమా కళిఱన్నాన్ ఎంకై ప్పఱ్ఱి
తీవలం శెయ్య క్కనాక్కండేన్ తోళీ! నాన్ 

ఓ మిత్రమా! స్పష్ఠమైన ఉచ్ఛారణతో వేద నిపుణులు వేద మంత్రాలు పఠిస్తున్నారు. వారు లేత ఆకులతో ఉన్న పవిత్రమైన గడ్డిని పరిచి, ఎండు కొమ్మలని అగ్నికి సమర్పించిరి. నిండుగా అలంకరించి ఉన్న మహా గజము వలె కృష్ణ భగవానుడు  ఆనందంతో నా చేయి పట్టుకుని అగ్ని ప్రదక్షిణలు చేయుట నేను స్వప్నంలో చూశాను. 

ఎనిమిదవ పాశురము:  తను ఎంబెరుమానుడి సమక్షంలో సన్ని కల్లు (రుబ్బు రాయి) తొక్కిన అనుభూతిని అనుభవాన్ని, ఆమె పంచుకుంటుంది.

ఇమ్మైక్కుం ఏళేళ్ పిఱవిక్కుం పఱ్ఱావన్
నమ్మై ఉడైయవన్ నారాయణన్ నంబి
శెమ్మై ఉడైయ తిరుక్కైయాల్ తాళ్ పఱ్ఱి
అమ్మి మిదిక్క  క్కనాక్కండేన్ తోళీ! నాన్ 

ఓ మిత్రమా! ఈ జన్మలోనే కాక రాబోయే అన్ని జన్మలలో కూడా మనకు ఏకైక ఆశ్రయం ఎంబెరుమానుడు. సర్వ గుణ పరిపూర్ణుడైన ఆతడే మనకు స్వామి.  ఆ నారాయణుడు, కృష్ణ భగవానుడు, ఆతడి దివ్య హస్తముతో (అతని అనుచరుల పాదాలను కూడా పట్టుకోగల), నా పాదాన్ని పట్టుకుని సన్ని కల్లుపైన ఉంచడం నేను నా కలలో చూశాను .

తొమ్మిదవ పాశురము: లాజ హోమాము (హోమములో పేలాలు సమర్పించే ఆనవాయితి) యొక్క అనుభూతిని అనుభవాన్ని ఆమె పంచుకుంటుంది.

వరిశిలై వాళ్ ముగత్తు ఎన్నైమార్ తాం వందిట్టు
ఎరి ముగం పారిత్తు ఎన్నై మున్నే నిఱుత్తి
అరి ముగన్ అచ్చుదన్ కైమేళ్ ఎంకై వైత్తు
పొరిముగందు అట్ట క్కనాక్కండేన్ తోళీ! నాన్ 

ఓ మిత్రమా! విల్లులాంటి వారి కనుబొమ్మలు మరియు దివ్య తేజస్సు గల ముఖాలున్న నా సోదరులు అగ్ని సమక్షమున నన్ను నిలబెట్టి అగ్నిహోమాదులు గావించడం,  నేను స్వప్నంలో  చూశాను. గంభీరమైన సింహం లాంటి ముఖారవిందము కలిగిన అచ్యుతుడి దివ్య హస్తాన్ని నా చేతి పైన ఉంచి, పేలాలు (మురమురాలు) నా చేతిలో ఉంచడం,  నేను స్వప్నంలో  చూశాను. 

పదవ పాశురము: ఎంబెరుమానుడితో ఏనుగు అంబారి ఎక్కి అందరితో పణ్ణీరు చల్లించుకున్న అనుభూతిని అనుభవాన్ని ఆమె పంచుకుంటుంది.

కుంగుమం అప్పి క్కుళిర్ శాందం మట్టిత్తు
మంగల వీది వలం శెయ్దు మణ నీర్
అంగు అవనోడుం ఉడన్ శెన్ఱు అంగు ఆనై మేల్
మంజనమాట్ట క్కనాక్కండేన్ తోళీ! నాన్ 

ఓ మిత్రమా! నా శరీరముపై కుంకుమ పూవుతో కూడిన నలుగు, చల్లని చందన లేపనము చేశారు, ఏనుగుపైన ఎంబెరుమానుడితో పాటు నేను దివ్యంగా అలంకరించబడిన వీధుల గుండా పట్టణం చుట్టూ  వెళ్ళాను. మా ఇరువురికీ సుగంధ జలాలతో స్నానం గావించడం నేను నా స్వప్నంలో చూశాను. 

పదకొండవ పాశురము:  ఈ పది పాశురములు సేవించిన వారికి లభించే ఫలితాన్ని వివరిస్తూ ఈ పదిగాన్ని పూర్తి చేస్తుంది.

ఆయనుక్కాగత్తాన్ కండ కనావినై
వేయర్ పుగళ్ విల్లిపుత్తూర్ క్కోన్ కోదై శొల్
తూయ తమిళ్ మాలై ఈరైందుం వల్లవర్
వాయు నన్ మక్కళై ప్పెఱ్ఱు మగిళ్వరే 

బ్రాహ్మనోత్తములచే కీర్తించబడిన వారు పెరియాళ్వార్లు. వారు శ్రీవిల్లిపుత్తూర్కి నాయకుడు. పెరియాళ్వార్ల కుమార్తె అయిన ఆండాళ్ కృష్ణ భగవానుని తన స్వప్నంలో ఎలా పరిణయము ఆడిందో ఆమె దయతో వర్ణించిన ఈ పది పాశురములను నేర్చుకున్న వారికి గొప్ప గుణాలతో, భగవత్ విషయములలో నిమగ్నమై ఉండే పెరియాళ్వార్ల వంటి సంతానము పొంది ఎల్ల కాలము సంతోషముగా జీవిస్తారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2020/05/nachchiyar-thirumozhi-6-simple/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

నాచ్చియార్ తిరుమొళి – సరళ వ్యాఖ్యానము – ఐందాం తిరుమొళి – మన్ను పెరుం

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

నాచ్చియార్ తిరుమొళి

<< నాంగామ్ తిరుమొళి – తెళ్ళియార్ పలర్

కూడల్లో పాలుపంచుకున్న తర్వాత కూడా భగవానుడితో ఏకం కానందున, ఒకానొక సమయంలో ఆమె భగవానుడితో కలిసి ఉన్నప్పుడు తమతో ఉన్న కోకిల పక్షిని చూస్తుంది. ఆ పక్షి జ్ఞానవంతురాలని, ఆమె మాటలకు ప్రత్యుత్తరం ఇవ్వగలదని గ్రహించి, ఆమె కోకిల పక్షి పాదాల వద్ద పడి, “నన్ను ఆతడితో ఏకం చేయి” అని ప్రార్థిస్తోంది. తన మాటలకు ప్రత్యుత్తరం ఇచ్చే సామర్థ్యం ఉందని భావించి, ఆమె ఆ పక్షి ప్రార్థిస్తుంది. రావణునితో “నన్ను పెరుమాళ్ళతో ఏకం చేయి” అని చెప్పగల సామర్థ్యం ఉన్న సీతా పిరాట్టి లాంటి ఆండాళ్, ఆ కోకిలని వదలదు. ఇక్కడ, ఆమె తనను భగవానుడితో ఏకం చేయమని ప్రార్థిస్తోంది.

మొదటి పాశురము: అందరినీ సంరక్షించగల సామర్థ్యం ఉన్న ఎంబెరుమానుడు నన్ను రక్షించకపోతే, దాన్ని సరి చేయడం తన కర్తవ్యం కాదా అని ఆమె కోకిల పక్షిని అడుగుతోంది.

మన్ను పెరుంపుగళ్ మాదవన్ । మామణివణ్ణన్ మణిముడి మైందన్
తన్నై ఉగందదు కారణమాగ ఎన్ శంగిళక్కుం వళక్కు ఉణ్డే?
పున్నై కురుక్కత్తి జ్ఞాళల్ శెరుంది ప్పొదుంబినిల్ వాళుం కుయిలే ।
పన్ని ఎప్పోదుం ఇరుందు విరైందు ఎన్ పవళవాయన్ వరక్కూవాయ్ ।

పొన్న, మేడి, అల్లి, తుంగ వంటి వివిధ రకాల చెట్ల రంధ్రములలో నివసించే ఓ కోకిలా! అసంఖ్యాకమైన కల్యాణ గుణాలు కలిగిన భగవానుడు, శ్రీ మహాలక్ష్మికి పతి, నీల మాణిక్య వర్ణము కలిగినవాడు, విలువైన రత్నాలు పొదిగిన మకుటాన్ని ధరించినవాడు, అత్యంత బలశాలి, నాకు తగినటువంటి వాడు, అతడిని నేను కోరుకున్నందుకు నా కంకణాలు నా చేతుల నుండి జారిపోవడం సరేనా?  ఎర్రటి దివ్య అదరములున్న ఆ భగవానుడు నా దగ్గరకు త్వరలో  వచ్చేటట్టుగా నీవు ఆతడి దివ్య నామాలను గట్టి గట్టిగా పలకాలి.

రెండవ పాశురము: ఆమె తన ప్రస్తుత స్థితిని తెలిపితే, కోకిల అది విని తగిన పరిహారం చూపవచ్చు. అందుకే, ఆమె తాను ఉన్న స్థితిని వివరిస్తోంది.

వెళ్ళై విళిశంగు ఇడంగైయిల్ కొండ విమలన్ ఎనక్కు ఉరుక్కాట్టాన్
ఉళ్ళం పుగుందు ఎన్నై నైవిత్తు నాలుం ఉయిర్ ప్పెయ్దు క్కూత్తాట్టు క్కాణుం
కళ్ళవిళ్ శెణ్బగప్పూమలర్ కోది క్కళిత్తిశై పాడుం కుయిలే
మెళ్ళ ఇరుందు మిళఱ్ఱి మిళఱ్ఱాదు ఎన్ వేంగడవన్ వరక్కూవాయ్ ।

తేనె బిందువులతో కారుతున్న చంపక పుష్పపు రసాన్ని ఆస్వాదించి  సంతోషంగా రాగాలు తీసి పాడే ఓ కోకిల! అతి ఉత్తమమైన శుద్ధ భక్తులను ఆకర్షించే దివ్య శంఖాన్ని తన ఎడమ హస్తములో ధరించిన తన దివ్య స్వరూపాన్ని నాకు వ్యక్తం చేయడం లేదు. అంతేకాక, అతడు నా హృదయంలోకి ప్రవేశించి నన్ను లోపల కుళ్ళి క్రుశించిపోయేలా చేస్తున్నాడు. మరింత బాధను అనుభవించమని ప్రతిరోజూ నాకు ప్రాణ వాయువుని ప్రసాదించి నన్ను బ్రతికి ఉంచి పోషిస్తున్నాడు. నన్ను కృశింప జేసి, దానిని ఆతడు వినోదంగా అనుభవిస్తున్నాడు. నీవు నా దగ్గర ఉండి నాతో అర్థంలేని కబూర్లు చెప్పి ఆడుకునే బదులు, ఆతడు తిరువేంగడం నుండి ఇక్కడికి వచ్చేటట్లు నీవు కూసి అతన్ని పిలవాలి.

మూడవ పాశురము: మన శత్రువులను తొలగించి, మనకి అనుభవాన్ని అందించే శ్రీరాముడు ఇక్కడకు వచ్చేలా కూసి పిలవమని కోకిలను ఆమె ప్రార్థిస్తుంది.

మాదలి తేర్ మున్బు కోల్ కొళ్ళ మాయన్ ఇరావణనన్మేల్ శరమారి
తాయ్ తలై అఱ్ఱఱ్ఱు వీళ త్తొడుత్త తలైవన్ వరవెంగుం కాణేన్
పోదలర్ కావిల్ పుదుమణం నాఱ ప్పొఱి వణ్డిన్ కామరం కేట్టు ఉన్
కాదలియోడు ఉడన్ వాళ్ కుయిలే । ఎన్ కరుమాణిక్కం వరక్కూవాయ్

చక్కటి సువాసనలు వెదజల్లుతున్న పూతోటలో తుమ్మెదల రాగాల మధ్య నీ జంట పక్షితో (ఆడ పక్షి) జీవిస్తున్న ఓ కోకిల! మహాద్భుతంగా రావణుడు యుద్దము చేస్తుండగా, మాదలి సారథిగా నడిపిన రథాన్ని శ్రీ రాముడు ఎక్కి రావణుడిపై బాణాల వర్షం కురిపించి రావణుడి శిర చ్ఛేదము చేసిన ఆ ఎంబెరుమానుడి రాక నాకు కనిపించుట లేదు. అందువల్ల ఆ నీలి మాణిక్య వర్ణుడైన ఎంబెరుమానుడు ఇక్కడకు రావాలని నీవు కూసి కేకలు వేయాలి.

నాలుగవ పాశురము: గరుడ ధ్వజము ఉన్న అతి సౌందర్యుడు ఆ ఎంబెరుమానుడు, తాను ఉన్న చోటికి వచ్చేలా కూయమని కోకిలని ఆమె ప్రార్థిసుంది.

ఎన్బురుగి ఇనవేల్ నెడుం కణ్గళ్ ఇమై పొరుందా పలనాళుం
తున్బక్కడల్ పుక్కు వైగుందన్ ఎన్బదోర్ తోణి పెఱాదు ఉళల్గిన్ఱేన్
అన్బుడైయారై ప్పిరివుఱునోయ్ అదు నీయుం అఱిదికుయిలే ।
పొన్బురై మేనిక్కరుడ క్కొడియుడై ప్పుణ్ణియనై వరక్కూవాయ్ ।

ఓ కోకిల! ఎముకలు కరిగిపోతున్నాయి, పొడుగాటి విశాలమైన ఈ రెందు కళ్ళు నిద్రని ఒద్దంటున్నాయి. ఎంతో కాలంగా, నేను ఆతడి విరహ వేదన సాగరములో మునిగి ఉన్నాను, నన్ను శ్రీవైకుంఠానికి తీసుకువెళ్ళే  విష్ణుపోదం (శ్రీవైకుంఠ నాథుడనే నావ) పొందలేకపోయాను, ఇక్కడ నేను క్షోభని అనుభవిస్తున్నాను. మనకి ప్రియమైన వారికి దూరమైనప్పుడు కలిగే బాధ ఎలాంటిదో నీకు తెలియదా? స్వర్ణ స్వరూపుడు, గరుడ ధ్వజము కలిగిన ఆ కృష్ణుడు ఇక్కడికి వచ్చేలా నీవు కూయాలి.

ఐదవ పాశురము: సమస్థ లోకాలని కొలిచిన ఆ భగవానుడిని దర్శించుకోడానికి, ఆతడు ఇక్కడకు వచ్చేలా పిలువగలడా అని ఆమె కోకిలని అడుగుతోంది.

మెన్నడై అన్నం పరందు విళైయాడుం విల్లిపుత్తూర్ ఉఱైవాన్ తన్
పొన్నడి కాణ్బదోర్ ఆశైయినాల్ ఎన్ పొరుకయఱ్ కణ్ణిణై తుంజా
ఇన్నడి శిలోడుపాల్ అముదూట్టి ఎడుత్త ఎన్ కోలక్కిళియై
ఉన్నొడు తోళమై కొళ్ళువన్ కుయిలే। ఉలగళందాన్ వరక్కూవాయ్ ।

మెల్లని నడకతో నడిచే హంసలు విశాలముగా విస్తరించి ఆడుకునేలా విస్తారమైన చోటు శ్రీవిల్లిపుత్తూర్లో ఉంది. పీతల వంటి నా కళ్ళు ఒకదానితో ఒకటి పోరాడుతూ, శ్రీవిల్లిపుత్తూర్లో నివాసుడై ఉన్న ఎంబెరుమానుడి స్వర్ణ సుందరమైన దివ్య చరణాలను దర్శించాలనే కోరికతో నిద్రని ఒద్దంటున్నాయి. ఓ కోకిల! అన్ని లోకాలను కృపతో కొలిచిన ఎంబెరుమానుడు ఇక్కడకు వచ్చేటట్లుగా కూయి. నీవు అలా చేస్తే, నేను చక్కర పొంగలి, పాయసం తినిపించి పోషించి చూసుకుంటున్న నా చిలుకతో నీ స్నేహంగా చేయిస్తాను.

ఆరవ పాశురము: నేను జీవించడానికి మూల కారకుడు ఎంపెరుమానుడు. ఆతడు ఇక్కడికి వచ్చేలా నీవి కూసి పిలిస్తే, నేను బ్రతికినంత కాలము నా శిరస్సుని నీ పాదాల వద్ద ఉంచుకుంటాను.

ఎత్తిశైయుం అమరర్ పణిందు ఏత్తుం ఇరుడీకేశన్ వలి శెయ్య
ముత్తన్న వెణ్ముఱువళ్ శెయ్య వాయుం ములైయుం అళగళిందేన్ నాన్
కొత్తలర్ కావిల్ మణిత్తడం కణ్పడై కొళ్ళుం ఇళం కుయిలే ఎన్
తత్తువనై వరక్కూగిఱ్ఱియాగిల్ తలై అల్లాల్ కైమ్మాఱిలేనే ।

వికసించిన పూల తోట లోపల అందమైన ప్రదేశంలో నిద్రిస్తున్న ఓ చిన్ని కోకిల!  దివ్య గంధర్వులు, అప్సరసల అభివందనాలు ఆరాధనలు నాలుగు దిక్కుల నుండి అందుకుంటున్న గొప్ప ఖ్యాతిగలవాడు హృశీకేషుడు (తన భక్తుల ఇంద్రియాలు తన ఆధీనంలో ఉంచు కున్నవాడు). ఆతడు నాకు దర్శనమివ్వకుండా నన్ను బాధపెడుతున్నాడు, కాబట్టి ముత్యాల వంటి నా తెల్లటి దంతాలు, నా స్థనములు, మెరిసే నా వర్ణము మొదలైన నా అందాన్ని నేను కోల్పోయాను. నేను జీవించడానికి మూలకారకుడైన ఎంబెరుమానుడిని నీవు ఇక్కడకు పిలిస్తే, నా శిరస్సుని ఎప్పటికీ మీ కాళ్ల వద్ద ఉంచడం తప్పా మరొక బదులుపకారము నేనెరుగను.

ఏడవ పాశురము: అందమైన ఆయుధాలు ధరించిన ఎంబెరుమానుడు తన వద్దకి వచ్చేటట్టుగా కూయమని కోకిలని ఆమె ప్రార్థిస్తుంది.

పొంగియ పాఱ్కడల్ పళ్ళి కొళ్వానై ప్పుణర్వదోర్ ఆశైయినాల్ ఎన్
కొంగై కిళర్ందు కుమైత్తుక్కుదుగలిత్తు ఆవియై ఆగులం శెయ్యుం
అంగుయిలే! ఉనక్కెన్న మఱైందుఱైవు? ఆళియుం శంగుం ఒణ్ తండుం
తంగియ కైయవనై వరక్కూవిల్ నీ శాలత్తరుమం పెఱుది ।

ఓ అందమైన కోకిల! ఉప్పొంగే తరంగాలతో తిరుప్పార్కడలిలో (పాల సముద్రం) శయనించి ఉన్న ఎంపెరుమానుడిని చేరాలని కోరిక నా స్థనాలను దృఢంగా మార్చి నన్ను భ్రమింపజేస్తున్నాయి. నీవు ఎలా దాగి ఉంటే ఏమి ప్రయోజనం? దివ్య శంఖము, దివ్య చక్రము, దివ్య గదని వారి దివ్య హస్తములలో ధరించి ఉన్న ఎంబెరుమానుడిని నీవు ఇక్కడకు రప్పిస్తే, నీవు అతి గొప్ప కార్యం చేసినవాడవౌతావు.

ఎనిమిదవ పాశురము: తిరుమాళ్ (శ్రీ మహాలక్ష్మీ పతి) అయిన ఎంబెరుమానుడు తన వద్దకి వచ్చేటట్టుగా కూయమని కోకిలని ఆమె ప్రార్థిస్తుంది.

శార్ంగం వళైయ వలిక్కుం తడక్కైచ్చదురన్ పొరుత్తముడైయన్
నాంగళ్ ఎమ్మిలిరుందు ఒట్టియ కైచ్చంగం నానుం అవనుం అఱిదుం
తేంగని మామ్బొళిల్ శెందళిర్ కోదుం శిఱు కుయిలే ! తిరుమాలై
ఆంగు విరైందు ఒల్లై కూగిఱ్ఱియాగిల్ అవనై నాన్ శెయ్వన కాణే ।

మామిడి తోటలో పండ్లతో నిండి ఉన్న చెట్ల లేత ఎర్రటి ఆకులను నీ ముక్కుతో పొడిచి పెకిలిస్తున్న ఓ యువ కోకిల! అత్యంత శక్తివంతమైన శారంగాన్ని తన దివ్య హస్థములతో ఎత్తగల ఎంబెరుమానుడు, ప్రేమ బాణాల విషయములో కూడా గొప్ప నిపుణుడు. మేమిద్దరం రహస్యంగా  కలిసి చేసిన ప్రమాణము మా ఇద్దరికీ బాగా తెలుసు. ఎంతో దూరంలో ఉన్న ఆ భగవానుడిని నీవు పిలవకపోతే, నేను ఆతడిని ఎలా హింసిస్తానో నీవే చూస్తావు.

తొమ్మిదవ పాశురము:  ఎంబెరుమానుడిని పిలవమని ఆమె కోకిలను కోరుతుంది లేదా ఆతడి నుండి తన గాజులను తిరిగి తెచ్చి పెట్టమంటుంది.

పైంగిళి వణ్ణన్ శిరీదరన్ ఎన్బదోర్ పాశత్తు అగప్పట్టిరుందేన్
పొంగళి వణ్డిరైక్కుం పొళిల్ వాళ్ కుయిలే ! కుఱిక్కొండు ఇదునీకేళ్
శంగొడు చక్కరత్తాన్ వరక్కూవుదల్ పొన్వళై కొండు తరుదల్
ఇంగుళ్ళ కావినిల్ వాళక్కరుదిల్ ఇరండత్తొన్ఱేల్ తిణ్ణం వేణ్డుం ।

మెరిసే తుమ్మెదలు రాగాలు తీస్తున్న తోటలో సంతోషంగా జీవిస్తున్న ఓ కోకిల! నేను చెప్పేది జాగ్రత్తగా వినుము. నేను చిలుకపచ్చ వర్ణముతో నున్న తిరుమాల్ యొక్క విచిత్రమైన వలలో చిక్కుకున్నాను. నీవు ఈ తోటలో నివసించాలనుకుంటే, దివ్య శంఖ చక్రాలు ధరించిన ఆ ఎంబెరుమానుడు ఇక్కడకు వచ్చేలా కూయాలి లేదా నేను పోగొట్టుకున్న బంగారు కంకణాలను నీవు తిరిగి తీసుకురావాలి.

పదవ పాశురము: ఆతడిని ఆ ప్రదేశానికి రప్పించకపోతే కోకిలకి శిక్ష విధిస్తానని ఆమె బెదిరిస్తుంది.

అన్ఱు ఉలగం అళందానై ఉగందు అడిమైక్కణవన్ శెయ్య
తెన్ఱలుం తింగళుం ఊడఱుత్తు ఎన్నై నలియుం ముఱైమై అఱియేన్
ఎన్ఱుం ఇక్కావిల్ ఇరుందిరుందు ఎన్నైత్తదైత్తాదే నీయుం కుయిలే
ఇన్ఱు నారాయణనై వరక్కూవాయేల్ ఇంగుత్తై నిన్ఱుం తురప్పన్ ।

మహాబలి శక్తివంతంగా నున్న రోజుల్లో, దయతో అన్ని లోకాలను కొలిచిన ఆ భగవానుడికి సేవ చేయాలని నేను ఆశించాను. ఆతడు ఆ ఆశని నిరాశ చేసినందున, నేను క్షీణించి ఉన్నాను. నిండు పున్నమి చంద్రుడు, చల్లని పిల్లగాలులు నా లోపల ప్రవేశించి నన్ను ఎందుకు హింసిస్తున్నాయని ఆ సమయంలో నేను కారణం తెలుసుకోలేక పోయాను. ఓ కోకిల! నన్ను హింసించకుండా, ఈ తోటలో శాశ్వతంగా ఉండిపో. కానీ ఈ రోజు ఆ భగవానుడిని ఇక్కడకు రప్పించక పోతే, నేను ఈ తోట నుండి నిన్ను తరిమివేస్తాను.

పదకొండవ పాశురము: ఈ పదిగాన్ని నేర్చుకునేవారు, వారి స్వరూపాని అనుగుణంగా ఫలితాన్ని పొందుతారని ఆమె చివరిలో తెలియజేస్తుంది.

విణ్ణుఱ నీండు అడి తావియ మైందనై వేఱ్కణ్ మడందై విరుంబి
కణ్ణుఱ ఎన్ కడల్ వణ్ణనైక్కూవు కరుంగుయిలే ! ఎన్ఱ మాఱ్ఱం
పణ్ణుఱు నాన్మఱైయోర్ పుదువై మన్నన్ బట్టర్ పిరాన్ కోదై శొన్న
నణ్ణుఱు వాశగ మాలై వల్లార్ నమో నారాయణాయ ఎన్బారే ।

నాలుగు వేదాలను రాగాలతో పఠించగల సామర్థ్యం ఉన్న శ్రీవైష్ణవులు నివసించే శ్రీవిల్లిపుత్తుర్కి నాయకుడైన పెరియాళ్వార్ల కుమార్తె ఆండాళ్, చక్రాల వంటి కళ్ళు మరియు సున్నితమైన మనస్సు గలది. ఆమె , తన దివ్య పాదాలతో, విశ్వమంతా వ్యాపించి కొలవగల గొప్పతనము ఉన్న ఎంబెరుమానుడిని ఆమె కోరుకుంది. ఆమె “ఓ నల్లనైన కోకిల! ఆ భగవానుడిని నేను దర్శించేలా కూసి పిలువుము” అని ఒక కోకిలని సహాయము అడిగింది. ఈ పది పాశురాలను కూర్చింది. ఎంబెరుమానుడిని గొప్పగా కీర్తించే ఈ పాశురాలను సేవించగలిగిన వారు, ఖచ్చితంగా నిత్యము పాడి ఎంబెరుమానుడిని సేవించ గలుగుతారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2020/05/nachchiyar-thirumozhi-5-simple/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org