జ్ఞానసారము 9

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

జ్ఞానసారము

<< పాశురము 8

Lord-Vishnu

అవతారిక

కిందటి పాశురములో భగవంతుడి దగ్గర ఇతర ప్రయోజనాలేవీ ఆశించక కేవలము కైంకర్యము చేయు భాగ్యమును కోరే భక్తుల నిబధ్ధతను గురించి తెలిపారు. ఈపాశురములో  భగవంతుడు తన భక్తుల హృదయమును శోధించి దానిని తన నివాస స్థానముగా చేచుకునే విధమును తెలియజేస్తున్నారు. ‘ ఈ హృదయమును మనలనే కోరుతున్నదా? ఇతర ప్రయోజనాలేవీ ఆశించక కేవలము మన కైంకర్యమునే కోరుతున్నాడా? ‘ అని శోధించి అలాంటి హృదయమును తన ఆవాస స్థానముగా చేసుకుంటాడు అని చెపుతున్నారు.

ఆసిల్ అరుళాల్ అన్నైత్తు ఉలగుం కాత్తళిక్కుం
వాస మలరాళ్ మణవాళన్- తేసు పొలి
విణ్ణాట్టిల్ సాల విరుంబుమే వేఱొన్ఱై
యెణ్ణాదార్ నెంజ త్తిరుప్పు

ప్రతిపదార్థము

ఆసిల్ = దోష రహితమైన
అరుళాల్ = కృప వలన
అన్నైత్తు ఉలగుం = సకల లోకములను
కాత్తు = రక్షించి
అళిక్కుం = కోరికలను తీర్చి
వాస మలరాళ్ = తామరలో ఉద్భవించిన అమ్మవారిని
మణవాళన్- = సకల లోక నాయకుడన శ్రీమన్నారాయణుడు
తేసు పొలి = ప్రకాశవంతమైన
విణ్ణాట్టిల్ = శ్రీవైకుంఠములో
వేఱొన్ఱై = తనను తప్ప ఇతర ప్రయోజనములను
యెణ్ణాదార్ = కోరని వారికి
నెంజత్తు = హృదయములో
ఇరుప్పు = నివాసము చేయుట
సాల = చాలా
విరుంబుం =  ప్రియమైనది

భావము

ఆసిల్ అరుళాల్ : ఒక్కొక్క సారి  కృప కూడా దోషమవుతుంది అది ఎలాగంటే ఏదైనా ప్రయోజనమును ఆశించి  కృప చూపితే అప్పుడు అది దోషమవుతుంది. పరిమళ అళగర్ , కృపకు అర్థాన్ని చెపుతూ                                       ‘ నిర్హేతుకముగా , స్వభావ సిధ్ధముగా సకల జీవరాసులపై ప్రసరించే ప్రేమ  కృప ‘ అన్నారు. ఇది ఎవరిపైన ఎటువంటి బేధ భావము లేక సమానముగా ప్రసరిస్తుంది. లోకములో భార్య, పిల్లలు, బంధువులు ,స్నేహితులూ మీద ప్రేమ వుంటుంది . వారొతోవున్న సంబందము వలన వారిపై  ప్రేమ కలుగుతుంది. ఇతరులపై అటువంటి ప్రేమ కలుగదు. భగవంతుడి కృప అలా కాక నిర్హేతుకముగా సమస్త జీవరాసులపై సమానముగా ప్రసరిస్తుంది.

అన్నైత్తు ఉలగుం : సమస్త లోకములను అనగా భూలోక ,భువర్లోక ,సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక , సత్యలోకములు అనే ఊర్ధ్వ లోకములు ఏడు,  అతల, వితల,  సుతల,  రసాతల, తలాతల, మహాతల, పాతాళములనే  అధోలోకములు ఏడు, మొత్తము పదునాలుగు భువనములను అండము అంటారు . ఈలోకములలోని  సమస్త జీవరాసులపై భగవంతుడు నిర్హేతుకముగా, నిష్పక్షపాతముగా తన అపారమైన కృపను ప్రసరిస్తారని చెపుతున్నారు.

కాత్తళిక్కుం: కృప అంటే ఇష్టప్రాప్తి, అనిష్ట నివృత్తి. అంటే భక్తులకు అవసరమైన వాటిని అనుగ్రహించి ,దుఃఖ హేతువైన విషయములను తోల్గించుట. దీనినే రక్షత్వము అంటారు. ” కాత్తు, అళిక్కుం “,( రక్షించి, కృపచేయు) అన్న రెండు పదములు కలిసి ” కాత్తళిక్కుం ” అయ్యింది.

వాస మలరాళ్ మణవాళన్- : ” వేరి మారాతు పూమేలిరుప్పళ్ “అని నమ్మళ్వార్లు అన్నట్లుగా , ఎప్పుడు వాడని, రంగు మారని, వాసన తగ్గని   నవ నవ లాడే తామర మీద వేచేసి ఉండే శ్రీమహాలక్ష్మి. ఆమేను  ” కాత్తు, అళిక్కుం “,( రక్షించి, కృపచేయు) అని చెప్పుట వలన అమ్మతో కలసి లోకములను రక్షిస్తాడని , రక్షణలో అమ్మవారికి కూడా ప్రధాన పాత్ర వుందని చెప్పే వేదాంత సూత్రము ఇక్కడ చెప్పబడింది. ఇంకా భగవంతుడిలోని రక్షకత్వమును పెంపొందించి  , ఆయన జీవాత్మలను రక్షించుట చూసి ఆనందిస్తుంది.  ఇలా శ్రీమహాలక్ష్మితో చేరి చేయు కృప యొక్క ఫలితముగా చేతనులసంచిత పాపాలు తొలగి , భగవంతుని తప్ప మరి వేరు ప్రయోజనమును ఆశించని శుధ్ధమైన హృదయమును కలిగి వుంటారు. అటువంటి  శుధ్ధమైన హృదయమును భగవంతుడు ఆదరించు విధామును  ఇక్కడ చెపుతున్నారు.
తేసు పొలి విణ్ణాట్టిల్: పరమపదము, వైకుంఠము అని పిలవబడే అపారమైన ఆనందములకు నిలయము. ఇక్కడ  శ్రీమహాలక్ష్మితో, నిత్యసూరులతో శ్రీమన్నారాయణుడు వేంచేసి ఉంటాడు. దాని కంటే కూడా….

సాల విరుంబుమే : చాలా ప్రీతికరమైనది. అంత ఉన్నతమైన స్థలము వేరే ఏముంటుంది అంటే….

వేరు ఒన్రు ఎణ్ణాదార్ నేంజత్తిరుప్పు: ఉణ్ణుం శోరు, పరుగుం నీరు, తిన్నుం వెత్తిలై ఎల్లాం కణ్ణనెంబెరుమానే అని ఆళ్వార్లు భావించారు. ఆయనకు కృష్ణుడు తప్ప వేరే ఎమీ అవసరము లేదు. అలాగా అన్య ప్రయోజనములను ఆశించని హృదయము ఎవరికి వుందో , వారి హృదయము భగవంతుడికి చాలా ప్రీతికరము. పరమపదముకన్న గొప్పది అని అర్థము.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/02/gyana-saram-9-asil-arulal/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *