Author Archives: chudamani chakravarthy

పూర్వ దినచర్య – శ్లోకం 20 – అనుకంప

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

<< శ్లోకం 19

శ్లోకం 20

అనుకంప పరివాహై: అభిషేచన పూర్వకమ్ |
దివ్యం పదద్వయం దత్వా దీర్ఘo ప్రణమతో మమ ||

ప్రతి పదార్థము:

అనుకంప పరివాహై: = పరుల ధుఃఖము చూసి సహించలేక పోవుట చేత పొంగే పరివాహము
అభిషేచన పూర్వకం = ( ధుఃఖము వలన కలిగిన తాపము తీరునట్లుగా) దాసుడిని ముందుగా (తమ కారుణ్యము లో) స్నానమాడించి తరువాత
దీర్ఘo = దీర్ఘoగా – చాలా సేపు
ప్రణమతః = భక్తి పారవశ్యముతో సాష్ఠాన్గపడి అలాగే ఉండిపోయిన
మమ = దాసుడికి
దివ్యం = ఉన్నతమైన
పదద్వయం = పాద ద్వయములను
దత్వా = ఉంచి

భావము:

దాసుడికి ధుఃఖము వలన కలిగిన తాపము తీరునట్లుగా తమ కారుణ్య దృక్కులలో ముందుగా స్నానమాడించి ,భక్తి పారవశ్యముతో సాష్ఠాన్గపడి చాలా సేపు అలాగే ఉండిపోయిన దాసుడి తలపై ఉన్నతమైన తమ పాద ద్వయములను ఉంచి మామునులు కటాక్షించారు. ఒకడు ధుఃఖముతో బాధ పడుతున్నప్పుడు తమకు ధుఃఖము లేకున్నా వారి బాధ చూడ లేక తాము ధుఃఖించటాన్ని అనుకంప అంటారు. దీనినే దయ అని అంటారు. “కృపా దయా అనుకంపా ” అన్న అని అమరకోశములో చెప్పబడింది.
కృష్ణుడికి చేసిన నమస్కారము ఒక్కటే పది అశ్వమేధ యాగ ఫలమునిస్తుంది.పది అశ్వమేధ యాగములు చేసిన వాడు స్వర్గ భోగములననుభవించి తిరిగి ఈ లోకములో పుట్టుట తధ్యము. కృష్ణుడిని నమస్కరించిన వాడికి నమ-స్కారము చేస్తే వాడు పరమపదమును చేరి పునర్జన్మ లేని వాడవుతాడు ( విష్ణు పురాణము-4-36) అనేది ఇక్కడ అంతరార్థము.
భగవంతుడికి చేసిన నమస్కారమునకే ఇంతటి మహిమ ఉంటే ఇక ఆచార్యుల గురించి చెప్పేదేముంది?ఆచార్యులది దివ్య పదద్వయము. భగవంతుడి శ్రీ పాదముల కన్నా ఆచార్యుల శ్రీ పాదములు మహిమాన్వితములు. (” సంసార మోక్షంగళ్ ఇరండుక్కుం పొదువాన కారణమాగియ భగవత్ సమ్బదత్తై విడ , మోక్షత్తిర్కే కారణమాన ఆచార్య సంబంధం ఉయర్న్దదు — శ్రీ వచన భూషణము-433 చూర్ణిక )ఇహ,పర లోకముల కష్ఠాలను దాటటానికి సమానముగా సహకరించే భగవంతుడి శ్రీ పాదముల కన్నా , మోక్షమునకే కారణమగు ఆచార్యుల శ్రీ పాదములు ఉన్నతములని శ్రీ వచన భూషణము-433 చూర్ణిక లో చెప్పబడింది.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/09/purva-dhinacharya-tamil-20/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org

పూర్వ దినచర్య – శ్లోకం 19 – భృత్యైః

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

<< శ్లోకం 18

శ్లోకం 19

భృత్యైః ప్రియ హితైకాగ్రైః ప్రేమపూర్వ ముపాసితం |

తత్ప్రార్థనానుసారేణ సంస్కారాన్ సంవిధాయ మే ||

ప్రతి పదార్థము:

ప్రియ హితైకాగ్రైః = (భగవదారాధన కొరకు) ఆచార్యులకు ఏఏ వస్తువులందు ప్రీతి ఉందో ,ఆచార్యుల వర్ణాశ్రమానికి ఏఏ వస్తువులు తగినవో, ఆ యా  వస్తువులను సేకరించి సమర్పించుట

భృత్యైః = కోయిల్ అణ్ణన్ లాంటి శిష్యులు

ప్రేమపూర్వం = ప్రేమతో

ఉపాసితం! =  హితమైన వస్తువులు సమర్పించు విధమును గమనించి

తత్ప్రార్థనానుసారేణ = వారి పురుషకారముతో

మే = దాసుడికి

సంస్కారాన్ = తాపం,  పుండ్రం, నామం, మంత్రం,  యాగం అనే ఐదు సంస్కారములు

సంవిధాయ  =  శాస్త్రోక్తముగా జరిగింది (పొంది)

భావము :

పెరుమాళ్ యొక్క సన్నిధిలో మామునులు వేంచేసి వుండగా వారి శిష్యులు భగవదారాధనకు ఉపకరించు  బియ్యము, పప్పు,  పండ్లు, పాలు,  పెరుగు, కూరలు మొదలగు వస్తువులను భక్తితో తీసుకువచ్చి సమర్పించి , వారికి శుశ్రూష చేయటానికి మామునులు అంగికరించారు. “మఠాపత్యం యతిః కుర్యాత్ విష్ణు ధర్మాభివృధ్ద్ధయే ” యతులు వైష్ణవ  ధర్మములను  ( పంచ సంస్కారము,  ఉపవేదంత ‍‌‍‍‌‍రహస్యార్థ ప్రవచనములు,  ఆ యా ధర్మములను తమ శిష్యుల చేత ఆచరణ గావించుట మొదలగు) అభివృధ్ధి చేయుటకై మఠాధిపత్యము స్వీకరించాలని పరాశర సమ్హితలో నిర్దేశించిన కారణముగా మామునులు  మఠాధిపత్యము స్వీకరించారు. అంతే కాదు సాక్షాత్ శ్రీ రంగ నాథుడే వారిని ఈ కైంకర్యమునకు నియమించుట విశేషము.  అందు వలననే కోయిల్ కందాడై అణ్ణన్ వంటి శిష్యులు తదీయారాధనకు కావలసిన వస్తు సామాగ్రిని సమర్పించగా మామునులు వాటిని స్వీకరించటము జరిగింది.

అనేకులు ( ఎఱుంబిఅప్పా వంటి) వారి వద్దకు వచ్చి తమకు కూడా పంచ సంస్కారము చేసి శిష్యులుగా స్వీకరించమని ప్రార్ధించగా మామునులు వారి ప్రార్ధనను స్వీకరించి వారందరికీ పంచ సంస్కారములు అనుగ్రహించారు. ఆ రోజులలో శాస్త్రమును అనుసరించి ఒక సంవత్సర కాలము కైంకర్యము చేసిన వారికి మాత్రమే పంచ సంస్కారములు చేసే వారు.  కాని మామునులు ఎఱుంబిఅప్పాకు  వారి అంతరంగ శిష్యుల ప్రార్దన వలన  శాస్త్ర విధిని కూడా పక్కకు పెట్టి ఆశ్రయించిన మరునాడే పంచ సంస్కారములు చేసారు. మనకు శాస్త్రము కంటే శిష్యుల ప్రార్థన లోని బలమును చూపుతున్నారు. “ఆచార్యులు సుదినమున ఉదయాది నిత్య కర్మలను, భగవనుష్ఠానమును ముగించుకొని , నిత్య కర్మలనాచరించి వచ్చిన శిష్యులను కూర్చోబెట్టి కంకణ ధారణ గావించి, పంచ సంస్కారములు చేయవలెను “అని పరాశర సమ్హితలో నిర్దేశించిన విధముగానే మామునులు చేసేవారు. ఈ శ్లోకములో తాప , పుండ్ర , రామానుజ దాస నామ  సంస్కారములను పొందిన విధమును చెప్పి తరువాతి శ్లోకములో యాగము(దేవ పూజ) , ఆ తరువాతి శ్లోకములో ద్వయ మంత్రోప దేశమును పొందిన విధమును  ఎరుంబియప్పా చెపుతున్నారు. చేతనుడు శ్రీవైష్ణవుడవటానికి పైన తెలిపిన పంచ సంస్కారములు పొందుట తప్పనిసరి .ఆచార్యుడు సంస్కారం చేయుట అనగా ఒక జీవాత్మ శ్రీవైష్ణవుడిగా మారుటకు తోడ్పడే ఒక మంచి కార్యక్రమం.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/09/purva-dhinacharya-tamil-19/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org

 

పూర్వ దినచర్య – శ్లోకం 18 – తత స్తత్ సన్నిధి

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

<< శ్లోకం 17

శ్లోకం 18

తత స్తత్ సన్నిధి స్తంభ మూల భూతలభూషణం ।

ప్రాజ్ముఖం సుఖమాసీనం ప్రసాదమధురస్మితం ।।

ప్రతి పదార్థము:

తతః = శ్రీరంగనాధునికి తిరువారాధనము చెసిన తరువాత

తత్ సన్నిధి స్తంభ మూల భూతల భూషణం = ఆ పెరుమాళ్ సన్నిధిలో ఉన్న స్తంభము క్రింద కూర్చుండి

ప్రాజ్ముఖం = తూరుపు ముఖము చేసి

సుఖం = సుఖముగా ,మనసును భగవంతుడి మీద కేంద్రీకరించి

అసీనం = పద్మాసనములో ఉండి

ప్రసాదమధురస్మితం = మనో నిర్మలత్వము వలన కలిగిన ప్రశాంత ముఖముతో వున్నారు.

భావము:

కిందటి శ్లోకములో చెప్పిన తిరువారాధన క్రమములో ద్వయ మంత్ర జపము కూడా ఉపలక్షణముగా ఉన్నది. అందువలన త్రికాలములలో తిరువారాధనానంతరము మంత్ర రత్నమనబడే ద్వయ మంత్రమును వెయ్యినొక్క సార్లు ,అలా వీలు కానప్పుడు నూటొక్క సార్లు, అదీ వీలు కాక పోతే ఇరవై ఎనిమిది సార్లు ఆజీవన పర్యంతము జపము చేయాలని పరాశరులుచే చెప్పబడినది. ఇలా జపము చేసేటప్పుడు మామునుల హృదయము ఆచార్యుల యందే లీనమై ఉంటుంది ఎందుకనగా వీరు ఆచార్య పరతంత్రులు కదా!

మామునులు నిర్మల మనస్కులవటము చేతవారి ముఖము జపము చేయునపుడు ప్రశాంతముగా వెలుగొందుతున్నది. మంచి పనులు చేసేటప్పుడు తూర్పు ముఖము చేసి వుండటము సంప్రదాయము కాబట్టి వీరు తూర్పు ముఖముగా కూర్చొని వున్నారి ‘ ప్రాజ్ముఖం సుఖమాసీనం  ‘ అని చెప్పటము జరిగింది.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/09/purva-dhinacharya-tamil-18/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org

పూర్వ దినచర్య – శ్లోకం 17 – అథ రంగనిధిం

Published by:

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

<< శ్లోకం 16

శ్లోకం 17

అథ రంగనిధిం సమ్యగ్ అభిగమ్య నిజం ప్రభుం ।

శ్రీనిధానం శనైస్తస్య శోధయిత్వా పద ద్వయం ।।

ప్రతి పదార్థము:

అథ = పొద్దుటి అనుష్ఠానములు ముగించుకొని కావేరి నుండి మఠమునకు వేంచేసిన తరువాత

నిజం = తమ నిత్య ఆరాధనకు సంసిధ్ధులై

ప్రభుం = స్వామి అయిన

రంగనిధిం = తమ మఠములో వేంచేసి వున్న  శ్రీరంగమునకే నిధి అయిన రంగనాథుని

సమ్యగ్ అభిగమ్యం = సాంప్రదాయానుసారము సమీపించి సాష్ఠాoగ నమస్కారము చేసి

శ్రీనిధానం = కైంకర్య శ్రీకి నిధి అయిన

తస్య పద ద్వయం = ఆ శ్రీరంగనాథుని శ్రీపాద  ద్వయములను

శనైః = నిధానముగా

శోధయిత్వా = అభిషేకము చేసి

భావము:

శాండిల్య స్మృతిలో, స్నానంతరము భగవదభిగమము చేసే విధానమును ఈ విధముగా తెలిపారు. అనగా  స్నానాంతరము ఊర్ద్వ పుండ్రములు ధరించి, కాళ్ళు కడుగుకొని, ఆచమనము చేసి, మనసును, ఇంద్రియములను నిగ్రహించుకొని,ప్రతి దినము, ఉభయ సంధ్యలలోను ,ఉదయము సూర్యుడుదయించు వరకు,సాయంత్రము నక్షత్రములు ఉదయించు వరకు మంత్రములను జపించుకొనుచూ వుండి తరవాత భగవదభిగమము చేసి ( భగవంతుడి దరి చేరి)తిరువారాధనము చేయాలి. ఇక్కడ రంగనాథుని శ్రీపాదములను కడుగుట తిరువారాధనమునకు ఉపలక్షణము. వీరు యత్రీంద్ర ప్రవణులు కావున తమ ఆచార్యులభిమానించిన శ్రీరంగనాథునికి  తిరువారాధనము చేస్తున్నారు. భరతుడి భక్తుడైన శతృజ్ఞుడు  భరతుడి ఆరాధ్య దైవమని శ్రీరాముడిని ఆరాధించిన విషయము ఇక్కడ మామునులుకు శ్రీరంగనాథుడు ఆరాధ్య దైవమని గ్రహించాలి.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/09/purva-dhinacharya-tamil-17/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org

యతిరాజ వింశతి – 20

Published by:

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

యతిరాజ వింశతి

<< శ్లోకము 19

విజ్ఞాపనం యదిదమద్య తు మామకీనం అంగీకురుష్వ యతిరాజ!దయాంబురాశే |
అజ్ఞోsయమాత్మ గుణలేశ వివర్జితశ్చ్ తస్మాదనన్య శరణో భవతీతిమత్వా ||

ప్రతి పదార్థము:

దయాంబురాశే! = పరధుఃఖమును చూసి సహించలేని దయా సముద్రుడా

యతిరాజ! = ఓ యతిరాజా!

అద్య = ఇప్పుడు

మామకీనం = ‘వాచా యతీంద్ర(3)అని మొదలైన మూడవ శ్లోకము నుండి 19వ శ్లోకము వరకు ఏవైతే విన్నవించారో

యద్ విజ్ఞాపనం = ఆ విజ్ఞాపనలన్నీ

ఇదం = వాటిని

అజ్ఞాన అయం = అజ్ఞానుడైన

ఆత్మ గుణలేశ వివర్జితశ్చ = మనో నిగ్రహము, ఇంద్రియ నిగ్రహము వఒటి  ఆత్మ గుణములు కొంచేము కూడా లేని వాడను

తస్మాద్ = అందు వలన

అనన్య శరణః భవతి = మనము తప్ప వేరొక ఉపాయము లేని వాడు

ఇతిమత్వా = అని

అంగీకురుష్వ = అనిగ్రహించ ప్రార్థన

భావము:

యతిరాజులు తప్ప మరొక ఉపాయము లేకపోవుటయే ఇప్పటి వరకు తాము చేసిన విన్నపములను స్వీకరించటానికి కారణము , అని అనన్య శరణత్వమును చెప్పి ఈ యతిరాజ వింశతిని సంపూర్ణము చేస్తున్నారు. ఈ శ్లోకములో ‘ దయాంబురాశే! ‘ అని సంబోధించటము చేత యతిరాజుల దయకు కారణములేవీ అవసరము లేదు , అది నిర్హేతుకము, నిత్యము అని స్పష్టము చేసారు.  ‘ దయైక సింధోః  ‘(6), ‘ రామానుజార్య కరుణావ తు ‘ (14), యతీంద్ర కరుణావ తు ‘ (15), భవద్దయయా ‘(16), కరుణా పరిణామ ‘(19),’ దయాంబురాశే! ‘(20)  అని పలు సందర్భములలో పలు మార్లు ప్రస్తావించటము చేత కృపామాత్ర ప్రసన్నా చార్యులని చెప్పబడినది.

ఈ యతిరాజ వింశతినిలొని మొదటి శ్లోకములో ‘శ్రీ మాధవాంఘ్రి జలజద్వయ నిత్యసేవా ప్రేమా విలాశ పరాంకుశ పాదభక్తం !’ అనటము రామానుజ నూత్తందాదిలోని  మొదటి పాశురములో ‘పూమన్ను మాదు పొరుందియ మార్బన్ పుగళ్ పామన్ను మాఱన్ అడి పణిందుయ్దవన్…………ఇరామానుసన్ ‘ జ్ఞప్తికి వస్తున్నది. అలాగే 19వ శ్లోకములో ‘ శ్రీమన్! యతీంద్ర తవ దివ్యపదాబ్జ సేవాం వివర్థయ ….నాధా! ‘  అనటము , రామానుజ నూత్తందాదిలోని ముగింపుకు ముందున్న 107వ పాశురములో ‘ ఇరామానుసా ! ఉన్ తొండర్కే అన్బుత్తురిక్కుంపడి ఎన్నై ఆక్కి అంగాడ్పడుత్తు ‘ జ్ఞప్తికి వస్తున్నది.

కావూన యతిరాజులు రామానుజ నూత్తందాదిని స్వయముగా విని ఆనందించినట్ళు ఈ యతిరాజవింశతిని కూడామనము పాదగా విని ఆనందిస్తారనటములో సందేహము లేదు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/10/yathiraja-vimsathi-tamil-slokam-20/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

యతిరాజ వింశతి – 19

Published by:

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

యతిరాజ వింశతి

<< శ్లోకము 18

శ్రీమన్యతీంద్ర! తవ దివ్యపదాబ్జసేవాం శ్రీశైలనాథకరుణాపరిణామదత్తాం |
తామన్వహం మమ వివర్ధయ నాథ! తస్యాః కామం విరుద్దమఖిలంచనివర్తయ త్వం ||

 

ప్రతి పదార్థము:

శ్రీమన్యతీంద్ర! = తమ అచార్యులకు, శిష్యులకు మోక్షమునివ్వగల గొప్ప సంపద కలిగియున్న ఓ యతీంద్రా!

త్వం = తమరి

మే = దాసుడికి

శ్రీశైలనాథకరుణాపరిణామదత్తాం = తమరి ఆచార్యులైన శ్రీశైలనాథులనబడే తిరుమలై ఆండాన్ (తిరువాయి మొళి పిళ్ళై)చే కృపతో ఇవ్వబడిన

తాం = ఉన్నతమైన

తవ దివ్యపదాబ్జసేవాం = తమరి శ్రీపాదములకు చేయు కైంకర్యమును

అన్వహం = నిరంతరము

వివర్ధయ = విశేషముగా కొనసాగునట్లు అనుగ్రహించాలి (తమరి దాస పరంపరలోని ఆఖరి వారి వరకు ఆ కైంకర్యమును చేయుటకు అనుగ్రహించాలి )

నాథ = స్వామి అయిన యతిరాజా

తస్యాః = దాస్యము చేయుటకు

విరుద్దం = విరుద్దముగా ఉన్న

అఖిలం = సమస్త అడ్డంకులను

కామం నివర్తయ = అడుగంట పోగొట్టి అనుగ్రహించాలి

 

భావము:

కిందటి శ్లోకాలైన ‘వాచా యతీంద్ర!(3), నిత్యం యతీంద్ర!(4) లలో చెప్పినట్లుగానే యతిరాజులకు, వారి దాసవర్గానికి కైంకర్యము చేయుటకు అనుగ్రహించమని ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు.’ సేవాం వరత్తయ ‘ అన్న ప్రయోగముతో యతిరాజులకు చేయు కైంకర్య ప్రాప్తిని,’ వరత్తయ ‘అన్న పదములోని ‘ వి ‘అనే ఉపసర్గ వలన యతిరాజుల దాసవర్గానికి చేయు కైంకర్య ప్రాప్తిని ప్రార్థిస్తున్నారు. అర్థాత్ తమ కైంకర్యమును యతిరాజులే పొందుట వలన వారే ప్రాప్యులు ,ఆ కైంకర్య విరోధిని నివర్తించటము వలన వారే ప్రాపకులు అవుతున్నారు. ఇహ లోక, పర లోక సుఖానుభవము , అత్మానుభవమైన కైవల్యము, యతిరాజుల తృప్తి కోసము కాక తమ తృప్తి కోసము చేసే భగవద్కైంకర్యము మొదలైనవి యతిరాజుల  కైంకర్య విరోధులు అని గ్రహించాలి.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/10/yathiraja-vimsathi-tamil-slokam-19/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

యతిరాజ వింశతి – 18

Published by:

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

యతిరాజ వింశతి

<< శ్లోకము 17

కాలత్రయేsపి కరణత్రయనిర్మితాతిపాపక్షయస్య శరణం భగవత్క్షమైవ |
సా చ త్వయైవ కమలారమణౌsథ్రితా యత్ క్షేమస్య ఏవ హి యతీంద్ర! భవచ్చితానాం ||

ప్రతి పదార్థం:

యతీంద్ర = ఓ యతీంద్రా

కాలత్రయేsపి = భూత భ్విష్యత్ వర్తమానాలనే మూడు కాలాలలో

కరణత్రయనిర్మిత = మనోవాకాయ కర్మణా

అతిపాపక్షయస్య =  మహా ఘోర పాపములు చేసిన జీవాత్మలకు( సకల పాపములను భరించు పరమాత్మకే భరింప సక్యము కాని మహా ఘోర పాపములు)

శరణం = పాపములను పోగొట్టు ఉపాయమైన

భగవత్క్షమైవ = దోషములను పరిహరించుటయే గుణములైన భగవంతుడి గొప్పదనమే అయినా

త్వయయ ఏవ = ఆ భగవంతుడినే వశపరచుకున్నా తమరి వలన మాత్రమే

కమలారమణే = దయా స్వరూపుడైన భగవంతుడిలో దయాది గుణములకు రాణీంపు కలుగజేయు శ్రిరంగనాచ్చియార్ పతి అయిన శ్రిరంగనాధుల వద్ద

అర్థ్రితా ఇతి యత్ = ప్రార్థించినది ఏదీనా ఉందా

స ఏవ = ఆ ప్రార్థనయే (శరణాగతి గద్యములో)

భవచ్చరితానాం = (తమ అభిమానమునకు) తమరిచే స్వీకరింపబడిన దాసులకు

క్షేమః హి = ఉత్తారకము కదా

భావము:

కిందటి శ్లోకములో శ్రీరంగనాధులు యతిరాజులకు వశపడియున్నారని చెప్పి , ఈ శ్లోకములో ఆ  శ్రీరంగనాధులను దాసుడి పాపాలను తొలగించవలసినదిగా కొత్తగా ప్రార్థించనవసరము లేదు.  శరణాగతి గద్యములో  ‘ మనోవాక్కాయైః ‘  ప్రారంభమయ్యే చూర్ణికలో , ‘ కృతాన్ క్రియమాణాన్ కరిష్యమాణాం చ సర్వాన్ అశేషతః క్షమస్వ  ‘  ( గతములో చేసినవి,  ఇప్పుడు చేస్తున్నవి, ఇక ముందు చేయబోయేవి అయిన సకల విధ అపచారములను నిశ్శేషముగా తొలగించి అనుగ్రహించాలి ) అని దాసుల పాపములను పోగొట్టుటకు  ప్రార్థించియే వున్నారు.  ఆ ప్రార్థనయే దాసులను ఉజ్జీవింప గలదు కదా!

శరణాగతి గద్యములో తమకు సంబంధించిన వారి పాపాలను సహించమని భగవంతుడిని  ప్రార్థించినట్లు స్పష్టముగా కనపడకున్నను “ఇమైయోర్ తలైవా!ఇన్నిన్న నీర్మై ఇని యామురామై ,అడియేన్ సెయ్యుం విణ్ణప్పం కేట్టరుళాయ్ ” (దేవాది దేవా!  ఇక మామీద నీ దయ ఎప్పటికీ లేకుండా పోకూడదు,ఇది దాసుడు చేయు విన్నపము)  అని అన్న నమ్మాళ్వార్ల శ్రీపాదములను నమ్ముకున్న వారు కావున రామానుజులు కూడా అలాగే ప్రార్థించినట్లు గ్రహించాలి. వాస్తవముగా ఇతరుల ధుఃఖమును చూచి సహించలేని వారు కాబట్టే తిరుకోట్టియుర్ నంబి 18 సార్లు తిప్పించి ఆఖరికి కృప చేసిన ద్వయమంత్రార్థమును కోరికగల వారందరికీ ఉపదేశించి ‘ ఉడయవర్ (ఉభయ విభూతి మంతుడు),కృపా మాత్ర ప్రసన్నాచార్యులు ‘ ఆయినారు. రామానుజులు తమ సంబంధీకుల పాపములను కూడా పోగొట్టమని అడిగినట్లుగా స్పష్టమవుతున్నదని భావించే శేషస్స ఏవహి యతీంద్ర!-భవచ్చరితానాం.”(తమరి ప్రార్థనయే తమరి దాసుల ఉజ్జీవనానికి వర్తిస్తుంది.)అని మామున్లే చెప్పినట్లు గ్రహించవచ్చు. గద్య వాఖ్యములో మమ(అపచారాన్)అని లేనందున,అందరి పాపములను సహించ గలరని ప్రార్థించినట్లు అర్థము చేసుకోవచ్చు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/10/yathiraja-vimsathi-tamil-slokam-18/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

యతిరాజ వింశతి – 17

Published by:

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

యతిరాజ వింశతి

<< శ్లోకము 16

శ్రుత్యగ్రవేద్యనిజదివ్యగుణస్వరూపః ప్రత్యక్షతాముపగతస్తివహ రంగరాజః |
వశ్యస్సదా భవతి తె యతిరాజ తస్మాచ్చకతః స్వకీయజనపాపవిమోచనే త్వం ||

 

ప్రతి పదార్థము:

యతిరాజ = ఓ యతిరాజా

శ్రుత్యగ్రవేద్య = ఆచార్య ముఖముగా తెలుసుకొన తగినదయిన వేదాంతసారము

నిజదివ్యగుణస్వరూపః = అపార జ్ఞానము, శక్త్యాది గుణములు ,అందరిని నియమించగల శక్తి, తననాశ్రయించినవారికి పరతంత్రులుగా వుండగలుగుట

ఇహ తు =  ఈ భూమి మీద

ప్రత్యక్షతాముపగతః = అందరికీ కన్నుల పండుగగా వుండుట

రంగరాజః = శ్రీరంగరాజులు

తె = తమరికి

సదా = ఎల్లప్పుడు

వశ్యః =  వశపడి ( ఏది చెప్పినా తప్పక చేయువాడు)

భవతి = శక్తుడవుతున్నాడు ( తమరు చెప్పిన పనులు చేయుటయే తాము ఇక్కడ వేంచేసి వుండుటకు ప్రయోజనముగా భావించు వారు)

తస్మాత్ = ఆ విధముగా శ్రీరంగరాజులు తమరికి వశపడి వుండుట వలన

స్వకీయ = తమరి దాసుల

జన = దాస జనుల

పాపవిమోచనే = పాపాములను పోగొట్టుటలో

త్వం = తమరు

శక్తః భవసి = శక్తులవుతున్నారు

 

భావము:

శబ్దాది దోషములను పోగొట్టుట, రామానుజుల దాసాదిదాస వర్గములో అందరికీ ,దాస్యము చేయవలననే కోరిక మొదలైన వాటిని కిందటి శ్లోకములో తెలియజేసారు. దీనికి రామానుజుల వద్ద వుండవలసిన దయను గురించి అంతకు ముందున్న రెండు శ్లోకములలో చెప్పారు. ప్రస్తుతము తన కోరికను నెవేర్చుటకు రామానుజులకు ఉన్న శక్తిని గురించి తెలియజేస్తున్నారు. శ్రీరంగరాజులు అర్చా మూర్తిగా వుండి అందరి కళ్ళకు ఆనందమును కలుగజేయుతున్న వైలక్షణ్యమును ‘ఉపగతస్తుఇహ ‘ అన్నప్రయోగములోని ‘అస్తు ‘ తో నొక్కి చెపుతున్నారు. పరత్వము,వ్యూహత్వము (పరమ పద నాధులు , క్షీరాబ్ధి నాధులు)చాలా దూరముగా వుండుట వలన ఈ లోకములో వున్న మన కళ్ళకు కనపడరు. రామ క్రిష్ణాది విభవావతారముల  యుగములలో మనము లేము. అందు వలన ఆ మూర్తులను చూడలేము. అంతర్యామిగా వున్న రూపమును చూచుట కఠోర యొగాభ్యాసము చేసిన యోగులకు మాత్రమే సాధ్యము. మనబోటి చర్మ చక్షువులకు అసాధ్యము. అర్చామూర్తి అయిన శ్రీరంగనాధులు ఈ కాలములో ,ఈ దేశములో వేంచేసి వుండి  కఠోర యొగాభ్యాసము చేయకుండా, చర్మ చక్షువులకు కూడా కనపడుటయే ఆయన విలక్షణము. అటువంటి శ్రీరంగనాధులు రామానుజులకు వశపడి వుండుట చేత ఆ శ్రీరంగనాధుల దగ్గర దాసుడి గురించి చెప్పి గట్టెక్కించ వచ్చని ఈ శ్లోకములో తెలుపుతున్నారు. మొక్షోపాయమైన క్రమ, జ్ఞాన, భక్తి, ప్రపత్తి యోగముల కన్నా భిన్నమైన ఐదవదైన ఆచార్యాభిమానమనే ఉపాయమును చేపాట్టారు. అందుకే ఆచార్యులైన ఎంబెరుమార్లను ఆశ్రయించి వారి పురుషకారమును కోరుతున్నారని వ్యాఖ్యాత అభిప్రాయ పడుతున్నారు. పాపములు తొలగిపోయినప్పుడు పరమపదములో భగవదనుభవము, కైంకర్యము ప్రాప్తి తధ్యము కావున పాప విమొచనమును కోరుకుంటున్నారు.

అడియేన్ చూడమణి రామానుజదాసి

మూలము:  http://divyaprabandham.koyil.org/index.php/2015/10/yathiraja-vimsathi-tamil-slokam-17/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

యతిరాజ వింశతి – 16

Published by:

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

యతిరాజ వింశతి

<< శ్లోకము 14

శబ్దాది భోగవిషయా రుచిరస్మదీయా నష్ఠా భవత్విహ భవద్ధయయా యతీంద్ర |
త్వద్దాసదాసగణనాచరమావధై యః తద్దాసతైకరసతాsవిరతా మమాస్తు ||

 

ప్రతి పదార్థము:

ఓ యతిరాజా = యతులకు రాజైన వాడా

ఇహ =  శరీరము ఉన్న ఈ స్థితిలో

అస్మదీయా = దాసుడి

శబ్దాది భోగవిషయా = శబ్దాది దోషాలైన రుచి, వాసన మొదలైనవి

భవద్ధయయా = ధుఃఖములను పోగొట్టు తమరి అపారమైన దయ వలన

నష్ఠా భవతు = రూపు మాసి పోవుగాక

యః = ఏ భాగ్యాశాలి

త్వద్దాస = ఒక వస్తువులా కొని అమ్ముటకు వీలైన విధముగా తమ ఆజ్ఞకు బద్దుడై

దాసగణనా = దాసులను లెక్క పెటే టప్పుడు

చరమావధౌ = చివరి వాడిగా

భవతి = ఉండి

తద్దాసతా =  వాడి (భగవంతుడి)  కోసము చేసే దాస్యములో

ఏకరసతా = ఏక లక్ష్యముతో

అవిరతా = నిత్యమై నిలుచుటకు

భవద్ధయయా = తమరి దయ

మమాస్తు = ఉండుగాక

 

భావము:

కిందటి రెండు శ్లోకములలో దాసుడిపై దయ చూపుటకు మీరే తప్ప మరొకరు లేరు అని యతిరాజులను ధృడముగా విన్నవించారు. ఈ శ్లోకములో యతిరాజులు తమకు కృప చేయ వలసిన విషయములను విన్నవిస్తున్నారు. అవి ఏమిటంటే శబ్దాది విషయములలో ఆశ పూర్తిగా తొలగిపోవాలి, యతిరాజుల దాస వర్గములో దాస ,దాస ,దాసాదిదాసుడిగా ఆఖరి దాసుడికి దాసుడు కావాలన్న రెండు కోరికలను ఈ శ్లోకములోని రెండు పాదాలలో క్రమముగా చెపుతున్నారు. యతిరాజుల కృప ఎంతటిది అంటే ఎవరైతే ఎక్కువ పాపాలను చేసి దాని వలన అధికముగ ధుఃఖమును అనుభవిస్తూ పరితపిస్తున్నారో , వారి మీద ఉండడటము కాదు, వారిని ఆ ధుఃఖజలధి నుండి ఉధ్ధరిస్తుంది. అందు వలననే కదా భగవంతుడు ‘ ఎంబెరుమాన్ ‘ కాగా,  యతిరాజులు ‘ ఎంబెరుమానార్ ‘ అయ్యారు. భగవంతుడిని మించిన గొప్పగుణములు కలవారనే కదా తిరుకోట్టియుర్ నంబి తన శిష్యులైన రామానుజులను ‘ ఎంబెరుమానార్ ‘ అని పిలిచారు.’ భవదత్తయయా ‘అన్న ప్రయోగము వలన పై విషయము  స్పష్టమవుతున్నది. భగవంతుడి కృప దాసుడిని ఉద్ధరించ జాలదు.తమరి కృప మాత్రమే దాసుడిని ఉద్ధరించ గలిగినది అని సారము.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/10/yathiraja-vimsathi-tamil-slokam-16/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

యతిరాజ వింశతి – 15

Published by:

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

యతిరాజ వింశతి

<< శ్లోకము 14

శుద్దాత్మయామునగురూత్తమకూరనాథ భట్టాఖ్యదేశికవరోక్తసమస్తనైచ్యం |
అద్యాస్త్యసండుంచితమేవ మయీహ లోకే తస్మాధ్యతీంద్ర !కరుణైవ తు మద్గతిస్తే ||

 

ప్రతి పదార్థము:

యతీంద్ర != ఓ యతిపతి

ఈహ లోకే = పాపాత్ములుండు ఈ లోకములో

అద్య = కలి పురురుషుడు ఏలుతున్న ఈ కాలములో

శుద్దాత్మయామునగురూత్తమకూరనాథ భట్టాఖ్యదేశికవర = దోషములే లేని శుధ్ధమైన ఆత్మ స్వరూపమును కల్లిగి వున్న యామునార్యులని పిలివబచే ఆళవందార్లు ,ఆత్మ గుణపరిపూర్ణులైన కూరత్తాళ్వాన్లు , పూర్వాచార్యులందరిలో మిక్కిలి ఉన్నతులైన పరాశర భట్టరు మొదలైన వారు

ఉక్తసమస్తనైచ్యం = తమ గ్రంధములలో ఆరోపించుకున్న నీచ గుణములన్నీ

మైయి ఏవ = దాసుడొక్కడి యందే

అస్త్యసంకుంచితం (అస్తి) = పూర్తిగా నిండి వున్నవి

తస్మాత్ =  అందువలన

తే కరుణా తు = లోకములో ప్రసిధ్ద్ధమైన తమ కారుణ్యము

మధ్గతిః ఏవ (భవతి) = దాసుడి విషయములో కృప చూపవలసింది

 

భావము:

         ఆళవందార్, కూరత్తళ్వాన్, శ్రీ పరాశర భట్టరు మొదలైన వాళ్ళు శుధ్ధాత్మలు కలవారు. వారి వారి రచనలలో వారిపై ఆరోపించుకున్న దోషాలేవీ మచ్చుకైనా లేని వారు. భట్టరు, కూరత్తళ్వాన్ల పెద్ద కుమారులు. వారి అసలు పేరు శ్రీరంగనాధులు . విష్ణుపురాణములో పరాశర ముని లాగా ‘ పరమాత్మ శ్రీమన్నారాయణుడే  ‘  అని విశ్వసించి ప్రచారము చేసినందు వలన వారిని శ్రీరంగనాధులే పలు తడవలు ‘ పరాశర భట్టరు ‘అని కీర్తించటము వలన వారికి ఆ పేరు స్థిరపడినది.

         ‘ సమస్తనైచ్యం మమ ఏవ అసంగుచితం అస్తి ‘అన్న పదాన్వయమే కాక

‘ సమస్తనైచ్యం మయి అసంగుచితమెవ అస్తి ‘అన్న అర్థాన్ని కూడా తీసుకోవచ్చు. అది ఎలాగంటే ఎంపెరుమానార్ (ఉడయవర్లు)  ‘  మన కారుణ్యమునకు కడుపు చాలా పెద్దది. దానికి దోషాలు తక్కువైతే కడుపు నిండదు. మీ దగ్గర దోషాలు అంత లేవే ! మరి మా కరుణకు పాత్రులు ఎలా కాగలరు?  ‘ అని అడిగినట్లు భావించి ఇలా చెపుతున్నారు. స్వామీ యతిరాజా ! తమరి కరుణకు కావలసినంత దోషములు పరిపూర్ణముగానే దాసుడి వద్దవున్నాయి. కావున తమరి కరుణకు దాసుడికి అర్హత కలదు. అని చెప్పినట్లు పై అన్వయము వలన తెలుస్తున్నది.  ‘ తేతు కరుణావ మద్గతి ‘ -శాస్త్రములలో , చెప్పబడిన జ్ఞానము , అనుష్టానము , వైరాగ్యము గలవారికి కర్మయోగమో,  జ్ఞానయోగమో, భక్తియోగమో ఉపాయము కావచ్చును. కాని దాసుడికి అటువంటి సద్గుణాలేవీ లేనందున తమరి కరుణ ఒక్కటే ఉపాయము అని చెపుతున్నారు.

           ఆళ్వందార్లు తమ స్తొత్రరత్నము(62)  శ్లోకములో దాసుడు శాస్త్రమును మీరి ప్రవర్తించిన వాడిని, మిక్కిలి నీచమైఅన వాడిని ఎందులోను మనసు నిలపలేని చంచల బుధ్ధి గలవాడను , ఓర్వలేని వాడిని, ఒక్క మంచి పని చేసిన వాడను కాను, వంచన పరుడను, హంతకుడను, మిక్కిలి పాపిని – అని చెప్పుకున్నారు.

           కూరత్తళ్వాన్లు అతిమానుష స్తవము (59,60) శ్లోకములలో ‘ఎంపెరుమానే! భగవద్భాగవత, ఆచార్య అపచారములను చేయుట ఇంకా మాన లేదు. ఇటువంటి పాపి అయిన దాసుడు దరి చేరలేని మహా పాప కూపములో పడి వున్నాడు . వేరు ఉపాయములు లేని దాసుడు తమరి శ్రీపాదములనే ఉపాయముగా ఆశ్రయించి వున్నాడు. గతములో శరణాగతి చేసిన విషయము మీద దాసుడికి శ్రద్ద లేదు. అందు వలన ఇప్పుడు ఇలా తమరి శ్రీపాదములను పట్టినంతనే తమరు  మన్నిస్తారని తలచను, అని తమ దోషములను చెప్పుకుంటున్నారు.

శ్రీపరాశర భట్టరు తమ ‘ శ్రీరంగరాజ స్తవము ఉత్తర శకము(89)లో మోక్షోపాయముగా చెప్పబడిన జ్ఞాన , కర్మ ,భక్తి యోగములు ఉపాయములు కావు. మోక్షమును పొందాలన్న కోరిక కూడా లేదు. వేరే గతి లేదు అర్హతలు లేవు. పాపములు మాత్రము అనంతముగా కలిగి వున్నాను. మూర్ఖత్వము వలన శబ్దాది విషయములకు వశపడి కలత చెందిన మనసుతో ‘ నీవే నాకు శరణము ‘ అన్న మాటను మాత్రమే చెప్పగలను, అన్నట్లుగా తాము కూడా అనేక దోషములు చేశామని నైచ్యానుసంధానము చేసుకుంటూ ‘ యామునగురూత్తమ కూరనాధ భట్టాఖ్య దేశిక వరోక్త సమస్త నైచ్యం ‘అన్నారు.

 అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/10/yathiraja-vimsathi-tamil-slokam-15/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org