తిరుప్పావై – సరళ వ్యాఖ్యానము – పాశురములు 1 – 5

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

తిరుప్పావై

<<తనియన్లు

మొదటి పాశురము: ఆండాళ్  గొల్ల భామలను, కాలాన్ని ప్రశంసిస్తూ, భగవాన్ మాత్రమే   మన అంతిమ లక్ష్యమని మరియు సాధనమని ప్రశంసిస్తూ, కృష్ణానుభవం పొందాలనే సంకల్పముతో మార్గళి నోముని పాటించాలని నిశ్చయించుకుంది.

మార్గళి త్తింగల్ మది నిఱైన్ద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్, పోదుమినో నేరిళైయీర్
శీర్ మల్గుమ్ ఆయ్ ప్పాడి శెల్వచ్చిఱు మీర్గాళ్
కూర్వేల్ కొడుం తొళిలన్ నన్దగోపన్ కుమరన్
ఏర్ ఆర్ న్ద కణ్ణి యశోదై యిళంశింగమ్
కార్మేని చ్చెంగణ్ కదిర్మదియం పోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పఱైతరువాన్
పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్

ఓహో ! ఇది మార్గశీర్ష మాసము.వెన్నెల నిండిన మంచిరోజు. ఓ అందమైన ఆభరణములు గల పడుచులారా! ఇశ్వర్యముతో నిండిన వ్రేపల్లెలో సంపదలతో తులతూగుచున్న ఓ బాలికలారా! ఈ మార్గశీర్ష స్నానము చేయవలెనని సంకల్పమున్నచో రండు.ముందు నడువుడు. వాడియగు వేలాయుధమును దాల్చి ఏ విధమగు ఆపద రాకుండా కాపాడుచున్న శ్రీ నందగోపుల కుమారుడును, అందమగు కన్నులతో అలరుచున్న యశోద యొక్క బాల సింహమును, నీలమేఘశ్యముడును, ఎఱ్ఱ తామరలపోలిన కన్నులు కలవాడును, సూర్యునివలె ప్రకాశమును, చంద్రునివలె ఆహ్లాదమును ఈయజాలిన దివ్యముఖమండలము కలవాడును అయిన నారాయణుడే. ఆతనినే తప్ప వేరొకరిని అర్దించని మనకే , మనమపేక్షించు వ్రత సాదనమగు ‘పర’ అను వాద్యమును ఈయనున్నాడు.మనమీ వ్రతము చేయుటను చూచి లోకులందరూ సంతోషించునట్లు మీరు అందరు వచ్చి ఈ వ్రతములో చేరుడు.

.రెండవ పాశురము: కృష్ణానుభవంలో పాల్గొనేటప్పుడు చేయవలసిన పనులు  మరియు చేయకూడని పనుల జాబితాను ఆమె వివరిస్తుంది. భగవాన్ కి శరణాగతి చేసిన మనకు, పూర్వాచార్యులే మార్గదర్శకులు అని ఆమె వివరించింది.

వైయత్తు వాళ్వీర్గాళ్ నాముమ్ నమ్ పావైక్కు
చ్చెయ్యుమ్ కిరిశైగళ్ కేళీరో పార్కడలుళ్
పైయత్తు యిన్ఱ పరమన్ అడిపాడి
నెయ్యుణ్ణోమ్ పాలుణ్ణోమ్ నాట్కాలే నీరాడి
మై యిట్టు ఎళుదోమ్ మలరిట్టు నామ్ ముడియోమ్
శెయ్యాదన శెయ్యోమ్ తీక్కురళై చ్చెన్ఱోదోమ్
ఐయ్యముమ్ పిచ్చైయుమ్ ఆన్దనైయుమ్ కైకాట్టి
ఉయ్యు మాఱైణ్ణి యుగన్దేలో రెమ్బావాయ్.

కృష్ణుడవతరించిన కాలములో ఈ లోకములో పుట్టి దుఃఖమయమగు ఈ ప్రపంచములో కూడ ఆనందమునే అనుభవించుచున్న వారలారా ! మేము మా వ్రతమునకు చేయు క్రియాకలాపము వినుడు. పాల సముద్రములో ధ్వని కాకుండా మెల్లగా పండుకొనియున్న ఆ పరమపురుషుని పాదములకు మంగళము పాడెదము. ఈ వ్రత సమయములో నేతిని గాని , పాలనుగాని మే మారగింపము.తెల్లవారు జాముననే లేచి స్నానము చేసెదము.కంటికి కాటుక పెట్టుకొనము, కొప్పులో పూవులు ముడువము. మా పెద్దలు ఆచరింపని పనుల నాచరింపము. ఇతరులకు బాధ కలిగించు మాటలను , అసత్య వాక్యములను ఎచ్చోటను పలుకము. జ్ఞానాధికులను అధిక ధన ధాన్యాదులతో సత్కరించుచుందుము. బ్రహ్మచారులకు సన్యాసులకు భిక్ష నొసంగుచుందుము.మేము ఉజ్జీవించు విధమునే పర్యాలోచన చేసుకొందుము. దీని నంతను విని మీరానందింపగోరుచున్నాము.

మూడవ పాశురము:. కృష్ణానుభవమును ఆస్వాదించడానికి ఆమెకు అనుమతి ఇచ్చిన   బృందావనములోని వారందరికీ ఆ యొక్క ప్రయోజనములు కలగాలని ఆండాళ్ ప్రార్థిస్తుంది. ప్రతి ఒక్కరూ కృష్ణానుభవం పొందాలి అని అర్ధము.

ఓంగి యులగళన్ద ఉత్తమన్ పేర్ పాడి
నాంగళ్ నమ్ పావైక్కు చ్చాఱ్ఱి నీరాడినాల్
తీంగిన్ఱి నాడెల్లామ్ తింగళ్ ముమ్మారి పెయ్ దు
ఓంగు పెరుం శెన్నెల్ ఊడు కయలుగళ
పూంగువళై పోదిల్ పొరివణ్డు కణ్పడుప్ప
తేంగాదే పుక్కిరున్దు శీర్తములై పఱ్ఱి
వాంగ, క్కుడమ్ నిఱైక్కుమ్ వళ్ళల్ పెరుం పశుక్కళ్
నీంగాద శెల్వమ్ నిరైన్దేలో రెమ్బావాయ్.

బలి చక్రవర్తి ఇచ్చిన దానము నంది ఆకాశము వరకు పెరిగి మూడు లోకములను తనపాదములచే కొలిచిన పురుషోత్తముడగు త్రివిక్రముని దివ్య నామములను గానము చేసి మేము మా వ్రతము అను మిషతో స్నానము చేయగనే దేశమంతయు నెలకు మూడు వానలు పడి ఈతిబాధలు లేక సుఖముగా ఉండవలెను. ఆకాశమువరకు పెరిగిన వరిచేలలో చేపలు త్రుళ్ళి పడుచుండగా , కలువ పూవులలో మనోహరములగు తుమ్మెదలు నిద్రించుచుండగా , సస్యములు సమృద్దములై యుండవలెను.పాలు పితుకుటకు కొట్టములో దూరి స్తిరముగా కూర్చుండి పొదుగునంటగనే పాలు కుండలు నిండునట్లు చేపు గోవులు సమృద్దముగా నుండవలెను. నశ్వరము కాని సంపద దేశమంతా నిండవలెను.

నాల్గవ పాశురము: ఆండాళ్ ఒక నెలలో మూడు సార్లు (బ్రహ్మణుల కొరకు, రాజు మరియు పవిత్రమైన స్త్రీల కొరకు) వర్షించాలని పర్జన్య దేవుడిని ఆదేశిస్తుంది, తద్వారా బృందావనములో ప్రజలు సంపన్నముగా జీవిస్తూ, కృష్ణానుభవమును పొందవచ్చు.

ఆళి మళైక్కణ్ణా  ఒన్ఱు నీకై కరవేల్
ఆళియుళ్ పుక్కు ముగున్దు కొడార్తేఱి
ఊళి ముదల్వన్ ఉరువమ్ పోల్ మెయి కఱుత్తు
పాళియం తోళుడై పఱ్పనాబన్ కైయిల్
ఆళి పోళ్ మిన్ని, వలమ్బురి పోల్ నిన్ఱు అదిర్ న్దు
తాళాదే శార్ ఙ్గ ముదైత్త శరమళైపోల్
వాళవులగినిల్ పెయ్ దిడాయ్ నాంగళుమ్
మార్గళి నీరాడ మగిళిన్దేలో రెమ్బావాయ్

గంభీర స్వభావుడా ! వర్ష నిర్వాహకుడా ! ఓ పర్జన్య దేవా ! నీవు దాత్రుత్వములో చూపు ఔదార్యమును ఏ మాత్రమును సంకోచింపచేయకుము. గంభీరమగు సముద్రములో మధ్యకు పోయి , ఆ సముద్ర జలమునంతను నీవు పూర్తిగా త్రాగి గర్జించి ఆకాశమున వ్యాపించి సర్వజగత్కారణ భూతుడగు శ్రీమన్నారాయణుని దివ్య విగ్రహము వలె శ్యామల మూర్తివై ఆ పద్మ నాభుని విశాల సుందరబాహు యుగళిలో దక్షిణ బాహువు నందలి చక్రమువలె మెరసి ఎడమ చేతిలోని శంఖమువలె ఉరిమి శార్ఙమను ధనస్సు నుండి విడిచిన బాణముల వర్షమా అనునట్లు లోకమంతయు సుఖించునట్లు మేము సంతోషముతో మార్గశీర్ష స్నానము చేయునట్లు వర్షింపుము.

ఐదవ పాశురము: ఎంబెరుమాన్ యొక్క దివ్య నామాలను నిరంతరం పఠించడంతో మన అన్ని కర్మలు (పాప పుణ్యాలు రెండూ) మటుమాయమవుతాయని ఆండాళ్ చూపిస్తుంది. మన పూర్వ కర్మలు నిప్పులో వేసిన దూది వలె కాలిపోతాయి, భవిష్యత్తులో చేసే కర్మలు తామరాకుపై నీరువలె అంటకుండా పోతాయి. ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన అంశము ఏమిటంటే, మనము గతంలో చేసిన పాప కర్మలన్నీ ఎంబెరుమాన్ తొలగిస్తాడు. మనము భవిష్యత్తులో తెలియక చేయబోయే పాపములు కూడా తొలగిస్తాడు. కానీ, భవిష్యత్తులో తెలిసి చేసే పాప కర్మల ఫలితమును మాత్రము అనుభవించేలా చేస్తాడు.

మాయనై మన్ను, వడమదురై మైన్దనై
త్తూయ పెరునీర్ యమునై త్తుఱైవనై
ఆయర్ కులత్తినిల్ తోన్ఱుమ్ మణివిళక్కై
త్తాయైక్కుడల్ విళక్కమ్ శెయ్ద దామోదరనై
తూయోమాయ్ వన్దునామ్ తూమలర్ తూవిత్తొళుదు
వాయినాల్ పాడి, మనత్తినల్ శిన్దిక్క
పోయ పిళ్ళైయుమ్ ప్పుగు దరువా నిన్ఱనవుమ్
తీయినిల్ తూశాగుం శెప్పేలో రెమ్బావాయ్

ఆశ్చర్యకరములగు చేష్టలు కలవాడును, నిత్యము భగవత్సంబంధముగల ఉత్తరదేశమునందలి మధురానగరికి నిర్వాహకుడును , పవిత్రము అగాధమునగు జలముగల యమునానది రేవే తనకు గురుతుగా కలవాడును , గోపవంశమున ప్రకాశించిన మంగళ దీపము అయినవాడును,తల్లి యశోద గర్భమును ప్రకాశింపచేయునటులు త్రాడుచే కట్టబడి దామోదరుడైన వాడునునగు కృష్ణ భగవానుని వద్దకు పవిత్రులమై వచ్చి మనము పరిశుద్దములగు పుష్పములతో నర్చించి అంజలి ఘటించి వాక్కుతో కీర్తించి మనసారా ధ్యానించినచో మన పూర్వసంచిత పాపరాశియు , ఆగామి పాపరాశియు అగ్నిలో పడిన దూదివలే భస్మమైపోవును.కావున భగవానుని నామములను పాడుడు.

ఈ విధంగా, మొదటి ఐదు పాశురముల ద్వారా, ఎంబెరుమాన్ యొక్క పర (శ్రీవైకుంఠంలో శ్రీమన్నారాయణ), వ్యూహ (క్షీర సముద్రములోని శ్రీ మహావిష్ణువు), విభవ (త్రివిక్రముడు), అంతర్యామి (వరుణుని అంతర్యామియైన), అర్చ (వడమధుర యొక్క భగవాన్) స్వరూపాల గురించి వివరింబడింది.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2020/05/thiruppavai-pasurams-1-5-simple/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org

ప్రమేయము (లక్ష్యము) – http://koyil.org
ప్రమాణము (గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (పూర్వాచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment