ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 14 -15

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఉపదేశ రత్తినమాలై

గతాశీర్షిక

పాశురం 14

ఈ పాశురములో మామునులు మిగిలిన ఆళ్వార్లందరూ అవయవిగా భావించే నమ్మాళ్వార్లు వైశాఖ మాస విశాఖ నక్షత్రం రోజున అవతరించి, తిరువాయ్మొళి ద్వారా వేద వేదాంత అర్థములను సరళమైన తమిళ్ భాషలో కృప చేసిన విధమును వారి వైభవమును ఈ లోకులందరూ బాగుగా తెలుసుకొను విధముగా సాయిస్తున్నారు.

ఏరార్ వైగాశి విశాగత్తినేత్తత్తై! ప్పారోరఱియ ప్పగర్ గిన్ఱేన్ * శీరారుమ్ వేదమ్ తమిళ్ శయ్ ద మెయ్యన్ ఏళిల్ కురుగై నాదన్ * అవతరిత్త నాళ్!!

గొప్పకీర్తిని కలిగిన వైశాఖ మాస విశాఖ నక్షత్ర విశిష్టతను ఈ జనులందరు సుస్పష్టముగా తెలుసుకొనే విధముగా సాయిస్తున్నారు. ఈ రోజుననే వేదార్థములను అందమైన తమిళ భాషలో సరియైన అర్థ వివరణములతో కృపచేసిన కురుగూరు ప్రభువులైన నమ్మాళ్వార్లు అందమైన తిరుక్కురుగూరునందు అవతరించిన దినము. సత్యత్వం అనగా నిజాయితీగా దేని/ఏవరి గురించైనా వాస్తవములను వివరించుట. వేదముల ఔన్నత్యం ఏమనగా అవి అపౌరుషేయాలు (ఎవరిచేత వ్రాయబడనివి కావు), నిత్యత్వం (ఎల్ల వేళలా ఉడుట), స్వప్రమాణత్వం (తనకు తానే ఆధారముగానుండుట/ఇతరుల మీద ఆధారపడకుండుట) అనునవి. ఇంకా ముఖ్యమైన వేద విశేషణమేమనగా పరమాత్మ శ్రీమన్నారాయణుని స్వరూప (సహజ తత్వము), రూప (దివ్యాకారము) మరియు గుణ (కల్యాణ గుణములను) గురించి తెలియపరచుట.  వేద, వేదాంగము (ఉపనిషత్తు) ల అర్థములను  1. తిరివిరుత్తం, 2. తిరువాశిరియం, 3.పెరియ తిరువన్ధాది మరియు 4. తిరువాయ్మొళి అను తమ నాలుగు తమిళ ప్రబంధముల రూపముగా మనందరికీ అర్థమగు రీతిలో కృపచేసినారు.

పాశురం 15 

ఈ పాశురములో క్రిందటి పాశురములో ఏ నమ్మాళ్వార్ల గురించైతే చెప్పారో వారి వైభవమును, వారి అవతార దినమును, వారవతరించిన ఊరును మఱియు వారు కృప చేసిన తిరువాయ్మొళి ప్రబంధ ప్రాశస్త్యమును మామునులు తమకు తామే అనుభవిస్తున్నారు.

ఉణ్ణోవైగాశి విశాగత్తుక్కు ఒప్పొరునాళ్?*
ఉణ్డో శడకోపర్కు ఒప్పొరువర్? * ఉణ్డో తిరువాయ్మొళి కొప్పు? తెన్కురుగైక్కు ఉణ్డో! ఒరుపార్ దన్నిల్ ఒక్కుమూర్?

సర్వేశ్వరుడైన శ్రీమన్నారాయణునకు అతని విభూతులకు మంగళాశాసనము చేసిన నమ్మాళ్వార్లవతరించిన వైశాఖ మాస విశాఖా నక్షత్రమునకు సమమైనదున్నదా?(లేదు). మన శఠగోపన్ నమ్మాళ్వార్లకు సమమగు వారుకలరా? లేరు (సర్వేశ్వరుడు, నిత్యులు, ముక్తులు మఱియు ఈ లోకంలోని వారందరూ కూడా ఆళ్వార్లకు సమానమైనవారు కారు). వేదసారమును కూలంకషంగా వివరించు తిరువాయ్మొళికి సమానమైన ప్రబంధము ఉన్నదా ? (లేదు). అటువంటి ఆళ్వార్లను మనకు అందించిన కురుగూరుకు సమానమైన ఊరు కలదా? (లేదు) (ఎందుకనగా ఆదినాధ పెరుమాళ్ళు మరియు నమ్మాళ్వార్లకు సమానమైన ప్రాశస్త్యమును ఇచ్చు ఊరు). పెరుమాళ్ అర్చావతారమునందే పరత్వమును కలిగి ఉన్న దివ్యదేశం నమ్మాళ్వార్లు అవతరించిన స్థలం. నమ్మాళ్వార్ల కృప కారణముగా భగవద్రామానుజుల అవతారమునకు 4,000 సంవత్సరములకు ముందే వారి భవిష్యదాచార్య విగ్రహము అవతరించిన స్థలమిది. ఎంబెరుమానార్ (భగవద్రామానుజుల) పునరవతారముగా భావింపబడే మణవాళ మహామునులు అవతరించిన దివ్య స్దలం. ఈ దివ్యమైన కీర్తి ప్రతిష్ఠలు కలిగిన ఊరు వేరెక్కడ చూచుటకు కనబడదు. ఈ విధమగా సర్వేశ్వరుని, ఆళ్వార్ మరియు ఆచార్యుల ప్రాధాన్యతను/సంబంధమును కలిగి ఉండుటచే ఈ స్థలము యొక్క కీర్తి త్రిగుణీకృతమైనది.

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2020/06/upadhesa-raththina-malai-14-15-simple/

ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : http://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment