జ్ఞానసారము 2

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

జ్ఞానసారము

<< పాశురము -1

2వ పాశురం

R

నరకుం సువర్గముం నాణ్మలరళ్ కోనై
ప్పిరివు పిరియామైయుమాయ్- త్తురిసఱ్ఱు
సాదకం పోల నాదన్ తనదరుళే పార్తిరుత్తల్
కోతిలడియార్ గుణం

ప్రతి పదార్థము

నాణ్మలరళ్ కోనై = పద్మోద్భవ ప్రియుడిని( స్వామిని)

ప్పిరివు = వీడి వుండుట

నరకుం = నరకము అర్థాత్ కష్టము

పిరియామై = వీడకుండుట

సువర్గముం = స్వర్గము, సుఖము

త్తురిసఱ్ఱు = దోషములు లేక

సాదకం పోల  = చాతక పక్షి  లాగా (వాన కోసము ఎదురు చూస్తూ)

నాదన్ తనదు = భగవంతుడి

అరుళ్  = కృపను

పార్తిరుత్తల్ = ఎదురుచూడటము

కోతిలడియార్  = దోషములే లేని దాసుల

గుణం = సహజ గుణము

భావము

నరకము, స్వర్గము అనే పదాలు దుఖఃమును , సుఖమును తెలియజేస్తాయి. “తున్బం ఇన్బం ” అన్న తిరువాయ్మొళి పాశురములో ” ఇన్బయిల్  వెన్నరగాగి ఇనియ నల్వాన్ సువర్గంగుళుమాయ్ ” అన్న చోట చూస్తే ” సుఖదుఃఖములు” అన్న అర్థము స్పురిస్తున్నది. అందు వలన నరకము అంటే దుఃఖము స్వర్గము అంటే సుఖము అని గ్రహించాలి.

పర  భక్తి గల వారికి ఏది దుఃఖము? ఏది సుఖము? అంటే (పద్మోద్భవ ప్రియుడు ) నారాయణుని వీడి వుండుట  దుఃఖము, వీడకుండుట సుఖము. పర భక్తి అనగా విడిపోవుటను తాళ లేక పోవుట.  శ్రీ రామాయణములో శ్రీరాముడు అడవికి బయలుదేరునప్పుడు సీతా దేవి తాను కూడా వస్తానని ప్రార్థించగా ,  శ్రీరాముడు నగర వాసమునకు ,వన వాసమునకు ఉన్న భేదములను చెప్పి అందు వలన అడవికి రాకుండ అంతఃపురములోనే వుండవలసినదిగా చెప్పారు. అది విన్న సీత  సుఖదుఃఖములు మీరు చెప్పినట్లు ఉండవు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా వుంటుంది. నాకు మీతో చేరి వుండటము  సుఖము, మిమ్ము వీడి వుంటే అది దుఃఖము . ఈ వాస్తవము తమరికి తెలియక పోతే నన్ను అడిగి తెలుసుకోగలరు . తమరికి తెలియనివి ఇతరులను అడిగి తెలుసుకోవాలి, అది తప్పు కాదు కదా! తమరిలాగా మేము కొలత కొలిచి ప్రేమించలేదే! మాకు మీమీద ఉన్న ప్రేమ అపారమైనది.” అని చెప్పింది.  దీనికి శ్రీరాముడు ” మాకంటే నీకు ప్రేమ కొండంత ఉన్నట్లుగా చెప్పావు కదా! దానికి ప్రతిగా మమ్మల్ని ఏమి చేయమంటావు? ” అన్నారు. అప్పుడు సీత ” నేను ముందుగా నడుస్తాను. మీరు వెనకాల రండి ” అన్నది అని పెరియవాచ్చన్ పిళ్ళై వ్యాఖ్యానము చేసారు.

ఇక్కడ ఒక వేదాంత సారము కనపడుతుంది. సీత , రాముడిని చూసి మీతో వుండడటము సుఖము, మిమ్మి వీడి వుండుట దుఃఖము  అని చెప్పింది కదా! ఇది ఆమెకు తగినదే. అలాగే జీవాత్మ పరమాత్మను చూసి ఇలా చెప్పటము పద్దతి కాదు. పిరాట్టి పర్మాత్మనే సుఖముగ భావించినది. జీవాత్మలు పర్మాత్మను,   పిరాట్టిని చేరి సుఖముగా వుంటాయి. అందు వలన పిరాట్టికి  ఏకాయణ  అని జీవాత్మలను మిధునాయనులని అంటారు. ఏకాయణ న భగవంతుడొక్కడినే సుఖముగా భావిస్తుంది. జీవాత్మలు  పరమాత్మను , పిరాట్టినిల   మిధునమును సుఖముగా భావిస్తారు. దీనిని  పిరాట్టికి, జీవాత్మలకు వున్న భేదముగా గ్రహించాలి.

” నాణ్మలరాళ్ కోనై పిరివుం పిరియామైయుమాయ్ ” –  పిరాట్టితో కూడిన పరమాత్మను వీడి  వుండుట, పిరాట్టితో కూడిన పరమాత్మను విడకుండుట – దుఃఖము , సుఖముగా చెప్పబడుతున్నాయి. లక్ష్మణుడు రాముడితో “సీత ఎలా మిమ్మల్ని వీడి వుండ లేదో అలాగే నేను కూడా మిమ్మల్ని వీడి వుండ లేను ” అన్నాడు. ఇందులో లక్ష్మణుడు  తనను సీతతో సమానముగా చెప్పుకున్నాడు. అయితే అది కేవలము రాముడిని వీడి అనుభవించే దుఃఖములో మాత్రమే వర్తిస్తుంది. అంతే కాని రాముడీని మాత్రమే ఆశ్రయించిన సీత లాగా అన్న అర్థమును తీసుకోకూడదు.  లక్ష్మణుడుకి సీతరాముల కూడి వుండగా సేవ చేయటమే ఆనందము.

” భవాంస్తు సహ వైదేహ్యా గిరిసానుష  రంస్యతే అహం సర్వం కరిష్యామి ”  మీరు, సీత గిరి సానువుల మధ్య విహరిస్తున్నప్పుడు , నిద్రిస్తున్నప్పుడు   , మేలుకొని ఉన్నప్పుడు దాసుడు సకల కైంకర్యములను చేస్తాడు, అని చెప్పాడు. ఇలాంటి కైంకర్యము చేయటమే సకల ఆత్మలకు విధియైఉన్నది.

తురిసఱ్ఱు-తురిసు-కుఱ్ఱం – దోషము లేని-అనగా పరమాత్మను పిరాట్టిని వీడితే దుఃఖములు కలుగుతాయి. వారితో కూడి వుంటే దుఃఖములు కలుగవు ,  సుఖములు కలుగుతాయి , భక్తి కలుగుతాయి . అలా భక్తి కలిగితే దానిని అధికారి విశేషణము అంటారు. భోజనము చేయడానికి ఆకలి కలిగి వుండడమే అర్హత అయినట్లుగానే భగవంతుడిని అనుభవించటానికి భక్తి కలిగి వుండాలి. ఈ భక్తి సాధనము కాదు. ఉపాసకులు భక్తిని సాధనముగా భావిస్తున్నారు. శరణాగతులు మాత్రము దీనిని సాధనముగా భావించరు. అలా చేస్తే అది దోషమవుతుంది. ఇక్కడ దోష రహితులంటే భక్తిని సాధనముగా స్వీకరించని వారని అర్థము.

” సాదకం పోల్ నాదన్ తనదరుళే పార్తిరుప్పార్ ” అనగా చాతక పక్షి వాననీటి కోసమే చూస్తూ వుంటుంది , కాని వేరే నీటిని స్వీకరించదు. అలాగ ఆత్మ కూడా భగవంతుడి కృప కోసమే ఎదురుచూస్తూ వుంటుంది. ఆ కృప మాత్రమే ఆయనను పొందడానికి సాధనమనే దృడ అధ్యవసాయము కలిగి వుండటమే దాసుల గుణము . ”  తుణియేనిని నిన్నరుళల్లదు నిన్నరుళే పురిందిరుందేన్”  అన్న తిరుమంగై ఆళ్వార్ల పాశురము మరియు పెరియాళ్వార్ యొక్క పెరియాళ్వార్ తిరుమొళి
శెన్నియోంగు(5.4.1) లో “నిన్ అరుళే పురిందు ఇరున్దేన్ ”  కూడా ఇదే చెపుబడుతున్నది.

” కోదిలడియార్గుణం” – దాసులనటానికి వేరు వేరు అర్థాలలోను,   వేరు వేరు సాదనములలోను సంబంధము కలిగివున్న దోషరహితులని ఆర్థం. తమ దాసత్వమునకు భగవంతుడినే ప్రాప్తగాను ,ప్రాపకముగాను , ప్రాప్యముగాను భావిస్తాడు. పొందవలసినది ప్రాప్త ,  అది పొందుటకు మార్గము ప్రాపకము , పొందిన తరువాత ఈ ఆత్మకు భగవంతుడే నాయకుడు అవుతాడను సత్యము, అదే ప్రాప్యము. శ్రీ వచన భూషణం లో చెప్పినట్టుగా  భక్తుని ఆలోచన ఏ విధముగా ఉండుననగా “ప్రాప్త మరియు ప్రాపకము రెండూను పరమాత్మే, మనలను పొందుటలో సంతోషము తనకే చెందుతుంది ” అని భావిస్తాడు. ప్రపన్నుడు పెరుమాళ్ యొక్క వస్తువు కాబట్టి ఎప్పుడైతే వస్తువు ప్రప్పత్తి ద్వారా తనను చేరుకుంటాడో, అప్పుడు లభించే ఆనందము ఆ పరమాత్మదే కాని జీవాత్మది కాదు.పరమాత్ముని సంతోషముగాంచి జీవాత్మ ఆనందిస్తాడు.అందు వలన ఈ పాటలో మొదటి పాశుములో స్వామి అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్  ఫలము భగవంతుడే అని చూపి, ఆ ఫలము పొందుటకు సాధనము కూడా భగవంతుడే అని చెప్పారు. ఇది కోదిలడియార్ల్ (దోషములు లేని భక్తులు) యొక్క స్వభావికమైన గుణము అందువలననే ” కోదిలడియార్గుణం” అని అన్నారు.

అడియేన్  చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2014/11/gyana-saram-2-naragum-suvargamum/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment